మీ ఇంటి రేటింగ్ ఎంత?
♦ కస్టమర్ల చూపు గ్రీన్ బిల్డింగ్స్ వైపు
♦ విద్యుత్, నీటి పొదుపు; బిల్లుల తగ్గింపుతో డబ్బు ఆదా
♦ దేశంలో 3,770 గ్రీన్ బిల్డింగ్స్; తెలంగాణలో 259
ఇంట్లోకి ఫ్రిజ్, వాషింగ్ మిషన్ వంటి ఉత్పత్తులను కొనుగోలు చేసే ముందు త్రీస్టారా? ఫోర్ స్టారా? ఫైవ్ స్టారా? అని చూసి మరీ కొంటాం. వేల రూపాయల ఖరీదు చేసే వీటిని కొనేటప్పుడే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) రేటింగ్ ఉన్న వాటినే తీసుకుంటాం. మరి అలాంటిది ఏకంగా ఇంటినే కొనుగోలు చేసే ముందు ఏం చూడాలి? ఏ రేటింగ్ ఉన్న ఇంటిని సొంతం చేసుకోవాలి?.. ఇదిగో ఇప్పుడిదే చర్చ జరుగుతోంది స్థిరాస్తి రంగంలో! అందుకే హరిత భవనాలు (గ్రీన్స్ బిల్డింగ్స్) వైపే కొనుగోలుదారులు.. వాటి నిర్మాణాల వైపే నిర్మాణదారులూ అడుగులేస్తున్నారు మరి!! - సాక్షి, హైదరాబాద్
పర్యావరణ ప్రమాణాలను పాటించి నిర్మించే భవనాలనే గ్రీన్ బిల్డింగ్స్ అంటారు. సాధారణ నిర్మాణాలతో పోలిస్తే హరిత భవనాల నిర్మాణానికి 3-5 శాతం ఖర్చు ఎక్కువవుతుంది. విద్యుత్, నీటి వంటి బిల్లుల తగ్గింపు ద్వారా ఈ వ్యయం రెండేళ్లలో తిరిగొస్తుందని నిపుణులు చెబుతున్నారు.
పునాది నుంచే మొదలు..
గ్రీన్ బిల్డింగ్స్ నిర్మాణానికి ఫ్లైయాష్ ఇటుకలు (బూడిదతో చేసిన ఇటుకలు), ఫ్లైయాష్ సిమెంట్ (గ్రీన్ సిమెంట్)లను వాడుతారు. రెండు బ్రిక్స్‌ల మధ్య థర్మాకోల ను పెడతారు. 15 నుంచి 18 మిల్లీ మీటర్ల మందం ఉన్న డబుల్ గ్రేసింగ్ అద్దాలను వినియోగిస్తారు. ఈ గ్లాస్ మధ్య 3 మి.మిల ఖాళీ స్థలం ఉంటుంది. ఇది గాలితో నిండి ఉంటుంది. రీసైకిల్ అల్యూమినియం ఉక్కు, రసాయన రహిత టైల్స్, సహజ రంగులు, వెదురు సంబంధిత సామగ్రిని గ్రీన్ హౌజ్ నిర్మాణాల్లో వినియోగిస్తారు. సౌర శక్తి సహాయంతో భవన నిర్మాణానికి అవసరమైన విద్యుత్, నీటిని వాడుకుంటారు. సహజ వెలుగులు, వాయు ప్రసరణకు వీలుగా నిర్మాణం ఉంటుంది. ఇంటిలోపలే కాకుండా వీధుల్లోనూ ఎల్‌ఈడీ లైట్లను వినియోగిస్తారు. ఆవరణ, పరిసరాల్లో తక్కువ నీటిని తీసుకొని ఎక్కువ కాలం జీవించే మొక్కలు, చెట్లను పెంచుతారు.
దేశంలో 3,770 గ్రీన్ బిల్డింగ్స్..
దేశంలో హరిత భవనాలను ప్రోత్సహించేందుకు, వాటిని గుర్తించేందుకు ప్రత్యేకంగా ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) కూడా ఉంది. ఇది నిర్మాణాలు, వెంచర్లకు ప్లాటినం, గోల్డ్, సిల్వర్ అనే మూడు కేటగిరీల్లో రేటింగ్ ఇస్తుంటుంది. 80కి పైగా పాయింట్లు వస్తే ప్లాటినం, 60-79 మధ్య వస్తే గోల్డ్, 50-59 మధ్య వస్తే సిల్వర్ సర్టిఫికెట్లు ఇస్తారు. ఇప్పటివరకు దేశంలో 384 కోట్ల చ.అ.ల్లో సుమారు 3,770 ప్రాజెక్ట్‌లు హరిత భవనాలుగా గుర్తింపు పొందాయని ఐజీబీసీ చెబుతోంది.
పాత ఇళ్లూ గ్రీన్‌గా..
కొత్త భవనాల సంగతి పక్కన పెడితే, మరి పాత ఇళ్లనూ గ్రీన్ బిల్డింగ్స్‌గా మార్చుకోలేమా? అంటే ఎస్ అనే సమాధానమిస్తోంది ఐజీబీసీ. గచ్చిబౌలిలోని హెచ్‌ఎస్‌బీసీ బ్యాంక్ భవనం ఇలా హరిత ప్రమాణాలకు అనుగుణంగా మార్చిందేనని ఉదహరిస్తోంది కూడా.
ఏం చేయాలంటే..
⇔ ఇంట్లో వినియోగించే ఎలక్ట్రిక్ వస్తువులన్నీ కూడా త్రీ స్టార్, ఫైవ్ స్టార్ ఉండే వి మాత్రమే చూసుకోవడం.
⇔ భవనాల లోపలికి గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే విధంగా పైకప్పు నిర్మాణంలో చిన్న చిన్న మార్పులు చే యాలి.
⇔ సాధ్యమైనంత వరకు సోలార్ విద్యుత్‌నే వినియోగించాలి. భవనం లోపల పూర్తిగా ఎల్‌ఈడీ లైట్లనే వినియోగించాలి.
⇔ నీటిని వృథా చేయరాదు. ఆయా భవన ప్రాంతాల్లో ఉన్న జీవ వైవిధ్యాన్ని కూడా పరిరక్షించాలి. వర్షపు నీరు వృథా కాకుండా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలి.
హరిత భాగ్యనగరం..
దేశంలో తొలిసారిగా ప్లాటినం రేటింగ్ పొందిన భవనం.. హైదరాబాద్‌లోని సీఐఐ సొహబ్రి గోద్రెజ్ గ్రీన్ బిజినెస్ సెంటర్. 20 వేల చ.అ.ల్లోని ఈ నిర్మాణం 2003లో గుర్తింపు పొందింది. ఆ తర్వాత నివాస సముదాయంలో అవని రెసిడెన్సీ, గ్రీన్ ప్యాసింజర్ టెర్మినల్‌గా రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ప్రభుత్వ గ్రీన్ బిల్డింగ్‌గా హుడా బిల్డింగ్ (ప్రస్తుతం ఇది యూఎస్ కాన్సులేట్ కార్యాలయం) గుర్తింపు పొందాయి. తెలంగాణలోని 259 హరిత భవనాల్లో 150కి పైగా భవనాలు హైదరాబాద్‌లోనే ఉన్నాయి.