బోసి నవ్వులు పదిలం
సీఎం చొరవతో శ్రీమాన్‌కు విజయవంతంగా కాలేయ మార్పిడి
గజ్వేల్: చాలా కాలం తర్వాత ఆ ఇంట బోసి నవ్వులు విరిశాయి. అరుదైన ‘బిలరి అస్టీరియా’ వ్యాధితో బాధపడుతున్న 11 నెలల చిన్నారి శ్రీమాన్ కాలేయ మార్పిడి ఆపరేషన్‌ను పూర్తి చేసుకొని ఇంటికి చేరుకున్నాడు. దేవసాని హనుమాన్‌దాస్, ఉమామహేశ్వరి దంపతుల కుమారుడు శ్రీమాన్‌కు ‘బిలరి అస్టీరియా’వ్యాధి సోకింది. కాలేయ మార్పిడే శరణ్యమని వైద్యులు నిర్ధారించారు. కానీ ఆపరేషన్‌కు రూ.20 నుంచి 30 లక్షల వరకు ఖర్చవుతుందని తెలిసి, చేతిలో చిల్లిగవ్వ లేక పేద తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది.
ఈ నేపథ్యంలో ఆగస్టు 3న ‘సాక్షి’మెయిన్‌లో ప్రచురితమైన కథనం ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి వెళ్లడంతో చలించిన ఆయన.. తన సహాయనిధి నుంచి రూ. 25 లక్షలు మంజూరు చేశారు. సీఎం చొరవతో ఆపరేషన్ తర్వాత మెరుగైన వైద్యం అందడంతో శ్రీమాన్ కోలుకున్నాడు. గురువారం రాత్రి శ్రీమాన్ ఇంటికి చేరుకోవడంతో సందడి నెలకొన్నది. ఈ సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడుతూ సీఎం చొరవ వల్లే తమ కొడుక్కి కొత్త జీవితం వచ్చిందని, జీవితాంతం కేసీఆర్‌కు రుణపడి ఉంటామని తెలిపారు.