సాసూన్ హాస్పిటల్ డీన్ వినాయక్ కాలే
ముంబై: పుణే పోర్షే కారు రోడ్డు ప్రమాదంలో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలుడికి సంబంధించి బ్లడ్ శాంపిళ్ల తారుమారు విషయంలో ఓ రాష్ట్ర మంత్రి, ఎమ్మెల్మే డాక్టర్లపై ఒత్తిడి చేశారని సాసూన్ హాస్పిటల్ డీన్ తెలిపారు. బుధవారం హాస్పిటల్ డీన్ వినాయక్ కాలే మీడియాతో మాట్లాడారు.
‘‘మహారాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్ మంత్రి హసన్ ముష్రిఫ్, ఎమ్మెల్యే సునీల్ తింగ్రే.. మెడికల్ సూపరింటెండెంట్‌గా డాక్టర్ అజయ్ తవాడేను నియమించారు. వీరు అధికారపార్టీ ఎన్సీపీ అజిత్ పవార్ వర్గానికి చెందిన నేతలు. వారు బ్లడ్ శాంపిళ్లను తారుమారు చేయించటం కోసం సోరెన్సిక్ డాక్టర్లపై ఒత్తిడి తీసుకువచ్చారు’’ అని డీన్ తెలిపారు. శాంపిళ్ల తారుమారుపై ఓ కమిటీని ఏర్పాటు చేసిన మంగళవారం ఈ వ్యవహారంపై రోజంతా విచారణ జరిపించామని హాస్పిటల్ డీన్ వినాయక్ కాలే తెలిపారు. తను కూడా ఈ విషయంపై పలు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.
హాస్పిటల్ డీన్ మీడియా సమావేశం ముగిసిన కొన్ని గంటల్లోనే ఆయన్ను రాష్ట్ర ప్రభుత్వం సెలవుపై పంపటం గమనార్హం. ఈ కేసు విషయంలో నిర్లక్ష్యం వహించినందుకు, సరైన నిర్ణయం తీసుకోనందుకే ఆయన్ను ప్రభుత్వం సెలవుపై పంపినట్లు తెలుస్తోంది.
ఇక.. మైనర్ బాలుడి బ్లడ్ శాంపిళ్లు తారుమారు చేయటం కోసం ఇద్దరు డాక్టర్లు అజయ్ తవాడే, శ్రీహరి హర్నర్.. మధ్యవర్తి హాస్పిటల్ ప్యూన్ ద్వారా నిందితుడి కుటుంబ సభ్యుల వద్ద రూ.3 లక్షల లంచం తీసున్నారని తెలియటంతో వారిని పుణే క్రైం బ్రాంచ్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నారు. ఇక.. బ్లడ్ శాంపిళ్ల తారుమారుపై మహారాష్ట్ర ప్రభుత్వం సైతం దర్యాప్తుకు డాక్టర్ పల్లవి సపాలే నేతృత్వంలో ఓ కమిటి ఏర్పాటు చేసింది. ఈ కమిటిలో గ్రాంట్ మెడికల్ కాలేజీ, జేజే గ్రూప్ హాస్పిటల్ డీన్‌లు సభ్యులుగా ఉన్నారు.
ఈ కేసులో ఓ ఎమ్మెల్యే కుమారుడికి సంబంధం ఉందని మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రెసిడెంట్ నానా పటోల్ ఆరోపణలు చేశారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే ఆ ఎమ్మెల్యే.. పోలీసులతో టచ్‌లోకి వెళ్లారు. బ్లడ్ శాంపిళ్లను మార్చటం కోసం డాక్టర్లు కూడా ఫోన్ చేశారని పటోల్ ఆరోపణలు చేశారు. ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇక.. ప్రముఖ బిల్డర్ అయన మైనర్ తండ్రి కూడా బ్లడ్ శాంపిళ్లను తారుమారు చేయించాలని డాక్టర్ తవాడేకు 14 సార్లు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది.
ఇక.. ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మంగళవారం స్పందించారు. ‘ప్రమాదం జరిగినప్పటి నుంచి పుణే పోలీసు కమిషనర్‌తో నేను టచ్‌లో ఉన్నా. ఈ కేసులో ఎంతటివారు ఉన్నా చర్యలు తీసుకుంటాం. చట్టం ముందు అందరూ సమానులే. ఎవ్వరినీ వదిలిపెట్టం. నేను ఇప్పటికే ఈ కేసు విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు ఇచ్చాను’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment