shelter zone
-
14 మంది మృతి యాదృచ్ఛికం కాదు: ఢిల్లీహైకోర్టు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ ఆశాకిరణ్ షెల్టర్‌హోమ్‌లో స్వల్ప వ్యవధిలో 14 మంది మృతి చెందడం యాదృచ్ఛికం కాదని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. షెల్టర్‌హోమ్‌లో పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని ఢిల్లీ సోషల్ వెల్ఫేర్ శాఖ కార్యదర్శిని కోర్టు ఆదేశించింది. జస్టిస్ మన్మోహన్, జస్టిస్ తుషార్రావ్ గేదెలతో కూడిన ధర్మాసనం ఈ కేసును సోమవారం(ఆగస్టు5) విచారించింది. ఈ సందర్భంగా బెంచ్ కీలక ఆదేశాలు జారీ చేసింది. షెల్టర్ హోమ్‌లో ఉండాల్సినదాని కంటే ఎక్కువ మంది ఉంటే కొందరిని అక్కడి నుంచి తరలించాలని సూచించింది. షెల్టర్‌హోమ్‌లోని మంచినీటి పైపులైన్లతో పాటు డ్రైనేజీ పైపులైన్లను పరిశీలించాలని, అక్కడి తాగునీటి నాణ్యతను పరీక్షించాలని ఢిల్లీ జల్‌బోర్డును ఆదేశించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి షెల్టర్‌హోమ్‌లో మొత్తం 25 మంది చనిపోగా కేవలం జులైలోనే 14మంది మరణించారు. -
తల్లిదండ్రులే ఆమె పిల్లలు
కడుపున పుట్టిన వాళ్లు తరిమేసిన తల్లిదండ్రులు ఎక్కడికి పోవాలి? పిల్లల్ని పెంచి పెద్ద చేసి పసి పిల్లల వయసుకు చేరుకున్న ఆ వృద్ధులను ఎవరు ఆదుకోవాలి? ‘నేను మీ తల్లిని’ అంది రాజేశ్వరి. నీలగిరులకు ఎవరైనా ఆహ్లాదం కోసం వెళతారు. కాని పిల్లలు విడిచిన తల్లిదండ్రులు మాత్రం రాజేశ్వరిని వెతుక్కుంటూ వెళతారు. ఆమె నడుపుతున్న హోమ్ వారికి శాశ్వత ఇల్లుగా మారింది. ఊరూరా ఎంతమంది రాజేశ్వరుల అవసరం ఉందో కదా ఇప్పుడు. ఈ కథ 20 ఏళ్ల క్రితం మొదలైంది. ఆ రోజు రామమూర్తి తన ఇంటికి ఒక వృద్ధురాలిని తీసుకుని వచ్చాడు. భార్య రాజేశ్వరితో ‘ఇవాళ నుంచి ఈమె మనతోనే ఉంటుంది’ అన్నాడు. రాజేశ్వరి ‘ఎవరు.. ఏమిటి’ అని భర్తని ఒక్క మాట కూడా అడగలేదు. ‘అలాగే’ అంది. అయితే ఆ వృద్ధురాలు లెప్రెసీ పేషెంట్. ఆమెకు ఆ వ్యాధి ఉందనో, మరే కారణం చేతనో అయినవారు ఆమెను వదిలేశారు. రామమూర్తి, రాజేశ్వరిలకు ఇద్దరు ఆడపిల్లలు. చదువుకుంటున్నారు. ‘లెప్రసీ అంటువ్యాధి ఏమీ కాదు కదా.. అదేం పర్వాలేదులే’ అన్నాడు రామమూర్తి. దానికి కారణం– అతడు హెల్త్ డిపార్ట్మెంట్లో పని చేస్తూ ఉండటమే. లెప్రసీ పేషంట్స్‌తో ఎలా వ్యవహరించాలో అతనికి తెలుసు. అలా నీలగిరి జిల్లాలో కూనూరుకు పక్కనే ఉండే తెనాలి అనే చిన్న ఊళ్లో ఒక పెద్ద కార్యక్రమానికి తెర లేచింది. తలుపు తట్టండి... తెరవబడును మరో రెండు రోజులకే రామమూర్తి తలుపు తట్టబడింది. రాజేశ్వరి తెరిచి చూస్తే ఎదురుగా మరో వృద్ధురాలు. ‘మా ఇంట్లో నుంచి గెంటేశారు. మీ ఇంట్లో చోటు ఇవ్వండమ్మా’... రాజేశ్వరి గడప నుంచి పక్కకు జరిగి ఆమెను లోపలికి రానిచ్చింది. మరో వారంలో ఇంకో వృద్ధురాలు వచ్చింది. అప్పటికి రాజేశ్వరి భర్తతో మాట్లాడింది. ‘మన ఇంట్లో చోటు చాలదు. మన టీ గార్డెన్లో పెడదాం’ అంది. నీలగిరి జిల్లా టీ తోటలకు ప్రసిద్ధి. రాజేశ్వరికి కూడా చిన్న టీ తోట ఉంది. అందులోనే ఒక గదిలో ఆ ముగ్గురు స్త్రీలను ఉంచారు. చిన్న ఊరు తెనాలి. ఈ విషయం ఆ నోట ఈ నోట చుట్టుపక్కల ప్రాంతాలకంతా పాకిపోయింది. రామమూర్తికి ఎవరో ఒకరు ఫోన్ చేసేవారు. రాజేశ్వరి వారిని అక్కున చేర్చుకునేది. ఇవాళ్టికి దాదాపు ఇరవై ఏళ్లు గడిచిపోయాయి. రామమూర్తి రిటైర్ అయ్యాడు. వాళ్ల పెద్దమ్మాయి మెడిసిన్ చేసి డాక్టర్‌గా ఉద్యోగం చేస్తోంది. చిన్నమ్మాయి ఇంకా చదువుకుంటూ ఉంది. అయినప్పటికీ రాజేశ్వరి తన సొంత పిల్లలకు కాకుండా ఇంకో అరవై మందికి తన హోమ్‌లో తల్లిగా ఉంటూ సేవ చేస్తోంది. నగలు కుదువ పెట్టి హోమ్‌కు ఉన్న డిమాండ్ దృష్ట్యా రిజిస్టర్ చేసి నడపడం తప్పని సరి అని శ్రేయోభిలాషులు చెప్తే ‘ఎంఎన్ ట్రస్ట్’ పేరుతో రిజిస్టర్ చేసి అర ఎకరాలో రెండు షెడ్స్ వేసి అన్ని విధాలా అనుకూలమైన షెల్టర్ హోమ్‌ను నిర్మించారు రామమూర్తి, రాజేశ్వరి. ‘ఇది అనాథ గృహం కాదు. పిల్లల చేత గెంటివేయబడగ దిక్కులేనివారైన తల్లిదండ్రులకు ఆత్మీయ గృహం’ అంటుంది రాజేశ్వరి. ఇది నడపడం ఎలాగా? ‘మన టీ తోట మీద వచ్చే ఆదాయం దీనికే పెడదాం’ అంది రాజేశ్వరి. ఉద్యోగంలో ఉండగా, ఇప్పుడు పెన్షన్ నుంచి రామమూర్తి సగం ఆదాయం ఈ హోమ్‌కే. డాక్టర్‌గా ఉద్యోగం చేస్తున్న కూతురు ఒక ముప్పై వేల వరకూ పంపుతుంది. మొత్తం మీద నెలకు 70 లేదా ఎనభై వేలు సొంత ఖర్చుల మీదే ఈ భార్యాభర్తలు హోమ్‌ను నడుపుతున్నారు. ‘తమిళనాడు ప్రభుత్వం మా హోమ్‌ను గుర్తించింది కాని వాళ్ల నుంచి ఏమీ ఫండ్స్ రావు. ఈ హోమ్స్ కూడా లోన్ తీసుకుని, నా నగలు కుదువ పెట్టి కట్టాం’ అంటుంది రాజేశ్వరి. ఇప్పుడు హోమ్‌లో 60 మంది ఉన్నారు. అతి తక్కువ వయసు అంటే 47. ఎక్కువ వయసు అంటే 90. ‘ఒక్కొక్కరిది ఒక్కో ధోరణి. కొందరు చెప్పిన వెంటనే మాట వింటారు. మరికొందరు మొండిగా ఉంటారు. ఆత్మీయులకు దూరంగా ఉండటం వల్ల వారికి స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. అన్నింటినీ ఓపిగ్గా భరిస్తూ వస్తాను’ అంటుంది రాజేశ్వరి. సొంత తల్లిలా హోమ్‌లో ఉన్న సభ్యులకు మూడు పూట్లా టీ ఉంటుంది. సాయంత్రం పలహారం ఉంటుంది. ఉదయం టిఫిన్, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం సరేసరి. నీలగిరి చల్లటి ప్రాంతం కాబట్టి ఎప్పుడూ వేణ్ణీళ్ల ఏర్పాటు ఉంటుంది. వెచ్చటి దుస్తులను ఇస్తుంది రాజేశ్వరి. రెండు పూటలా యోగా చేయిస్తారు. ఉల్లాసం కోసం పాటలు వినిపిస్తూనే ఉంటాయి. ‘వంట పని దాదాపుగా నేనే చూస్తాను’ అంటుంది రాజేశ్వరి. హోమ్ కోసం ఒక వ్యాన్, ఐదుగురు సిబ్బంది పని చేస్తారు. ‘రెగ్యులర్‌గా హాస్పిటల్‌కు తీసుకెళతాం. అందరికీ ఆధార్ కార్డ్‌లు ఇప్పించాం. ఎవరైనా పోతే అంత్యక్రియలు కూడా నిర్వహిస్తాం’ అంటుందామె. ఇంత పని ఎందుకోసం చేస్తున్నారు ఈ భార్యాభర్తలు. బహుశా ఇది చూపదగ్గ మానవత్వం అనుకోవడం వల్ల కావచ్చు. భావితరాలకు పాఠం వీరి హోమ్‌కు రెగ్యులర్‌గా కొంతమంది వచ్చి విరాళాలు ఇస్తారు. కొందరు స్కూల్ పిల్లలు పుట్టినరోజులు జరుపుకోవడానికి వస్తారు. ‘మీ తల్లిదండ్రులను ఇలా విడిచిపెట్టొద్దు’ అని చెబుతుంది రాజేశ్వరి వారికి. పిల్లల్ని పెద్ద చేయడం కోసం తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడతారు. వారిని నిరాకరించి పిల్లలు మరిన్ని కష్టాల్లో నెడతారు. నీలగిరిలో రాజేశ్వరి ఉంది. మీ ఊళ్లో ఎవరున్నారు? -
ప్రేమ్ ఇల్లమ్.. వీల్చెయిర్తోనే నడిపిస్తోంది
వైకల్యంతో వీల్ చెయిర్‌కు పరిమితమైన ఇందిర ను చైల్డ్‌కేర్ హోమ్‌లో చేర్చారు తల్లిదండ్రులు. వారానికి ఒకసారి మాత్రమే ఇంటి నుంచి ఎవరో ఒకరు వచ్చి ఇందిరను కలిసేవారు. ఇందిరకేమో వాళ్లను పదేపదే చూడాలనిపించేది. ఎంతో ఇష్టమైన తన వాళ్లకు దూరంగా ఉన్నప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో ప్రత్యక్షం గా అనుభవించిన ఇందిర తనలాంటి వాళ్లకు ఇబ్బందులు కలగకుండా చూసేందుకు ‘ప్రేమ్ ఇల్లమ్’ పేరుతో షెల్టర్ హోమ్ ను నడుపుతూ.. 30 మంది పిల్లలను అమ్మలా ఆదరిస్తున్నారు. ఇందిరకు ఐదేళ్లు ఉన్నప్పుడు పోలియో వచ్చి తొంభైశాతం వైకల్యానికి గురైంది. నడవడానికి రెండు కాళ్లు సహకరించనప్పటికీ ‘ఏదోఒకరోజు నేను నడవగలుగుతాను’ అన్న ధైర్యంతో ఉండేది. తల్లిదండ్రులు చెన్నైలోని ఓ షెల్టర్ హోంలో ఇందిరను చేర్చారు. హోమ్‌లో ఉన్న పిల్లలంతా బొమ్మలతో ఆడుకోవడానికి ఇష్టపడితే ఇందిర మాత్రం చదువుకునేందుకు ఆసక్తి చూపించేది. అన్నయ్య ప్రోత్సాహంతో.. షెల్టర్ హోమ్‌లో సైకాలజిస్టుగా పనిచేస్తోన్న అన్నయ్య సెల్విన్ ఇందిర ఆసక్తిని గమనించి తల్లిదండ్రులతో మాట్లాడి ఇందిర డైలీ స్కూలుకు వెళ్లి చదువుకునేందుకు ప్రోత్సహించాడు. ఇందిర ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుందోనని తల్లిదండ్రులు భయపడ్డప్పటికీ, అన్న అండతో‡ధైర్యం గా ముందుకు సాగింది. కానీ చాలా స్కూళ్లు ఇందిర వైకల్యాన్ని సాకుగా చూపించి అడ్మిషన్ ఇవ్వడానికి వెనకాడాయి. ఎట్టకేలకు ఒక స్కూలు ఇందిరకు ఎనిమిదో తరగతిలో చేరేందుకు అడ్మిషన్ ఇచ్చింది. స్కూల్లో చేరిన ఇందిర అనేక భయాలు, ఆత్మనూన్యతకు లోనైనప్పటికీ అంకిత భావంతో ఎంతో కష్టపడి చదివి ఎస్ఎస్ఎల్సీ మంచి మార్కులతో పాసైంది. అలాగే డిగ్రీ, ఎంసీఏ కూడా పూర్తి చేసింది. ప్రేమ్ ఇల్లమ్.. ఇందిర లాంటి వాళ్లను మరింత మందిని ప్రోత్సహించాలన్న ఉద్దేశ్యంతో సెల్విన్ 1999లో ‘ప్రేమ్ ఇల్లమ్’ను స్థాపించి వైకల్యం గలిగిన పిల్లలకు ఆసరాగా నిలుస్తున్నాడు. ఇందిర ఎంసీఏ అయ్యాక ఉద్యోగం చేసే అవకాశం వచ్చినప్పటికీ ప్రేమ్ ఇల్లమ్‌లో చేరి సేవ చేయాలని నిర్ణయించుకుంది. 2017 నుంచి ప్రేమ్ ఇల్లమ్ సంస్థకు సేవలందిస్తోంది. ప్రస్తుతం ప్రేమ్ ఇల్లమ్‌లో 30 మంది అమ్మాయిలు ఉన్నారు. వీరిలో ఐదుగురు స్కూలుకెళ్తుండగా మిగతా వారంతా హోమ్‌లోనే ఉంటున్నారు. ఈ పిల్లలకు చదువు చెప్పడం కోసం ఇందిర స్పెషల్ ఎడ్యుకేషన్‌లో బిఈడీ చేసి వారికి పాఠాలు చెబుతోంది. అంతేగాక 2019 నుంచి సేంద్రియ పద్ధతిలో పంటలు పండిస్తూ, ఆ పంటలతోనే షెల్టర్ హోమ్ పిల్లలకు భోజనం పెడుతుండడం విశేషం. కరోనా కష్టకాలంలో గ్రామంలోని పాజిటివ్ పేషంట్లకు భోజనాన్ని పంపిణీ చేసింది. ‘‘నా చిన్నప్పటినుంచి పన్నెండేళ్ల వరకు షెల్టర్ హోంలో గడిపాను. దీంతో బయట సమాజంలో ఎలా ఉంటుందో తెలిసేది కాదు. శారీరక, మానసిక వైకల్యం లేని పిల్లల్ని ఎప్పుడూ కలవలేదు. ఎనిమిదో తరగతిలో చేరి కొత్తకొత్త పాఠ్యాంశాలను నేర్చుకోవడం, తోటి విద్యార్థులతో కలవడం కష్టంగా ఉండేది. రోజూ స్కూలు అవగానే అన్నయ్య దగ్గర బాధపడేదాన్ని. ‘‘నువ్వు ధైర్యాన్ని కోల్పోవద్దు నిన్ను నువ్వు గట్టిగా నమ్ము’’ అని వెన్ను తట్టి చెప్పేవారు. అ ప్రోత్సాహంతోనే ఎంసీఏ వరకు చదివాను. నాకు ఒకరు ఏవిధంగా చెయ్యందించారో అలానే నేను నాలాంటి వాళ్లకు సాయం చేయాలని ప్రేమ్ ఇల్లమ్‌లో పని చేస్తున్నాను. మేము సేంద్రియ పద్ధతిలో ఒక్కో పంటకు 25 బస్తాల ధాన్యాన్ని పండిస్తాము. అవి హోమ్‌లో ఉన్న పిల్లలకు సరిపోతాయి. కూరగాయలు, పండ్ల చెట్లు కూడా పెంచి పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం’’ అని ఇందిర చెప్పింది. పట్టుదలకు వైకల్యం అడ్డురాదని, ఎంతటి పనినైనా సాధించవచ్చని ఇందిర ‘ప్రేమ్ ఇల్లమ్’ నిరూపిస్తుంది. -
షెల్టర్ హోంలో వలస కూలీ మృతి
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో వలస కూలీల కోసం ఏర్పాటు చేసిన షెల్టర్ హోంలో ఓ వలస కార్మికుడు గురువారం మరణించారు. వివేక్ విహార్ ప్రాంతంలో ఉన్న ఈ షెల్టర్ హోంలో గత కొద్దిరోజులుగా మృతుడు ఉంటున్నట్టు సమాచారం. కాగా షెల్టర్ హోంలో మరణించిన వ్యక్తి మృతికి కారణాలు తెలియరాలేదు. కరోనా కట్టడికి విధించిన దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో వలస కూలీలు, నిరాశ్రయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. పనులు లేక వేలాది మంది వలస కూలీలు రోడ్లపై నడుచుకుంటూ శ్రామిక్ రైళ్ల ద్వారా స్వగ్రామాల బాట పడుతున్నారు. ఇళ్లకు వెళ్లేలోపే మంచినీరు, ఆహారం లభించక పలువురు ప్రాణాలు విడిచిన ఘటనలు చోటుచేసుకున్నాయి. మరోవైపు వలస కూలీలకు ఊరటగా సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రైళ్లు, బస్సుల్లో ప్రయాణించే వలస కూలీల చార్జీలను ప్రభుత్వమే భరించాలని, వారికి ఉచితంగా భోజనం, మంచినీరు సమకూర్చాలని సర్వోన్నత న్యాయస్ధానం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. చదవండి : కార్మికుల రైలు బండికి ‘టైం టేబుల్’ లేదట! -
షెల్టర్ హోంలో ఇద్దరు మహిళల మృతి
పట్నా: బిహార్ రాజధాని పట్నాలోని ఓ మానసిక వికలాంగుల కేంద్రంలో ఇద్దరు మహిళలు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. నేపాలినగర్లోని ‘ఆసరా’ అనే షెల్టర్‌హోంలో ఈ ఘటన జరిగింది. ఆసుపత్రి వర్గాలు, ప్రభుత్వం వేర్వేరు కారణాలు చెబుతుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. 17, 40 ఏళ్లున్న ఇద్దరు మహిళలను ఆగస్టు 10 అర్ధరాత్రి దాటిన తరువాత ఆసుపత్రి తీసుకెళ్లగా, వారు అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ సంగతిని పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంలో విఫలమైన షెల్టర్ హోం, ఆసుపత్రి వర్గాలపై పట్నా ఐజీ ఎన్‌హెచ్ ఖాన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు, వారికి చికిత్స జరుగుతున్న సమయంలో ఆసుపత్రిలోనే చనిపోయారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ రాజ్‌కుమార్ తెలిపారు. ఆ హోం లో వారిని పారిపోవాలంటూ బహుమతులు ఆశచూపిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన తరువాతి రోజే ఇద్దరు మృతిచెందారు. -
'ముద్దాయిలకు షెల్టర్‌జోన్‌గా బెజవాడ'
-
ముద్దాయిలకు షెల్టర్ జోన్‌గా బెజవాడ: గౌతంరెడ్డి
ఓటుకు కోట్లు కేసులో ఉన్న ముద్దాయిలకు విజయవాడ షెల్టర్ జోన్‌గా మారిపోయిందని వైఎస్ఆర్సీపీ నాయకుడు గౌతం రెడ్డి మండిపడ్డారు. ఈ కేసులో ఎ4గా ఉన్న మత్తయ్యకు బొండా ఉమామహేశ్వరరావు, ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఆశ్రయం కల్పించారని ఆయన ఆరోపించారు. కేసులోంచి బయట పడేందుకు పోలీసు అధికారులతో వారికి తర్ఫీదు ఇప్పిస్తున్నారని గౌతం రెడ్డి అన్నారు. తప్పు చేయకపోతే ఇలాంటి పాట్లు పడాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ నేతలకు ఎందుకు ఉంటుందని ఆయన ప్రశ్నించారు. -
కలకలం
హిందూపురం అర్బన్, న్యూస్‌లైన్ : హిందూపురం పట్టణం నేరగాళ్లకు షెల్టర్‌జోన్‌గా మారింది. ఈ పట్టణాన్ని కేంద్రంగా చేసుకుని దోపిడీలు, దొంగతనాలు, దందాలు వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే అంతర్ రాష్ట్ర దొంగల ముఠా నాయకుడు గిరీష్ అలియాస్ కుణిగల్ గిరి అలియాస్ మోదురు గిరి, అతని అనుచరులను ఆదివారం హిందూపురం పోలీసులు పట్టుకున్నారు. దీంతో పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కుణిగల్ గిరి స్థానికంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్‌నని చెప్పుకుంటూ తెర వెనుక వ్యవహారం నడిపేవాడు. ఇతనిది కర్ణాటకలోని తుమకూరు జిల్లా కుణిగల్ తాలూకా హోసూరు గ్రామం. దాదాపు 75 కేసుల్లో ప్రధాన నిందితుడు. ఇతని ముఠాను పట్టుకోవడానికి కర్ణాటక పోలీసులు మూడు ప్రత్యేకృబందాలుగా రంగంలోకి దిగారు. దీన్నిబట్టే గిరి ఎంత పెద్ద నేరగాడో అర్థం చేసుకోవచ్చు. ఇతను 15 రోజుల క్రితం హిందూపురం పట్టణంలోని ఆరవిందనగర్‌లో ఓ ఇంటి పైఅంతస్తును అద్దెకు తీసుకున్నాడు. తన అనుచరులు ముగ్గురితో కలసి ఉండేవాడు. వారంతా ఉదయాన్నే కర్ణాటకలో డ్యూటీలంటూ వెళ్లి రాత్రి ఇంటికి చేరుకునేవారు. క్లాస్ యువకులుగా కన్పిస్తుండడంతో ఎవరికీ అనుమానం రాలేదు. కర్ణాటక ప్రాంతంలో దోపిడీలు, దొంగతనాలు, బెదిరింపులు, ఇసుక దందాలు వంటివి చేసేవారు. కాగా, శనివారం రాత్రి 11 గంటల సమయంలో కుణిగల్ గిరి కెనిటిక్ బైక్‌పై వెళుతూ ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన అతన్ని 108 సిబ్బంది ఆస్పత్రిలో చేర్చారు. వివరాలు చెప్పలేని స్థితిలో ఉండగా అతని వద్ద ఏదైనా ఆధారం లభిస్తుందేమోనని సోదా చేశారు. ఒక తపంచా, బుల్లెట్లు, కె.ప్రశాంత్ పేరుతో డ్రైవింగ్ లెసైన్సు లభ్యమయ్యాయి. వెంటనే వారు హిందూపురం వన్‌టౌన్ సీఐ మురళీకృష్ణకు సమాచారం అందించారు. ఆయన హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని.. నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. ముందు తప్పుడు అడ్రెస్ చెప్పి మభ్యపెట్టడానికి ప్రయత్నించాడు. పోలీసులు గట్టిగా విచారణ చేయడంతో అసలు విషయం బయట పడింది. వెంటనే కర్ణాటకలోని తుమకూరు నేరవిభాగం పోలీసులకు సమాచారమిచ్చారు. వారు కూడా హిందూపురం చేరుకున్నారు. సంయుక్తంగా గిరి ఉంటున్న ఇంటిపై దాడి చేశారు. అతని అనుచరులైన మంజునాథ్, గోవిందు, వాసులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు తపంచాలు, బెల్లెట్లు, సుమారు రూ.8 లక్షల నగదు, దాదాపు అరకిలో బంగారు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వారిని కర్ణాటక పోలీసులు బెంగళూరుకు తరలిస్తుండగా మార్గమధ్యంలోని బెవనహళ్లి వద్ద గోవిందు మూత్రవిసర్జన అంటూ వాహనాన్ని ఆపించి పారిపోవడానికి ప్రయత్నించాడు. పోలీసులు అతనిపై కాల్పులు జరిపారు. కాళ్లలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. అతన్ని తిరిగి పట్టుకుని బెంగళూరుకు తరలించారు. కుణిగల్ గిరి ముఠా సుమారు మూడు నెలలుగా హిందూపురంలో మకాం వేసి దం దాలు సాగించినట్లు తెలుస్తోంది. పట్టణంలోనే వివిధ ప్రాంతా ల్లో ఉంటూ చివరగా ఆరవింద్‌నగర్‌కు చేరుకున్నట్లు సమాచా రం. ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీని హత్య చేయడానికి ఈ ముఠా స్కెచ్ వేసిందనే వదంతులు పట్టణంలో వి న్పించాయి. ‘అక్బరుద్దీన్ ఓవైసీని హత్య చేయడానికి కుట్రపన్నిన ముఠాను అరెస్టుచేసిన స్థానిక పోలీసులకు అభినందనలు’ అం టూ స్థానిక ఎంఐఎం నాయకులు పత్రికా ప్రకటన కూడా విడుదల చేయడం గమనార్హం. అయితే..దీన్ని స్థానిక పోలీసులు కొట్టిపారేస్తున్నారు. ఈ ముఠా స్థానికంగా కాకుండా కర్ణాటక ప్రాంతా ల్లో నేరాలకు పాల్పడుతూ ఎవరికీ అనుమానం రాదనే ఉద్దేశంతో హిందూపురంలో తలదాచుకున్నట్లు వారు చెబుతున్నారు. నిఘా వైఫల్యం : కర్ణాటక ప్రాంతాల్లో నేరాలకు పాల్పడుతూ పక్కనే ఉన్న హిందూపురంలో మకాం పెడుతున్నా నిఘా విభాగం పోలీసులు గుర్తించలేకపోతున్నారు. కొన్ని నెలల క్రితం బెంగళూరు ఏటీఎం నిందితుడు హిందూపురం వచ్చి సెల్‌ఫోన్‌ను విక్రయించి దర్జాగా జారుకున్నాడు. ఇప్పుడు కుణిగల్ గిరి ముఠా పట్టుబడింది. దీన్నిబట్టే నేరగాళ్లకు హిందూపురం షెల్టర్ జోన్‌గా మారిందనే విషయం స్పష్టమవుతోంది. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రముఖ రాజకీయ నాయకులైన రాహుల్‌గాంధీ, వైఎస్ జగన్మోహన్రెడ్డి, నందమూరి బాలకృష్ణ.. ఇలా ముఖ్యులు హిందూపురం వచ్చినప్పుడు పోలీసులు అంతా కంట్రోల్లోనే ఉందని చెప్పుకున్నారు. అయితే..వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉండడంతో పట్టణవాసులు ఆందోళన చెందుతున్నారు. -
పుట్టపర్తిలో మావోల కలకలం
సాక్షి ప్రతినిధి, అనంతపురం : ఆధ్మాత్మిక కేంద్రమైన పుట్టపర్తిని మావోయిస్టులు షెల్టర్ జోన్‌గా ఎంచుకున్నారా? వీవీఐపీల తాకిడి తగ్గిన నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు నిఘా, భద్రతను తగ్గించడాన్ని అలుసుగా తీసుకున్నారా? దాడులు చేసిన, రోగాల బారిన పడిన మావోయిస్టులను పుట్టపర్తిలో ఏర్పాటు చేసిన షెల్టర్‌కు తరలిస్తున్నారా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నాయి పోలీసు నిఘా వర్గాలు. ఒడిశా పర్యాటక శాఖ మంత్రి మహేశ్వర మహంతిపై కాల్పులు జరిపిన నలుగురు మావోయిస్టులను పుట్టపర్తిలో గురువారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఇందుకు బలం చేకూర్చుతోంది. వివరాల్లోకి వెళితే.. దశాబ్దం క్రితం వరకూ జిల్లా నక్సల్స్ ఖిల్లాగా ప్రసిద్ధికెక్కింది. పీపుల్స్ వార్(గణపతి వర్గం), పీపుల్స్ వార్(కేఎస్ వర్గం), ఓ వర్గం ప్రైవేటు సైన్యమైన ఆర్వోసీ(రీ ఆర్గనైజింగ్ కమిటీ), మరో వర్గం ప్రైవేటు సైన్యమైన రెడ్ స్టార్.. నక్సల్స్ కార్యకలాపాలతో జిల్లా అట్టుడికిపోయింది. సైద్ధాంతిక విభేదాలు పొడచూపడంతో ఒక్కోసారి నక్సల్స్ గ్రూపుల మధ్యే కాల్పులు చోటుచేసుకునేవి. కాల్పులు.. ఎదురు కాల్పులు.. ఎన్కౌంటర్లతో జిల్లా నెత్తురోడింది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల వల్ల జిల్లాలో అధికశాతం నక్సల్స్ లొంగిపోయి.. జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. కొందరు పోలీసు ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయాల వల్ల జిల్లాలో నక్సల్స్ కదలికలు లేకుండా పోయాయి. మళ్లీ కలకలం.. గురువారం పుట్టపర్తిలోని ఓ ప్రైవేటు లాడ్జిలో నలుగురు మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. ఒడిశా పర్యాటక శాఖ మంత్రి మహేశ్వర మహంతిపై పూరీలో ఈనెల 21న నలుగురు మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఒడిశాలో గాలింపులు తీవ్రమవడంతో కాల్పులు జరిపిన మావోయిస్టులు ఫిబ్రవరి 23న పుట్టపర్తికి చేరుకున్నారు. ఓ ప్రైవేటు లాడ్జిలో ఏర్పాటు చేసుకున్న షెల్టర్‌లో నలుగురు మావోయిస్టులు నాలుగు రోజులుగా తలదాచుకుంటున్నారు. ప్రైవేటు లాడ్జిలో కొందరు వ్యక్తుల కదలికలు అనుమానాస్పదంగా ఉండటాన్ని నిఘా వర్గాలు పసిగట్టాయి. గురువారం తెల్లవారుజామున ఆ లాడ్జిపై దాడి చేసి.. నలుగురు మావోయిస్టులను అదుపులోకి తీసుకోవడం సంచలనం రేపింది. డీజీపీ ప్రసాదరావు ఆదేశాల మేరకు వారిని ఒడిశాకు తరలించారు. వ్యూహాత్మకంగా మావోయిస్టులు.. పోలీసుల కార్యకలాపాలు తక్కువగా ఉండి.. ప్రశాంతంగా ఉన్న ప్రదేశాలను మావోయిస్టులు షెల్టర్ జోన్‌గా ఎంచుకుంటారు. షెల్టర్ జోన్ ఏర్పాటు చేసుకున్న ప్రదేశాల్లో మావోయిస్టులు ఎలాంటి దాడులకు, హింసాత్మక ఘటనలకు పాల్పడరు. తద్వారా తమ కదలికలు ఆ ప్రాంతంలో లేవనే సంకేతాలను పంపినట్లవుతుందన్నది వారి ఎత్తుగడ. ఎక్కడైనా దాడులు చేసిన తర్వాత గాలింపులు తీవ్రమైతే.. అందులో పాల్గొన్న మావోయిస్టులను షెల్టర్ జోన్‌కు తరలిస్తారు. దాడుల్లో గాయపడిన వారిని.. రోగాల బారిన పడిన వారిని కూడా షెల్టర్ జోన్‌కు తరలిస్తారు. షెల్టర్ జోన్లో తమకు అత్యంత విశ్వసనీయమైన ఇన్ఫార్మర్లకు నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తారు. ఎప్పటికప్పుడు షెల్టర్ జోన్‌నూ.. నిర్వాహకులను మార్చుతుంటారు. తద్వారా ఎవరికీ అనుమానం రాదన్నది మావోయిస్టుల వ్యూహం. సత్యసాయి బాబా నిర్యాణం తర్వాత పుట్టపర్తికి వీవీఐపీల తాకిడి గణనీయంగా తగ్గింది. ఆ క్రమంలో పోలీసులు కూడా నిఘాను, బందోబస్తును తగ్గించారు. భక్తులు, పర్యాటకుల తాడికి కూడా గణనీయంగా పడిపోవడంతో పుట్టపర్తిలోని లాడ్జిలు 90 శాతం ఖాళీగా ఉంటున్నాయి. ఇది పసిగట్టిన మావోయిస్టులు భక్తుల పేరుతో లాడ్జిలను అద్దెకు తీసుకుని.. షెల్టర్ ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. గురువారం నాటి ఘటన నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు పుట్టపర్తిలో నిఘా, భద్రతను కట్టుదిట్టం చేశారు. పుట్టపర్తిలో మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే విషయం తెలుసుకుని స్థానికులు భయాందోళనకు గురయ్యారు.