నిమ్స్‌లో గుండె, కాలేయ మార్పిడి టవర్స్
- నిమ్స్ బ్లడ్ బ్యాంక్ ప్రారంభోత్సవంలో మంత్రి లక్ష్మారెడ్డి
- రూ.36 కోట్లతో మరిన్ని వైద్య పరికరాల కొనుగోలు
- స్టెమ్‌సెల్ రీసెర్చ్ సెంటర్, అధునాతన డయాగ్నొస్టిక్స్ ల్యాబ్
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక నిజామ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(నిమ్స్)లో గుండె, కాలేయ మార్పిడి శస్త్రచికిత్సల కోసం మరో రెండు అధునాతన టవర్స్ నిర్మిస్తామని వైద్య, ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. నిమ్స్ సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంక్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు. అంతకు ముందు నిమ్స్‌లో అందుతున్న వైద్య సదుపాయాలు... రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆరా తీశారు. ఏఎంసీ, సూపర్‌స్పెషాలిటీ, ఎమర్జెన్సీ మిలీనియం బ్లాక్, పాత భవనం ఇలా అన్ని వార్డుల్లోనూ తనిఖీలు నిర్వహించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ... ఆస్పత్రి అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల చరిత్రలో దేశంలోనే తొలి స్టెమ్‌సెల్ థెరపీ రీసెర్చ్ అండ్ ట్రీట్‌మెంట్ సెంటర్‌ను త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా మిలీనియం బ్లాక్‌లో అడ్వాన్స్‌డ్ డయాగ్నొస్టిక్ ల్యాబ్‌ను ప్రారంభిస్తామన్నారు. ఇప్పటికే రూ.27 కోట్లతో వివిధ వైద్య పరికరాల కొనుగోలుకు ఆదేశాలు జారీ చేశామని, మరో రూ.36 కోట్ల విలువ చేసే వైద్య పరికరాల కొనుగోలుకు త్వ రలోనే టెండర్లు పిలవనున్నామన్నారు. బీబీనగర్ నిమ్స్‌లో ఇప్పటికే ఓపీ సేవలు ప్రారంభించామని, త్వరలోనే ఇన్ పేషెంట్ సర్వీసులను కూడా అందజేస్తామని అన్నారు.
వచ్చే ఏడాది నుంచి బీబీనగర్ నిమ్స్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ కోర్సును ప్రారంభించనున్నట్లు తెలి పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో గుండె, కాలేయ, మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్సలు చేస్తూ ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం కల్పిస్తున్నామన్నారు. ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో ఇప్పటి వరకు కేడావర్ లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్లు మాత్రమే జరుగుతున్నాయని, ఇకపై లైవ్ లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్లు కూడా చేయనున్నట్లు పేర్కొన్నారు. మంత్రి వెంట వైద్య, ఆరోగ్య ముఖ్య కార్యదర్శి రాజేశ్ తివారి, నిమ్స్ డెరైక్టర్ మనోహర్‌తో పాటు వివిధ విభాగాలకు చెందిన అధికారులు ఉన్నారు. ఇదిలా ఉంటే వైద్యసేవల్లో జరుగుతున్న జాప్యం, ఆస్పత్రిలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు కొంత మంది ఆరోగ్యశ్రీ రోగులు యత్నించగా సెక్యురిటీ సిబ్బంది వారిని నిలువరించారు. అధికారుల తీరుపై వారు తీవ్ర అసహనం వ్యక్తం చేయడం కొసమెరుపు.