కవలల కుటుంబం
- వంశపారంపర్యంగా అందరూ కవలలే
- ఒకే కాన్పులో ముగ్గురు ఆడ శిశువులు జననం
పి.ఎన్.కాలనీ: ఆ కుటుంబంలో కవలల పంట పండుతోంది. కవలల జననం వారసత్వంగా మారింది. వివరాల్లోకి వెళ్తే... పాలకొండ మండలం బాసూరు గ్రామానికి చెందిన ముంజేటి లక్ష్మణరావు భార్య సుజాత పట్టణంలోని మందుల మోహనరావు ఆస్పత్రిలో శుక్రవారం ముగ్గురు ఆడ శిశువులకు జన్మనిచ్చింది. ముగ్గురు బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. అయితే, కవలల జననం వంశపారంపర్యంగా రావడం గమనార్హం.
లక్ష్మణరావు కూడా తన అన్నయ్య రాముతో కలసి కవలలుగా జన్మించాడు. అలాగే, లక్ష్మణరావు పెదనాన్న పిల్లలు కూడా కవలలే. గతంలో కూడా లక్ష్మణరావు దంపతులకు ఇద్దరు కవలలు పుట్టి మరణించారు. ఆ తరువాత ఒక మగబిడ్డకు జన్మనిచ్చారు. అయితే, వారసత్వంగా వస్తున్న కవలలు పుట్టి మరణించడం తమను ఎంతగానో బాధించిందని, మళ్లీ ఒకే కాన్పులో ముగ్గురు కవలలు జన్మించడంతో.. కుటుంబం మొత్తం కవలలతో కళకళలాడుతోందని దంపతులిద్దరూ ఆనందం వ్యక్తం చేశారు.