కలెక్టర్ జగన్‌మోహన్ : నమస్కారం.. అమ్మా బాగున్నావా? మీ పేరేంటి?
గంగమ్మ : మంచిగున్న అయ్యా.. నా పేరు గంగమ్మ.
కలెక్టర్ : ఆరోగ్యం ఎలా ఉంది..?
గంగమ్మ : బాగుందయ్యా.. కాళ్ల నొప్పులు ఉన్నాయి.
కలెక్టర్ : మందులు వాడుతున్నావా?
గంగమ్మ : యావత్‌మాల్ (మహారాష్ట్ర) గోలీలు వేసుకుంటున్న సారు.
కలెక్టర్ : ప్రతిరోజూ కొంత సేపు నడవండమ్మా. ఆశ్రమంలోనే అటూ ఇటూ తిరిగితే కొంత ఆరోగ్యంగా ఉండవచ్చు.
కలెక్టర్ : ఏం పెద్దాయన ఏ ఊరు మీది?
విఠల్ : సావాపురం సారు.. రెండుమూడేండ్లుగా ఇక్కడే ఉంటున్న.
కలెక్టర్ : కొడుకులున్నారా?
విఠల్ : ఉన్నా కానీ లేనట్లే సారూ (కంటతడి పెడుతూ). ఆరోగ్యం బాగుంట లేదు. మాకు పింఛన్ ఇప్పించండి.
కలెక్టర్ : 65 ఏళ్లు దాటి ఉన్నావు కదా.. తప్పకుండా మీకందరికీ పింఛన్ వచ్చేలా చూస్తా. కలెక్టర్ : అమ్మా ఏం పేరు నీది. పిల్లలున్నారా..?
రేవంతి : నాపేరు రేవంతి.. సారూ. పిల్లలున్నరు. కొడుకున్నడు. బిడ్డ ఉంది.
కలెక్టర్ : నిన్ను చూడటానికి వస్తారా?
రేవంతి : కొడుకు పిల్లలు రారు సారూ.. బిడ్డ పిల్లలు అప్పుడప్పుడు వచ్చి చూసిపొతుంటరు.
కలెక్టర్ : భోజనం బాగా పెడుతున్నారా?
రేవంతి : పెడుతున్నరు సారు.
కలెక్టర్ : మీది ఏవూరు అమ్మా? ఆరోగ్యం ఎలా ఉంది?
రాజమ్మ : బీరెల్లి సారూ.. నిర్మల్ దగ్గరుంటది. కాళ్లు చేతులు గుంజుతన్నై. నడవడం కష్టంగా ఉంది.
కలెక్టర్ : మందులు ఇస్తున్నారా?
రాజమ్మ : గోలీలిచ్చిండ్రు సారు. ఆరోగ్యం బాగలేనప్పుడు ఈ గోలీలు వేసుకోండమ్మ అని చెప్పిండ్రు.
కలెక్టర్ : ఏం అమ్మా ఖాళీ సమయంలో ఏం చేస్తారు?
కత్రుబాయి : ఉత్తగ కూసుంటము సారు.
కలెక్టర్ : ఇక్కడ చిన్న పిల్లలు కూడా ఉన్నారు.. కదా.. వారితో మాట్లాడుతుండండి. మీకు కూడా కొంత ఆనందం కలుగుతుంది.
కలెక్టర్ : బాబూ నీ పేరేంటీ? ఏ చదవుకుంటున్నావు. (అనాథ బాలుడితో ముచ్చటిస్తూ..)
సాయి : సాయి.. ఐదో తరగతి.
కలెక్టర్ : ఏ ఊరు మీది. మీ నాన్న ఏంచేస్తాడు?
సాయి : అమ్మ, నాన్న జరమొచ్చి చచ్చిపోయిండ్రు.
కలెక్టర్ : బాగా చదువుకుంటున్నావా?
సాయి : చదువుకుంటున్న.
కలెక్టర్ : బాగా చదువుకోవాలి బాబూ.. (దగ్గరికి తీసుకుంటూ..)
కలెక్టర్ : నువ్వు ఎన్నో తరగతి చదువుతున్నావు? అన్నం తింటున్నావా?
అశోక్ : ఆరో తరగతి సారు. కస్తాల రామకృష్ణ కాలనీ స్కూలుకు పోతున్నా.. తింటున్న సారూ..
కలెక్టర్ : నమస్కారం అమ్మా.. వెళ్లొస్తా..
కలెక్టర్ హామీలు..
వృద్ధాశ్రమంలో ఆశ్రమం పొందుతున్న వారందరికీ ప్రభుత్వం మంజూరు చేస్తున్న వృద్ధాప్య పింఛన్లు ఇప్పిస్తా.
అనాథ బాలికలు, వివిధ ఘటనల్లో బాధితులుగా మారుతున్న చిన్నారుల కోసం జిల్లాలో మరో ప్రత్యేక ఆశ్రయం ఏర్పాటు చేయాలని కోరుతూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతాం.వృద్ధులందరికీ దుప్పట్ల పంపిణీకి చర్యలు తీసుకుంటా.
వృద్ధురాలి బాధలు తెలుసుకుంటున్న కలెక్టర్
Published Sun, Nov 16 2014 2:08 AM | Last Updated on Wed, Aug 8 2018 5:54 PM
Advertisement
Advertisement