Female infants
-
కాసులకు కక్కుర్తిపడి కడుపులోనే కరిగిస్తున్నారు!
సాక్షి ప్రతినిధి, వరంగల్: కాసులకు కక్కుర్తిపడుతున్న కొందరు ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు, వైద్య సిబ్బంది లింగనిర్ధారణ పరీక్షలు చేస్తూ కడుపులోని బిడ్డను కరిగించేస్తున్నారు. ఆడపిల్లలు వద్దనుకునే వారి బలహీనతను ఆసరాగా చేసుకొని లింగనిర్ధారణ పరీక్షల పేరుతో విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నారు. రెండేళ్ల కిందట హైదరాబాద్‌కు చెందిన వైద్యాధికారులు బృందాలుగా ఏర్పడి ఉమ్మడి వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్న ఆస్పత్రులు, సెంటర్లపై పోలీసులతో కలిసి డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. దీంతో కొంతకాలం దందాకు అడ్డుకట్టపడింది. అనంతరం మళ్లీ ఈ దందా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో సాగుతోంది. దీనిని అరికట్టకపోతే 2031 జనాభా లెక్కల నాటికి అడపిల్లల సంఖ్య గణనీయంగా పడిపోయే ప్రమాదం ఉందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఆందోళన కలిగిస్తున్న గణాంకాలు గర్భస్థ లింగ నిర్ధారణ నేరం అని అన్ని స్కానింగ్ కేంద్రాల్లో, ఆస్పత్రుల్లో బోర్డు కనిపిస్తుంది. కానీ ఆయా కేంద్రాల నిర్వాహకులు, వైద్యులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పవిత్రమైన వైద్య వృత్తికే కళంకం తెస్తున్నారు. వైద్యారోగ్యశాఖ అధికారుల పర్యవేక్షణలోపంతో ఆడశిశువులు భ్రూణహత్యకు గురవుతున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 3,50,03,674. 2011లో దేశంలోని మొత్తం జనాభాలో 2.89 శాతం. జాతీయ జనాభా కమిషన్, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ గణాంకాల ప్రకారం 2021లో తెలంగాణ జనాభా 3,77,25,000 కాగా, 2031 నాటికి 3,92,07,000కు చేరుకోగలదని అంచనా. ఇవి 2021, 2031 సంవత్సరాల్లో వరుసగా దేశ జనాభాలో 2.77 శాతం, 2.66 శాతం. 2011 గణాంకాల ప్రకారం రాష్ట్రంలో లింగ నిష్పత్తి (ప్రతి వెయ్యిమంది పురుషులకు మహిళల సంఖ్య) 988 కాగా, వివిధ జిల్లాల్లో ఇది 950 నుంచి 1046 వరకు నమోదైంది. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు తప్పవు పోలీసు శాఖ సహకారంతో స్కానింగ్ సెంటర్లపై డెకాయ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాం. సంబంధిత చట్టంపై ఆరోగ్య సిబ్బంది ద్వారా గర్భిణులకు అవగాహన కల్పిస్తాం. మొదట ఆడ సంతానం కలిగి ఉండి తిరిగి గర్భం దాల్చిన వారిపై ప్రత్యేక దృష్టి పెడతాం. స్వచ్ఛంద సంస్థలు ఐసీడీఎస్, మెప్మాతో కలిసి స్కానింగ్ కేంద్రాలపై నిఘా పెంచుతాం. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే 104 లేదా 1098 లేదా డయల్ 100కు సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటాం. –డాక్టర్ సాంబశివరావు,డీఎంహెచ్ఓ, హనుమకొండ బేటీ బచావో బేటీ పఢావోతో అవగాహన బాలురకు దీటుగా బాలికల సంఖ్యను పెంచేందుకు బేటీ బచావో బేటీ పఢావో కార్యక్రమం ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. అవకతవకలకు పాల్పడే స్కానింగ్ సెంటర్ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటున్నాం. –సంతోష్, జిల్లా బాలల పరిరక్షణ అధికారి -
వెయ్యి మందికి 881 మంది ఆడ శిశువులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మగ, ఆడ శిశువుల నిష్పత్తి జాతీయ సగటు కంటే కాస్తంత మెరుగ్గా ఉంది. పుట్టుక సందర్భంగా జరిగే రిజిస్ట్రేషన్ల ఆధారంగా లింగ నిష్పత్తిని 2016లో లెక్కగట్టిన కేంద్రం ఆ లెక్కలను తాజాగా విడుదల చేసింది. పుడుతున్న వారిలో జాతీ య సగటులో 1,000 మంది మగ శిశువులు ఉంటే, 877 మంది ఆడ శిశువులు ఉన్నారు. తెలంగాణలో మాత్రం ఆడ శిశువులు 881 మంది పుట్టారని కేంద్రం తన నివేదికలో తెలిపింది. ఈ విషయంలో ఏపీ చివరన ఉంది. ఏపీలో 1,000 మంది మగ శిశువులకు 806 మంది, రాజస్తాన్‌లోనూ 806 మంది ఆడ శిశువులే ఉన్నారు. అన్ని రాష్ట్రాల్లో కంటే ఏపీ, రాజస్తాన్‌లు లింగ నిష్పత్తిలో భారీ తేడాతో చివరిస్థానంలో ఉన్నాయి. తెలంగాణలో హెచ్చుతగ్గులు కనిపించాయి. 2015లో జాతీయ సగటు 1,000 మంది మగ శిశువులకు 881 మంది ఆడ శిశువులు పుట్టగా, తెలంగాణలో 834 మంది మాత్రమే. 2016లో తెలంగాణలో 881కు చేరింది. ఏపీలో ఈ సగటు దారుణంగా పడిపోయింది. 2015లో 1,000 మంది మగ శిశువులకు 971 మంది ఆడ శిశువులు పుడితే ఇప్పుడు 806కు పడిపోయింది. తమిళనాడు జాతీయ సగటు కంటే దారుణంగా ఉంది. కరీంనగర్ జిల్లాలో 713 మందే.. కరీంనగర్ జిల్లాలో 2014లో 1,000 మంది మగ శిశువులకు ఏకంగా 1080 ఆడ శిశువులు ఉన్నారు. 2015లో 959 మంది ఆడ శిశువులు పుడితే, 2016లో అదికాస్తా దారుణంగా 713 మందికి పడిపోయింది. నల్లగొండ జిల్లాలో 2014లో 1,000 మంది మగ శిశువులకు 1060 మంది ఆడ శిశువులు పుడితే, 2015లో 959 మంది ఉండగా, 2016లో దారుణంగా 773కు పడిపోయింది. హైదరాబాద్, మెదక్ జిల్లాల్లో మాత్రం ఇతర జిల్లాల కంటే మెరుగైన పరిస్థితి ఉంది. ఇప్పటికీ కడుపులో ఆడ పిల్ల ఉన్నట్లు గుర్తించి భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారా అన్న అనుమానాలు ఉన్నాయి. ప్రధానంగా ప్రైవేటు ఆస్పత్రులు అనైతిక చర్యలకు పాల్పడుతుండటంతో అబార్షన్లు పెరుగుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అయితే తెలంగాణలో ఇప్పుడు ఆ పరిస్థితి మారుతుందని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ ఏర్పడ్డాక ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలు లింగ నిష్పత్తిలో భారీ తేడా లేకుండా చేశాయంటున్నారు. గతంలో ప్రైవేటు ఆస్పత్రుల్లోనే ప్రసవాలు అధికంగా జరిగేవి. తర్వాత ప్రభుత్వం సర్కారు దవాఖానాల్లో ప్రత్యేక వసతులు కల్పించింది. దీంతో 2015–16లోనే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల శాతం 30 నుంచి 41 శాతానికి చేరుకున్నాయని చెబుతున్నారు. దీనివల్ల 2016 తర్వాత పరిస్థితి మెరుగుపడిందని చెబుతున్నారు. పథకాలతో మార్పు.. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి పథకాల వల్ల ఆడ శిశువును కోల్పోవడానికి ఎవరూ సిద్ధపడటం లేదు. కల్యాణలక్ష్మి ద్వారా ఆడ బిడ్డ పుడితే పెళ్లి ఖర్చు కోసం రూ.లక్ష నూటా పదహార్లు ఇస్తున్నారు. ఇది ఆడ పిల్లల తల్లిదండ్రుల్లో ఆత్మస్థైర్యం నింపింది. కేసీఆర్ కిట్ పథకం ద్వారా ప్రభుత్వం ప్రోత్సాహకం కింద మగ బిడ్డ పుడితే రూ.12 వేలు, ఆడ పిల్ల పుడితే రూ.13 వేలు ప్రోత్సాహకం ఇస్తోంది. దీంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరిగాయని వైద్య ఆరోగ్యశాఖ మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అభిప్రాయపడ్డారు. జనన ధ్రువీకరణ సులభతరం మున్సిపాలిటీలు, గ్రామాల్లో జనన ధ్రువీకరణ ఇప్పటికీ ఒక ప్రహసనంగా మారింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో దాన్ని నమోదు చేసుకోవడం, పొందడం గగనంగా మారింది. ఇప్పు డు ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ పొందే వీలు కల్పించినా అది పూర్తిస్థాయిలో అమలు కావడం లేదన్న చర్చ జరుగుతోంది. కొన్ని సందర్భాల్లో పుట్టిన పిల్లల నమోదు పూర్తిస్థాయిలో ఉండటం లేదన్న విమర్శలున్నాయి. దీంతో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రులే సంబంధిత వెబ్సైట్ లో వివరాలను నమోదు చేయడం ద్వారా జనన ధ్రువీకరణ పొందవచ్చని అధికారులు చెబుతున్నారు. ‘వెబ్సైట్లోకి వెళ్లి శిశువు వివరాలు నమోదు చేయాలి. ఆ తర్వాత దాన్ని ప్రింట్‌గా తీసుకుని ధ్రువీకరణ పత్రంగా వాడుకోవచ్చు. అయితే ఒక శిశువు పేరుతో మరొకటి తీసుకోవడానికి వెబ్సైట్ అంగీకరించదు’అని ఆరోగ్య కుటుంబ సంక్షేమ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు ‘సాక్షి’కి తెలిపారు. -
ఓల్డేజ్ హోం ముసుగులో...
పశ్చిమబెంగాల్లో పిల్లల స్మగ్లింగ్ చాలా ఎక్కువగా ఉంది. కోల్‌కతాకు ఉత్తరంగా ఉన్న బదూరియా ప్రాంతంలోని ఓ నర్సింగ్‌హోంలో బిస్కట్ల బాక్సులో ముగ్గురు పిల్లలను పెట్టి స్మగ్లింగ్ చేసిన వ్యవహారం దేశాన్ని కుదిపేస్తే.. తాజాగా అదే నగరంలో 10 మంది ఆడ శిశువులను ఒక ఓల్డేజ్ హోంలో దాచిపెట్టిన వైనాన్ని పోలీసులు బయటపెట్టారు. వాళ్లందరినీ రక్షించారు. ఇది కోల్‌కతాకు దక్షిణంగా ఉన్న ఠాకూర్పుకూర్ ప్రాంతంలో జరిగింది. శుక్రవారం నాడు సాయంత్రం సమయంలో అందిన సమాచారంతో పూర్బాశ అనే ఓ ఓల్డేజి హోం మీద పోలీసులు దాడి చేశారు. అందులో 23 మంది వృద్ధులు ఉంటారు. భవనం పై అంతస్థులో మొత్తం 10 మంది శిశువులు ఉన్నారు. వాళ్లంతా ఒకటి నుంచి పది నెలల లోపు వయసున్నవాళ్లే, అందరూ ఆడపిల్లలే. భవనంలో పైభాగాన్ని భవన యజమాని అద్దెకు ఇచ్చారు. అతడిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. పిల్లల స్మగ్లింగ్ రాకెట్లో ఓ స్వచ్ఛంద సంస్థది ప్రధాన పాత్ర అని తెలుస్తోంది. ఆ సంస్థ కార్యాలయం వెనకాల ఉన్న మైదానంలో ఇద్దరు శిశువుల మృతదేహాలను పూడ్చిపెట్టి ఉంచడాన్ని కూడా పోలీసులు కనుగొన్నారు. ఈ రెండు ఘటనలకు మధ్య కోల్‌కతా నగరంలో రెండు నర్సింగ్‌హోంలపై పోలీసులు దాడులు చేశారు. కాలేజి స్ట్రీట్‌లో ఉన్న ఓ నర్సింగ్‌హోంలో సీఐడీ విభాగం అధికారులు 200 అమెరికా డాలర్లు, 2000 హాంకాంగ్ డాలర్లు, 1200 యూరోలు, 15 వేల రూపీలు, కొంత బంగారం కనుగొన్నారు. ఇప్పటివరకు ఈ స్కాంలో 15 మందిని అరెస్టు చేశామని వాళ్లలో కొందరు ఇప్పటివరకు తాము కనుగొన్న నాలుగు కేసుల్లోనూ నిందితులుగా ఉన్నారని సీఐడీ అదనపు డీజీ రాజేష్ కుమార్ తెలిపారు. ఈ స్మగ్లింగ్ నెట్వర్క్ మొత్తాన్ని ఛేదించే పనిలో ఉన్నామని ఆయన అన్నారు. పిల్లలందరినీ ఈనెల పదో తేదీన ఇక్కడకు తీసుకొచ్చారని ఆశ్రమంలో వృద్ధులకు నర్సుగా వ్యవహరిస్తున్న ఓ మహిళ చెప్పారు. అయితే.. వాళ్లను ఎందుకు తీసుకొచ్చారో మాత్రం తెలియదని అన్నారు. బదురియా ఘటనలో అరెస్టయిన వారిని విచారించినప్పుడు కాలేజి స్ట్రీట్ నర్సింగ్ హోం గురించి సమాచారం వచ్చిందని.. అక్కడివారిని విచారిస్తే ఈ ఓల్డేజి హోం గురించిన సమాచారం తెలిసిందని రాజేష్ కుమార్ చెప్పారు. కొందరు అవివాహిత మహిళలకు డబ్బు ఆశ చూపించి పిల్లలను కన్న తర్వాత వాళ్లను వదిలేసి వెళ్లిపొమ్మంటున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే, ఆస్పత్రులలో శిశువులను కన్న మహిళలకు.. వారి పిల్లలు చనిపోయారని చెప్పి, అప్పటికే తమ వద్ద ఉన్న మృత శిశువులను చూపిస్తున్నారు. వాళ్ల పిల్లలను కూడా ఎత్తుకొచ్చి స్మగ్లింగ్ చేస్తున్నారు. -
ఉప్పలపాడులో ఆడ మృత శిశువులు
ఏ తల్లి కన్న కవలలో కానీ బొడ్డూడకుండానే వాగులో మృతశిశువులుగా కనిపించారు. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం ఉప్పలపాడు సమీపంలో కలకలం రేపిన ఈ ఘటన వివరాలు...ఆదివారం తెల్లవారుజామున బహిర్భూమికివచ్చిన కొందరికి ఏడుమంగళంవాగు బ్రిడ్జి కింద ఉన్న నీటిలో తేలియాడుతూ ఇద్దరు ఆడశిశువుల మృతదేహాలు కనిపించాయి. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్దఎత్తున అక్కడకు చేరుకుని పోలీసులు సమాచారం అందించారు. రూరల్ ఎస్.ఐ.లు సురేంద్రబాబు, జె.సిహెచ్.వెంకటేశ్వర్లు సంఘటన స్థలానికి చేరుకుని చిన్నారుల మృతదేహాలను పోస్ట్‌మార్టమ్ నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. చుట్టుపక్కల గ్రామాల్లోని ఆస్పత్రుల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
కవలల కుటుంబం
- వంశపారంపర్యంగా అందరూ కవలలే - ఒకే కాన్పులో ముగ్గురు ఆడ శిశువులు జననం పి.ఎన్.కాలనీ: ఆ కుటుంబంలో కవలల పంట పండుతోంది. కవలల జననం వారసత్వంగా మారింది. వివరాల్లోకి వెళ్తే... పాలకొండ మండలం బాసూరు గ్రామానికి చెందిన ముంజేటి లక్ష్మణరావు భార్య సుజాత పట్టణంలోని మందుల మోహనరావు ఆస్పత్రిలో శుక్రవారం ముగ్గురు ఆడ శిశువులకు జన్మనిచ్చింది. ముగ్గురు బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. అయితే, కవలల జననం వంశపారంపర్యంగా రావడం గమనార్హం. లక్ష్మణరావు కూడా తన అన్నయ్య రాముతో కలసి కవలలుగా జన్మించాడు. అలాగే, లక్ష్మణరావు పెదనాన్న పిల్లలు కూడా కవలలే. గతంలో కూడా లక్ష్మణరావు దంపతులకు ఇద్దరు కవలలు పుట్టి మరణించారు. ఆ తరువాత ఒక మగబిడ్డకు జన్మనిచ్చారు. అయితే, వారసత్వంగా వస్తున్న కవలలు పుట్టి మరణించడం తమను ఎంతగానో బాధించిందని, మళ్లీ ఒకే కాన్పులో ముగ్గురు కవలలు జన్మించడంతో.. కుటుంబం మొత్తం కవలలతో కళకళలాడుతోందని దంపతులిద్దరూ ఆనందం వ్యక్తం చేశారు.