Aswapuram
-
అయ్యో.. రూ.75 వేల టమాటా చెత్త కుప్పల్లో...
సాక్షి,అశ్వాపురం(ఖమ్మం): అశ్వాపురానికి చెందిన ఓరుగంటి భిక్షమయ్య రెండు ఎకరాల్లో టమాటా తోట సాగు చేయగా.. ఇటీవల వర్షాలతో కాయలకు నీటి బుడగలు వచ్చి పూర్తిగా పాడయ్యాయి. దీంతో చేసేదేం లేక మంగళవారం కూలీలను పెట్టి కోయించి 200 బాక్సుల టమాటాలు చెత్త కుప్పలో పారబోయించారు. ఈ టమాటాలు మంచిగా ఉండి మార్కెట్‌కు తరలిస్తే రూ.75 వేల ఆదాయం వచ్చేదని భిక్షమయ్య వెల్లడించారు. రెండు ఎకరాల్లో సాగుకు సుమారు రూ.70 వేల వరకు ఖర్చు చేయగా.. తోటలో కాత మంచిగా ఉన్న సమయాన వర్షాలు కురిసి తీరని నష్టం వచ్చిందని వాపోయాడు. ఇంకా 100 బాక్సుల టమాటాలు పాడైపోయి ఉన్నాయని... సుమారు 100 బాక్సులు మాత్రమే మంచి టమాటా లభించే అవకాశముందని తెలిపాడు. మొత్తంగా రెండు ఎకరాల పేరిట రూ.50 వేల ఆదాయం కూడా అవకాశం లేదని... తనలాంటి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని భిక్షమయ్య కోరాడు. చదవండి: శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు కొత్త రహదారి.. రాబోయే రోజుల్లో నాలుగు వరుసలుగా.. -
మావోయిస్టుల పేరుతో బెదిరింపులు, వసూళ్లు
అశ్వాపురం: మావోయిస్టు పార్టీ పేరుతో కాంట్రాక్టర్లను, వ్యాపారులను బెదిరిస్తూ డబ్బు లు డిమాండ్ చేస్తున్న నలుగురిని అశ్వాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. అశ్వాపురం పోలీస్ స్టేషన్లో సోమవారం విలేకరుల సమావేశంలో మణుగూరు డీఎస్పీ ఆర్.సాయిబాబా తెలిపిన వివరాలు... జయశంకర్ జిల్లా తాడ్వాయి మండలం రెడ్డిగూడెం గ్రామానికి చెందిన ధర్మ సంపత్‌రెడ్డి, గజ్జల సమ్మయ్య, మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందిన తలారి సుబ్బారావు, మణుగూరు మండలం అశోక్‌నగర్‌కు చెందిన నిమ్మల శ్రీపతి కలిసి ముఠాగా ఏర్పడ్డారు. తాము మావోయిస్టులమంటూ వ్యాపారులను, కాంట్రాక్టర్లను బెదిరించి డబ్బు గుంజుతున్నా రు. అశ్వాపురంలోని టీడీపీ సెంటర్లో నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నారన్న సమాచారంతో వారిని అశ్వాపురం సీఐ అల్లం నరేందర్ ఆధ్వర్యంలో పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రెండు సెల్ఫోన్లు, రెండు సిమ్ కార్డులు, మావోయిస్టు పార్టీ పేరుతోగల లెటర్ ప్యాడ్స్ స్వాధీనపర్చుకున్నారు. వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోగల పెట్రోల్ బంక్ యజమానిని బెదిరించిన కేసులో సంపత్‌రెడ్డి, సమ్మయ్య నిందితులుగా ఉన్నారు. సంపత్రెడ్డిపై గతంలో ఏటూరునాగారం, మంచిర్యాల జిల్లాలోని జైపూర్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ నలుగురిని కోర్టుకు అప్పగించనున్నట్టు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో సీఐ అల్లం నరేందర్, సిబ్బంది పాల్గొన్నారు. -
వృద్ధురాలి హత్య
అశ్వాపురం : ఇంటి స్థలం వివాదం నేపథ్యంలో ఓ వృద్ధురాలిని ఆమె కుటుంబీకులే హత్య చేశారు. మండలంలోని మల్లెమడుగు పంచాయతీలో శుక్రవారం ఇది జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు... మల్లెమడుగు గ్రామానికి చెందిన పిల్లికల్ల సీతమ్మ(82)కు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమారుడు దశరథ్‌తో కలిసి గ్రామంలోనే ఉంటోంది. వీరి ఇంటి పక్కనే చిన్న కుమార్తె కడెం రమణ నివసిస్తోంది. సీతమ్మకు, కుమార్తె రమణకు మధ్య కొంతకాలంగా ఇంటి స్థలం విషయమై వివాదం సాగుతోంది. గురువారం ఉదయం నుంచి సాయం త్రం వరకు సీతమ్మ, ఆమె కుమార్తె రమణ, ఆమె కుమారుడు సర్వేశ్వర్రావు.. గొడవపడ్డారు. రాత్రి సీతమ్మ తన ఇంటిలో పడుకుంది. తెల్లవారేసరికి మృతిచెందింది. ఆమె తలపై తీవ్ర గాయాలున్నాయి. పెద్ద కుమార్తె నాగమ్మ గమనించి స్థానికులకు, మిగిలిన కుటుంబీకులకు తెలిపింది. సీతమ్మను ఆమె చిన్నకుమార్తె కడెం రమణ, మనవడు (రమణ కుమారుడు) సర్వేశ్వర్రావు కలిసి కొట్టి చంపారని పోలీసులు భావిస్తున్నారు. సీతమ్మను చంపుతామంటూ రమణ, అమె కుమారుడు బెదిరించినట్టు స్థానికులు చెప్పారు. హత్య ప్రదేశాన్ని సీఐ అల్లం నరేందర్, ఎస్సై రాంజీ పరిశీలించారు. మృత దేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి పంపించారు. ఆమె పెద్ద కుమార్తె నాగమ్మ ఫిర్యాదుతో సీఐ అల్లం నరేందర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
శెభాష్.. షహనాజ్
అశ్వాపురం: కనిపెంచిన తల్లిదండ్రులను అనాథలుగా వదిలేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో అనాథలు, అభాగ్యులైన వృద్ధులను చేరదీస్తూ.. మానవత్వం పంచుతూ.. పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది.. షహనాజ్‌బేగం. మండల కేంద్రమైన అశ్వాపురంలో 2011 జూన్ 27న మండల పరిధిలోని అమ్మగారిపల్లికి చెందిన షహనాజ్‌బేగం ఆమె సోదరిమణులు వహిదాబేగం, నూర్జహాన్‌బేగం, అరీఫాసుల్తానాలు కలిసి అరీఫా–రోష్ని వృద్ధాశ్రమాన్ని స్థాపించారు. ఆరు నెలలకే ఆమె సోదరిమణులు వ్యక్తిగత కారణాలతో దూరప్రాంతాలకు వెళ్లారు. అప్పటినుంచి షహనాజ్‌బేగమే వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తోంది. అభాగ్యులైన వృద్ధులకు అండగా ఉంటోంది. తమ స్వార్థం కోసమే తాము బతుకుతూ ఇతరుల కష్టాలు తమకెందుకని భావిస్తున్న ప్రస్తుత సమాజంలో వృద్ధులను తన కన్నతల్లిదండ్రులలాగా చూసుకుంటోంది. ఆమె సేవా దృక్పథాన్ని పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, స్థానికులు అభినందిస్తున్నారు. 7 సంవత్సరాలుగా వృద్ధాశ్రమం నిర్వహణ వృద్ధాశ్రమం స్థాపించినాటి నుంచి తన భర్త సహకారంతో ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొంటూ ముందుకుసాగుతోంది. మణుగూరు ఏరియా సింగరేణి అధికారులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు, పురప్రముఖలు, మండల కేంద్ర ప్రజలు, దాతల సహకారంతో వృద్ధులకు ఏడు సంవత్సరాలుగా అన్ని సౌకర్యాలూ అందిస్తోంది. ఒక్కోసారి ఖర్చులు సొంతంగా కూడా భరించాల్సి వస్తోంది. ప్రస్తుతం అరీఫా–రోష్ని వృద్ధాశ్రమంలో 18 మంది వృద్ధులు ఉన్నారు. అద్దె భవనంలో వృద్ధులు ఇబ్బందులు పడవద్దని ఇటీవల షహనాజ్‌బేగం మండలకేంద్రంలోని మంచికంటినగర్‌లో భూమి కొనుగోలు చేసి వృద్ధాశ్రమం భవన నిర్మాణానికి పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, స్థానికుల చేతుల మీదుగా శంకుస్థాపన చేయించారు. సేవే.. సంతోషం వృద్ధాశ్రమం నిర్వహిస్తూ.. ఏ దిక్కూ లేని అభాగ్యులైన వృద్ధులకు సేవచేయడం సంతోషంగా ఉంది. నా భర్త ఎస్కే.మెహరాజ్, దాతల సహకారంతో ఇబ్బందులు అధిగమించి ఆశ్రమం నిర్వహిస్తున్నా. అద్దె భవనంలో వృద్ధులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు వృద్ధాశ్రమానికి నూతన భవనం నిర్మించేందుకు శంకుస్థాపన చేయించాం. నిర్వహణకు దాతలు çకూడా సహకరించాలి. –షహనాజ్‌బేగం, అరీఫా–రోష్ని వృద్ధాశ్రమం నిర్వాహకురాలు -
డీసీఎంను ఢీకొన్న లారీ : ముగ్గురు మృతి
అశ్వాపురం: భద్రాద్రికొత్తగూడెంజిల్లా అశ్వాపురం మండలం మొండికుంట వద్ద జరిగిన ప్రమాదంలో ముగ్గురు కూలీలు మృతిచెందారు. బీఎస్ఎన్ఎల్ పైపులు దింపుతున్న డీసీఎంను మరో లారీ ఢీకొంది. ఈ సంఘటనలో పైపులు దింపుతున్న కూలీ శివరాత్రి గోపయ్య (50), డీసీఎం డ్రైవర్ భాగ్యరావు(23) అక్కడికక్కడే మృతిచెందారు. మరో పదిమందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతులు, గాయపడిన వారు గుంటూరుకు చెందిన కూలీలు. కాగా, భద్రాచలం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతిచెందాడు. -
అశ్వాపురంలో కుండపోత
17 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదు బంగాళాఖాతంలో అల్పపీడనం మరో రెండ్రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లాను ఎడతెరిపిలేని వానలు ముంచెత్తుతున్నాయి. జిల్లాలోని అశ్వాపురంలో శనివారం ఉదయం 8.30 గంటల నుంచి ఆదివారం ఉదయం 8.30 గంటల వరకు ఏకంగా 17 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అలాగే సత్తుపల్లిలో 13 సెంటీమీటర్లు, బూర్గంపాడులో 11 సెంటీమీటర్లు, భద్రాచలంలో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా సమీపంలో పశ్చిమ, వాయవ్య బంగాళాఖాతం మీదుగా ఆదివారం ఏర్పడిన అల్పపీడనంతో రుతుపవనాలు ఊపందుకోనున్నాయి. ఈ ప్రభావంతో రెండ్రోజులపాటు తెలంగాణవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. -
అశ్వాపురం అతలాకుతలం
అశ్వాపురం (ఖమ్మం జిల్లా) : అశ్వాపురంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల కారణంగా చెరువులు, కుంటలు నిండు కుండలను తలపిస్తున్నాయి. భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. అశ్వాపురం పరిసర ప్రాంతాల్లోని అన్ని వాగులు పొంగిపొర్లుతుండటంతో.. పలు గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
ఆటోడ్రైవర్‌ను చితకబాదిన ఎస్ఐ
- పోలీసు స్టేషన్ ఎదుట గ్రామస్తుల ఆందోళన అశ్వాపురం (ఖమ్మం జిల్లా) : ఓ ఆటోడ్రైవర్‌ను అమానుషంగా చితకబాదిన ఎస్ఐ తీరుకు నిరసనగా పోలీస్ స్టేషన్ ఎదుట గ్రామస్తులు ఆందోళనకు దిగిన సంఘటన అశ్వాపురంలో జరిగింది. అశ్వాపురం ఎస్ఐ దుందుడుకుగా వ్యవహరించి గొల్లగూడెంకు చెందిన ఓ ఆటో డ్రైవర్‌ను చిన్న కారణానికి అమానుషంగా చితకబాదాడు. ఎస్ఐ తీరును నిరసిస్తూ మంగళవారం పోలీస్ స్టేషన్ ఎదుటు గ్రామస్తులతోపాటు కాంగ్రెస్, సీపీఐ, టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. పోలీసు అధికారులు సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. -
గౌతమినగర్‌లో భారీ చోరీ
అశ్వాపురం : ఖమ్మం జిల్లా అశ్వాపురం మండలం గౌతమినగర్‌లో భారీ చోరీ జరిగింది. భారజల కర్మాగారంలో సైంటిఫిక్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సుందర్‌లాల్ మూడు రోజుల క్రితం తమ కుమారుడిని హైదరాబాద్‌లో దిగబెట్టి వచ్చేందుకు వెళ్లారు. శుక్రవారం సాయంత్రం ఇంటికి తిరిగి రాగా.. తలుపుల తాళాలు, లోపల బీరువా బద్దలు కొట్టి వస్తువులు చిందరవందరగా కనిపించాయి. ఇంట్లో ఉంచిన 48 తులాల బంగారు ఆభరణాలు, రూ.60వేల నగదు చోరీకి గురైనట్టు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
వ్యాన్ బోల్తా : నలుగురికి గాయాలు
అశ్వాపురం (ఖమ్మం) : అశ్వాపురం మండలం మొండికుంట వద్ద సోమవారం సాయంత్రం ఓ వ్యాన్ ప్రమాదవశాత్తూ బోల్తా కొట్టింది. ఈ ఘటనలో వ్యాన్ డ్రైవర్‌తోపాటు మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం భద్రాచలం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పినపాక మండలం నుంచి చంద్రుగుండ మండలానికి ఇంటిసామాను తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. -
అశ్వాపురంలో టీఆర్ఎస్ కార్యకర్తల వీరంగం
ఖమ్మం: తెలంగాణ బంద్ సందర్భంగా ఖమ్మం జిల్లా అశ్వాపురంలో టీఆర్ఎస్ కార్యకర్తల వీరంగం సృష్టించారు. నేడు గురు పౌర్ణమి సందర్భంగా గుడికి వెళ్లివస్తున్న భక్తుల కార్లపై దాడి చేసి, అద్దాలు ధ్వంసం చేశారు. బంద్ అయినా వాహనాలు ఎలా నడుపుతారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. విద్యా, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నాయి. -
ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడి మృతి
అశ్వాపురం, న్యూస్‌లైన్: ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రంలోని కందుల పుల్లయ్య ఫిల్లింగ్ స్టేషన్ యజమాని కందుల కృష్ణప్రణీత్(24) శుక్రవారం పెట్రోల్ బంకు నుంచి అశ్వాపురంలోని ఇంటికి ద్విచక్ర వాహనంపై వస్తున్నాడు. ఈ క్రమంలో మణుగూరు నుంచి భద్రాచలం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును క్రాస్ చేస్తుండగా ఎదురుగా లారీ వచ్చింది. దీంతో అతను వెనక్కు తగ్గుతున్న క్రమంలో పక్కనుంచి బస్సును ఢీకొన్నాడు. ఈ ఘటనలో కిందపడిన అతనికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు 108లో అతనిని గౌతమీనగర్ కాలనీలోని భారజల ఉద్యోగుల ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. కృష్ణప్రణీత్ మృతితో అతని కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగియపోయారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామంలోని ప్రముఖులు, వివిధ పార్టీల రాజకీయ నాయకులు ఆస్పత్రి వద్దకు చేరుకుని మృతదేహాన్ని సందర్శించి వారి కుటుంబానికి సానుభూతిని వ్యక్తంచేశారు.