సినిమాల్లో వీరు పాసయ్యారు | special story on tollwood movies 2019 | Sakshi
Sakshi News home page

సినిమాల్లో వీరు పాసయ్యారు

Published Tue, Dec 10 2019 12:00 AM | Last Updated on Tue, Dec 10 2019 10:43 AM

special story on tollwood movies 2019 - Sakshi

శ్రద్ధా శ్రీనాథ్‌, శివాత్మికా రాజశేఖర్‌, ఐశ్వర్యా రాజేశ్‌

ఇండస్ట్రీ సముద్రం లాంటిది. కొత్త నీరు ఎప్పటికప్పుడు సముద్రంలో చేరినట్టే, ఇండస్ట్రీలోనూ కొత్త ముఖాలు కనిపిస్తూనే ఉంటాయి. ప్రవాహం సాగుతుంటుంది. ఈ ప్రయాణంలో ప్రామిసింగ్‌గా కొందరు మాత్రమే అనిపిస్తారు. నిజానికి గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మెరిసిన కొత్తవాళ్ల సంఖ్య అభినందనీయంగా లేదు. గత ఏడాది కొత్త దర్శకులు నెలకో వారం చొప్పున మెరిశారు. ఈసారి అదీ కనిపించలేదు. హీరోహీరోయిన్లు విషయంలోనూ అంతే. అలా ఈ ఏడాది తెలుగులో పరిచయమైనవాళ్లల్లో ఫస్ట్‌ టెస్ట్‌లో పాస్‌ అయి, ఇటు ఇండస్ట్రీ అటు ప్రేక్షకులకు బాగా రీచ్‌ అయినవారి గురించి మాట్లాడుకుందాం.  

హీరోలిద్దరే!
► డిటెక్టివ్‌ అనేవాడికి తన మీద తనకి నమ్మకం, కొంచెం ఓపిక ఉండాలి అనేది ఏజెంట్‌ ఆత్రేయ ఫిలాసఫీ. నవీన్‌ పొలిశెట్టి జర్నీని  గమనిస్తే ఇలాంటి థియరీనే తన లైఫ్‌లోనూ పాటించినట్టున్నారు. యూట్యూబ్‌ వీడియోలతో మొదలయి, సినిమాల్లో అవకాశాల కోసం ఓపికగా ఎదురు చూశారు. ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస్‌ ఆత్రేయ’తో హీరోగా పరిచయం అయ్యారు నవీన్‌ పొలిశెట్టి. ఈ ఏడాది వచ్చిన చిన్న చిత్రాల్లో పెద్ద విజయం అందుకున్న సినిమా ‘ఏజెంట్‌.. ఆత్రేయ’. వన్‌ మ్యాన్‌ షోగా సినిమాను నడిపించారు నవీన్‌. ప్రస్తుతం ‘జాతి రత్నాలు’లో నటిస్తున్నారు.

► అన్నయ్యేమో యూత్‌ క్రేజీ స్టార్‌. ఏం చేసినా సెన్సేషనే. ఆయన తమ్ముడిగా ఇండస్ట్రీలో పరిచయం అయ్యేటప్పుడు అంచనాలుండటం సహజం. ఒత్తిడి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎంట్రీ ఇచ్చారు ఆనంద్‌ దేవరకొండ.. బ్రదర్‌ ఆఫ్‌ విజయ్‌ దేవరకొండ. ‘దొరసాని’ అంటూ ఓ కొత్త తరహా ప్రేమకథను ప్రేక్షకులకు చూపించారు. స్టార్‌ అన్నయ్య తమ్ముడు కాబట్టి ఎంట్రీ ఈజీ అయింది. ప్రస్తుతం రెండు, మూడు చిత్రాలతో బిజీగా ఉన్నారు ఆనంద్‌. ఇలా ఈ ఏడాది పరిచయమైన హీరోల్లో ప్రేక్షకులకు ఎక్కువ రీచ్‌ అయినది ఈ ఇద్దరే అని చెప్పొచ్చు.

ఆ ఆరుగురు...
ఈ ఏడాది చాలామంది డైరెక్టర్లు పరిచయం అయ్యారు. అయితే సక్సెస్‌ పర్సంటేజ్‌ పరంగా ఎక్కువగా రీచ్‌ అయినవారి గురించి ప్రస్తావించాలంటే.. ‘డియర్‌ కామ్రేడ్‌’తో భరత్‌ కమ్మ, ‘ఎవరు’తో వెంకట్‌ రామ్‌జీ, ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో స్వరూప్‌ ఆర్‌ఎస్‌జే, ‘దొరసాని’తో కేవీఆర్‌ మహేంద్ర, ‘మల్లేశం’తో రాజ్‌.ఆర్, ‘రాజావారు రాణిగారు’తో రవికిరణ్‌ దర్శకులుగా పరిచయం అయ్యారు. హిట్‌ కొట్టారు. నెక్ట్స్‌ సినిమా ఏం చేస్తారు? అనే ఆలోచన ప్రేక్షకుడిలో కలిగించడంలో సక్సెస్‌ అయ్యారు. లైంగిక వేధింపులు, లైంగిక హింస.. ప్రస్తుతం మాట్లాడాల్సిన విషయాలు. అవగాహన కలిగించాల్సిన సమయం.

ఇలాంటి కథతో ‘డియర్‌ కామ్రేడ్‌’ కథను చెప్పారు భరత్‌ కమ్మ. ఈ ఏడాది మన దేశం నుంచి ఆస్కార్‌కు పంపే సినిమాల లిస్ట్‌లో ‘డియర్‌ కామ్రేడ్‌’ కూడా ఉండటం విశేషం. ‘డిటెక్టివ్‌’ కథలు తెలుగులో వచ్చి చాలా కాలం అయింది. అలాంటి సీరియస్‌ డిటెక్టివ్‌ కథకు హ్యూమర్‌ జత చేసి ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస్‌ ఆత్రేయ’తో బాక్సాఫీస్‌కి కితకితలు పెట్టారు స్వరూప్‌. ఈ అల్లరి ఏజెంట్‌ అందరినీ నవ్వించి, అందరికీ నచ్చేశాడు. ఏజెంట్‌ను ఓ ఫ్రాంచైజీగా కొనసాగించే ఆలోచన ఉందని దర్శకుడు ఓ సందర్భంలో తెలిపారు.

ఆనంద్‌ దేవరకొండ, నవీన్‌ పొలిశెట్టి
తెలంగాణ ప్రాంతంలో 1980లలో జరిగే అపురూపమైన ప్రేమకథగా ‘దొరసాని’ చిత్రాన్ని తెరకెక్కించారు మహేంద్ర. ఈ కథను మూడేళ్లు పాటు సుమారు 42 వెర్షన్లు రాసినట్టు దర్శకుడు పేర్కొన్నారు. కథ 1980లలో జరిగేట్టు చూపించడంలో దర్శకుడు సూపర్‌ సక్సెస్‌ అయ్యారనే చెప్పాలి.   చిన్న బడ్జెట్‌ సూపర్‌ స్టార్‌ అడివి శేష్‌ ఈ ఏడాది మరో కొత్త దర్శకుడిని పరిచయం చేశారు. ఫ్రెంచ్‌ సినిమా ‘ది ఇన్వెజిబుల్‌ గెస్ట్‌’ కథను తీసుకుని అద్భుతంగా మన భారతీయతను జోడించి ‘ఎవరు’గా తీశారు దర్శకుడు వెంకట్‌ రామ్‌ జీ.

సినిమా పూర్తయ్యేసరికి ప్రేక్షకుల గోళ్లు ఏమాత్రం మిగలకుండా పూర్తిగా కొరికేసుకునే రేంజ్‌ థ్రిల్లర్‌ తీయడంలో పక్కాగా సక్సెస్‌ అయ్యారు రామ్‌జీ. మరో మీడియమ్‌ బడ్జెట్‌ హిట్‌ను అడవి శేష్‌ హిట్‌ లిస్ట్‌లోకి అందించారు రామ్‌జీ.  ఎన్ని కమర్షియల్‌ సినిమాలొచ్చినా, కాన్సెప్ట్‌ చిత్రాలొచ్చినా మన కథలు, మన సంస్కృతులను గుర్తు చేసే సినిమాలు ప్రత్యేకం.. అవసరం. అమ్మ కష్టాన్ని చూడలేక ఆసు యంత్రాన్ని కనిపెట్టిన సూపర్‌ హీరో ‘చింతకింది మల్లేశం’ జీవితకథను ‘మల్లేశం’గా తెరకెక్కించారు రాజ్‌ ఆర్‌. నిజాయతీగా కథను చెప్పిన తీరు ప్రశంసలు అందుకుంది. కొత్త దర్శకులకు ప్రియమైన జానర్‌లో ప్రేమకథ ఎప్పుడూ ముందుంటుంది. ఆ పాత ఫార్ములాను ఎంత కొత్తగా చెప్పడం అనేదాన్ని బట్టి దర్శకుడి ప్రతిభ దాగి ఉంటుంది. ‘రాజావారు రాణిగారు’ అనే పల్లెటూరి ప్రేమకథను కనువిందుగా చూపించారు దర్శకుడు రవికిరణ్‌. దర్శకుల్లో ఈ ఆరుగురి రీచ్‌ బాగుందనొచ్చు.

మెరిసిన నాయికలు
తెలుగు మూలాలున్న అమ్మాయి ఐశ్వర్యా రాజేశ్‌. తమిళంలో మంచి పేరు సంపాదించారు. తమిళంలో ఆమె నటించిన సూపర్‌ హిట్‌ చిత్రం ‘కణా’. ఈ చిత్రం రీమేక్‌ ‘కౌసల్య కృష్ణమూర్తి’తో తెలుగులో పరిచయం అయ్యారామె. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ పూర్తి చేసి, నానీతో ‘టక్‌ జగదీష్‌’ కమిట్‌ అయ్యారు. కన్నడంలో మంచి ఫెర్ఫార్మర్‌ అనిపించుకున్న శ్రద్ధా శ్రీనాథ్‌ తెలుగులో ‘జెర్సీ’తో ఎంట్రీ ఇచ్చారు.

నాని పాత్రకు దీటుగా నటించి ఆడియన్స్‌లో ఆసక్తి కలిగించారు. ప్రస్తుతం ‘క్షణం’ దర్శకుడు రవికాంత్‌ పేరెపు దర్శకత్వంలో ఓ సినిమా పూర్తి చేశారామె. రాజశేఖర్, జీవిత దంపతుల కుమార్తెగా ఎంట్రీ ఇచ్చిన శివాత్మికా రాజశేఖర్‌ ‘దొరసాని’లో మంచి నటనను కనబరిచారు. అలానే ‘గద్దలకొండ గణేష్‌’లో మృణాలినీ రవి, ‘గ్యాంగ్‌ లీడర్‌’లో ప్రియాంకా మోహనన్‌ ప్రేక్షకుడి అటెన్షన్‌ రాబట్టగలిగారు. పేరు రావడం.. రాకపోవడం అనేది ఎవరి చేతుల్లోనూ ఉండదు. సినిమా హిట్‌ వారి వారి కెరీర్‌ని నిర్ణయిస్తుంది. ఈ ఏడాది పెద్దగా గుర్తింపు తెచ్చుకోనివారికి 2020 కలిసొస్తుందేమో. అలాగే ఈ ఏడాది ఎక్కువగా రీచ్‌ అయినవారు వచ్చే ఏడాది ఇంకా విజయాలు చూస్తారేమో.
– గౌతమ్‌ మల్లాది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement