కనబడుట లేదు | Today International Family Day | Sakshi
Sakshi News home page

కనబడుట లేదు

Published Sun, May 15 2016 1:45 AM | Last Updated on Mon, Sep 4 2017 12:06 AM

కనబడుట లేదు

కనబడుట లేదు

మే 15 అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం
- కె.సువర్చల
ఒక్క నిమిషం ఇది చదవడం ఆపి మీ ఇంట్లో ఇవి మిస్సయ్యాయేమో గమనించండి.
1.చేతి కర్ర 2.పెద్ద నల్లగొడుగు 3.కాశీ తువ్వాలు 4.జపమాల 5.కళ్లద్దాల పెట్టె 6.ముక్కుపొడుం 7.తమలపాకుల సంచీ 8.పడక్కుర్చీ 9.పెన్షన్ బుక్కు 10. ఫైనల్‌గా- మిమ్మల్ని -ఒరే అబ్బాయ్ అనో ఏమిటే అమ్మాయ్ అనో పిలవగలిగే మనిషి.... ఇవేవీ మీ ఇంట్లో లేవా? అయితే మీది న్యూక్లియర్ ఫ్యామిలీ కిందే లెక్క.
   
చంద్రుడు మిస్ కాలేదు. చంద్రుడు వచ్చే వేళ పిల్లలను కూచోపెట్టుకుని కథలు చెప్పే మనిషి మిస్సయ్యింది. సూర్యుడు మిస్ కాలేదు. ఎండ కాసే వేళ అదిలించి ఇంట్లో కూచోబెట్టే మనిషి మిస్సయ్యాడు. పాలు మిస్ కాలేదు. వాటితో వెన్నకాచి ఆ వెన్నను నెయ్యిగా మార్చే అనుభవం మిస్సయ్యింది. చక్కెర మిస్ కాలేదు. ఆ తీపితో ఏ పండుగనాడు ఏ తీపి చేయాలో చెప్పే పెద్దరికం మిస్సయ్యింది. కష్టం వస్తే సలహా. నష్టం వస్తే ఓదార్పు. చిరాకుగా ఉంటే పరిహాసం. పరాకుగా ఉన్నప్పుడు ఒక అనుభవ శకలం... ఇవన్నీ ఇచ్చే పెద్దలు ఇవాళ ఇళ్లల్లో మిస్సవుతున్నారు. ముఖ్యంగా వారి ఆశీర్వాదం కూడా.
   
ఇప్పుడు చీటికి మాటికి గూగుల్‌ను సెర్చ్ చేయడం ఆనవాయితీ. కానీ అతి పెద్ద సెర్చ్ ఇంజన్ల వంటి పెద్దలను మాత్రం ఊళ్లకు పరిమితం చేశాం. పాత ఇళ్లకు పరిమితం చేశాం. వృద్ధాశ్రమాలకు పరిమితం చేశాం. లేదా అనాథాశ్రమాలకు వదిలేశాం. మబ్బును చూసి వాన ఎప్పుడు వస్తుందో చెప్పేవారు, మట్టిబాటను చూసి ఏ గమ్యానికి చేరుస్తుందో చెప్పేవారు, వాలకం చూసి ఎటువంటి మనిషో చెప్పేవారు... ఈ అనుభవసారం మిస్సింగ్.
 
ఇంట్లో తాతయ్య ఉంటే- ఓహో... ఒకనాడు ఎంత పెద్ద రైతు... ఆ రూఫ్ అంతా అలా ఖాళీగా పడి ఉంది కదా... దాని మీద హాంఫట్ అని చిక్కుడు మొక్కలు పెంచగలడు. టొమాటోలను ఎరుపెక్కించగలడు. పొట్లకాయలను పొడుగు పొడుగున పెరిగేలా చేయగలడు. మనుమణ్ణి అగ్రికల్చర్ బీఎస్సీ ఫీజ్ కట్టకుండా ఇంట్లోనే చదివించగలడు. నానమ్మ ఉంటే? దగ్గూ జలుబూ... ఒక్క చిట్కా వైద్యంతో సరి. దడుపు? ఒక్క దడుపు మంత్రంతో సరి. జారి కాలు వాస్తే పసుపూ సున్నం రాస్తే సరి. మనవరాలు ఎంబీబీఎస్ చదవాలంటే మొదటిపాఠం ఇక్కడి నుంచే మొదలు. ఇవాళ చదువు ఉంది. ఫీజుకు డబ్బు ఉంది. కాని ఈ పరంపర పాఠాలే మిస్సింగ్.
   
ఇటీవల షాదీ డాట్ కామ్ వాళ్లు కాబోయే వధూవరుల మనోభిప్రాయం కనుక్కుందామని మొత్తం పాతిక నుంచి ముప్పై అయిదు లోపు వయసున్న 8,500 మందిని సర్వే చేసింది. వారిలో మగవాళ్లు దాదాపు 4,000, స్త్రీలు 4,500. ‘పెళ్లయ్యాక మీరు ఎలా జీవించదలుచుకున్నారు’ అని ఆడవాళ్లను అడిగితే 64 శాతం మంది ‘నా భర్తతో విడిగా’ అని జవాబు చెప్పారు. మగవాళ్లను అడిగితే 44 శాతం మంది ‘నా భార్యతో విడిగా’ అని చెప్పారు.

స్త్రీలలో 30 శాతం మంది మాత్రమే అత్తమామలతో పాటుగా అని జవాబు చెప్పారు. మగవాళ్లలో 56 శాతం మాత్రం తమ తల్లిదండ్రులను ఉంచుకుంటాం అంటున్నారు. మగవాళ్ల లెక్క ఆశావహంగా ఉన్నా వారు చేసుకోబోయేది 70 శాతంలోని ‘విడిగా నా భర్తతో’ ఉండాలని ఆశించే అమ్మాయిలనే కాబట్టి ఫలితం పెద్దవాళ్లే అనుభవించాల్సి వస్తోంది. ఇంతకూ ఈ విడిగా అనే కోరిక ఎందుకు?
   
ఇంట్లోని కొడుకు భార్యను తీసుకొని వేరే ఇంట్లో కాపురం పెడితే దానిని ‘వేరు కాపురం’ అంటారు కానీ ‘వేరు కుటుంబం’ అనరు. ఉద్యోగం కోసమో ఉదర పోషణార్థమో వేరే ఊరో దేశమో వెళితే ‘భార్యాపిల్లలను తీసుకెళ్లాడు’ అని అంటారు కానీ ‘కుటుంబాన్ని తీసుకెళ్లాడు’ అనరు. ఇంగ్లిష్‌లో ఫ్యామిలీ అనే మాట వచ్చి ఫ్యామిలీ అంటే సొంత ఫ్యామిలీ అనే అర్థం స్థిరపడింది కానీ ‘కుటుంబం’ అనే మాటకు అర్థం విస్తృతమైనది. ఆ ఊళ్లో ఆ కుటుంబం పెద్దది అంటున్నామంటే- తల్లి తండ్రి కొడుకులు కోడళ్లు మనమలు మనవరాళ్లు బాబాయ్‌లు పెదనాన్నలు... ఇందరు ఉన్నారని అర్థం. ఇందరుగా ఉన్నారని అర్థం. దానినే కుటుంబం అంటారు.
 
ఇవాళ ఇలాంటి కుటుంబాలు లేవు.
 ఫ్యామిలీలే ఉన్నాయి.
 కుటుంబాలలోని మైనస్‌లు ఏమిటి?
     అజమాయిషీ ఎక్కువ.
     నిర్ణయాలు తీసుకోవడానికి ఉండదు.
     పరిహాసాలు చిన్నబుచ్చటాలు ఉంటాయి.
     పిల్లలు ఎక్కువ మందికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
     వంట/ వంటగది మన ఇష్టం కాదు.
     ఆదాయం/ వ్యయం మన ఒక్కరిది కాదు.
 మరి న్యూక్లియర్ ఫ్యామిలీలలోని ప్లస్‌లు ఏమిటి?
     ప్రైవసీ. ఇదే ప్రధానమైనది. మన ఇష్టమొచ్చినట్టు మనం ఉండొచ్చు.
     ఆర్థికంగా మెరుగ్గా జీవించొచ్చు.
 
     పిల్లల చదువుకు తిండికి ప్రాధాన్యం ఇవ్వొచ్చు.
     ఇతర అనుబంధాల నిర్వహణలోని ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు.
 ఈ నాలుగైదు కారణాలు ఒక పెద్ద వ్యవస్థను సులభంగా గెలవగలిగాయి.
   
భారతీయ సమాజం సంతృప్త సమాజం. అంటే ఉన్న దాంట్లో సంతోషంగా ఉండే సమాజం. కానీ 21వ శతాబ్దం దేశంలోని కంప్యూటర్‌తోపాటు కొన్ని ఆశలూ ఆశయాలు ఆకాంక్షలు కూడా తెచ్చింది. పిల్లలు బాగా చదువుకోవాలి, అమెరికాకు వెళ్లాలి, ముప్పై ఏళ్లకే సొంత ఇల్లు ఉండాలి, మార్కెట్‌లోకి వచ్చిన కొత్త బ్రాండ్ కారు పోర్టికోలో పార్క్ చేసి ఉండాలి... ఇవన్నీ ఎప్పుడు వచ్చాయో వేగం పెరిగింది. తక్షణ అనుబంధాలు ప్రధానమయ్యి రక్త సంబంధాలు పలుచనయ్యాయి.

వేరేవాళ్ల సంగతి మనకెందుకు ఈ రేస్‌లో మనం ముందుండాలి అని ఎప్పుడు అనుకున్నామో నాన్న అమ్మ అన్న వదినె చిన్నాన్న పెదనాన్న ఇలాంటి ఎగస్ట్రా లగేజ్ లేకుండా భార్య భర్త పిల్లలు అనే చిన్న యూనిట్ ఈ పరుగు పందెంలో సులభంగా గెలవడానికి పరుగుపెట్టింది. కాలుష్యం, ఒత్తిడి, అనారోగ్యం, ఒంటరితనం... ఇవన్నీ ప్రాకారాలుగా కలిగిన నగర జీవితంలో న్యూక్లియర్ ఫ్యామిలీగా బతుకు వెళ్లమార్చడం నేర్చుకుంది.
 ఇక్కడ తాతకు దగ్గులు ఎవరూ నేర్పరు.
 అసలు దగ్గడానికి తాత ఉంటే కదా.
   
కానీ ఇది సరైన పద్ధతి కాదు అంటారు సామాజిక విశ్లేషకులు, సాంస్కృతిక అధ్యయనశీలురు, మానసిక వికాస నిపుణులు. ముఖ్యంగా పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర కంటే అమ్మమ్మ తాతయ్య లేదా నానమ్మ తాతయ్యల పాత్ర ముఖ్యం అని అంటారు. కేవలం తల్లితండ్రి మాత్రమే ఉండే ఇంట్లో ఎదిగొచ్చే పిల్లలకు వేరే వాహిక ఉండదు. వాళ్ల ఇష్టాయిష్టాలు నివేదించడానికి అవ్వా తాతలు చాలా ముఖ్యమైన వాహిక అని అంటారు. అలాగే అమ్మా నాన్నల అభీష్టాలను పిల్లల చేత ఒప్పించడంలో కూడా అవ్వా తాతల పాత్ర కీలకమైనదిగా వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ మధ్య దొంతర లేకపోవడం వల్ల ఇరు వర్గాల మధ్య ఘర్షణ, ఒత్తిడి, వ్యతిరేకత పెరిగిపోతున్నాయనడానికి అనేక ఉదంతాలు కనిపిస్తున్నాయి. తల్లిదండ్రులు ఉద్యోగస్తులైతే కనుక ఇంట్లో పెద్దవాళ్లు లేకపోతే కనుక పిల్లలు అదుపు తప్పే అవకాశం ఎక్కువ. ఇక విడాకులు పొందిన దంపతుల విషయంలో అయితే ఇది దాదాపు శూన్యంతో సమానం అవుతుంది. అవన్నీ పక్కన పెడితే పిల్లలకు సంస్కృతి ఎలా అందాలి? సంప్రదాయం ఎలా తెలియాలి? ఏది మంచో ఏది మన్నికమైనదో ఏది కార్తో ఏది ఆర్తో ఎలా తెలియాలి? ‘మన’ అంటూ ఒకటి ఉందనే అతిశయం బాల్యంలోనే ఏర్పడకపోతే యవ్వనం ఆత్మవిశ్వాసం కోల్పోతుంది.

‘మనది’ అనే ఒక వేరు వేళ్లూనకపోతే ఎదగడం బోలుగా మారుతుంది. ఇవన్నీ తల్లిదండ్రులు చెప్పలేరు. చెప్పడానికి వీలు ఉండదు. ఒకవేళ చెప్పినా పిల్లలు వినరు. అమ్మ పెట్టే ముద్ద తినని పిల్లవాడు నానమ్మ పెట్టే నాలుగు ముద్దలనూ గుటుక్కుమనిపిస్తాడు కదా. ఇదీ అంతే.కానీ రోజులు మారుతున్నాయి. మన దేశంలో గత పదేళ్లుగా కుటుంబాల ఏర్పాటు వ్యవస్థలో అభివృద్ధి మందకొడిగా ఉంది. అలాగే న్యూక్లియర్ ఫ్యామిలీల ఊపు కూడా మందకొడిగా ఉందని అంటున్నారు. ఇంకా చెప్పాలంటే గుజరాత్, కర్నాటక, మహారాష్ట్ర, హర్యానా, తమిళనాడు రాష్ట్రాలు న్యూక్లియర్ ఫ్యామిలీల కంటే ఉమ్మడి కుటుంబాలుగా ఉండటంపై ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాయని ఇటీవలి పరిశోధన.

పెళ్లి కావాల్సిన యువతీ యువకుల వేరు కాపురాల కల ఎలా ఉన్నా కష్టకాలంలో ఆదుకునే పెద్ద దిక్కు లేక, ఇంట్లో మాట్లాడే మనిషి లేక, పిల్లల చేయి పట్టుకుని నడిపించే పెద్ది దిక్కు లేక పడే అవస్థతో పోలిస్తే ఉమ్మడి కుటుంబాల్లో ఉండే సంకటాలు చిన్నవి అని భావించే వారు తమ అనుభవాల ద్వారా అందరికీ తెలియ చేస్తున్నారు. తెలుగు సమాజం మరీ ఆ అంచున లేదు. మరీ ఈ అంచున లేదు. మధ్యస్తంగా ఉంది.
 
తమని కన్నవారు తాము కన్నవారు కలిసి ఉండేదే కుటుంబం అని అందరూ తెలుసుకునే రోజు భవిష్యత్తులో రావచ్చు. ఎందుకంటే 1970లలో పోలిస్తే న్యూక్లియర్ ఫ్యామిలీల పెరుగుదల అమెరికాలో ప్రస్తుతం 40 శాతం నుంచి 21 శాతానికి పతనం అయ్యింది. అమెరికానే పెద్దల బాట పట్టినప్పుడు కుటుంబమూలాలు బలంగా ఉన్న మన సమాజం ఆ దారి అంది పుచ్చుకోవడం కష్టమేం కాదు. అదే జరిగినప్పుడు మిస్సింగ్ అనే మాట నిజంగా మిస్సయిపోతుంది.
 
8,500 షాదీ డాట్ కామ్ సర్వేలో పాల్గొన్న యువతీ యువకులు
 
64% భర్తతో విడిగా కాపురం ఉండాలని కోరుకుంటున్న మహిళలు
 
56% తల్లిదండ్రులను తమ వద్దే ఉంచుకుంటామని చెబుతున్న పురుషులు
 
44% పెద్దలకు దూరంగా విడిగా కాపురం ఉండాలని కోరుకుంటున్న మగాళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement