కుమార్తెను అప్పగించాలని వేడుకుంటున్న గాయం నాగమణి, పక్కనే సోదరుడు రాము
సాక్షి, మచిలీపట్నం: తప్పిపోయిన కూతురు పదేళ్ల తర్వాత ప్రత్యక్షమవడంతో ఆ తల్లి ఆనందానికి అవధుల్లేవు. పేగు తెంచుకు పుట్టిన కన్న కూతుర్ని ఎలాగైనా దక్కించుకోవాలని ఆ తల్లి ఆరాటపడుతోంది. కూలి పని చేసుకుని పెంచుకుంటా కుమార్తెను అప్పగించండంటూ ఉన్నతాధికారులను వేడుకుంటోంది. సంబంధిత వివరాలు ఇలా ఉన్నాయి...
కృష్ణా జిల్లా తిరువూరు భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన గాయం నాగమణికి ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. పదేళ్ల క్రితం ఆమెతో భర్త గొడవపడి ఇద్దరు కుమార్తెలను, ఓ కుమారుడుని తీసుకుని ఇంటి నుంచి వెళ్లి పోయాడు. మద్యానికి బానిసైన భర్త కన్నబిడ్డలను వదిలేయడంతో వారిలో ఇద్దరు తల్లి వద్దకు చేరుకున్నారు. తప్పిపోయిన బాలిక అమూల్య కోసం ఆ తల్లి గాలించినా ఫలితం లేకుండా పోయింది. కాగా, ఐదేళ్ల అమూల్యను ఓ మహిళ చేరదీసి చేవూరి కృష్ణవేణి పేరుతో మచిలీపట్నంలోని బాలసదన్‌లో చేర్పించింది. అక్కడ ఏడో తరగతి వరకు చదివిన అమూల్య ప్రస్తుతం ఎ.కొండూరులోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం (కేజీవీబీ)లో 8వ తరగతి చదువుతోంది. కోవిడ్ నేపథ్యంలో కేజీవీబీ మూసివేయగా.. రాజ్యలక్ష్మి అనే ఉపాధ్యాయురాలు ఆశ్రయం ఇచ్చారు. తన కుటుంబ వివరాలు చెప్పడంతో ఆ ఉపాధ్యాయురాలు అమూల్యను వెంటబెట్టుకుని తిరువూరులో గాలించారు. చివరకు తల్లి ఆచూకీ తెలిసింది. తన బిడ్డను అప్పగించమని కేజీబీవీ అధికారిని ఆ తల్లి వేడుకోగా చైల్డ్ వెల్ఫేర్ కమిటీని సంప్రదించాలని సూచించారు.
డీఎన్‌ఏ పరీక్షలో నిర్ధారిస్తేనే..
ఐసీడీఎస్ అధికారులు, తహసీల్దార్ అమూల్యగా నిర్ధారిస్తూ ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారు. అయితే డీఎన్‌ఏ పరీక్ష చేస్తే కానీ అమూల్యను నాగమణి కుమార్తెగా నిర్ధారించలేమని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చెప్పింది. దీంతో ఆ తల్లి కన్న కూతురు కోసం అధికారుల చుట్టూ తిరుగుతోంది. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని తన కుమార్తెను అప్పగించాలని వేడుకుంటోంది. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ‘స్పందన’లో వినతిపత్రం సమర్పించింది.
గుర్తిస్తే అప్పగించవచ్చు
ఐదేళ్ల ప్రాయంలో తప్పిపోయిన పిల్లలకు కొంతమేర తల్లిదండ్రులను గుర్తించే జ్ఞాపకశక్తి ఉంటుంది. ఇటువంటి కేసుల్లో తల్లిదండ్రులను గుర్తిస్తే బంధువులు, చుట్టుపక్కల వారిని విచారించి వాస్తవమైతే లిఖిత పూర్వకంగా అంగీకారం తీసుకుని అప్పగించవచ్చు. భవిష్యత్తులో న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తుతాయని భావిస్తే డీఎన్‌ఏ రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోవచ్చు.
– డి.ఆంజనేయరెడ్డి, డైరెక్టర్, నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్
Comments
Please login to add a commentAdd a comment