దత్తుపై దయచూపండి..
-
ప్రస్తుతం ప్రాణాపాయ పరిస్థితి
-
శస్త్రచికిత్స చేయాలంటే రూ.25 లక్షలు అవసరం
-
అప్పులు చేసి, ఉన్నదంతా ఖర్చుపెట్టిన తల్లిదండ్రులు
-
ఏమీ చేయలేక ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు
ఆదిలాబాద్ రిమ్స్ : పంతొమ్మిదేళ్ల వయసులో చలాకిగా ఉండాల్సిన ఆ యువకుడు.. మంచానికే పరిమితమయ్యాడు. ఆ వయసులో అందరిలా తాను చదువుకోవాలని.. ఆటలాడాలని.. ఆశ ఉన్నా అనారోగ్యం అతడి పాలిట శాపంగా మారింది. లివర్ చెడిపోయి అతని బతుకు దుర్భరంగా మారింది. పొట్ట ఉబ్బి, కాళ్లు, చేతులు వాపులతో అసలు నడవడానికే ఇబ్బంది పడుతున్నాడా యువకుడు. వైద్యం కోసం ఎదురుచూస్తున్నాడు.
ఎనిమిదేళ్లుగా అనారోగ్యమే..
ఆదిలాబాద్ పట్టణం రాంనగర్ కాలనీకి చెందిన దుమ్మ వనిత, భగవాండ్లు దంపతులకు ఒక కూతురు, ఒక కుమారుడు. గతంలోనే కూతురు హేమలత వివాహం చేయగా, ప్రస్తుతం కుమారుడు దత్తాత్రి డిగ్రీ తతీయ సంవత్సరం చదువుతున్నాడు. 2008లో జాండీస్ రావడంతో హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు చేసిన వైద్యులు దత్తుకు లివర్ పాడైపోయిందని తెలిపారు. దీంతో ప్రతీ నెల ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. చికిత్సలతో ప్రతీ నెల దాదాపు రూ.20 వేల ఖర్చు వచ్చేది. ఇలా ఏడాది పాటు వైద్యం చేయించుకున్నారు. అక్కడ నయం కాకపోవడంతో మళ్లీ మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చూపించారు. మళ్లీ హైదరాబాద్‌లోని మెడిసిటీలో మూడేళ్ల పాటు చికిత్స చేయించుకున్నారు. ఇలా మూడేళ్లలో రూ.2 లక్షలు ఖర్చయ్యాయి. అక్కడ నుంచి మళ్లీ వార్దాలో నెలరోజుల పాటు చికిత్స అందించారు. ఇలా ప్రతినెల ఆస్పత్రులు చుట్టూ తిరిగిన వ్యాధి నయం కాలేదు. ఇప్పటి వరకు రూ.10 లక్షల వరకు ఖర్చు చేసినట్లు దత్తు తల్లిదండ్రులు తెలుపుతున్నారు. ఇప్పటికే బ్యాంకులో రూ. 2 లక్షలు అప్పుతీసుకోగా, రూ. 3 లక్షల వరకు ప్రై వేట్ అప్పులు చేసి కొడుకు చికిత్స అందిస్తున్నారు. ఉస్మానియా, యశోద ఆస్పత్రులకు వెళ్లినా ప్రయోజనం లేదు. రూ.25 లక్షల వరకు చెల్లిస్తే శస్త్రచికిత్స చేస్తామని ప్రైవేట్ ఆస్పత్రులు చెప్పడంతో ఒక్కసారిగా కంగుతిన్నారు. ప్రస్తుతం రెండు నెలలుగా దత్తు మంచానికి పరిమితమయ్యాడు. రిమ్స్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స తీసుకుంటున్నాడు. దత్తు తండ్రి భగవాండ్లు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం చేస్తున్నాడు. తల్లిదత్తుకు సపర్యాలు చేస్తూ ఇంట్లోనే ఉంటోంది. కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. ఎవరైనా దాతలు ఆదుకుని తమ కొడుకును కాపాడాలని ఆ తల్లిదండ్రులు వనిత, భగవాండ్లు వేడుకుంటున్నారు.