సాక్షి, హైదరాబాద్: బంగాళాఖాతంలో ప్రస్తుతమున్న ఉపరితల ఆవర్తనం రెండు మూడు రోజుల్లో బలపడి అల్పపీడనంగా మారనుందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. ఈ ప్రభావంతో వచ్చే మూడు రోజులపాటు రాష్ట్రంలో అక్కడక్కడ ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ డెరైక్టర్ వై.కె.రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. గురువారం ఉదయం 8.30 గంటల నుంచి శుక్రవా రం ఉదయం 8.30 గంటల వరకు రాష్ట్రంలో అనేకచోట్ల భారీ వర్షాలు కురిశాయి.
వరంగల్ జిల్లా పాలకుర్తిలో 12 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. కరీంనగర్ జిల్లా మంథనిలో 11 సె.మీ. వర్షం కురిసింది. అశ్వారావుపేట, కొణి జర్ల, గుండాలలో 7 సె.మీ. చొప్పున, బోనకల్, సుల్తానాబాద్, ఇల్లెందు, మెట్‌పల్లిల్లో 6 సె.మీ. చొప్పున, సత్తుపల్లి, పినపాక, మహబూబాబాద్, సదాశివనగర్‌లలో 5 సె.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. మరోవైపు నగరంలోని వివిధ ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు.