కిమ్స్‌లో కాలేయ మార్పిడి
మంగళగిరి నుంచి శంషాబాద్‌కు విమానంలో తరలింపు
పోలీసుల సహకారంతో రోడ్డు బ్లాక్ చేసి కిమ్స్‌కు చేరిక
హైదరాబాద్: కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతున్న హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తికి నగరానికి చెందిన కిమ్స్ వైద్యబృందం విజయవంతంగా కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేసింది. కాలేయ మార్పిడి 6 నుంచి 8 గంటల్లోపే చేయాల్సి ఉన్నందున కిమ్స్ వైద్యులు అవయవదాత నుంచి సేకరించిన కాలేయాన్ని విజయవాడ నుంచి విమానంలో తీసుకొచ్చి.. నగరంలో పోలీసుల సాయంతో రోడ్లపై ట్రాఫిక్ ఆపివేసి ఆసుపత్రికి తెచ్చి సకాలంలో ఆపరేషన్ నిర్వహించారు. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో ఇటీవల జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడి విజయవాడ ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ధనమ్మ(54)ను వైద్యులు బ్రెయిన్‌డెడ్‌గా నిర్ధారించారు.
జీవన్‌దాన్ సిబ్బంది అవయవదానంపై బంధువులకు అవగాహన కల్పించడంతో వారు అందుకు అంగీకరించారు. వెంటనే కిమ్స్ వైద్యులు విజయవాడ చేరుకుని మధ్యాహ్నం 2.30 గంటలకు దాత శరీరం నుంచి కాలేయాన్ని సేకరించి ప్రత్యేక బాక్స్‌లో భద్రపరిచారు. ఆలస్యం చేయకుండా గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. సాయంత్రం 5.30కు బయలు దేరిన విమానం 6.20కి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. అక్కడి నుంచి ప్రత్యేక అంబులెన్స్‌లో గ్రీన్‌చానల్ ద్వారా రాత్రి 7.10 గంటలకు కిమ్స్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అప్పటికే కిమ్స్‌లో చికిత్స పొందుతున్న 43 ఏళ్ల వ్యక్తికి ఆపరేషన్ థియేటర్‌లో ఛాతీ భాగాన్ని తెరిచి ఉంచారు. డాక్టర్ ఎంబీవీ ప్రసాద్ నేతృత్వంలోని వైద్యబృందం బాధితునికి కాలేయాన్ని విజయవంతంగా అమర్చింది.