YK reddy
-
నైరుతి రుతుపవనాల రాక.. కాస్త ఆలస్యం
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాల రాక కాస్తంత ఆలస్యం అయ్యే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె.రెడ్డి వెల్లడించారు. కేరళలోకి గురువారం (నేడు) రుతుపవనాలు ప్రవేశిస్తాయని ఇటీవల ప్రకటించగా, ఇప్పుడు 8వ తేదీన వచ్చే అవకాశముందని ఆయన తెలిపారు. అలాగే తెలంగాణలోకి ఈ నెల 11న వస్తాయని ఇటీవల అంచనా వేయగా, ఇప్పుడు 13వ తేదీన రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశముందని ఆయన వివరించారు. అయితే ఈ తేదీలకు రెండ్రోజులు అటూ ఇటూ తేడా ఉండొచ్చని పేర్కొన్నారు. వాస్తవంగా గతేడాదితో పోలిస్తే ఈసారి రుతుపవనాలు ఆలస్యమవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం గత నెల వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఆలస్యం కావడం పట్ల రైతుల్లో ఆందోళన మొదలైంది. గతేడాది నైరుతి రుతుపవనాలు మే 29వ తేదీనే కేరళను తాకాయి. ఆ తర్వాత జూన్ 8న తెలంగాణలోకి ప్రవేశించాయి. -
బలహీనంగా రుతుపవనాలు
సాక్షి, హైదరాబాద్ : వచ్చే వారం రోజుల్లో రుతుపవనాలు బలహీనంగా ఉండే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె.రెడ్డి వెల్లడించారు. అయితే అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలను కొట్టివేయలేమని ఆయన పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్ నుంచి ఉత్తర మధ్య కర్ణాటక వరకు విదర్భ, తెలంగాణ మీదుగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి ఏర్పడిందని వాతావరణ కేంద్రం అధికారి రాజారావు వెల్లడించారు. దీని ప్రభావంతో వచ్చే మూడు రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఒక్కసారిగా వేడి పెరిగింది. శుక్రవారం హైదరాబాద్, ఖమ్మం, మెదక్లలో సాధారణం కంటే నాలుగు డిగ్రీలు అధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్, ఖమ్మం, నల్లగొండ, భద్రాచలం, రామగుండంలో 39 డిగ్రీల చొప్పున పగటి ఉష్ణోగ్రతలు నమోదు కాగా, హన్మకొండ, హైదరాబాద్, మెదక్లలో 38 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. -
ఉరిమిన మేఘం
►రాష్ట్రంలో మళ్లీ భారీ వర్షాలు... ► మెదక్ జిల్లా న్యాల్కల్లో 22 సెం.మీ. కుండపోత ► ఝరాసంగం, జుక్కల్లో 20 సెం.మీ.ల వర్షం ► మెదక్, నిజామాబాద్లో పొంగుతున్న వాగులు, వంకలు ► నిజామాబాద్ జిల్లా కారేగామ్లో వాగులో కొట్టుకుపోయి తల్లి, ఐదుగురు పిల్లల మృతి ► మెదక్లో జహీరాబాద్, నారాయణఖేడ్ నియోజకవర్గాలు అతలాకుతలం ► నేడు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం సాక్షి, హైదరాబాద్/నిజామాబాద్/సంగారెడ్డి: మేఘం మళ్లీ ఉరిమింది. కుండపోత కురిసింది. మెదక్, నిజామాబాద్ జిల్లాలో శనివారం కుంభవృష్టి కురిసింది. మెదక్ జిల్లా న్యాల్కల్లో 22.4 సెం.మీ, ఝరాసంగంలో 20 సెం.మీ, నిజామాబాద్ జిల్లా జుక్కల్లో 20 సెం.మీ. వర్షం కురిసింది. పలుచోట్ల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. రహదారులు దెబ్బతిన్నాయి. రాకపోకలు స్తంభించాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం కూడా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇప్పటికే కురిసిన భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోయాయి. వాగులు, వంకలు పొంగుతున్నాయి. వాగులో ఓ కారు కొట్టుకుపోయి శనివారం నిజామాబాద్ జిల్లా పిట్లం మండలం కారేగామ్లో తల్లి, ఆమె ఐదుగురు బిడ్డలు జలసమాధి అయ్యారు. పలుచోట్ల పంటలు దెబ్బతిన్నాయి. నైరుతి రుతుపవనాలు మరోవారం వరకు విస్తరించడంతో రాష్ట్రంలో ఈ నెల 10 వరకు అక్కడక్కడ వర్షాలు కురుస్తూనే ఉంటాయని అధికారులు చెబుతున్నారు. లానినా ట్రెండ్ మొదలైనా ఇంకా బలపడలేదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె.రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. నిజామాబాద్లో కుండపోత మొన్నటిదాకా నిజామాబాద్ జిల్లాను అతలాకుతలం చేసి.. తగ్గుముఖం పట్టిన వర్షం మళ్లీ తన ప్రతాపం చూపింది. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు జుక్కల్ మండలంలో అత్యధికంగా 20 సెంటీమీటర్ల వర్షం కురిసింది. దీంతో చెరువులు, కుంటలు మరోసారి పొంగాయి. మిగతా మండలాల్లోనూ 6 సెం.మీ. మేర వర్షం పడింది. జిల్లాలోని పోచారం ప్రాజెక్టు నుంచి 1,020 క్యూసెక్కుల నీటిని వదలగా.. అంతే నీరు వచ్చి చేరుతోంది. కౌలాస్నాలా ప్రాజెక్టు ద్వారా 25 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. నిజాంసాగర్ మండలం నల్లవాగు మత్తడికి సుమారు 50 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. అలుగు పారి వరదనీరు నాందేడ్- సంగారెడ్డి జాతీయ రహదారి16పై నుంచి ప్రవహించింది. మత్తడికి దిగువన ఉన్న రహదారి కొట్టుకుపోయింది. సంగారెడ్డి, నాందేడ్, హైదరాబాద్ ప్రధాన రహదారిపై రాకపోకలు స్తంభించాయి. కౌలాస్నాలా గేట్లు ఎత్తివేయడంతో దేవాడ వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. రోడ్డుపై నుంచి 20 అడుగుల ఎత్తు వరకు నీరు ప్రవహిస్తోంది. సింగూరుకు లక్ష క్యూసెక్కుల వరద మెదక్ జిల్లాలో రెండున్నర గంటలపాటు కుంభవృష్టి కురిసింది. జహీరాబాద్, నారాయణఖేడ్ నియోజకవర్గాలు అతలాకుతలం అయ్యాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేవలం లోకల్ క్యాచ్మెంట్ ఏరియా నుంచే 1.20 లక్షల క్యుసెక్కుల వరద సింగూరుకు వచ్చి చేరాయి. దీంతో అధికారులు ఒకేసారి 9 గేట్లు ఎత్తి 1.20 లక్షల క్యూసెక్కుల నీటిని బయటకు వదులుతున్నారు. జహీరాబాద్ సమీపంలోని నారింజ ప్రాజెక్టులోకి వరద నీరు పోటెత్తింది. ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తి నీటిని కిందకు వదిలారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రాజెక్టు మీదుగా రాకపోకలను నిలిపివేశారు. ఝరాసంగం మండలంలోని ప్రఖ్యాత కేతకీ సంగమేశ్వర ఆలయంలోకి వరద నీరు వచ్చి చేరింది. గర్భగుడి సైతం నీటితో నిండిపోయింది. ఆలయం ముఖద్వారం ఎదుట ఉన్న దుకాణాలు నీటిలో కొట్టుకు పోయాయి. నారాయణఖేడ్ మండలం తుర్కాపల్లి శివారులోని పెద్దమ్మకుంటలో నలుగురు ఈతకు వెళ్లగా.. పుండరీకం(14) అనే వ్యక్తి గల్లంతయ్యాడు. సిర్గాపూర్-నారాయణఖేడ్ రూట్లో వంతెనపై నుంచి నీరు పారుతోంది. కంగ్టి మండలంలో సాగులో ఉన్న పంటలన్నీ నీటమునిగాయి. 8 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. కాపాడిన దసరా సెలవులు దసరా సెలవులు మెదక్ జిల్లా మునిపల్లి మండలం తాట్పల్లి కేజీబీవీ విద్యార్థుల ప్రాణాలు కాపాడాయి. విద్యార్థులు సెలవులకు వెళ్లిన మరుసటి రోజే డబ్బా వాగు పొంగి స్కూలును ముంచెత్తింది. స్కూలు ప్రహరీ గోడ కూలింది. వరదకు స్కూల్లోని కుర్చీలు, బెంచీలు, విద్యార్థుల పుస్తకాలు కొట్టుకుపోయాయి. మరోవైపు నారాయణఖేడ్ మండలం కొండాపూర్ హనుమాన్ మందిర్ తండా శివారులోని వాగులో ఓ బాలుడు కొట్టుకుపోతుండగా యువకులు కాపాడారు. -
లానినా ట్రెండ్ మొదలైంది
- ఈ నెలలో తరచుగా వర్షపాతం నమోదయ్యే అవకాశం - ‘సాక్షి’తో హైదరాబాద్ వాతావరణ కేంద్రం డెరైక్టర్ వైకే రెడ్డి సాక్షి, హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రుతుపవనాలు మళ్లీ ఊపందుకున్నాయి. దీంతో రాష్ట్రంలో మూడు, నాలు గు రోజులుగా అనేకచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెలలో తరచుగా వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు అంచ నా వేస్తున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం డెరైక్టర్-ఇన్చార్జి వైకే రెడ్డి ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. సాక్షి: ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి? వైకే రెడ్డి: పశ్చిమ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అదిప్పుడు భూమిపైకి ఉత్తర దిశగా కదిలింది. అలాగే నైరుతి రుతుపవనాలు ఊపందుకున్నాయి. మరోవైపు అరేబియా సముద్రంలోని గాలులు, బంగాళాఖాతంలోని గాలులు విలీనమై తేమ చొచ్చుకుని రావడం తదితర కారణాల వల్ల ప్రస్తుతం రాష్ట్రంలో కుండపోత, భారీ వర్షాలు నమోదవుతున్నాయి. హైదరాబాద్లో ఇంతటి వర్షం చివరిసారిగా ఎప్పుడు నమోదైంది? వైకే రెడ్డి: నగరంలో ఈ సీజన్లో ఇంతటి భారీ వర్షపాతం ఇప్పుడే నమోదైంది. 2000 ఆగస్టు 24న అత్యధికంగా 24 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఆ తర్వాత 2009లో 13 సెంటీమీటర్లు నమోదైంది. ఆ తర్వాత ఏడేళ్లకు ఇప్పుడు నగరంలో రెండు చోట్ల 12 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. ప్రస్తుత వర్షాలతో పంటలకు ఏమేరకు ఉపయోగం? వైకే రెడ్డి: ప్రస్తుత వర్షాలు పంటలకు ఉపయోగమే. అనేకచోట్ల పంటలు ఎండిపోయే పరిస్థితుల్లో ఈ వర్షాలు వాటికి ప్రాణం పోస్తాయి. ఇంకా వారం, పది రోజులు వర్షాలు పడకున్నా వర్షాభావ పంటలకు నష్టంలేదు. ఎల్నినో పోయిందన్నారు... మరి లానినా ఏర్పడిందా? లేదా? వైకే రెడ్డి: ఎల్నినో వెళ్లిపోయింది కానీ.. లానినా ఇంకా ఏర్పడలేదు. ప్రస్తుతం తటస్థస్థితి కొనసాగుతోంది. అయితే లానినా ట్రెండ్ మాత్రం మొదలైంది. ఈ నెలాఖరు నాటికి అది బలపడే అవకాశాలున్నాయి. లానినా బలపడినా లేకపోయినా సెప్టెంబర్లో వర్షాలు సాధారణంగా కురుస్తాయి. ఈ నెలలో కొన్ని రోజులు వర్షాలు కురుస్తాయి... కొన్ని రోజులు సాధారణ స్థితి ఉంటుంది. -
నెలాఖరు వరకు మోస్తరు వర్షాలే!
- పలుచోట్ల గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం - వచ్చే నెల నుంచి బలపడనున్న రుతుపవనాలు సాక్షి, హైదరాబాద్/ విశాఖపట్నం: నైరుతి రుతుపవనాలు బలహీనపడటంతో రాష్ట్రంలో ఈ నెలాఖరు వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలే కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డెరైక్టర్ వై.కె.రెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. దీంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతాయన్నారు. ఫలితంగా పలుచోట్ల గాలులతో కూడిన వానలు, ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. వచ్చే నెల నుంచి మళ్లీ రుతుపవనాలు పుంజుకుంటాయని, దీంతో మళ్లీ విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. సెప్టెంబర్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందన్నారు. తమ అంచనా ప్రకారం ఈసారి సీజన్ ఆశాజనకంగానే ఉందని చెప్పారు. రుతుపవనాలు ప్రస్తుతం ఉత్తర భారతం వైపు వెళ్లాయని, అది సాధారణంగా సీజన్లో జరిగే ప్రక్రియేనన్నారు. కాగా, రాష్ట్రంలో గత 24 గంటల్లో హన్మకొండలో అత్యధికంగా 38 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. అక్కడ సాధారణం కంటే 5 డిగ్రీలు అధికంగా నమోదైంది. హైదరాబాద్, రామగుండంలలో సాధారణం కంటే 2 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణలో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ విభాగం తెలిపింది. ప్రస్తుతం పంజాబ్ నుంచి ఈశాన్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి చురుగ్గా ఉందని పేర్కొంది. -
మూడు రోజులపాటు భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: బంగాళాఖాతంలో ప్రస్తుతమున్న ఉపరితల ఆవర్తనం రెండు మూడు రోజుల్లో బలపడి అల్పపీడనంగా మారనుందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. ఈ ప్రభావంతో వచ్చే మూడు రోజులపాటు రాష్ట్రంలో అక్కడక్కడ ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ డెరైక్టర్ వై.కె.రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. గురువారం ఉదయం 8.30 గంటల నుంచి శుక్రవా రం ఉదయం 8.30 గంటల వరకు రాష్ట్రంలో అనేకచోట్ల భారీ వర్షాలు కురిశాయి. వరంగల్ జిల్లా పాలకుర్తిలో 12 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. కరీంనగర్ జిల్లా మంథనిలో 11 సె.మీ. వర్షం కురిసింది. అశ్వారావుపేట, కొణి జర్ల, గుండాలలో 7 సె.మీ. చొప్పున, బోనకల్, సుల్తానాబాద్, ఇల్లెందు, మెట్పల్లిల్లో 6 సె.మీ. చొప్పున, సత్తుపల్లి, పినపాక, మహబూబాబాద్, సదాశివనగర్లలో 5 సె.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. మరోవైపు నగరంలోని వివిధ ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు.