ఆపన్న హస్తం
ఖాళీ సమయాన్ని సామాజిక సేవకు వెచ్చిస్తున్న విద్యార్థులు
ఏ పనీ లేకపోతే సరదాగా సినిమాకో షికారుకో వెళదామని అనేకమంది అనుకుంటారు. మరికొందరు ముసుగుతన్ని నిద్ర పోతుంటారు. ఈ ధోరణిలో క్రమేణా మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం అనేకమంది తమ ఖాళీ సమయాన్ని సామాజిక సేవ కోసం వినియోగిస్తున్నారు. ఇటువంటి వారిలో సాధారణ పౌరులకంటే విద్యార్థుల సంఖ్యే అధికంగా ఉంది.
న్యూఢిల్లీ : నిన్నమొన్నటిదాకా ఖాళీ సమయంలో సినిమాలకు వెళ్లడమో లేక ఆటలాడుకోవడమో చేస్తున్న విద్యార్థులు ఇప్పుడు సామాజిక సేవపై ఆసక్తి చూపుతున్నారు. ఈ విషయమై కోల్‌కతానుంచి నగరానికి వచ్చి 11వ తరగతి చదువుతున్న అనుక్ష మండల్ మాట్లాడుతూ ‘భవిష్యత్తులో ఏదో మేలు జరుగుతుందనే ఆశతో మంచి పనులు చేయొద్దు. ఇతరులు మీ నుంచి స్ఫూర్తి పొందేందుకు మాత్రమే చేయాలి’ అని అంది. కాగా సీక్రెట్ శాంటా క్లాజ్ వేషం ధరించిన అనుక్ష గత ఏడాది డిసెంబర్‌లో క్రిస్మస్ సందర్భంగా బుద్ధిమాంద్య సమస్యతో బాధపడుతున్న విద్యార్థులతో కాలక్షేపం చేసింది. వారికి ఆ రోజంతా వినోదం కల్పించాడు.
2012లో శీతాకాలంలో వీధులే ఆవాసాలుగా కాలం గడుపుతున్న 500 మంది అనాథలకు దుప్పట్లను పంచిపెట్టింది. వీటిని కొనుగోలు చేసేందుకు తన స్నేహితులతోపాటు బంధువుల వద్దనుంచి ఈ చిన్నారి రూ. 55 వేలను విరాళాల రూపంలో సేకరించింది. ఇందుకోసం తన స్నేహితురాళ్లను ఎంచుకుని వారిని ఐదు బృందాలుగా విభజించింది. వారందరినీ నగరంలోని వివిధ ప్రాంతాలకు రాత్రిపూట పంపించి రహదార్ల పక్కన నిద్రిస్తున్న అనాథలకు దుప్పట్లను పంపిణీ చేసింది.
ఈ విషయమై అనుక్ష మాట్లాడుతూ ‘శీతాకాలంలో రాత్రివేళల్లో రహదార్లపై నిద్రిస్తున్న అనేకమంది చనిపోతున్నారనే విషయం నా దృష్టికొచ్చింది. వారికి ఏదో ఒకటి చేయాలని నాకనిపించింది. వాస్తవానికి మా అమ్మ కూడా తన చిన్నతనంలో బడి కి వెళ్లే సమయంలో సామాజిక సేవ చేసింది. ఈ నేపథ్యంలో నా ఆలోచనను ఆమె ముందుంచా. దీంతో కొన్ని కంపెనీలతోపాటు స్నేహితులను ఆర్థిక సహాయం చేయాలని కోరాల్సిందిగా చెప్పింది. నాతో కలసి రావాలంటూ డిసెంబర్ 27వ తేదీన కొంతమందిని కోరా. వారి తో నగరంలోని వివిధ ప్రాంతాల్లో రాత్రిపూట సంచరించా. కొంతమంది అనాథలు ఫుట్‌పాత్‌లపై నిద్రించడం కనిపించింది. అటువంటి వారందరికీ దుప్పట్లు అందజేశాం.
ఇలా చేయడం నాకు ఎంతో ఆనందంగా అనిపించింది’ అని చెప్పింది. ‘10 ఏళ్ల వయసులో ఉండగా చెన్నై ఆస్పత్రి సమీపంలో జరిగిన ఘటన నాకు ఎంతో స్ఫూర్తి ఇచ్చింది. ఆ తర్వాత జరిగిన అనేక ఘటనలు కూడా స్ఫూర్తిదాయకంగా నిలి చాయి. ఎనిమిదేళ్ల వయసులోనే నాకు మధుమేహం ఉందని వైద్యపరీక్షల్లో తేలింది. అంత చిన్న వయసులో ఈ వ్యాధిబారినపడిన చిన్నారులకు చికిత్స చేసేందుకు అప్పట్లో కోల్‌కతాలో ప్రత్యేక వైద్యులెవరూ లేరు. దీంతో చెన్నైలోని ఓ ఆస్పత్రికి వెళ్లాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు.
మధుమేహంతో బాధపడుతున్న చిన్నారులకు అక్కడి వైద్యులు ఇంజెక్షన్లు ఇవ్వడం నా కంటపడింది. అయితే వాస్తవానికి ఆ ఇంజెక్షన్లను కొనుగోలు చేసే శక్తి వారి కుటుంబీకులకు లేదు. ఈ ఘటనే నాకు స్ఫూర్తి నిచ్చింది. ఇటువంటి వారికి జీవితంలో మున్ముందు ఏదో ఒకటి చేయాలని ఆ రోజే నిర్ణయించుకున్నా’ అని తెలిపింది. అమెరికాలో ఇటీవల జరిగిన పురస్కార ప్రదాన కార్యక్ర మానికి హాజరైన వారిలో అనుష్క కూడా ఉంది.
కాగా గుర్గావ్‌కు చెందిన 12వ తరగతి విద్యార్థిని మేనక కూడా సామాజిక సేవ చేస్తోంది. తన ఇంటికి సమీపంలోని మురికివాడకుచెందిన చిన్నారులకు ఆంగ్లం నేర్పుతోంది. ఈ విషయమై ఆ చిన్నారి ఖాళీ సమయంలో ఆంగ్లం నేర్పుతున్నానని తెలిపింది. ఆ ప్రాంతానికి నీటి సరఫరా బాగా తక్కువని, దీంతో నీటి పొదుపు గురించి కూడా వారికి వివరిస్తున్నానని తెలిపింది.
ఇదిలాఉంచితే మేనక నీటి పొదుపుపై కూడా మురికివాడ వాసులకు అవగాహన కల్పిస్తోంది. ఢిల్లీకి చెందిన ఆకాశ్‌పవార్ అనే మరో విద్యార్థి బాల్యవివాహాలతోపాటు బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాడు. అనేక సంవత్సరాలుగా ఇందుకు సంబంధించిన కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నాడు.