అరీఫా–రోష్ని ఆశ్రమంలో వృద్ధులు.. ఇన్‌సెట్‌లో షహనాజ్‌బేగం
అశ్వాపురం: కనిపెంచిన తల్లిదండ్రులను అనాథలుగా వదిలేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో అనాథలు, అభాగ్యులైన వృద్ధులను చేరదీస్తూ.. మానవత్వం పంచుతూ.. పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది.. షహనాజ్‌బేగం. మండల కేంద్రమైన అశ్వాపురంలో 2011 జూన్ 27న మండల పరిధిలోని అమ్మగారిపల్లికి చెందిన షహనాజ్‌బేగం ఆమె సోదరిమణులు వహిదాబేగం, నూర్జహాన్‌బేగం, అరీఫాసుల్తానాలు కలిసి అరీఫా–రోష్ని వృద్ధాశ్రమాన్ని స్థాపించారు. ఆరు నెలలకే ఆమె సోదరిమణులు వ్యక్తిగత కారణాలతో దూరప్రాంతాలకు వెళ్లారు. అప్పటినుంచి షహనాజ్‌బేగమే వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తోంది. అభాగ్యులైన వృద్ధులకు అండగా ఉంటోంది. తమ స్వార్థం కోసమే తాము బతుకుతూ ఇతరుల కష్టాలు తమకెందుకని భావిస్తున్న ప్రస్తుత సమాజంలో వృద్ధులను తన కన్నతల్లిదండ్రులలాగా చూసుకుంటోంది. ఆమె సేవా దృక్పథాన్ని పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, స్థానికులు అభినందిస్తున్నారు.
7 సంవత్సరాలుగా వృద్ధాశ్రమం నిర్వహణ
వృద్ధాశ్రమం స్థాపించినాటి నుంచి తన భర్త సహకారంతో ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొంటూ ముందుకుసాగుతోంది. మణుగూరు ఏరియా సింగరేణి అధికారులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు, పురప్రముఖలు, మండల కేంద్ర ప్రజలు, దాతల సహకారంతో వృద్ధులకు ఏడు సంవత్సరాలుగా అన్ని సౌకర్యాలూ అందిస్తోంది. ఒక్కోసారి ఖర్చులు సొంతంగా కూడా భరించాల్సి వస్తోంది. ప్రస్తుతం అరీఫా–రోష్ని వృద్ధాశ్రమంలో 18 మంది వృద్ధులు ఉన్నారు. అద్దె భవనంలో వృద్ధులు ఇబ్బందులు పడవద్దని ఇటీవల షహనాజ్‌బేగం మండలకేంద్రంలోని మంచికంటినగర్‌లో భూమి కొనుగోలు చేసి వృద్ధాశ్రమం భవన నిర్మాణానికి పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, స్థానికుల చేతుల మీదుగా శంకుస్థాపన చేయించారు.
సేవే.. సంతోషం
వృద్ధాశ్రమం నిర్వహిస్తూ.. ఏ దిక్కూ లేని అభాగ్యులైన వృద్ధులకు సేవచేయడం సంతోషంగా ఉంది. నా భర్త ఎస్‌కే.మెహరాజ్, దాతల సహకారంతో ఇబ్బందులు అధిగమించి ఆశ్రమం నిర్వహిస్తున్నా. అద్దె భవనంలో వృద్ధులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు వృద్ధాశ్రమానికి నూతన భవనం నిర్మించేందుకు శంకుస్థాపన చేయించాం. నిర్వహణకు దాతలు çకూడా సహకరించాలి.
–షహనాజ్‌బేగం, అరీఫా–రోష్ని వృద్ధాశ్రమం నిర్వాహకురాలు
Comments
Please login to add a commentAdd a comment