హిందూపురం అర్బన్, న్యూస్‌లైన్ : హిందూపురం పట్టణం నేరగాళ్లకు షెల్టర్‌జోన్‌గా మారింది. ఈ పట్టణాన్ని కేంద్రంగా చేసుకుని దోపిడీలు, దొంగతనాలు, దందాలు వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే అంతర్ రాష్ట్ర దొంగల ముఠా నాయకుడు గిరీష్ అలియాస్ కుణిగల్ గిరి అలియాస్ మోదురు గిరి, అతని అనుచరులను ఆదివారం హిందూపురం పోలీసులు పట్టుకున్నారు. దీంతో పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కుణిగల్ గిరి స్థానికంగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌నని చెప్పుకుంటూ తెర వెనుక వ్యవహారం నడిపేవాడు. ఇతనిది కర్ణాటకలోని తుమకూరు జిల్లా కుణిగల్ తాలూకా హోసూరు గ్రామం. దాదాపు 75 కేసుల్లో ప్రధాన నిందితుడు.
ఇతని ముఠాను పట్టుకోవడానికి కర్ణాటక పోలీసులు మూడు ప్రత్యేకృబందాలుగా రంగంలోకి దిగారు. దీన్నిబట్టే గిరి ఎంత పెద్ద నేరగాడో అర్థం చేసుకోవచ్చు. ఇతను 15 రోజుల క్రితం హిందూపురం పట్టణంలోని ఆరవిందనగర్‌లో ఓ ఇంటి పైఅంతస్తును అద్దెకు తీసుకున్నాడు. తన అనుచరులు ముగ్గురితో కలసి ఉండేవాడు. వారంతా ఉదయాన్నే కర్ణాటకలో డ్యూటీలంటూ వెళ్లి రాత్రి ఇంటికి చేరుకునేవారు. క్లాస్ యువకులుగా కన్పిస్తుండడంతో ఎవరికీ అనుమానం రాలేదు. కర్ణాటక ప్రాంతంలో దోపిడీలు, దొంగతనాలు, బెదిరింపులు, ఇసుక దందాలు వంటివి చేసేవారు.
కాగా, శనివారం రాత్రి 11 గంటల సమయంలో కుణిగల్ గిరి కెనిటిక్ బైక్‌పై వెళుతూ ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన అతన్ని 108 సిబ్బంది ఆస్పత్రిలో చేర్చారు. వివరాలు చెప్పలేని స్థితిలో ఉండగా అతని వద్ద ఏదైనా ఆధారం లభిస్తుందేమోనని సోదా చేశారు. ఒక తపంచా, బుల్లెట్లు, కె.ప్రశాంత్ పేరుతో డ్రైవింగ్ లెసైన్సు లభ్యమయ్యాయి. వెంటనే వారు హిందూపురం వన్‌టౌన్ సీఐ మురళీకృష్ణకు సమాచారం అందించారు. ఆయన హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని.. నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. ముందు తప్పుడు అడ్రెస్ చెప్పి మభ్యపెట్టడానికి ప్రయత్నించాడు. పోలీసులు గట్టిగా విచారణ చేయడంతో అసలు విషయం బయట పడింది. వెంటనే కర్ణాటకలోని తుమకూరు నేరవిభాగం పోలీసులకు సమాచారమిచ్చారు.
వారు కూడా హిందూపురం చేరుకున్నారు. సంయుక్తంగా గిరి ఉంటున్న ఇంటిపై దాడి చేశారు. అతని అనుచరులైన మంజునాథ్, గోవిందు, వాసులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు తపంచాలు, బెల్లెట్లు, సుమారు రూ.8 లక్షల నగదు, దాదాపు అరకిలో బంగారు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వారిని కర్ణాటక పోలీసులు బెంగళూరుకు తరలిస్తుండగా మార్గమధ్యంలోని బెవనహళ్లి వద్ద గోవిందు మూత్రవిసర్జన అంటూ వాహనాన్ని ఆపించి పారిపోవడానికి ప్రయత్నించాడు. పోలీసులు అతనిపై కాల్పులు జరిపారు. కాళ్లలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. అతన్ని తిరిగి పట్టుకుని బెంగళూరుకు తరలించారు. కుణిగల్ గిరి ముఠా సుమారు మూడు నెలలుగా హిందూపురంలో మకాం వేసి దం దాలు సాగించినట్లు తెలుస్తోంది. పట్టణంలోనే వివిధ ప్రాంతా ల్లో ఉంటూ చివరగా ఆరవింద్‌నగర్‌కు చేరుకున్నట్లు సమాచా రం. ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీని హత్య చేయడానికి ఈ ముఠా స్కెచ్ వేసిందనే వదంతులు పట్టణంలో వి న్పించాయి. ‘అక్బరుద్దీన్ ఓవైసీని హత్య చేయడానికి కుట్రపన్నిన ముఠాను అరెస్టుచేసిన స్థానిక పోలీసులకు అభినందనలు’ అం టూ స్థానిక ఎంఐఎం నాయకులు పత్రికా ప్రకటన కూడా విడుదల చేయడం గమనార్హం. అయితే..దీన్ని స్థానిక పోలీసులు కొట్టిపారేస్తున్నారు. ఈ ముఠా స్థానికంగా కాకుండా కర్ణాటక ప్రాంతా ల్లో నేరాలకు పాల్పడుతూ ఎవరికీ అనుమానం రాదనే ఉద్దేశంతో హిందూపురంలో తలదాచుకున్నట్లు వారు చెబుతున్నారు.
నిఘా వైఫల్యం :
కర్ణాటక ప్రాంతాల్లో నేరాలకు పాల్పడుతూ పక్కనే ఉన్న హిందూపురంలో మకాం పెడుతున్నా నిఘా విభాగం పోలీసులు గుర్తించలేకపోతున్నారు. కొన్ని నెలల క్రితం బెంగళూరు ఏటీఎం నిందితుడు హిందూపురం వచ్చి సెల్‌ఫోన్‌ను విక్రయించి దర్జాగా జారుకున్నాడు. ఇప్పుడు కుణిగల్ గిరి ముఠా పట్టుబడింది. దీన్నిబట్టే నేరగాళ్లకు హిందూపురం షెల్టర్ జోన్‌గా మారిందనే విషయం స్పష్టమవుతోంది. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రముఖ రాజకీయ నాయకులైన రాహుల్‌గాంధీ, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, నందమూరి బాలకృష్ణ.. ఇలా ముఖ్యులు హిందూపురం వచ్చినప్పుడు పోలీసులు అంతా కంట్రోల్‌లోనే ఉందని చెప్పుకున్నారు. అయితే..వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉండడంతో పట్టణవాసులు ఆందోళన చెందుతున్నారు.
కలకలం
Published Mon, May 19 2014 2:02 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM
Advertisement
Advertisement