సాక్షి, హైదరాబాద్: అమ్మ నవమాసాలూ మోసి జన్మనిస్తే.. తండ్రి తన శరీరంలోని ఓ భాగాన్ని ఇచ్చి పునర్జన్మనిచ్చాడు.. బిడ్డను కాపాడుకునేందుకు తల్లిదండ్రులు పడుతున్న తపనను చూసిన వైద్యులు తమ వంతు సాయం చేసి ప్రాణం నిలబెట్టారు.. రూ.25 లక్షలు ఖర్చయ్యే కాలేయ మార్పిడి శస్త్రచికిత్సను ఉచితంగా చేశారు.. నిండు ఆరోగ్యం సమకూరిన చిన్నారి చిరునవ్వునే తమకు బహుమతిగా తీసుకున్నారు.. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం రాంపురం గ్రామానికి చెందిన మాడేపల్లి సతీశ్, మమతల కుమార్తె సౌజన్య (4) గాథ ఇది. ఉస్మానియా ఆస్పత్రి వైద్యుడు మధుసూదన్ ఆధ్వర్యంలో పలువురు వైద్యులు, మ్యాక్స్‌క్యూర్ ఆస్పత్రి, రెండు ఔషధ సంస్థలు ఈ సర్జరీకి సహాయం చేశారు.
అరుదైన వ్యాధితో బాధపడుతూ..
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం రాంపురం గ్రామానికి చెందిన దంపతులు మాడేపల్లి సతీశ్, మమత. సతీశ్ వరంగల్‌లోని ఓ సెలూన్‌లో వర్కర్‌గా పనిచేస్తున్నాడు. వారి ఒక్కగానొక్క కుమార్తె సౌజన్య (4). ఆమె పుట్టుకతోనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఆరోగ్యం సరిగా ఉండకపోవడం, కడుపు ఉబ్బిపోవడంతో చాలా ఆస్పత్రులు తిరిగారు. హైదరాబాద్ నగరంలోని పలు కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లారు. అక్కడ వైద్యులు పలు పరీక్షలు చేసి సౌజన్య హెపాటిక్ ఫైబ్రోసిస్ అనే తీవ్రమైన కాలేయ వ్యాధితో బాధపడుతోందని గుర్తించారు. దెబ్బతిన్న కాలేయాన్ని తొలగించి.. ఇతరుల కాలేయం అమర్చాల్సి ఉంటుందని తేల్చారు.
ఇందుకు రూ.25 లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పారు. సతీశ్ తమకు ఆరోగ్యశ్రీ కార్డు ఉందని ఆస్పత్రుల్లో చూపితే.. ఈ శస్త్రచికిత్సకు ఆరోగ్యశ్రీ వర్తించదని చెప్పారు. దాంతో వారు ఇటీవల పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులను కలసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారు నిమ్స్‌లో చేర్పించి చికిత్స చేయిస్తామని హామీ ఇచ్చినా.. తర్వాత పట్టించుకోలేదు. దాంతో సతీశ్, మమత వెళ్లి సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు ప్రయత్నించినా వీలుకాలేదు. చివరికి ఉస్మానియా ఆస్పత్రిలో ప్రముఖ కాలేయ వైద్యుడు మధుసూదన్‌ను సంప్రదించారు. ఆయన సౌజన్య పరిస్థితిని పరిశీలించి.. కాలేయ మార్పిడి చికిత్స చేసేందుకు అంగీకరించారు. తండ్రి కాలేయం ఆమెకు సరిపడడంతో.. సతీశ్ శరీరం నుంచి కొంత కాలేయాన్ని తీసి సౌజన్యకు అమర్చేందుకు సిద్ధమయ్యారు.
తలా ఇంత సాయం చేసి...
సతీశ్, మమతలు అప్పటికే తమ బిడ్డ వైద్యం కోసం ఆరేడు లక్షల రూపాయలు ఖర్చు చేసి ఉన్నారు. ఇప్పుడు శస్త్రచికిత్స కోసం అవసరమైన మందులు, పరికరాలు కొనుగోలు చేసేందుకు డబ్బులు లేవని వైద్యుడు మధుసూదన్‌తో ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పాపను ఎలాగైనా కాపాడాలని భావించిన మధుసూదన్.. తాను కొంత సొమ్మును సర్దారు. పలువురు స్నేహితులు, ఇతర దాతల నుంచి కొంత డబ్బును విరాళంగా సేకరించారు. రెండు ఔషధ కంపెనీలు ఖరీదైన మందులు, సర్జికల్ పరికరాలను ఉచితంగా అందించేందుకు ముందుకు వచ్చాయి.
అయితే ఉస్మానియాలో ‘లైవ్ డోనర్ లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ (జీవించి ఉన్న ఓ వ్యక్తి నుంచి కాలేయాన్ని కత్తిరించి.. వెంటనే మరొకరికి అమర్చడానికి)’కు కావాల్సిన మౌలిక వసతులు లేవు. ఆలస్యం చేస్తే పాప ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉండటంతో.. మధుసూదన్ కార్పొరేట్ ఆస్పత్రుల సాయం కోరారు. దీంతో మ్యాక్స్‌క్యూర్ ఆస్పత్రి యాజమాన్యం ముందుకు వచ్చి.. ఆపరేషన్ థియేటర్ సహా ఐసీయూ, ఇన్వెస్టిగేషన్ ఇతర సౌకర్యాలను ఉచితంగా సమకూర్చేందుకు అంగీకరించింది. దీంతో చిన్నారి సౌజన్యను మ్యాక్స్‌క్యూర్ ఆస్పత్రికి తరలించారు.
అక్కడ 15 రోజుల క్రితం తండ్రి సతీశ్ నుంచి 130 గ్రాముల కాలేయాన్ని సేకరించి.. సౌజన్యకు విజయవంతంగా అమర్చారు. ప్రస్తుతం తండ్రి, కుమార్తె ఇద్దరూ కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. పలువురు సర్జన్లు, అనెస్థీషియన్లు, ఇతర వైద్య సిబ్బంది పైసా ఆశించకుండా చికిత్సకు తోడ్పాటు అందించారని డాక్టర్ మధుసూదన్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment