ఆ నడకలో ఓ స్టయిల్... సిగిరెట్ అలవోకగా ఎగరేయడం ఓ స్టయిల్... కూలింగ్ గ్లాస్‌ని కూల్‌గా ఎగరేయడం ఓ స్టయిల్... అందుకే ‘స్టయిలు స్టయిలులే.. ఇది సూపర్ స్టయిలులే..’ పాట రజనీకాంత్ స్టయిల్‌కి తగ్గట్టు ఉంటుంది. కండక్టర్‌గా ఉన్నప్పుడు ప్రయాణికులకు టికెట్లు తెంచారు రజనీ. యాక్టర్ అయ్యాక ప్రేక్షకులు ఆయన సినిమా టిక్కెట్లు తెంచారు. నేటితో తమిళ పరిశ్రమకు రజనీ పరిచయమై 45 ఏళ్లు. ఈ సందర్భంగా ఆయన సినీ ప్రయాణం గురించి స్పెషల్ స్టోరీ.
సరిగ్గా ఇదే రోజు (ఆగస్ట్ 15), నలభై ఐదేళ్ల క్రితం తమిళ సినిమాకు ఓ కొత్త ముఖం పరిచయం అయింది. అప్పుడెవ్వరూ ఉహించి ఉండకపోవచ్చు.. తమిళ సినిమాకి ముఖం అతనే అవుతాడని. దర్శకుడు బాలచందర్ కనుగొన్న ముత్యాల్లో ఒకరు రజనీకాంత్. కె. బాల చందర్ దర్శకత్వంలో ‘అపూర్వ రాగంగళ్’ చిత్రం ద్వారా పరిచయం అయ్యారు రజనీకాంత్. ఆ సినిమాలో కమల్ హాసన్ హీరో. రజనీ కీలక పాత్ర చేశారు.
తర్వాత కన్నడంలో ‘కథా సంగమ’లో ఓ చిన్న పాత్ర చేశారు. వెంటనే తెలుగు చిత్రం ‘అంతులేని కథ’కి రజనీని తీసుకున్నారు బాలచందర్. ‘మూండ్రు ముడిచ్చు’ సినిమాలో ప్రాముఖ్యం ఉన్న పాత్రలో కనిపించారు. ఆ సినిమాలో రజనీ గాల్లోకి సిగిరెట్ విసిరేసే విధానానికి విజిల్స్ పడ్డాయి. రజనీ అనేవాడు ప్రేక్షకులకు రిజిస్టర్ అయ్యాడు.
‘చిలకమ్మ చెప్పింది’ సినిమాలో తొలిసారి పూర్తిస్థాయి లీడ్ రోల్ లో నటించారు రజనీ. తెలుగులో హీరో అయినప్పటికీ తమిళంలో పూర్తి స్థాయి హీరోగా మారలేదు రజనీ. దర్శకుడు ఎస్పీ ముత్తురామన్ ఆ ప్రయోగం చేశారు. ‘భువనా ఒరు కేళ్విక్కురి’లో విలన్ గా కాకుండా మంచి పాత్రలో కనబడ్డారు. ప్రయోగం ఫలించింది. ఆ తర్వాత ఎస్పీ– రజనీ కాంబినేషన్‌లో సుమారు 24 సినిమాలు వచ్చాయి.
ఒక్క ఏడాదిలో 20 సినిమాలు
1978 రజనీకు మరచిపోలేని ఏడాది. ఆ సంవత్సరం తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో ఆయనవి 20 సినిమాలు విడుదలయ్యాయి. ‘భైరవి’తో తమిళంలో సోలో హీరోగా తొలి సినిమా చేశారు. ‘వణకత్తుక్కురియ కాదలియే’లో రజనీకు ఇంట్రడక్షన్ సాంగ్ పెట్టారు. ఆ తర్వాత అదే ట్రెండ్ అయింది. ‘ముళ్ళుమ్ ములరుమ్’ మంచి పేరు తెచ్చిపెట్టింది.
యాక్టింగ్‌కి టాటా
నాలుగేళ్లలో సుమారు 50 సినిమాలు పూర్తి చేశారు రజనీ. అయినప్పటికీ సాలిడ్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ కొదవయింది. ఇంకా నటుడిగా కొనసాగుదామా? ఆపేద్దామా? అనే ఆలోచనలో పడ్డారట రజనీ. కానీ 1980లో వచ్చిన ‘బిల్లా’ ఆయన ప్రయాణాన్ని మార్చేసింది. ఆ తర్వాత ‘తిల్లు ముల్లు’ (1981)లో వంటి కామెడీ టచ్ ఉన్న సినిమా చేశారు రజనీ. అప్పటికి మంచి కమర్షియల్ హీరోగా దూసుకెళుతున్న రజనీ ఆధ్యాత్మిక సినిమా ‘శ్రీ రాఘవేంద్ర’ (1985) చేశారు. ఇందులో రాఘవేంద్ర స్వామి పాత్రను చేశారు రజనీ. ఇది ఆయనకు నూరవ సినిమా. రజనీ స్టార్ నుంచి సూపర్ స్టార్ గా ఎదిగిన పీరియడ్ 1990–2000. ఆ పదేళ్లల్లో చేసిన ’దళపతి’, ‘అన్నామలై’, ‘బాషా’, ‘ముత్తు’, ‘అరుణాచలం’, ‘నరసింహ’ వంటి బ్లాక్‌బస్టర్స్ ఉన్నాయి.
2000 –2020
‘నరసింహా’ సూపర్ సక్సెస్ తర్వాత రజనీ చేసిన ‘బాబా’ ఘోరపరాజయాన్ని చవి చూసింది. ఆ తర్వాత మూడేళ్లు విరామం తీసుకుని, మళయాళ చిత్రం ‘మణిచిత్ర తాళు’ తమిళ రీమేక్ ‘చంద్రముఖి’లో నటించారు. ఆ తర్వాత శంకర్ డైరెక్షన్ లో ‘శివాజీ’ చేశారు. మళ్లీ ఈ ఇద్దరి కాంబినేషన్ లోనే ‘రోబో’(2010) వచ్చింది. ఇండియన్ ఇండస్ట్రీలో అప్పటి వరకు అంత నిర్మాణం (దాదాపు 200 కోట్ల బడ్జెట్)తో ఏ సినిమా తెరకెక్కలేదు. ఆ తర్వాత పలు ఆరోగ్య సమస్యలతో బాధపడ్డారు రజనీ. నాలుగేళ్ల విరామం తర్వాత తన కుమార్తె సౌందర్య దర్శకత్వంలో రజనీ చేసిన ‘కొచ్చాడియాన్’ (విక్రమ సింహా), ఆ తర్వాత చేసిన ‘లింగ’ అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు. ‘కబాలి’ కూడా హైప్ ను మ్యాచ్ చేయలేకపోయింది. ఆ తర్వాత ‘కాలా, 2.0, పేట్టా, దర్బార్’ చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు రజనీకాంత్.
హిమాలయాలకు..
రజనీ విడిగా చాలా నిరాడంబరంగా ఉంటారు. ఒకసారి ఓ గుడికి మామూలు లుంగీ, చొక్కాతో వెళ్లిన రజనీని గుర్తు పట్టక ఒకావిడ 10 రూపాయలు ఇచ్చింది. రజనీ నవ్వుతూ ఆ నోటుని తీసుకున్నారు. లగ్జరీ కారు ఎక్కుతున్న ఆయన్ను చూసిన ఆవిడ ‘రజనీకాంత్’ అని గ్రహించింది. దగ్గరకెళ్లి క్షమాపణ చెబితే, రజనీ నవ్వేశారు. ఏడాదికి ఓసారి హిమాలయాలకు వెళతారు. కొన్ని రోజులపాటు ధ్యానం చేస్తారు. పై పై మెరుగులకు ప్రాధాన్యం ఇవ్వడం వృథా అంటారు రజనీ. అందుకే స్టార్ అయినప్పటికీ సామాన్యుడిలానే ఉంటారు.
దటీజ్ రజనీకాంత్.
రజనీ పంచ్ డైలాగ్స్
► అతిగా ఆశపడే ఆడది అతిగా ఆవేశ పడే మగవాడు బాగుపడినట్టు చరిత్రలో లేదు. (నరసింహ)
► ఈ బాషా ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టు. (బాషా)
► దేవుడు శాసిస్తాడు. ఈ అరుణాచలం పాటిస్తాడు. (అరుణాచలం)
► నాన్నా పందులే గుంపుగా వస్తాయి సింహం సింగిల్‌గా వస్తుంది. (శివాజీ)
► నా దారి రహదారి. బెటర్ డోంట్ కమిన్ మై వే. (నరసింహ).
Comments
Please login to add a commentAdd a comment