water savings
-
నీటి నిర్వహణ సూచీలో తెలంగాణ పైపైకి
సాక్షి, న్యూఢిల్లీ : నీతి ఆయోగ్ రూపొందించిన నీటి నిర్వహణ సూచీ (కాంపొజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్)లో తెలంగాణ ప్రగతి కనబరచింది. 2015– 16లో 11వ ర్యాంకు సాధించిన రాష్ట్రం.. 2016– 17లో 8వ స్థానాన్ని కైవసం చేసుకుంది. భూగర్భ జలాలను పెంచుకోవడం ద్వారా ర్యాంకు ను మెరుగుపరుచుకున్నట్లు నీతి ఆయోగ్ విశ్లేషణలో వెల్లడైంది. 2015–16లో 2వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్.. 2016–17లో 3వ ర్యాంకుతో సరిపెట్టుకుంది. నీతి ఆయోగ్ తొలిసారి రూపొందించిన ఈ సూచీని 2015–16, 2016–17 సంవత్సరాలకు రూపొందించి 2015–16ను ప్రాతిపదికగా తీసుకున్నారు. 9 అంశాల ఆధారంగా ర్యాంకులను నిర్దేశించారు. నీటి వనరులు, భూగర్భ జలాల పునరుద్ధరణ, భారీ, మధ్య తరహా నీటి పారుదల–నిర్వహణ, వాటర్‌షెడ్ అభివృద్ధి–నిర్వహణ, భాగస్వామ్య నీటి పద్ధతులు, సుస్థిర సాగునీటి నిర్వహణ పద్ధతులు, గ్రామీణ తాగునీరు, పట్టణ తాగునీరు–పారిశుధ్య నిర్వహణ, విధానాలు–పాలన ప్రాతిపదికన దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు హిమాలయ, హిమాలయేతర కేటగిరీలుగా నీతి ఆయోగ్ ర్యాంకులు ప్రకటించింది. ఉపరితల నీటి వనరులను అభివృద్ధి పరుచుకొని సాగునీటి పారుదల సామర్థ్యం పెంచుకోవడం, విభిన్న రుతువుల్లో నీటి లభ్యత అంతరాలు తగ్గించడం అంశాల్లో తెలంగాణ ప్రతిభ కనబరిచినట్లు నీతి ఆయోగ్ పేర్కొంది. అయితే తెలంగాణలో 55% గ్రామీణ ఆవాసాలకే సురక్షిత తాగునీటి సరఫరా జరుగుతోందని, నీటి నాణ్యత మెరుగుపడటం లేదని నీతి ఆయోగ్ పేర్కొంది. ఏపీలో మూడో వంతు ఆవాసాలకు.. ఆంధ్రప్రదేశ్‌లో మూడో వంతు ఆవాసాలకు సురక్షిత తాగునీరు అందుబాటులో లేదని నీతి ఆయోగ్ విశ్లేíషించింది. 26% పట్టణ వ్యర్థ జలాలనే ఏపీ శుద్ధి చేస్తోందని, దీన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. 50% పైగా పట్టణ కుటుంబాల నుంచి నీటి రుసుము వసూలు చేయడం లేదని పేర్కొంది. -
నీటి సంరక్షణ అందరి బాధ్యత
సుండుపల్లి: నీటిని సంరక్షించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ కేవీ సత్యనారాయణ కోరారు. సుండుపల్లిలో శనివారం రాజంపేట ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డితో కలిసి నీటిపథకం ఏర్పాటుకు భూమిపూజ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నీరుచెట్టు కింద రూ.500కోట్ల వివిధరకాల పనులు, 2వేల చెక్డ్యాంకుల, 3500 ఇతర పనులు మంజూరుచేశామన్నారు. చిన్నచిన్న కుంటలు 60వేలు తవ్వామన్నారు. వర్షం వస్తే కుంటలు, వాగులు, చెరువుల్లో నీరు చేరితే నీటికష్టాలు తీరతాయన్నారు. ఎస్.డి.టి. కింద రూ.200కోట్లు జిల్లాకు మంజూరైతే రూ.180కోట్లు మంచినీటికే వినియోగిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సంజీవరావు, ఏఎస్ఈ అనుగురాజన్, తహసీల్దార్ సుబ్రమణ్యంరెడ్డి, ఎంపీడీఓ సుధాకర్‌రెడ్డి, దేశంనాయకులు రాజకుమార్‌రాజు, శివరామిరెడ్డి, మహేశ్వరరాజు, సీఐ నరసింహరాజు, ఎస్ఐ చలపతి పాల్గొన్నారు. -
మీ ఇంటి రేటింగ్ ఎంత?
♦ కస్టమర్ల చూపు గ్రీన్ బిల్డింగ్స్ వైపు ♦ విద్యుత్, నీటి పొదుపు; బిల్లుల తగ్గింపుతో డబ్బు ఆదా ♦ దేశంలో 3,770 గ్రీన్ బిల్డింగ్స్; తెలంగాణలో 259 ఇంట్లోకి ఫ్రిజ్, వాషింగ్ మిషన్ వంటి ఉత్పత్తులను కొనుగోలు చేసే ముందు త్రీస్టారా? ఫోర్ స్టారా? ఫైవ్ స్టారా? అని చూసి మరీ కొంటాం. వేల రూపాయల ఖరీదు చేసే వీటిని కొనేటప్పుడే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) రేటింగ్ ఉన్న వాటినే తీసుకుంటాం. మరి అలాంటిది ఏకంగా ఇంటినే కొనుగోలు చేసే ముందు ఏం చూడాలి? ఏ రేటింగ్ ఉన్న ఇంటిని సొంతం చేసుకోవాలి?.. ఇదిగో ఇప్పుడిదే చర్చ జరుగుతోంది స్థిరాస్తి రంగంలో! అందుకే హరిత భవనాలు (గ్రీన్స్ బిల్డింగ్స్) వైపే కొనుగోలుదారులు.. వాటి నిర్మాణాల వైపే నిర్మాణదారులూ అడుగులేస్తున్నారు మరి!! - సాక్షి, హైదరాబాద్ పర్యావరణ ప్రమాణాలను పాటించి నిర్మించే భవనాలనే గ్రీన్ బిల్డింగ్స్ అంటారు. సాధారణ నిర్మాణాలతో పోలిస్తే హరిత భవనాల నిర్మాణానికి 3-5 శాతం ఖర్చు ఎక్కువవుతుంది. విద్యుత్, నీటి వంటి బిల్లుల తగ్గింపు ద్వారా ఈ వ్యయం రెండేళ్లలో తిరిగొస్తుందని నిపుణులు చెబుతున్నారు. పునాది నుంచే మొదలు.. గ్రీన్ బిల్డింగ్స్ నిర్మాణానికి ఫ్లైయాష్ ఇటుకలు (బూడిదతో చేసిన ఇటుకలు), ఫ్లైయాష్ సిమెంట్ (గ్రీన్ సిమెంట్)లను వాడుతారు. రెండు బ్రిక్స్‌ల మధ్య థర్మాకోల ను పెడతారు. 15 నుంచి 18 మిల్లీ మీటర్ల మందం ఉన్న డబుల్ గ్రేసింగ్ అద్దాలను వినియోగిస్తారు. ఈ గ్లాస్ మధ్య 3 మి.మిల ఖాళీ స్థలం ఉంటుంది. ఇది గాలితో నిండి ఉంటుంది. రీసైకిల్ అల్యూమినియం ఉక్కు, రసాయన రహిత టైల్స్, సహజ రంగులు, వెదురు సంబంధిత సామగ్రిని గ్రీన్ హౌజ్ నిర్మాణాల్లో వినియోగిస్తారు. సౌర శక్తి సహాయంతో భవన నిర్మాణానికి అవసరమైన విద్యుత్, నీటిని వాడుకుంటారు. సహజ వెలుగులు, వాయు ప్రసరణకు వీలుగా నిర్మాణం ఉంటుంది. ఇంటిలోపలే కాకుండా వీధుల్లోనూ ఎల్ఈడీ లైట్లను వినియోగిస్తారు. ఆవరణ, పరిసరాల్లో తక్కువ నీటిని తీసుకొని ఎక్కువ కాలం జీవించే మొక్కలు, చెట్లను పెంచుతారు. దేశంలో 3,770 గ్రీన్ బిల్డింగ్స్.. దేశంలో హరిత భవనాలను ప్రోత్సహించేందుకు, వాటిని గుర్తించేందుకు ప్రత్యేకంగా ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) కూడా ఉంది. ఇది నిర్మాణాలు, వెంచర్లకు ప్లాటినం, గోల్డ్, సిల్వర్ అనే మూడు కేటగిరీల్లో రేటింగ్ ఇస్తుంటుంది. 80కి పైగా పాయింట్లు వస్తే ప్లాటినం, 60-79 మధ్య వస్తే గోల్డ్, 50-59 మధ్య వస్తే సిల్వర్ సర్టిఫికెట్లు ఇస్తారు. ఇప్పటివరకు దేశంలో 384 కోట్ల చ.అ.ల్లో సుమారు 3,770 ప్రాజెక్ట్‌లు హరిత భవనాలుగా గుర్తింపు పొందాయని ఐజీబీసీ చెబుతోంది. పాత ఇళ్లూ గ్రీన్‌గా.. కొత్త భవనాల సంగతి పక్కన పెడితే, మరి పాత ఇళ్లనూ గ్రీన్ బిల్డింగ్స్‌గా మార్చుకోలేమా? అంటే ఎస్ అనే సమాధానమిస్తోంది ఐజీబీసీ. గచ్చిబౌలిలోని హెచ్ఎస్బీసీ బ్యాంక్ భవనం ఇలా హరిత ప్రమాణాలకు అనుగుణంగా మార్చిందేనని ఉదహరిస్తోంది కూడా. ఏం చేయాలంటే.. ⇔ ఇంట్లో వినియోగించే ఎలక్ట్రిక్ వస్తువులన్నీ కూడా త్రీ స్టార్, ఫైవ్ స్టార్ ఉండే వి మాత్రమే చూసుకోవడం. ⇔ భవనాల లోపలికి గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే విధంగా పైకప్పు నిర్మాణంలో చిన్న చిన్న మార్పులు చే యాలి. ⇔ సాధ్యమైనంత వరకు సోలార్ విద్యుత్‌నే వినియోగించాలి. భవనం లోపల పూర్తిగా ఎల్ఈడీ లైట్లనే వినియోగించాలి. ⇔ నీటిని వృథా చేయరాదు. ఆయా భవన ప్రాంతాల్లో ఉన్న జీవ వైవిధ్యాన్ని కూడా పరిరక్షించాలి. వర్షపు నీరు వృథా కాకుండా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలి. హరిత భాగ్యనగరం.. దేశంలో తొలిసారిగా ప్లాటినం రేటింగ్ పొందిన భవనం.. హైదరాబాద్‌లోని సీఐఐ సొహబ్రి గోద్రెజ్ గ్రీన్ బిజినెస్ సెంటర్. 20 వేల చ.అ.ల్లోని ఈ నిర్మాణం 2003లో గుర్తింపు పొందింది. ఆ తర్వాత నివాస సముదాయంలో అవని రెసిడెన్సీ, గ్రీన్ ప్యాసింజర్ టెర్మినల్‌గా రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ప్రభుత్వ గ్రీన్ బిల్డింగ్‌గా హుడా బిల్డింగ్ (ప్రస్తుతం ఇది యూఎస్ కాన్సులేట్ కార్యాలయం) గుర్తింపు పొందాయి. తెలంగాణలోని 259 హరిత భవనాల్లో 150కి పైగా భవనాలు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. -
కొండపై నీటి పొదుపు
ముందస్తు జాగ్రత్తల్లో టీటీడీ మఠాలు,హోటళ్లకు సరఫరాలో కోత కాటేజీల్లోనూ కొళాయిల బంద్ పుష్కరిణికి ట్యాంకర్ల ద్వారా నీళ్లు తీవ్ర వర్షాభావ పరిస్థితులతో తాగునీటి జలాశయాలు ఎండి పోవడంతో టీటీడీ నీటి పొదుపు చర్యలు ముమ్మరం చేసింది. ఆలయం, నిత్యాన్న ప్రసాద కేంద్రం మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో నీటి సరఫరాలో భారీగా కోత విధించింది. వార్షిక, నవ రాత్రి బ్రహ్మోత్సవా లకు నీటి ఎద్దడి లేకుండా టీటీడీ ముందస్తు చర్యలు చేపట్టింది. తిరుమల:తిరుమలకు శ్రీవారి దర్శనం కోసం వచ్చే సుమారు 70 వేల మంది భక్తులతో పాటు ఆలయ అవసరాల కోసం రోజూ 32 లక్షల గ్యాలన్ల నీరు అవసరం. ఏటా కురవాల్సిన 1,369.4 మిల్లీ మీటర్ల వర్షపాతంలో కనీసం 800 మి.మీ కూడా పడలేదు. తాగునీటిని సరఫరా చేసే గోగర్భం(2,840 లక్షల గ్యాలన్లు), ఆకాశ గంగ(670 లక్షల గ్యాలన్లు), కుమారధార(3224.83 లక్షల గ్యాలన్లు), పసుపుధార(886.70 లక్షల గ్యాలన్ల) ఎండిపోయాయి. ఒక్క పాపవినాశనం(5240 లక్షల గ్యాలన్లు)లో 20 శాతం మాత్రమే నీటి నిల్వ ఉంది. గంగ, బోర్ల నీటితో నెట్టుకొస్తున్న టీటీడీ తిరుమల అవసరాల కోసం రోజూ 5 నుంచి 7 ఎంఎల్డీ తెలుగుగంగ నీటిని సరఫరా చేస్తున్నారు. ఒప్పందం ప్రకారం రోజూ 10 ఎంఎల్డీ (22.5 లక్షల గ్యాలన్లు) తెలుగుగంగ నీటిని సరఫరా చేయాల్సి ఉన్నా ప్రస్తుతం అందులో సగం మాత్ర మే అందుతోంది. దీంతోపాటు కల్యాణీ డ్యాంలో వేసిన బోర్ల ద్వారా మరికొంత నీటిని సేకరిస్తున్నా రు. వీటితో భక్తులు, ఆలయం, అన్నదానం కోసం సరఫరా చేస్తున్నారు. నిత్యం వాడే నీటిలో సుమారు 40 శాతం కోత విధించారు. నీటిని చాలా పొదుపుగా వాడుతున్నారు. మఠాలు, హోటళ్లకు భారీగా కోత తిరుమలలోని 30 మఠాలు, 20 దాకా పెద్ద హోటళ్లు, మరో 50 హోటళ్లకు సరఫరా చేసే నీటిని బట్టి టీటీడీ అద్దె వసూలు చేస్తోంది. తాజా పరిస్థితులతో భారీగా నీ టి కోత విధించారు. దీంతో ప్రత్యామ్నాయంగా తిరుప తి నుంచి ట్యాంకర్లతో నీటిని కొనుగోలు చేస్తున్నారు. ఇక స్థానికులు నివాసం ఉండే బాలాజీనగర్‌లో కూడా పది రోజులకు ఒకసారి సరఫరా చేస్తున్నారు. కాటేజీల్లో ని నీటి కొళాయిల(నల్లాలు) సరఫరాలోనూ కోత విధిం చారు. ఆరుబయట కొన్ని తాగునీటి కొళాయిల్ని మూసివేశారు. కాటేజీల్లో మరుగుదొడ్డి, స్నానాల గది, వాష్బేసిన్లో మూడు కొళాయిలు ఉంటాయి. రెండు కొళాయి లు మూసివేసి కేవలం ఓ కొళాయి ద్వారానే నీటిని సరఫరా చేస్తున్నారు. ఆరుబయట రోడ్లకు ఇరువైపులా ఉం డే మరుగుదొడ్లు, స్నానాల గదుల్లో కొన్ని మూసివేశారు. మరికొన్నింటిలో నీరు వృథా కాకుండా నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేశారు. ట్యాంకర్లతోనే శ్రీవారి పుష్కరిణికి మంచినీరు సెప్టెంబర్ 16 నుంచి 26 వరకు వార్షిక, అక్టోబర్ 14 నుంచి 22 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాల కోసం పుష్కరిణికి మరమ్మతులు పూర్తి చేశారు. తిరుమలలోని మంచి నీటి డ్యామ్‌లు ఎండిపోవడంతో తిరుపతి నుంచి ట్యాంకర్లతో నీటిని పుష్కరిణికి సరఫరా చేస్తున్నారు. బ్రహ్మోత్సవాలకు నీటి ఇబ్బందులు లేకుండా పొదుపు చర్యల్ని టీటీడీ పెంచింది. -
ఆపన్న హస్తం
ఖాళీ సమయాన్ని సామాజిక సేవకు వెచ్చిస్తున్న విద్యార్థులు ఏ పనీ లేకపోతే సరదాగా సినిమాకో షికారుకో వెళదామని అనేకమంది అనుకుంటారు. మరికొందరు ముసుగుతన్ని నిద్ర పోతుంటారు. ఈ ధోరణిలో క్రమేణా మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం అనేకమంది తమ ఖాళీ సమయాన్ని సామాజిక సేవ కోసం వినియోగిస్తున్నారు. ఇటువంటి వారిలో సాధారణ పౌరులకంటే విద్యార్థుల సంఖ్యే అధికంగా ఉంది. న్యూఢిల్లీ : నిన్నమొన్నటిదాకా ఖాళీ సమయంలో సినిమాలకు వెళ్లడమో లేక ఆటలాడుకోవడమో చేస్తున్న విద్యార్థులు ఇప్పుడు సామాజిక సేవపై ఆసక్తి చూపుతున్నారు. ఈ విషయమై కోల్‌కతానుంచి నగరానికి వచ్చి 11వ తరగతి చదువుతున్న అనుక్ష మండల్ మాట్లాడుతూ ‘భవిష్యత్తులో ఏదో మేలు జరుగుతుందనే ఆశతో మంచి పనులు చేయొద్దు. ఇతరులు మీ నుంచి స్ఫూర్తి పొందేందుకు మాత్రమే చేయాలి’ అని అంది. కాగా సీక్రెట్ శాంటా క్లాజ్ వేషం ధరించిన అనుక్ష గత ఏడాది డిసెంబర్లో క్రిస్మస్ సందర్భంగా బుద్ధిమాంద్య సమస్యతో బాధపడుతున్న విద్యార్థులతో కాలక్షేపం చేసింది. వారికి ఆ రోజంతా వినోదం కల్పించాడు. 2012లో శీతాకాలంలో వీధులే ఆవాసాలుగా కాలం గడుపుతున్న 500 మంది అనాథలకు దుప్పట్లను పంచిపెట్టింది. వీటిని కొనుగోలు చేసేందుకు తన స్నేహితులతోపాటు బంధువుల వద్దనుంచి ఈ చిన్నారి రూ. 55 వేలను విరాళాల రూపంలో సేకరించింది. ఇందుకోసం తన స్నేహితురాళ్లను ఎంచుకుని వారిని ఐదు బృందాలుగా విభజించింది. వారందరినీ నగరంలోని వివిధ ప్రాంతాలకు రాత్రిపూట పంపించి రహదార్ల పక్కన నిద్రిస్తున్న అనాథలకు దుప్పట్లను పంపిణీ చేసింది. ఈ విషయమై అనుక్ష మాట్లాడుతూ ‘శీతాకాలంలో రాత్రివేళల్లో రహదార్లపై నిద్రిస్తున్న అనేకమంది చనిపోతున్నారనే విషయం నా దృష్టికొచ్చింది. వారికి ఏదో ఒకటి చేయాలని నాకనిపించింది. వాస్తవానికి మా అమ్మ కూడా తన చిన్నతనంలో బడి కి వెళ్లే సమయంలో సామాజిక సేవ చేసింది. ఈ నేపథ్యంలో నా ఆలోచనను ఆమె ముందుంచా. దీంతో కొన్ని కంపెనీలతోపాటు స్నేహితులను ఆర్థిక సహాయం చేయాలని కోరాల్సిందిగా చెప్పింది. నాతో కలసి రావాలంటూ డిసెంబర్ 27వ తేదీన కొంతమందిని కోరా. వారి తో నగరంలోని వివిధ ప్రాంతాల్లో రాత్రిపూట సంచరించా. కొంతమంది అనాథలు ఫుట్‌పాత్‌లపై నిద్రించడం కనిపించింది. అటువంటి వారందరికీ దుప్పట్లు అందజేశాం. ఇలా చేయడం నాకు ఎంతో ఆనందంగా అనిపించింది’ అని చెప్పింది. ‘10 ఏళ్ల వయసులో ఉండగా చెన్నై ఆస్పత్రి సమీపంలో జరిగిన ఘటన నాకు ఎంతో స్ఫూర్తి ఇచ్చింది. ఆ తర్వాత జరిగిన అనేక ఘటనలు కూడా స్ఫూర్తిదాయకంగా నిలి చాయి. ఎనిమిదేళ్ల వయసులోనే నాకు మధుమేహం ఉందని వైద్యపరీక్షల్లో తేలింది. అంత చిన్న వయసులో ఈ వ్యాధిబారినపడిన చిన్నారులకు చికిత్స చేసేందుకు అప్పట్లో కోల్‌కతాలో ప్రత్యేక వైద్యులెవరూ లేరు. దీంతో చెన్నైలోని ఓ ఆస్పత్రికి వెళ్లాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు. మధుమేహంతో బాధపడుతున్న చిన్నారులకు అక్కడి వైద్యులు ఇంజెక్షన్లు ఇవ్వడం నా కంటపడింది. అయితే వాస్తవానికి ఆ ఇంజెక్షన్లను కొనుగోలు చేసే శక్తి వారి కుటుంబీకులకు లేదు. ఈ ఘటనే నాకు స్ఫూర్తి నిచ్చింది. ఇటువంటి వారికి జీవితంలో మున్ముందు ఏదో ఒకటి చేయాలని ఆ రోజే నిర్ణయించుకున్నా’ అని తెలిపింది. అమెరికాలో ఇటీవల జరిగిన పురస్కార ప్రదాన కార్యక్ర మానికి హాజరైన వారిలో అనుష్క కూడా ఉంది. కాగా గుర్గావ్కు చెందిన 12వ తరగతి విద్యార్థిని మేనక కూడా సామాజిక సేవ చేస్తోంది. తన ఇంటికి సమీపంలోని మురికివాడకుచెందిన చిన్నారులకు ఆంగ్లం నేర్పుతోంది. ఈ విషయమై ఆ చిన్నారి ఖాళీ సమయంలో ఆంగ్లం నేర్పుతున్నానని తెలిపింది. ఆ ప్రాంతానికి నీటి సరఫరా బాగా తక్కువని, దీంతో నీటి పొదుపు గురించి కూడా వారికి వివరిస్తున్నానని తెలిపింది. ఇదిలాఉంచితే మేనక నీటి పొదుపుపై కూడా మురికివాడ వాసులకు అవగాహన కల్పిస్తోంది. ఢిల్లీకి చెందిన ఆకాశ్పవార్ అనే మరో విద్యార్థి బాల్యవివాహాలతోపాటు బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాడు. అనేక సంవత్సరాలుగా ఇందుకు సంబంధించిన కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నాడు.