‘ఇంటి పేరు అనురాగం ముద్దు పేరు మమకారం’...‘కలతలు లేని నలుగురు కలిసిసాగించారు పండంటి కాపురం’...‘మనసే జ్యోతిగ వెలిగిందిమమతల కోవెలలో ఈ మమతల కోవెలలో’...కుటుంబ ఘనతను తెలుగు సినిమాగానం చేస్తూనే ఉంది.వెండి తెర మీద కుటుంబాల గొప్పదనం చూసితమ కుటుంబాలను చక్కదిద్దుకున్న ప్రేక్షకులూ ఉన్నారు.సమాజానికి కుటుంబం మూలం.నేడు అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం సందర్భంగాకుటుంబ బంధాలను, విలువలను గానం చేసిన పాటలను గుర్తు చేసుకోవడమే ఈ వారం సండే స్పెషల్.
కుటుంబంలోని ప్రతి అనుబంధాన్ని, సందర్భాన్ని పాటగా మలిచిన ఘనులు మన సినిమావారు. జననం నుంచి మరణం వరకు, చంటి పాపల నుంచి వివాహ సందర్భాల వరకూ, తల్లి, తండ్రి, అక్కచెల్లెళ్ల గురించి, అన్నయ్యల గురించి ప్రతి అనుబంధాన్ని పాట చేయనే చేశారు. కుటుంబానికి సమస్య వస్తే ఆ విషాదాన్ని పాడారు. కుటుంబ సభ్యులు బూటకంగా వ్యవహరిస్తే ఆ సంగతీ చెప్పారు. ఎన్ని చేసినా ఏం చెప్పినా కుటుంబం పటిష్టంగా ఉండాలన్న భావన ప్రేక్షకులకు కలుగ చేశారు.కుటుంబం భార్యాభర్తలతో మొదలవుతుంది. ‘కాపురం కొత్త కాపురం... ఆలుమగలు కట్టుకున్న అనురాగ గోపురం’ అని భార్యాభర్తలు పాడుకుంటారు. ‘ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు కావాలి ముందు ముందు పొదరిల్లు’ అనుకుంటారు. ఆ భార్య ఇల్లాలిగా మారుతుంది.
‘ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి... ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి’ అని ఆమెను శ్లాఘిస్తారు. ఆమె గర్భవతి అవుతుంది. ‘అమ్మాయే పుడుతుంది అచ్చు అమ్మలాగే ఉంటుంది...’ అని హీరో పాడితే ‘అచ్చు నాన్నలాగే ఉంటాడు’ అని హీరోయిన్ పాడుతుంది. పాపాయి పుట్టడంతో ఇంటికి కళ వస్తుంది. ‘పుట్టిన రోజు పండగే అందరికీ.. మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికీ’, ‘ఈనాడే బాబూ నీ పుట్టిన రోజు’ అని పాడుకుంటారు. ఈ పిల్లలు కాసింత పెద్దవాళ్లయితే పార్కుకు తీసుకెళ్లి ‘ఉడతా ఉడతా హుచ్ ఎక్కడికెళతా హుచ్’ అని పాడుకుంటారు. ఇంకా పెద్దయ్యాక ఇంటి అమ్మాయిని అత్తింటికి సాగనంపుతూ ‘శ్రీలక్ష్మి పెళ్లికి చిరునవ్వు కట్నం’ అని పాడి అయ్య చేతిలో పెడతారు.
కాని ఉమ్మడి కుటుంబాలను గౌరవించే సంస్కృతి మనది. ఇంట్లో ఉన్న అన్నదమ్ములు అందరూ కలిసి ఉండే రోజులు ఒకప్పుడు ఉండేవి. అన్నదమ్ములు అందరూ కలిసి ఆడుకునేవారు పాడుకునేవారు. ‘బాబూ... వినరా అన్నాదమ్ముల కథ ఒకటి’ అని పాడుకుంటారు. ప్రతి అనుబంధాన్ని అది ఎంత అవసరమో ఒకరికొకరు చెప్పుకుంటారు. పిల్లలకు కూడా తెలియచేస్తారు.
అన్నయ్య ఇంటిలో ఇంపార్టెంటే. ‘అన్నయ్య సన్నిధి... అదే నాకు పెన్నిధి’ అని చెల్లెలు పాడుతుంది. ‘అన్నా.. నీ అనురాగం ఎన్నో జన్మల అనుబంధం’ అనీ పాడుతుంది. ‘చెల్లెమ్మా... నీవేలె నా ప్రాణమూ’ అని అన్నయ్య కూడా పాడతాడు. ‘మంచివారు మా బాబాయి... మా మాటే వింటాడోయి’ అని బాబాయి మీద పాట ఉంటుంది. ‘ఏమమ్మ జగడాల వదినమ్మో’... అని మరిది వదినను ఆటపట్టిస్తాడు. ‘చందురుని మించు అందమొలికించు ముద్దు పాపాయివే’ అని మేనమామ తన మురిపెం చూపిస్తాడు. ‘బావా బావా పన్నీరు బావను పట్టుకు తన్నేరు’ అని మరదళ్లు బావతో సరసమాడతారు. ఇక అమ్మా నాన్నల మీద ఎన్నో పాటలు. ‘అమ్మ అన్నది ఒక కమ్మని మాట’ అని పిల్లలు పాడితే ‘ఓ నాన్నా.. నీ మనసే వెన్నా’ అని సుపుత్రులు తండ్రిని హత్తుకుంటారు. ‘తాతా.. బాగున్నావా... ఓ తాతా.. బాగున్నావా’ అని మనవడు తాతతో పరాచికం ఆడతాడు. ఇల్లు ఈ అన్ని బంధాలతో ఉంటుంది.
ఇంటికి కుటుంబ అనుబంధాలు ముఖ్యం. వాటికి ఎటువంటి విఘాతం కలిగినా కన్నీరే. ‘అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం’ అని అనిపిస్తుంది. ‘ఎవ్వరి కోసం ఎవరుంటారు పోండిరా పోండి’ అని అనబుద్ధేస్తుంది. ‘ఈ జీవన తరంగాలలో ఆ దేవుడి చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకీ బంధము’ అనిపిస్తుంది. కాని ఈ కలతలు ఎన్ని వచ్చినా అవన్నీ చెదిరిపోక తప్పదు. ఎందుకంటే కుటుంబ బంధం తిరిగి అందరినీ దగ్గరకు చేస్తుంది. పండగో, పెళ్లో, శుభకార్యమో వారిని మళ్లీ ఏకం చేస్తుంది.‘కలిసుంటే కలదు సుఖము’ అని ఈ కుటుంబమే పాడుకుంటుంది. ‘మా లోగిలిలో పండేదంతా పుణ్యమే... మా జాబిలికి ఏడాదంతా పున్నమే’ అని భరోసా ఇచ్చుకుంటారు.
ఒకప్పుడు గొప్ప గొప్ప కుటుంబ గాధలను తీసిన తెలుగు సినిమాలు ఆ దారి నుంచి పక్కకు వెళ్లినప్పుడు తమిళంలో విక్రమన్, హిందీలో సూరజ్ బర్‌జ్యాతా మళ్లీ కుటుంబాలను గుర్తు చేశారు. కుటుంబాలన్నీ కలిసి కూర్చుని భోం చేయడం కూడా వింతగా మారడం.. అవును అలా ఉండేవాళ్లం కదూ అని ‘హమ్ ఆప్ కే హై కౌన్’ వంటి సినిమాలతో ట్రెండ్ మార్చుకున్నారు. తెలుగులో ‘నిన్నే పెళ్లాడతా’ ఈ ట్రెండ్‌ను మళ్లీ తెచ్చింది. పెళ్లి వేడుకులు ముఖ్యమైన కుటుంబ కలయికలుగా మారాయి. కుటుంబం శాశ్వతం..కుటుంబం అద్భుతం
Comments
Please login to add a commentAdd a comment