సాక్షి, అమరావతి/పోలవరం రూరల్/ధవళేశ్వరం: పరీవాహక ప్రాంతం (బేసిన్)లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటం, ఉప నదులు ఉప్పొంగుతుండటంతో గోదావరిలో వరద ఉద్ధృతి పెరుగుతోంది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు భద్రాచలం వద్ద ప్రవాహం 7,59,015 క్యూసెక్కులకు పెరిగింది. దాంతో నీటి మట్టం 38.9 అడుగులకు చేరింది. పోలవరం ప్రాజెక్టు వద్దకు ఎగువ నుంచి వచ్చిన వరదను వచ్చినట్టుగా 48 గేట్ల ద్వారా అధికారులు దిగువకు వదిలేస్తున్నారు. పోలవరం నుంచి 7,62,000 క్యూసెక్కుల నీరు దిగువకు వెళుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్‌లోకి 6,86,660 క్యూసెక్కులు చేరుతుండగా.. నీటి మట్టం 9.40 అడుగులకు చేరింది.
గోదావరి డెల్టాకు 9,900 క్యూసెక్కులను వదులుతూ మిగులుగా ఉన్న 6,76,760 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఎగువన వరద పెరిగిన నేపథ్యంలో బుధవారం ధవళేశ్వరం బ్యారేజ్‌కి చేరే ప్రవాహం పెరగనుంది. గోదావరిలో ఎగువన తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజ్‌లోకి 5,79,730 క్యూసెక్కులు, తుపాకులగూడెం వద్ద ఉన్న సమ్మక్క బ్యారేజ్‌లోకి 7.55 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావం వల్ల బుధవారం, గురువారం బేసిన్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో గోదావరిలో వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment