ఉరిమిన మేఘం | Heavy rains in state, medak district more effected by rains | Sakshi
Sakshi News home page

ఉరిమిన మేఘం

Published Sun, Oct 2 2016 3:13 AM | Last Updated on Mon, Sep 4 2017 3:48 PM

Heavy rains in state, medak district more effected by rains

రాష్ట్రంలో మళ్లీ భారీ వర్షాలు...
మెదక్ జిల్లా న్యాల్‌కల్‌లో 22 సెం.మీ. కుండపోత
ఝరాసంగం, జుక్కల్‌లో 20 సెం.మీ.ల వర్షం
మెదక్, నిజామాబాద్‌లో పొంగుతున్న వాగులు, వంకలు
నిజామాబాద్ జిల్లా కారేగామ్‌లో వాగులో కొట్టుకుపోయి తల్లి, ఐదుగురు పిల్లల మృతి
మెదక్‌లో జహీరాబాద్, నారాయణఖేడ్ నియోజకవర్గాలు అతలాకుతలం
నేడు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం


సాక్షి, హైదరాబాద్/నిజామాబాద్/సంగారెడ్డి: మేఘం మళ్లీ ఉరిమింది. కుండపోత కురిసింది. మెదక్, నిజామాబాద్ జిల్లాలో శనివారం కుంభవృష్టి కురిసింది. మెదక్ జిల్లా న్యాల్‌కల్‌లో 22.4 సెం.మీ, ఝరాసంగంలో 20 సెం.మీ, నిజామాబాద్ జిల్లా జుక్కల్‌లో 20 సెం.మీ. వర్షం కురిసింది. పలుచోట్ల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. రహదారులు దెబ్బతిన్నాయి. రాకపోకలు స్తంభించాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఆదివారం కూడా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇప్పటికే కురిసిన భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోయాయి. వాగులు, వంకలు పొంగుతున్నాయి. వాగులో ఓ కారు కొట్టుకుపోయి శనివారం నిజామాబాద్ జిల్లా పిట్లం మండలం కారేగామ్‌లో తల్లి, ఆమె ఐదుగురు బిడ్డలు జలసమాధి అయ్యారు. పలుచోట్ల పంటలు దెబ్బతిన్నాయి. నైరుతి రుతుపవనాలు మరోవారం వరకు విస్తరించడంతో రాష్ట్రంలో ఈ నెల 10 వరకు అక్కడక్కడ వర్షాలు కురుస్తూనే ఉంటాయని అధికారులు చెబుతున్నారు. లానినా ట్రెండ్ మొదలైనా ఇంకా బలపడలేదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె.రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.
 
నిజామాబాద్‌లో కుండపోత
మొన్నటిదాకా నిజామాబాద్ జిల్లాను అతలాకుతలం చేసి.. తగ్గుముఖం పట్టిన వర్షం మళ్లీ తన ప్రతాపం చూపింది. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు జుక్కల్ మండలంలో అత్యధికంగా 20 సెంటీమీటర్ల వర్షం కురిసింది. దీంతో చెరువులు, కుంటలు మరోసారి పొంగాయి. మిగతా మండలాల్లోనూ 6 సెం.మీ. మేర వర్షం పడింది. జిల్లాలోని పోచారం ప్రాజెక్టు నుంచి 1,020 క్యూసెక్కుల నీటిని వదలగా.. అంతే నీరు వచ్చి చేరుతోంది.

కౌలాస్‌నాలా ప్రాజెక్టు ద్వారా 25 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. నిజాంసాగర్ మండలం నల్లవాగు మత్తడికి సుమారు 50 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. అలుగు పారి వరదనీరు నాందేడ్- సంగారెడ్డి జాతీయ రహదారి16పై నుంచి ప్రవహించింది. మత్తడికి దిగువన ఉన్న రహదారి కొట్టుకుపోయింది. సంగారెడ్డి, నాందేడ్, హైదరాబాద్ ప్రధాన రహదారిపై రాకపోకలు స్తంభించాయి. కౌలాస్‌నాలా గేట్లు ఎత్తివేయడంతో దేవాడ వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. రోడ్డుపై నుంచి 20 అడుగుల ఎత్తు వరకు నీరు ప్రవహిస్తోంది.
 
 సింగూరుకు లక్ష క్యూసెక్కుల వరద
మెదక్ జిల్లాలో రెండున్నర గంటలపాటు కుంభవృష్టి కురిసింది. జహీరాబాద్, నారాయణఖేడ్ నియోజకవర్గాలు అతలాకుతలం అయ్యాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేవలం లోకల్ క్యాచ్‌మెంట్ ఏరియా నుంచే 1.20 లక్షల క్యుసెక్కుల వరద సింగూరుకు వచ్చి చేరాయి. దీంతో అధికారులు ఒకేసారి 9 గేట్లు ఎత్తి 1.20 లక్షల క్యూసెక్కుల నీటిని బయటకు వదులుతున్నారు. జహీరాబాద్ సమీపంలోని నారింజ ప్రాజెక్టులోకి వరద నీరు పోటెత్తింది. ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తి నీటిని కిందకు వదిలారు.
 
ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రాజెక్టు మీదుగా రాకపోకలను నిలిపివేశారు. ఝరాసంగం మండలంలోని ప్రఖ్యాత కేతకీ సంగమేశ్వర ఆలయంలోకి వరద నీరు వచ్చి చేరింది. గర్భగుడి సైతం నీటితో నిండిపోయింది. ఆలయం ముఖద్వారం ఎదుట ఉన్న దుకాణాలు నీటిలో కొట్టుకు పోయాయి. నారాయణఖేడ్ మండలం తుర్కాపల్లి శివారులోని పెద్దమ్మకుంటలో నలుగురు ఈతకు వెళ్లగా.. పుండరీకం(14) అనే వ్యక్తి గల్లంతయ్యాడు. సిర్గాపూర్-నారాయణఖేడ్ రూట్లో వంతెనపై నుంచి నీరు పారుతోంది. కంగ్టి మండలంలో సాగులో ఉన్న పంటలన్నీ నీటమునిగాయి. 8 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.
 
కాపాడిన దసరా సెలవులు
దసరా సెలవులు మెదక్ జిల్లా మునిపల్లి మండలం తాట్‌పల్లి కేజీబీవీ విద్యార్థుల ప్రాణాలు కాపాడాయి. విద్యార్థులు సెలవులకు వెళ్లిన మరుసటి రోజే డబ్బా వాగు పొంగి స్కూలును ముంచెత్తింది. స్కూలు ప్రహరీ గోడ కూలింది. వరదకు స్కూల్‌లోని కుర్చీలు, బెంచీలు, విద్యార్థుల పుస్తకాలు కొట్టుకుపోయాయి. మరోవైపు నారాయణఖేడ్ మండలం కొండాపూర్ హనుమాన్  మందిర్ తండా శివారులోని వాగులో ఓ బాలుడు కొట్టుకుపోతుండగా యువకులు కాపాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement