ఫైల్ ఫోటో
సాక్షి, మచిలీపట్నం: విదేశాల నుంచి వచ్చిన వారి నుంచే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది. అందుకే అసలు జిల్లాకు ఎంతమంది వచ్చారనే లెక్క పక్కాగా తీశారు. ఇప్పటి వరకు వివిధ దేశాల నుంచి జిల్లాకు 2,703 మంది వచ్చినట్లుగా ధ్రువీకరించారు. కేంద్ర విమానయాన శాఖ నుంచి వచ్చిన జాబితాలో ఉన్న అడ్రస్‌ల మేరకు క్షేత్రస్థాయి పరిశీలన చేయగా ఇందులో 2,606 మందిని గుర్తించారు. 97 మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. వీరు ఎక్కడ ఉన్నారనేది దానిపై ఆరా తీస్తున్నారు. జాబితాలో ఇచ్చిన అడ్రస్‌లో వారు లేకపోవటంతోనే సమస్యగా మారింది. ఇదే విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. విదేశాల నుంచి వచ్చిన వారి జాబితాలో పేర్లు ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఆచూకీ లభించకపోవటంపై ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఎందుకిలా జరిగిందనేది నిశిత పరిశీలన చేయాలని పోలీసు, రెవెన్యూ, వైద్య శాఖలకు ఆదేశించింది. మరో పక్క సచివాలయ, వార్డు/గ్రామ వలంటీర్లు సైతం ఇదే పనిలో ఉన్నారు. (నడుస్తూనే షాపులకు వెళ్లాలి)
9 మందిపై కేసు నమోదు..
విదేశాల నుంచి వచ్చిన వారు 28 రోజుల వరకు తప్పనిసరిగా ఇళ్లల్లోనూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌లో ఉండాలి. కానీ కొంతమంది దీనిని బేఖాతర్ చేస్తూ, బయటకొస్తున్నారు. ఇటువంటి వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలో తొమ్మిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసులు నమోదైతే పాస్‌పోర్టు, ఉద్యోగాలు పొందేందుకు ఇబ్బందులు ఎదురవుతాయని పోలీసులు అంటున్నారు. అందుకే విదేశాల నుంచి వచ్చిన వారు బయటకు రావద్దని సూచిస్తున్నారు. (ఇది.. ఇన్ఫోడెమిక్ !)
గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ..
విదేశాల నుంచి వచ్చిన వారిలో జిల్లాకు చెందిన వారు 2,443 మంది ఉండగా, ఇందులో 1,305 మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు కాగా 1,138 మంది పట్టణ ప్రాంతాల వారని అధికారులు లెక్క తేల్చారు. ఇక మిగిలిన వారిలో ఇతర జిల్లాలకు చెందిన వారు 43 మంది, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 73 మంది, ఇతర దేశాలకు చెందిన వారు 47 మంది ఉన్నట్లు గుర్తించారు. వీరందరికి అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించి హోం క్వారంటైన్‌లో ఉంచారు. (బోగీల్లో 20 వేల ఐసోలేషన్ పడకలు!)
వయసుల వారీ ఇలా..
పది ఏళ్లలోపు వారు 119 మంది ఉండగా, 10నుంచి 20 ఏళ్లు లోపువారు 107 మంది ఉన్నారు. 20 నుంచి 50 సంవత్సరాల లోపు వారు 1,681 మంది కాగా, ఆ పై వయస్సు గల వారు 536 మంది ఉన్నట్లుగా అధికారులు లెక్క తేల్చారు. (పొడిగింపు లేదు.. ఎమర్జెన్సీకి తావు లేదు)
Comments
Please login to add a commentAdd a comment