రాజేశ్వరి నడుపుతున్న హోమ్‌లో ఆశ్రయం పొందుతున్న వృద్ధులు; రామమూర్తి, రాజేశ్వరి
కడుపున పుట్టిన వాళ్లు తరిమేసిన తల్లిదండ్రులు ఎక్కడికి పోవాలి? పిల్లల్ని పెంచి పెద్ద చేసి పసి పిల్లల వయసుకు చేరుకున్న ఆ వృద్ధులను ఎవరు ఆదుకోవాలి? ‘నేను మీ తల్లిని’ అంది రాజేశ్వరి. నీలగిరులకు ఎవరైనా ఆహ్లాదం కోసం వెళతారు. కాని పిల్లలు విడిచిన తల్లిదండ్రులు మాత్రం రాజేశ్వరిని వెతుక్కుంటూ వెళతారు. ఆమె నడుపుతున్న హోమ్ వారికి శాశ్వత ఇల్లుగా మారింది. ఊరూరా ఎంతమంది రాజేశ్వరుల అవసరం ఉందో కదా ఇప్పుడు.
ఈ కథ 20 ఏళ్ల క్రితం మొదలైంది. ఆ రోజు రామమూర్తి తన ఇంటికి ఒక వృద్ధురాలిని తీసుకుని వచ్చాడు. భార్య రాజేశ్వరితో ‘ఇవాళ నుంచి ఈమె మనతోనే ఉంటుంది’ అన్నాడు. రాజేశ్వరి ‘ఎవరు.. ఏమిటి’ అని భర్తని ఒక్క మాట కూడా అడగలేదు. ‘అలాగే’ అంది. అయితే ఆ వృద్ధురాలు లెప్రెసీ పేషెంట్. ఆమెకు ఆ వ్యాధి ఉందనో, మరే కారణం చేతనో అయినవారు ఆమెను వదిలేశారు.
రామమూర్తి, రాజేశ్వరిలకు ఇద్దరు ఆడపిల్లలు. చదువుకుంటున్నారు. ‘లెప్రసీ అంటువ్యాధి ఏమీ కాదు కదా.. అదేం పర్వాలేదులే’ అన్నాడు రామమూర్తి. దానికి కారణం– అతడు హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తూ ఉండటమే. లెప్రసీ పేషంట్స్‌తో ఎలా వ్యవహరించాలో అతనికి తెలుసు. అలా నీలగిరి జిల్లాలో కూనూరుకు పక్కనే ఉండే తెనాలి అనే చిన్న ఊళ్లో ఒక పెద్ద కార్యక్రమానికి తెర లేచింది.
తలుపు తట్టండి... తెరవబడును
మరో రెండు రోజులకే రామమూర్తి తలుపు తట్టబడింది. రాజేశ్వరి తెరిచి చూస్తే ఎదురుగా మరో వృద్ధురాలు. ‘మా ఇంట్లో నుంచి గెంటేశారు. మీ ఇంట్లో చోటు ఇవ్వండమ్మా’... రాజేశ్వరి గడప నుంచి పక్కకు జరిగి ఆమెను లోపలికి రానిచ్చింది. మరో వారంలో ఇంకో వృద్ధురాలు వచ్చింది. అప్పటికి రాజేశ్వరి భర్తతో మాట్లాడింది. ‘మన ఇంట్లో చోటు చాలదు. మన టీ గార్డెన్‌లో పెడదాం’ అంది. నీలగిరి జిల్లా టీ తోటలకు ప్రసిద్ధి. రాజేశ్వరికి కూడా చిన్న టీ తోట ఉంది. అందులోనే ఒక గదిలో ఆ ముగ్గురు స్త్రీలను ఉంచారు.
చిన్న ఊరు తెనాలి. ఈ విషయం ఆ నోట ఈ నోట చుట్టుపక్కల ప్రాంతాలకంతా పాకిపోయింది. రామమూర్తికి ఎవరో ఒకరు ఫోన్ చేసేవారు. రాజేశ్వరి వారిని అక్కున చేర్చుకునేది. ఇవాళ్టికి దాదాపు ఇరవై ఏళ్లు గడిచిపోయాయి. రామమూర్తి రిటైర్ అయ్యాడు. వాళ్ల పెద్దమ్మాయి మెడిసిన్ చేసి డాక్టర్‌గా ఉద్యోగం చేస్తోంది. చిన్నమ్మాయి ఇంకా చదువుకుంటూ ఉంది. అయినప్పటికీ రాజేశ్వరి తన సొంత పిల్లలకు కాకుండా ఇంకో అరవై మందికి తన హోమ్‌లో తల్లిగా ఉంటూ సేవ చేస్తోంది.
నగలు కుదువ పెట్టి
హోమ్‌కు ఉన్న డిమాండ్ దృష్ట్యా రిజిస్టర్ చేసి నడపడం తప్పని సరి అని శ్రేయోభిలాషులు చెప్తే ‘ఎంఎన్ ట్రస్ట్’ పేరుతో రిజిస్టర్ చేసి అర ఎకరాలో రెండు షెడ్స్ వేసి అన్ని విధాలా అనుకూలమైన షెల్టర్ హోమ్‌ను నిర్మించారు రామమూర్తి, రాజేశ్వరి. ‘ఇది అనాథ గృహం కాదు. పిల్లల చేత గెంటివేయబడగ దిక్కులేనివారైన తల్లిదండ్రులకు ఆత్మీయ గృహం’ అంటుంది రాజేశ్వరి.
ఇది నడపడం ఎలాగా? ‘మన టీ తోట మీద వచ్చే ఆదాయం దీనికే పెడదాం’ అంది రాజేశ్వరి. ఉద్యోగంలో ఉండగా, ఇప్పుడు పెన్షన్ నుంచి రామమూర్తి సగం ఆదాయం ఈ హోమ్‌కే. డాక్టర్‌గా ఉద్యోగం చేస్తున్న కూతురు ఒక ముప్పై వేల వరకూ పంపుతుంది. మొత్తం మీద నెలకు 70 లేదా ఎనభై వేలు సొంత ఖర్చుల మీదే ఈ భార్యాభర్తలు హోమ్‌ను నడుపుతున్నారు.
‘తమిళనాడు ప్రభుత్వం మా హోమ్‌ను గుర్తించింది కాని వాళ్ల నుంచి ఏమీ ఫండ్స్ రావు. ఈ హోమ్స్ కూడా లోన్ తీసుకుని, నా నగలు కుదువ పెట్టి కట్టాం’ అంటుంది రాజేశ్వరి. ఇప్పుడు హోమ్‌లో 60 మంది ఉన్నారు. అతి తక్కువ వయసు అంటే 47. ఎక్కువ వయసు అంటే 90. ‘ఒక్కొక్కరిది ఒక్కో ధోరణి. కొందరు చెప్పిన వెంటనే మాట వింటారు. మరికొందరు మొండిగా ఉంటారు. ఆత్మీయులకు దూరంగా ఉండటం వల్ల వారికి స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. అన్నింటినీ ఓపిగ్గా భరిస్తూ వస్తాను’ అంటుంది రాజేశ్వరి.
సొంత తల్లిలా
హోమ్‌లో ఉన్న సభ్యులకు మూడు పూట్లా టీ ఉంటుంది. సాయంత్రం పలహారం ఉంటుంది. ఉదయం టిఫిన్, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం సరేసరి. నీలగిరి చల్లటి ప్రాంతం కాబట్టి ఎప్పుడూ వేణ్ణీళ్ల ఏర్పాటు ఉంటుంది. వెచ్చటి దుస్తులను ఇస్తుంది రాజేశ్వరి. రెండు పూటలా యోగా చేయిస్తారు. ఉల్లాసం కోసం పాటలు వినిపిస్తూనే ఉంటాయి.
‘వంట పని దాదాపుగా నేనే చూస్తాను’ అంటుంది రాజేశ్వరి. హోమ్ కోసం ఒక వ్యాన్, ఐదుగురు సిబ్బంది పని చేస్తారు. ‘రెగ్యులర్‌గా హాస్పిటల్‌కు తీసుకెళతాం. అందరికీ ఆధార్ కార్డ్‌లు ఇప్పించాం. ఎవరైనా పోతే అంత్యక్రియలు కూడా నిర్వహిస్తాం’ అంటుందామె. ఇంత పని ఎందుకోసం చేస్తున్నారు ఈ భార్యాభర్తలు. బహుశా ఇది చూపదగ్గ మానవత్వం అనుకోవడం వల్ల కావచ్చు.
భావితరాలకు పాఠం
వీరి హోమ్‌కు రెగ్యులర్‌గా కొంతమంది వచ్చి విరాళాలు ఇస్తారు. కొందరు స్కూల్ పిల్లలు పుట్టినరోజులు జరుపుకోవడానికి వస్తారు. ‘మీ తల్లిదండ్రులను ఇలా విడిచిపెట్టొద్దు’ అని చెబుతుంది రాజేశ్వరి వారికి. పిల్లల్ని పెద్ద చేయడం కోసం తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడతారు. వారిని నిరాకరించి పిల్లలు మరిన్ని కష్టాల్లో నెడతారు.
నీలగిరిలో రాజేశ్వరి ఉంది. మీ ఊళ్లో ఎవరున్నారు?
Comments
Please login to add a commentAdd a comment