సిద్దిపేటజోన్: అందరూ ఉండి ఏకాకులుగా మారిన వారు కొందరైతే.. విధి వక్రించి ఒంటరి జీవనం గడిపే వారు మరి కొందరు. వృద్ధాప్యంలో తోడూనీడా లేకుండా ఒక భరోసా కోసం ఎదురుచూసే వారికి, అభాగ్యులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం సిద్దిపేట జిల్లా కేంద్రంలో వృద్ధాశ్రమం ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది.
మంత్రి హరీశ్‌రావు చొరవతో సుమారు రూ.కోటి నిధులతో రాష్ట్రంలో ఒక మోడల్‌గా ఈ వృద్ధాశ్రమ ఏర్పాటుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. సిద్దిపేట పరిధి మిట్టపల్లి గ్రామ శివార్లలో ఎకరం స్థలంలో దీన్ని నిర్మించేందుకు పరిశీలన పూర్తి చేశారు. త్వర లో మంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నారు.
మహిళా శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు
కుటుంబ సభ్యుల ఆదరణ కరువైన వృద్ధులకు అండగా ఉండాలన్న ప్రభుత్వ ఆలోచన మేరకు హరీశ్‌రావు ఈ వృద్ధాశ్రమం ఏర్పాటుకు అంకురార్పణ చేశారు. దీని నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేసి రూ.కోటి నిధులను మంజూరు చేయించారు. మహిళా శిశుసంక్షేమ శాఖ ఆధ్వ ర్యంలో ఈ ఓల్డ్ ఏజ్ హోంను ఏర్పాటు చేస్తున్నారు. సుమారు వంద మందికి ఆశ్రయం ఇచ్చేలా వసతులతో భవనాన్ని నిర్మించనున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణం కోసం ఓల్డ్ ఏజ్ హోం చుట్టూ అందమైన పార్క్ ఏర్పాటు చేయనున్నారు.
అభాగ్యులకు ఎంత సేవ చేసినా తక్కువే
వృద్ధాప్యంలో ఉన్న అభాగ్యులకు ఒక నీడ ఇవ్వాలనే ఆలోచనకు ప్రతిరూపం ఇది. అనాథ వృద్ధులు, పిల్లలు ఉండీ వారు అందుబాటులో లేక అభాగ్యులైన వారికి ఎంత సేవ చేసినా తక్కువే. వారి బాధలను, ఒంటరిగా ఉన్నామనే ఆలోచనను దూరం చేసేలా ఆనంద నిలయంగా ఈ ఆశ్రమాన్ని ఏర్పాటు చేస్తాం.
–హరీశ్‌రావు, ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి
Comments
Please login to add a commentAdd a comment