వరద ముంపులో వృద్ధాశ్రమాలు
సహాయం కోసం ఆర్తిగా ఎదురుచూపులు
పట్టించుకోని ప్రభుత్వం, అధికారులు
వరద ముంపు నుంచి బయట పడుతున్న మరికొందరు
సాక్షి బృందం, విజయవాడ: అసలే అంతా 70 ఏళ్లపైబడిన వృద్ధులు. అయిన వారి ఆదరణ కోల్పోయి వృద్ధాశ్రమాల్లో ఆశ్రయం పొందుతున్నారు. అకస్మాత్తుగా విజయవాడను ముంచెత్తిన వరదతో వారంతా ఒక్కసారిగా వణికిపోయారు. ఏం జరిగిందో తెలుసుకునే లోపే నడుములోతు నీరు. ఎటూ కదలలేని స్థితి. చేసేదిలేక ప్రాణాలు అరచేతబెట్టుకుని ఒకరివద్దకు ఒకరు చేరుకున్నారు. చేయి, చేయి పట్టుకుని ఓదార్చుకుంటూ ఒకరికొకరు సహాయం అందించుకున్నారు.
ఊతకర్రల సహాయంతో ఆశ్రమం భవనం ఎక్కి ప్రాణాలు దక్కించుకున్నారు. తిండి లేక, మంచి నీరు లేక, కాలకృత్యాలు తీర్చుకునే దారిలేక నానా అవస్థలు పడ్డారు. మూడు రోజుల తర్వాత బుధవారం కాస్త నీరు తగ్గడంతో వారు మెల్లగా కిందకిదిగారు. ఇప్పటికీ వరద నీరు ఆశ్రమంలో ఉండటంతో ఎలాగోలా మంచాలపైకి చేరి అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నారు. సహాయం కోసం ఆర్తిగా ఎదురు చూస్తున్నారు.
అంటు వ్యాధుల భయం..
రాజీవ్ నగర్‌లోని మున్సిపల్ కార్పొరేషన్ వృద్ధాశ్రమంలో 20 మంది ఆశ్రయం పొందుతున్నారు. కొంతమంది కొన్నాళ్లుగా మంచానికే పరిమితమై ఉన్నారు. ఆదివారం ఉదయం వృద్ధాశ్రమంలోకి నీరు చేరడంతో వారంతా భవనం పైకి వెళ్లి తలదాచుకున్నారు. దాదాపు ముప్పై ఆరు గంటల తర్వాత కిందికి దిగినప్పటికీ ఆశ్రమంలో వరద నీరు ఉండడంతో ఒక్కో మంచంపై మూడు పరుపులు వేసి ఎత్తుగా ఏర్పాటు చేసి వాటిపై ఎలాగోలా విశ్రాంతి తీసుకుంటున్నారు. కొందరు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతుండగా మిగిలిన వారు అంటు వ్యాధులు ప్రబలుతాయోమోనని భయపడుతున్నారు.
మాతృదేవోభవ వృద్ధాశ్రమంలోనూ
వాంబేకాలనీలోని మాతృదేవోభవ వృద్ధాశ్రమం భవనం పూర్తిగా ముంపునకు గురైంది. అకస్మాత్తుగా వ చ్చిన వరదతో కనీసం రోడ్డు మీదకు కాలు పెట్టలేకపోయామని నిర్వాహకురాలు ఎం.దుర్గ చెప్పారు. ఇక్కడ ఆశ్రయం పొందుతున్న 35 మంది వృద్ధులను ఎక్కడికీ తీసుకెళ్లలేకపోయామన్నారు. మొదటి రోజు మధ్యాహ్నం వరకు ఫోన్లు పని చేశాయని, అప్పుడే సాయం కోసం ఎంతో మంది అధికారులకు ఫోన్ చేసినా ఎవరూ స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
దీంతో డాబా పైనే ఓ టార్పాలిన్‌తో తాత్కాలిక గుడిసెలా ఏర్పాటు చేసి వారందరినీ అక్కడ ఉంచామన్నారు. వారం క్రితం రూ. 2 లక్షల ఖరీదు చేసే నిత్యావసర సరుకులు తీసుకొచ్చానని, వాటిలో కొన్ని వరదకు కొట్టుకుపోగా, మిగిలినవి నీటిలో నాని ఎందుకు పనికిరాకుండా పోయాయని చెప్పారు. ఇప్పటి వరకు ప్రభుత్వ అధికారులు కనీసం ఇటు వైపు కన్నెత్తయినా చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
చరమాంకంలో చెప్పలేనంత కష్టం..
జీవిత చరమాంకంలో ఉన్న వృద్ధులు వరద ముంపు కారణంగా నానా అవస్థలు పడ్డారు. వరద నీటిని దాటి బయటకు వెళ్లలేక, నీట మునిగిన ఇంటిలో ఉండలేక, సమయానికి అన్న పానీయాలు అందక అగచాట్లు చవిచూశారు. ఇప్పుడు వరద నీరు కాస్త తగ్గడంతో కుటుంబ సభ్యుల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు చేరుతున్నారు. సింగ్‌నగర్, కేఎల్‌రావు నగర్, ఊర్మిళానగర్ ప్రాంతాల్లో వృద్ధుల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి.
బంధువుల భుజాల ఊతంతో బయటకు వస్తున్నవారు కొందరైతే,« థర్మా కోల్, లారీ ట్యూబుల సాయంతో ఒడ్డుకు చేరుతున్నవారు మరికొందరు పలు చోట్ల కనిపించారు. ప్రశాంతంగా బతకాల్సిన వయసులో చెప్పలేనంత కష్టంతో వారు ఇబ్బంది పడుతున్నారు.
మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు..
సింగ్‌నగర్ ప్రాంతంలో గత 15 ఏళ్లుగా ఉంటున్నాం. ఎప్పుడూ ఇలాంటి దుర్భర పరిస్థితులు చూడలేదు. వరద నీరు చేరడంతో ఇళ్లలో ఉండలేని పరిస్థితి. మూడు రోజుల పాటు ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూశాం. మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు. మర బోట్లు ఏర్పాటు చేశారని వినటమేగానీ ఒక్కటీ కానరాలేదు. శారీరక బలహీనతతో నడవలేని స్థితిలో ఉన్న నేను ప్రాణాలు కాపాడుకునేందుకు చేతి కర్రతో నడుము లోతు నీళ్లలో నడిచి ఒడ్డుకు చేరారు. – జె.వెంకటేశ్వరరావు, సింగ్‌నగర్
Comments
Please login to add a commentAdd a comment