17 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదు
బంగాళాఖాతంలో అల్పపీడనం
మరో రెండ్రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లాను ఎడతెరిపిలేని వానలు ముంచెత్తుతున్నాయి. జిల్లాలోని అశ్వాపురంలో శనివారం ఉదయం 8.30 గంటల నుంచి ఆదివారం ఉదయం 8.30 గంటల వరకు ఏకంగా 17 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
అలాగే సత్తుపల్లిలో 13 సెంటీమీటర్లు, బూర్గంపాడులో 11 సెంటీమీటర్లు, భద్రాచలంలో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా సమీపంలో పశ్చిమ, వాయవ్య బంగాళాఖాతం మీదుగా ఆదివారం ఏర్పడిన అల్పపీడనంతో రుతుపవనాలు ఊపందుకోనున్నాయి. ఈ ప్రభావంతో రెండ్రోజులపాటు తెలంగాణవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.