International Family Day
-
International Family Day: ఐపీఎల్ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)
-
International Family Day: కలుపుకుంటేనే.. కలదు సుఖం
సాక్షి, కైకలూరు: ‘ప్రపంచ శాంతిని ప్రోత్సహించడానికి మీరు చేయవలసిన పని ఏమిటంటే ఇంటికి వెళ్లి మీ కుటుంబాన్ని ప్రేమించడం’ అన్నారు మదర్ థెరిస్సా. కుటుంబ ప్రాముఖ్యతను ఈ ఒక్క వాక్యంలో అర్థం చేసుకోవచ్చు. కుటుంబ ప్రాధాన్యతను అందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో 1996 నుంచి ప్రతి ఏడాదీ మే 15న అంతర్జాతీయ కుటుంబాల దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి నిర్వహిస్తోంది. ఈ ఏడాది ‘కుటుంబం – పట్టణీకరణ’ అనే నినాదంతో ముందుకొచ్చింది. కుటుంబాల్లో ఆరోగ్యం, లింగ సమానత్వం, పిల్లల హక్కులు, కుటుంబ సంక్షేమ వ్యవహారాలను చర్చించడం దీని లక్ష్యం. పౌర జీవనం పట్టణ ప్రాంతాల్లోకి మారినప్పుడు అక్కడి పోకడలకు అలవాటుపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఇటువంటి అన్నింటిపైనా కుటుంబ సభ్యులందరూ కలిసి చర్చించుకోవాలని కుటుంబాల దినోత్సవం గుర్తు చేస్తుంది. దూరం పెరుగుతోంది... 2017లో నిర్వహించిన ఓ సర్వేలో తాత ఇంటి వద్ద నివసించే 18 సంవత్సరాలలోపు పిల్లలు కేవలం ఏడు శాతంగా నమోదైంది. 11 సంవత్సరాల వయసు వచ్చే సమయానికి తోబుట్టువులతో కలిసి గడిపిన ఖాళీ సమయం కేవలం 33 శాతంగా ఉంది. ఒంటరి జీవితం అంత సులభం కాదు. కుటుంబంలో నివసించే వ్యక్తి తన సంతోషాన్ని, బాధలను పంచుకోవడానికి కుటుంబ వ్యవస్థ ఉండాలి. కుటుంబం ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన విషయం. పూర్వం గ్రామాల్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అందరూ కలసి ఒకే పొయ్యిపై వంటలు చేసుకుని కలసి భోజనాలు చేసేవారు. ఉమ్మడి వ్యవసాయం ఉండేది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ దెబ్బతింది. ఉద్యోగాల రీత్యా పట్టణాలకు వెళ్లడం, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లోపించడం వంటి కారణాలతో ఉమ్మడి కుటుంబాలు చెల్లాచెదురయ్యాయి. కుటుంబాలకు దిశానిర్దేశం చేసిన పెద్దలు ఒంటరిగా మిగిలారు. మారుతున్న జీవన పరిస్థితుల వల్ల కుటుంబ సభ్యుల మధ్య దూరం పెరుగుతోంది. సెల్ఫోన్లు అందుబాటులోకి వచ్చాక దగ్గరగా కూర్చుని నాలుగు మాటలు మాట్లాడుకునే అవకాశం కోల్పోతున్నారు. కొత్త మార్పులు... కుటుంబ ప్రాధాన్యతను గుర్తిస్తున్నవారు ఇప్పటికీ కుటుంబ సభ్యులను దూరం చేసుకోవడం లేదు. మారిన జీవన పరిస్థితుల వల్ల దూరంగా ఉన్నప్పటికీ సాంకేతికత అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి మాధ్యమాల ద్వారా నిత్యం అందుబాటులో ఉంటున్నారు. ‘మై ఫ్యామిలీ’ అంటూ పలువురు వాట్సాప్‌లలో కుటుంబ సభ్యులను గ్రూపులుగా ఏర్పాటు చేసుకుని యోగక్షేమాలు తెలుసుకుంటూ, తాజా సమాచారం పంచుకుంటున్నారు. ఇంకా ఇలా చేయండి... కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు బలపడాలంటే కనీసం అందరూ ఏడాదికి రెండు పర్యాయాలు ఒకేచోట కలవడం ఉత్తమం. గ్రామాల్లో నివసిస్తున్న అమ్మమ్మ, నాన్నమ్మల దగ్గరకు తరచూ వెళ్లి వారి అనుభవాలను తెలుసుకోవాలి. పట్టణాల్లో నివసిస్తున్న బంధువులందరూ పండగల సమయంలో కలుసుకుని యోగక్షేమాలను ఆరా తీసుకోవాలి. కుటుంబ సభ్యులకు అత్యవసర సాయం అవవసరమైనప్పుడు అందరూ కలసి సహాయపడాలి. తరచుగా దేవాలయాలు, సాంస్కృతిక ప్రాంతాలను సందర్శించుకునేలా ప్రణాళిక చేసుకోవాలి. కుటుంబ ఆవశ్యకతను పిల్లలకు వివరించాలి. మార్పు రావాలి.. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కావడంతో మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. అనేక మంది బాల్యాన్ని కోల్పోతున్నారు. తాత, బామ్మల ప్రేమానురాగాలకు దూరమవుతున్నారు. ఇప్పటికైనా మార్పు రావాలి. తరచుగా కుటుంబ సభ్యులను కలుస్తూ ఆప్యాయతలు పెంచుకోవాలి. – చింతపల్లి వెంకటనారాయణ, ప్రముఖ సాహితీవేత్త, కైకలూరు ఉమ్మడి కుటుంబంతో ఎంతో మేలు.. మా నాన్న తరఫున ముగ్గురు అన్నదమ్ములు, మరో ముగ్గురు అక్క చెల్లెళ్లు. వివాహాలు కాకముందు అందరూ కలసికట్టుగా ఉండేవారు. మా చిన్నతనంలో ఇల్లంతా సందడిగా ఉండేది. ఇప్పుడు వారంతా ఖమ్మం, తణుకు ప్రాంతాల్లో నివసిస్తున్నారు. మరొకరు ఆమెరికాలో ఉద్యోగం చేస్తున్న అబ్బాయి దగ్గర ఉంటున్నారు. మా ఇంటి దగ్గర ఉన్న శివాలయంలో ఏటా జరిగే మహోత్సవాలకు కుటుంబ సభ్యులందరూ వస్తారు. ఇలా కలవడం ఎంతో సంతోషంగా ఉంటుంది. ఉమ్మడి కుటుంబాల్లో ఉన్న ఆనందం ఎక్కడా ఉండదు. – బందా నారాయణ, ఆటపాక, కైకలూరు మండలం వసుధైక కుటుంబం అవసరం... నేటి సమాజానికి పూర్వపు వసుధైక కుటుంబాలు అవసరం. గతంలో నాలుగు తరాలు ఒకే గొడుకు కింద ఉండేవి. అవ్వాతాతలు చెప్పే కథల వల్ల పిల్లల్లో సృజనాత్మక శక్తి పెరిగేది. ఒంటరి జీవితం ఎంతో కష్టం. కుటుంబాల్లో పెద్ద దిక్కు లేకపోవడంతో ఆత్మహత్యలు, విడాకులు, భ్రూణ హత్యలు వంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. కుటుంబాలు విచ్ఛిన్నం కాకుండా తిరిగి వసుధైక కుటుంబంగా మారాలి. – డాక్టర్ బీవీ లీలారాణి, ఎంఏ, ఎంఫిల్, పీహెచ్డీ, రిటైర్డ్ రీడర్ ఇన్ తెలుగు -
ఇంటి పేరు అనురాగం ముద్దు పేరు మమకారం
‘ఇంటి పేరు అనురాగం ముద్దు పేరు మమకారం’...‘కలతలు లేని నలుగురు కలిసిసాగించారు పండంటి కాపురం’...‘మనసే జ్యోతిగ వెలిగిందిమమతల కోవెలలో ఈ మమతల కోవెలలో’...కుటుంబ ఘనతను తెలుగు సినిమాగానం చేస్తూనే ఉంది.వెండి తెర మీద కుటుంబాల గొప్పదనం చూసితమ కుటుంబాలను చక్కదిద్దుకున్న ప్రేక్షకులూ ఉన్నారు.సమాజానికి కుటుంబం మూలం.నేడు అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం సందర్భంగాకుటుంబ బంధాలను, విలువలను గానం చేసిన పాటలను గుర్తు చేసుకోవడమే ఈ వారం సండే స్పెషల్. కుటుంబంలోని ప్రతి అనుబంధాన్ని, సందర్భాన్ని పాటగా మలిచిన ఘనులు మన సినిమావారు. జననం నుంచి మరణం వరకు, చంటి పాపల నుంచి వివాహ సందర్భాల వరకూ, తల్లి, తండ్రి, అక్కచెల్లెళ్ల గురించి, అన్నయ్యల గురించి ప్రతి అనుబంధాన్ని పాట చేయనే చేశారు. కుటుంబానికి సమస్య వస్తే ఆ విషాదాన్ని పాడారు. కుటుంబ సభ్యులు బూటకంగా వ్యవహరిస్తే ఆ సంగతీ చెప్పారు. ఎన్ని చేసినా ఏం చెప్పినా కుటుంబం పటిష్టంగా ఉండాలన్న భావన ప్రేక్షకులకు కలుగ చేశారు.కుటుంబం భార్యాభర్తలతో మొదలవుతుంది. ‘కాపురం కొత్త కాపురం... ఆలుమగలు కట్టుకున్న అనురాగ గోపురం’ అని భార్యాభర్తలు పాడుకుంటారు. ‘ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు కావాలి ముందు ముందు పొదరిల్లు’ అనుకుంటారు. ఆ భార్య ఇల్లాలిగా మారుతుంది. ‘ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి... ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి’ అని ఆమెను శ్లాఘిస్తారు. ఆమె గర్భవతి అవుతుంది. ‘అమ్మాయే పుడుతుంది అచ్చు అమ్మలాగే ఉంటుంది...’ అని హీరో పాడితే ‘అచ్చు నాన్నలాగే ఉంటాడు’ అని హీరోయిన్ పాడుతుంది. పాపాయి పుట్టడంతో ఇంటికి కళ వస్తుంది. ‘పుట్టిన రోజు పండగే అందరికీ.. మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికీ’, ‘ఈనాడే బాబూ నీ పుట్టిన రోజు’ అని పాడుకుంటారు. ఈ పిల్లలు కాసింత పెద్దవాళ్లయితే పార్కుకు తీసుకెళ్లి ‘ఉడతా ఉడతా హుచ్ ఎక్కడికెళతా హుచ్’ అని పాడుకుంటారు. ఇంకా పెద్దయ్యాక ఇంటి అమ్మాయిని అత్తింటికి సాగనంపుతూ ‘శ్రీలక్ష్మి పెళ్లికి చిరునవ్వు కట్నం’ అని పాడి అయ్య చేతిలో పెడతారు. కాని ఉమ్మడి కుటుంబాలను గౌరవించే సంస్కృతి మనది. ఇంట్లో ఉన్న అన్నదమ్ములు అందరూ కలిసి ఉండే రోజులు ఒకప్పుడు ఉండేవి. అన్నదమ్ములు అందరూ కలిసి ఆడుకునేవారు పాడుకునేవారు. ‘బాబూ... వినరా అన్నాదమ్ముల కథ ఒకటి’ అని పాడుకుంటారు. ప్రతి అనుబంధాన్ని అది ఎంత అవసరమో ఒకరికొకరు చెప్పుకుంటారు. పిల్లలకు కూడా తెలియచేస్తారు. అన్నయ్య ఇంటిలో ఇంపార్టెంటే. ‘అన్నయ్య సన్నిధి... అదే నాకు పెన్నిధి’ అని చెల్లెలు పాడుతుంది. ‘అన్నా.. నీ అనురాగం ఎన్నో జన్మల అనుబంధం’ అనీ పాడుతుంది. ‘చెల్లెమ్మా... నీవేలె నా ప్రాణమూ’ అని అన్నయ్య కూడా పాడతాడు. ‘మంచివారు మా బాబాయి... మా మాటే వింటాడోయి’ అని బాబాయి మీద పాట ఉంటుంది. ‘ఏమమ్మ జగడాల వదినమ్మో’... అని మరిది వదినను ఆటపట్టిస్తాడు. ‘చందురుని మించు అందమొలికించు ముద్దు పాపాయివే’ అని మేనమామ తన మురిపెం చూపిస్తాడు. ‘బావా బావా పన్నీరు బావను పట్టుకు తన్నేరు’ అని మరదళ్లు బావతో సరసమాడతారు. ఇక అమ్మా నాన్నల మీద ఎన్నో పాటలు. ‘అమ్మ అన్నది ఒక కమ్మని మాట’ అని పిల్లలు పాడితే ‘ఓ నాన్నా.. నీ మనసే వెన్నా’ అని సుపుత్రులు తండ్రిని హత్తుకుంటారు. ‘తాతా.. బాగున్నావా... ఓ తాతా.. బాగున్నావా’ అని మనవడు తాతతో పరాచికం ఆడతాడు. ఇల్లు ఈ అన్ని బంధాలతో ఉంటుంది. ఇంటికి కుటుంబ అనుబంధాలు ముఖ్యం. వాటికి ఎటువంటి విఘాతం కలిగినా కన్నీరే. ‘అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం’ అని అనిపిస్తుంది. ‘ఎవ్వరి కోసం ఎవరుంటారు పోండిరా పోండి’ అని అనబుద్ధేస్తుంది. ‘ఈ జీవన తరంగాలలో ఆ దేవుడి చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకీ బంధము’ అనిపిస్తుంది. కాని ఈ కలతలు ఎన్ని వచ్చినా అవన్నీ చెదిరిపోక తప్పదు. ఎందుకంటే కుటుంబ బంధం తిరిగి అందరినీ దగ్గరకు చేస్తుంది. పండగో, పెళ్లో, శుభకార్యమో వారిని మళ్లీ ఏకం చేస్తుంది.‘కలిసుంటే కలదు సుఖము’ అని ఈ కుటుంబమే పాడుకుంటుంది. ‘మా లోగిలిలో పండేదంతా పుణ్యమే... మా జాబిలికి ఏడాదంతా పున్నమే’ అని భరోసా ఇచ్చుకుంటారు. ఒకప్పుడు గొప్ప గొప్ప కుటుంబ గాధలను తీసిన తెలుగు సినిమాలు ఆ దారి నుంచి పక్కకు వెళ్లినప్పుడు తమిళంలో విక్రమన్, హిందీలో సూరజ్ బర్జ్యాతా మళ్లీ కుటుంబాలను గుర్తు చేశారు. కుటుంబాలన్నీ కలిసి కూర్చుని భోం చేయడం కూడా వింతగా మారడం.. అవును అలా ఉండేవాళ్లం కదూ అని ‘హమ్ ఆప్ కే హై కౌన్’ వంటి సినిమాలతో ట్రెండ్ మార్చుకున్నారు. తెలుగులో ‘నిన్నే పెళ్లాడతా’ ఈ ట్రెండ్‌ను మళ్లీ తెచ్చింది. పెళ్లి వేడుకులు ముఖ్యమైన కుటుంబ కలయికలుగా మారాయి. కుటుంబం శాశ్వతం..కుటుంబం అద్భుతం -
‘వారి సమక్షంలోనే క్షేమం.. స్వర్గం’
ప్రతి ఏడాది మే 15న ప్రపంచ కుటుంబ దినోత్సవం జరుపుకుంటారు. ఈ రోజున కుటుంబ సభ్యులంతా ఒక్క చోట చేరి వేడుక చేసుకుంటూ.. శుభాకాంక్షలు తెలుపుకుంటారు. కానీ లాక్డౌన్ కారణంగా ఈ ఏడాది చాలా మంది కుటుంబాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి. ఈ ఏడాది సందేశాలు తప్ప.. సంబరాలు లేవు. కానీ కష్టాలు ఎల్లకాలం ఉండవు.. త్వరలోనే మంచి రోజులు వస్తాయి. మనం మాత్రం మన కుటుంబ సభ్యులను మర్చిపోవద్దు అంటున్నారు అనిల్ అంబానీ భార్య టీనా అంబానీ. ఈ క్రమంలో ‘ప్రపంచం మునుపెన్నడు చూడని కష్టాన్నిఎదుర్కొంటుంది. కుటుంబం ప్రాధన్యత ఇప్పడు మరింత బాగా అర్థమవుతోంది. మీ ప్రియమైన వారితో కలిసి ఈ సమయాన్ని ఆస్వాదించండి. ఎందుకంటే వారే మీ స్వర్గధామం.. వారే మీకు సురక్షితం’ అంటూ ఇన్స్టాగ్రామ్ వేదికగా భర్త అనిల్ అంబానీ, కుమారులు అన్మోల్, అన్షులకు సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు టీనా అంబానీ. ఈ ఫోటోలో తండ్రి కొడుకులు ఒకరికొకరు కటింగ్ చేసుకుంటూ ఉండటం విషేశం. (2026 నాటికి జెఫ్ బెజోస్, మరి ముకేశ్ అంబానీ?) View this post on Instagram . #HairraisingTimes #TheNewNormal More than ever before, during this time of global churn, we've realised the importance of family. Hold your loved ones dear, enjoy your time together, even if virtually - they are your true haven, your very own safe space. #internationalfamilyday A post shared by Tina Ambani (@tinaambaniofficial) on May 15, 2020 at 12:38am PDT -
కుటుంబాలు సమాజ అభివృద్ధికి సూచికలు
సమాజ మార్పు అభివృద్ధి, పరివర్తనలో కుటుం బాలే కీలకం. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న కుటుంబాల విశిష్ఠతను తెలపడానికి అంతర్జాతీయ కుటుంబాల దినోత్సవం ప్రతి ఏటా మే 15న జరుపుకుంటారు. 1993లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 20 సెప్టెంబర్ 1993 నాటి 47/237 తీర్మానంలో ఇంటర్నేషనల్ ఫ్యామిలీస్ డేని ప్రకటించింది. అంతర్జాతీయ కుటుంబాల దినోత్సవం కుటుంబాల సమస్యల గురించి అవగాహనను, కుటుంబాలను ప్రభావితం చేసే సాంఘిక, ఆర్థిక మరియు జనాభా ప్రక్రియల పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి కృషి చేస్తుంది. 1994లో ఐక్యరాజ్యసమితి కుటుంబాల అంతర్జాతీయ సంవత్సరాన్ని అధికారికంగా ప్రకటించారు. 1994 మే 15న ప్రారంభించిన కుటుం బాల దినోత్సవం.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుటుం బాలు, ప్రజలు, సమాజాలు, సంస్కృతులను ప్రతి బింబించేలా ఉంటుంది. కుటుంబాలు సమాజానికి కేంద్రం. పైగా అన్ని వయసుల ప్రజలకు స్థిరమైన, సహాయక గృహాన్ని అందిస్తాయి అని ఇది సూచి స్తుంది. మొదటిసారిగా 1996లో ‘ఫ్యామిలీస్: ఫస్ట్ విక్టిమ్స్ ఆఫ్ పావర్టీ అండ్ హోమ్‌లెస్‌నెస్’ అనే థీమ్‌తో జరుపుకోగా 2018లో ‘కుటుంబాలు సంఘటిత సంఘాలు’ థీమ్‌తో నిర్వహిస్తున్నారు. ప్రతి మనిషి కుటుంబంలో ఒక భాగమే. సమాజంలోని వ్యక్తి సామాజీకరణం ద్వారానే సమాజంలో ఒక మానవత విలువలున్న మనిషిగా మారుతాడు, మనిషిని సమాజంలో ప్రాథమికంగా నియంత్రించేది కుటుం బమే. ఈ నియంత్రణ వల్లే వ్యక్తులు పరిమితులలో ఉంటారు. నేటి ఆధునీకరణ ప్రపంచంలో కుటుంబాలు వ్యక్తులను సామాజికంగా ఎంతవరకు నియంత్రిస్తున్నాయో ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఈ మధ్య కాలంలో నేరాలు, హత్యలు, ఆత్మహత్యలు, మానభంగాలు వాటి సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్నాయి. సమాజంలో మానవత , నైతిక విలువలు క్షీణించినపుడు యువత తప్పుదారిన పడుతుంది. యువతను నియంత్రించవలసిన బాధ్యత కుటుంబాలదే. కుటుంబాల నియంత్రణ సరిగా లేకపోతే సామాజిక నియంత్రణ ఉండదు దాంతో సమాజంలో అనేక వైపరీత్యాలు చోటు చేసుకుంటాయి. కాబట్టి కుటుంబాలు బాగుంటే సమాజాలు కూడా బాగుంటాయి. సమాజ అభివృద్ధి కోసం కుటుం బాలు నిరంతరం పాటు పడాలని కోరుకుందాం!. (మే15, అంతర్జాతీయ కుటుంబాల దినోత్సవం) – కందగట్ల శ్రవణ్ కుమార్, పీహెచ్డీ స్కాలర్,కాకతీయ యూనివర్సిటీ, వరంగల్ -
కనబడుట లేదు
మే 15 అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం - కె.సువర్చల ఒక్క నిమిషం ఇది చదవడం ఆపి మీ ఇంట్లో ఇవి మిస్సయ్యాయేమో గమనించండి. 1.చేతి కర్ర 2.పెద్ద నల్లగొడుగు 3.కాశీ తువ్వాలు 4.జపమాల 5.కళ్లద్దాల పెట్టె 6.ముక్కుపొడుం 7.తమలపాకుల సంచీ 8.పడక్కుర్చీ 9.పెన్షన్ బుక్కు 10. ఫైనల్‌గా- మిమ్మల్ని -ఒరే అబ్బాయ్ అనో ఏమిటే అమ్మాయ్ అనో పిలవగలిగే మనిషి.... ఇవేవీ మీ ఇంట్లో లేవా? అయితే మీది న్యూక్లియర్ ఫ్యామిలీ కిందే లెక్క. చంద్రుడు మిస్ కాలేదు. చంద్రుడు వచ్చే వేళ పిల్లలను కూచోపెట్టుకుని కథలు చెప్పే మనిషి మిస్సయ్యింది. సూర్యుడు మిస్ కాలేదు. ఎండ కాసే వేళ అదిలించి ఇంట్లో కూచోబెట్టే మనిషి మిస్సయ్యాడు. పాలు మిస్ కాలేదు. వాటితో వెన్నకాచి ఆ వెన్నను నెయ్యిగా మార్చే అనుభవం మిస్సయ్యింది. చక్కెర మిస్ కాలేదు. ఆ తీపితో ఏ పండుగనాడు ఏ తీపి చేయాలో చెప్పే పెద్దరికం మిస్సయ్యింది. కష్టం వస్తే సలహా. నష్టం వస్తే ఓదార్పు. చిరాకుగా ఉంటే పరిహాసం. పరాకుగా ఉన్నప్పుడు ఒక అనుభవ శకలం... ఇవన్నీ ఇచ్చే పెద్దలు ఇవాళ ఇళ్లల్లో మిస్సవుతున్నారు. ముఖ్యంగా వారి ఆశీర్వాదం కూడా. ఇప్పుడు చీటికి మాటికి గూగుల్‌ను సెర్చ్ చేయడం ఆనవాయితీ. కానీ అతి పెద్ద సెర్చ్ ఇంజన్ల వంటి పెద్దలను మాత్రం ఊళ్లకు పరిమితం చేశాం. పాత ఇళ్లకు పరిమితం చేశాం. వృద్ధాశ్రమాలకు పరిమితం చేశాం. లేదా అనాథాశ్రమాలకు వదిలేశాం. మబ్బును చూసి వాన ఎప్పుడు వస్తుందో చెప్పేవారు, మట్టిబాటను చూసి ఏ గమ్యానికి చేరుస్తుందో చెప్పేవారు, వాలకం చూసి ఎటువంటి మనిషో చెప్పేవారు... ఈ అనుభవసారం మిస్సింగ్. ఇంట్లో తాతయ్య ఉంటే- ఓహో... ఒకనాడు ఎంత పెద్ద రైతు... ఆ రూఫ్ అంతా అలా ఖాళీగా పడి ఉంది కదా... దాని మీద హాంఫట్ అని చిక్కుడు మొక్కలు పెంచగలడు. టొమాటోలను ఎరుపెక్కించగలడు. పొట్లకాయలను పొడుగు పొడుగున పెరిగేలా చేయగలడు. మనుమణ్ణి అగ్రికల్చర్ బీఎస్సీ ఫీజ్ కట్టకుండా ఇంట్లోనే చదివించగలడు. నానమ్మ ఉంటే? దగ్గూ జలుబూ... ఒక్క చిట్కా వైద్యంతో సరి. దడుపు? ఒక్క దడుపు మంత్రంతో సరి. జారి కాలు వాస్తే పసుపూ సున్నం రాస్తే సరి. మనవరాలు ఎంబీబీఎస్ చదవాలంటే మొదటిపాఠం ఇక్కడి నుంచే మొదలు. ఇవాళ చదువు ఉంది. ఫీజుకు డబ్బు ఉంది. కాని ఈ పరంపర పాఠాలే మిస్సింగ్. ఇటీవల షాదీ డాట్ కామ్ వాళ్లు కాబోయే వధూవరుల మనోభిప్రాయం కనుక్కుందామని మొత్తం పాతిక నుంచి ముప్పై అయిదు లోపు వయసున్న 8,500 మందిని సర్వే చేసింది. వారిలో మగవాళ్లు దాదాపు 4,000, స్త్రీలు 4,500. ‘పెళ్లయ్యాక మీరు ఎలా జీవించదలుచుకున్నారు’ అని ఆడవాళ్లను అడిగితే 64 శాతం మంది ‘నా భర్తతో విడిగా’ అని జవాబు చెప్పారు. మగవాళ్లను అడిగితే 44 శాతం మంది ‘నా భార్యతో విడిగా’ అని చెప్పారు. స్త్రీలలో 30 శాతం మంది మాత్రమే అత్తమామలతో పాటుగా అని జవాబు చెప్పారు. మగవాళ్లలో 56 శాతం మాత్రం తమ తల్లిదండ్రులను ఉంచుకుంటాం అంటున్నారు. మగవాళ్ల లెక్క ఆశావహంగా ఉన్నా వారు చేసుకోబోయేది 70 శాతంలోని ‘విడిగా నా భర్తతో’ ఉండాలని ఆశించే అమ్మాయిలనే కాబట్టి ఫలితం పెద్దవాళ్లే అనుభవించాల్సి వస్తోంది. ఇంతకూ ఈ విడిగా అనే కోరిక ఎందుకు? ఇంట్లోని కొడుకు భార్యను తీసుకొని వేరే ఇంట్లో కాపురం పెడితే దానిని ‘వేరు కాపురం’ అంటారు కానీ ‘వేరు కుటుంబం’ అనరు. ఉద్యోగం కోసమో ఉదర పోషణార్థమో వేరే ఊరో దేశమో వెళితే ‘భార్యాపిల్లలను తీసుకెళ్లాడు’ అని అంటారు కానీ ‘కుటుంబాన్ని తీసుకెళ్లాడు’ అనరు. ఇంగ్లిష్‌లో ఫ్యామిలీ అనే మాట వచ్చి ఫ్యామిలీ అంటే సొంత ఫ్యామిలీ అనే అర్థం స్థిరపడింది కానీ ‘కుటుంబం’ అనే మాటకు అర్థం విస్తృతమైనది. ఆ ఊళ్లో ఆ కుటుంబం పెద్దది అంటున్నామంటే- తల్లి తండ్రి కొడుకులు కోడళ్లు మనమలు మనవరాళ్లు బాబాయ్‌లు పెదనాన్నలు... ఇందరు ఉన్నారని అర్థం. ఇందరుగా ఉన్నారని అర్థం. దానినే కుటుంబం అంటారు. ఇవాళ ఇలాంటి కుటుంబాలు లేవు. ఫ్యామిలీలే ఉన్నాయి. కుటుంబాలలోని మైనస్‌లు ఏమిటి? అజమాయిషీ ఎక్కువ. నిర్ణయాలు తీసుకోవడానికి ఉండదు. పరిహాసాలు చిన్నబుచ్చటాలు ఉంటాయి. పిల్లలు ఎక్కువ మందికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. వంట/ వంటగది మన ఇష్టం కాదు. ఆదాయం/ వ్యయం మన ఒక్కరిది కాదు. మరి న్యూక్లియర్ ఫ్యామిలీలలోని ప్లస్‌లు ఏమిటి? ప్రైవసీ. ఇదే ప్రధానమైనది. మన ఇష్టమొచ్చినట్టు మనం ఉండొచ్చు. ఆర్థికంగా మెరుగ్గా జీవించొచ్చు. పిల్లల చదువుకు తిండికి ప్రాధాన్యం ఇవ్వొచ్చు. ఇతర అనుబంధాల నిర్వహణలోని ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు. ఈ నాలుగైదు కారణాలు ఒక పెద్ద వ్యవస్థను సులభంగా గెలవగలిగాయి. భారతీయ సమాజం సంతృప్త సమాజం. అంటే ఉన్న దాంట్లో సంతోషంగా ఉండే సమాజం. కానీ 21వ శతాబ్దం దేశంలోని కంప్యూటర్‌తోపాటు కొన్ని ఆశలూ ఆశయాలు ఆకాంక్షలు కూడా తెచ్చింది. పిల్లలు బాగా చదువుకోవాలి, అమెరికాకు వెళ్లాలి, ముప్పై ఏళ్లకే సొంత ఇల్లు ఉండాలి, మార్కెట్లోకి వచ్చిన కొత్త బ్రాండ్ కారు పోర్టికోలో పార్క్ చేసి ఉండాలి... ఇవన్నీ ఎప్పుడు వచ్చాయో వేగం పెరిగింది. తక్షణ అనుబంధాలు ప్రధానమయ్యి రక్త సంబంధాలు పలుచనయ్యాయి. వేరేవాళ్ల సంగతి మనకెందుకు ఈ రేస్‌లో మనం ముందుండాలి అని ఎప్పుడు అనుకున్నామో నాన్న అమ్మ అన్న వదినె చిన్నాన్న పెదనాన్న ఇలాంటి ఎగస్ట్రా లగేజ్ లేకుండా భార్య భర్త పిల్లలు అనే చిన్న యూనిట్ ఈ పరుగు పందెంలో సులభంగా గెలవడానికి పరుగుపెట్టింది. కాలుష్యం, ఒత్తిడి, అనారోగ్యం, ఒంటరితనం... ఇవన్నీ ప్రాకారాలుగా కలిగిన నగర జీవితంలో న్యూక్లియర్ ఫ్యామిలీగా బతుకు వెళ్లమార్చడం నేర్చుకుంది. ఇక్కడ తాతకు దగ్గులు ఎవరూ నేర్పరు. అసలు దగ్గడానికి తాత ఉంటే కదా. కానీ ఇది సరైన పద్ధతి కాదు అంటారు సామాజిక విశ్లేషకులు, సాంస్కృతిక అధ్యయనశీలురు, మానసిక వికాస నిపుణులు. ముఖ్యంగా పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర కంటే అమ్మమ్మ తాతయ్య లేదా నానమ్మ తాతయ్యల పాత్ర ముఖ్యం అని అంటారు. కేవలం తల్లితండ్రి మాత్రమే ఉండే ఇంట్లో ఎదిగొచ్చే పిల్లలకు వేరే వాహిక ఉండదు. వాళ్ల ఇష్టాయిష్టాలు నివేదించడానికి అవ్వా తాతలు చాలా ముఖ్యమైన వాహిక అని అంటారు. అలాగే అమ్మా నాన్నల అభీష్టాలను పిల్లల చేత ఒప్పించడంలో కూడా అవ్వా తాతల పాత్ర కీలకమైనదిగా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ మధ్య దొంతర లేకపోవడం వల్ల ఇరు వర్గాల మధ్య ఘర్షణ, ఒత్తిడి, వ్యతిరేకత పెరిగిపోతున్నాయనడానికి అనేక ఉదంతాలు కనిపిస్తున్నాయి. తల్లిదండ్రులు ఉద్యోగస్తులైతే కనుక ఇంట్లో పెద్దవాళ్లు లేకపోతే కనుక పిల్లలు అదుపు తప్పే అవకాశం ఎక్కువ. ఇక విడాకులు పొందిన దంపతుల విషయంలో అయితే ఇది దాదాపు శూన్యంతో సమానం అవుతుంది. అవన్నీ పక్కన పెడితే పిల్లలకు సంస్కృతి ఎలా అందాలి? సంప్రదాయం ఎలా తెలియాలి? ఏది మంచో ఏది మన్నికమైనదో ఏది కార్‌తో ఏది ఆర్తో ఎలా తెలియాలి? ‘మన’ అంటూ ఒకటి ఉందనే అతిశయం బాల్యంలోనే ఏర్పడకపోతే యవ్వనం ఆత్మవిశ్వాసం కోల్పోతుంది. ‘మనది’ అనే ఒక వేరు వేళ్లూనకపోతే ఎదగడం బోలుగా మారుతుంది. ఇవన్నీ తల్లిదండ్రులు చెప్పలేరు. చెప్పడానికి వీలు ఉండదు. ఒకవేళ చెప్పినా పిల్లలు వినరు. అమ్మ పెట్టే ముద్ద తినని పిల్లవాడు నానమ్మ పెట్టే నాలుగు ముద్దలనూ గుటుక్కుమనిపిస్తాడు కదా. ఇదీ అంతే.కానీ రోజులు మారుతున్నాయి. మన దేశంలో గత పదేళ్లుగా కుటుంబాల ఏర్పాటు వ్యవస్థలో అభివృద్ధి మందకొడిగా ఉంది. అలాగే న్యూక్లియర్ ఫ్యామిలీల ఊపు కూడా మందకొడిగా ఉందని అంటున్నారు. ఇంకా చెప్పాలంటే గుజరాత్, కర్నాటక, మహారాష్ట్ర, హర్యానా, తమిళనాడు రాష్ట్రాలు న్యూక్లియర్ ఫ్యామిలీల కంటే ఉమ్మడి కుటుంబాలుగా ఉండటంపై ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాయని ఇటీవలి పరిశోధన. పెళ్లి కావాల్సిన యువతీ యువకుల వేరు కాపురాల కల ఎలా ఉన్నా కష్టకాలంలో ఆదుకునే పెద్ద దిక్కు లేక, ఇంట్లో మాట్లాడే మనిషి లేక, పిల్లల చేయి పట్టుకుని నడిపించే పెద్ది దిక్కు లేక పడే అవస్థతో పోలిస్తే ఉమ్మడి కుటుంబాల్లో ఉండే సంకటాలు చిన్నవి అని భావించే వారు తమ అనుభవాల ద్వారా అందరికీ తెలియ చేస్తున్నారు. తెలుగు సమాజం మరీ ఆ అంచున లేదు. మరీ ఈ అంచున లేదు. మధ్యస్తంగా ఉంది. తమని కన్నవారు తాము కన్నవారు కలిసి ఉండేదే కుటుంబం అని అందరూ తెలుసుకునే రోజు భవిష్యత్తులో రావచ్చు. ఎందుకంటే 1970లలో పోలిస్తే న్యూక్లియర్ ఫ్యామిలీల పెరుగుదల అమెరికాలో ప్రస్తుతం 40 శాతం నుంచి 21 శాతానికి పతనం అయ్యింది. అమెరికానే పెద్దల బాట పట్టినప్పుడు కుటుంబమూలాలు బలంగా ఉన్న మన సమాజం ఆ దారి అంది పుచ్చుకోవడం కష్టమేం కాదు. అదే జరిగినప్పుడు మిస్సింగ్ అనే మాట నిజంగా మిస్సయిపోతుంది. 8,500 షాదీ డాట్ కామ్ సర్వేలో పాల్గొన్న యువతీ యువకులు 64% భర్తతో విడిగా కాపురం ఉండాలని కోరుకుంటున్న మహిళలు 56% తల్లిదండ్రులను తమ వద్దే ఉంచుకుంటామని చెబుతున్న పురుషులు 44% పెద్దలకు దూరంగా విడిగా కాపురం ఉండాలని కోరుకుంటున్న మగాళ్లు