ఓల్డేజ్ హోం ముసుగులో...
ఓల్డేజ్ హోం ముసుగులో...
Published Sat, Nov 26 2016 10:30 AM | Last Updated on Mon, Oct 22 2018 2:02 PM
పశ్చిమబెంగాల్‌లో పిల్లల స్మగ్లింగ్ చాలా ఎక్కువగా ఉంది. కోల్‌కతాకు ఉత్తరంగా ఉన్న బదూరియా ప్రాంతంలోని ఓ నర్సింగ్‌హోంలో బిస్కట్ల బాక్సులో ముగ్గురు పిల్లలను పెట్టి స్మగ్లింగ్ చేసిన వ్యవహారం దేశాన్ని కుదిపేస్తే.. తాజాగా అదే నగరంలో 10 మంది ఆడ శిశువులను ఒక ఓల్డేజ్ హోంలో దాచిపెట్టిన వైనాన్ని పోలీసులు బయటపెట్టారు. వాళ్లందరినీ రక్షించారు. ఇది కోల్‌కతాకు దక్షిణంగా ఉన్న ఠాకూర్‌పుకూర్ ప్రాంతంలో జరిగింది. శుక్రవారం నాడు సాయంత్రం సమయంలో అందిన సమాచారంతో పూర్బాశ అనే ఓ ఓల్డేజి హోం మీద పోలీసులు దాడి చేశారు. అందులో 23 మంది వృద్ధులు ఉంటారు. భవనం పై అంతస్థులో మొత్తం 10 మంది శిశువులు ఉన్నారు. వాళ్లంతా ఒకటి నుంచి పది నెలల లోపు వయసున్నవాళ్లే, అందరూ ఆడపిల్లలే. భవనంలో పైభాగాన్ని భవన యజమాని అద్దెకు ఇచ్చారు. అతడిని కూడా పోలీసులు విచారిస్తున్నారు.
పిల్లల స్మగ్లింగ్ రాకెట్‌లో ఓ స్వచ్ఛంద సంస్థది ప్రధాన పాత్ర అని తెలుస్తోంది. ఆ సంస్థ కార్యాలయం వెనకాల ఉన్న మైదానంలో ఇద్దరు శిశువుల మృతదేహాలను పూడ్చిపెట్టి ఉంచడాన్ని కూడా పోలీసులు కనుగొన్నారు. ఈ రెండు ఘటనలకు మధ్య కోల్‌కతా నగరంలో రెండు నర్సింగ్‌హోంలపై పోలీసులు దాడులు చేశారు. కాలేజి స్ట్రీట్‌లో ఉన్న ఓ నర్సింగ్‌హోంలో సీఐడీ విభాగం అధికారులు 200 అమెరికా డాలర్లు, 2000 హాంకాంగ్ డాలర్లు, 1200 యూరోలు, 15 వేల రూపీలు, కొంత బంగారం కనుగొన్నారు. ఇప్పటివరకు ఈ స్కాంలో 15 మందిని అరెస్టు చేశామని వాళ్లలో కొందరు ఇప్పటివరకు తాము కనుగొన్న నాలుగు కేసుల్లోనూ నిందితులుగా ఉన్నారని సీఐడీ అదనపు డీజీ రాజేష్ కుమార్ తెలిపారు. ఈ స్మగ్లింగ్ నెట్‌వర్క్ మొత్తాన్ని ఛేదించే పనిలో ఉన్నామని ఆయన అన్నారు.
పిల్లలందరినీ ఈనెల పదో తేదీన ఇక్కడకు తీసుకొచ్చారని ఆశ్రమంలో వృద్ధులకు నర్సుగా వ్యవహరిస్తున్న ఓ మహిళ చెప్పారు. అయితే.. వాళ్లను ఎందుకు తీసుకొచ్చారో మాత్రం తెలియదని అన్నారు. బదురియా ఘటనలో అరెస్టయిన వారిని విచారించినప్పుడు కాలేజి స్ట్రీట్ నర్సింగ్ హోం గురించి సమాచారం వచ్చిందని.. అక్కడివారిని విచారిస్తే ఈ ఓల్డేజి హోం గురించిన సమాచారం తెలిసిందని రాజేష్ కుమార్ చెప్పారు. కొందరు అవివాహిత మహిళలకు డబ్బు ఆశ చూపించి పిల్లలను కన్న తర్వాత వాళ్లను వదిలేసి వెళ్లిపొమ్మంటున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే, ఆస్పత్రులలో శిశువులను కన్న మహిళలకు.. వారి పిల్లలు చనిపోయారని చెప్పి, అప్పటికే తమ వద్ద ఉన్న మృత శిశువులను చూపిస్తున్నారు. వాళ్ల పిల్లలను కూడా ఎత్తుకొచ్చి స్మగ్లింగ్ చేస్తున్నారు.
Advertisement
Advertisement