సాక్షి ప్రతినిధి, అనంతపురం : ఆధ్మాత్మిక కేంద్రమైన పుట్టపర్తిని మావోయిస్టులు షెల్టర్ జోన్‌గా ఎంచుకున్నారా? వీవీఐపీల తాకిడి తగ్గిన నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు నిఘా, భద్రతను తగ్గించడాన్ని అలుసుగా తీసుకున్నారా? దాడులు చేసిన, రోగాల బారిన పడిన మావోయిస్టులను పుట్టపర్తిలో ఏర్పాటు చేసిన షెల్టర్‌కు తరలిస్తున్నారా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం
చెబుతున్నాయి పోలీసు నిఘా వర్గాలు. ఒడిశా పర్యాటక శాఖ మంత్రి మహేశ్వర మహంతిపై కాల్పులు జరిపిన నలుగురు మావోయిస్టులను పుట్టపర్తిలో గురువారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఇందుకు బలం చేకూర్చుతోంది.
వివరాల్లోకి వెళితే.. దశాబ్దం క్రితం వరకూ జిల్లా నక్సల్స్ ఖిల్లాగా ప్రసిద్ధికెక్కింది. పీపుల్స్ వార్(గణపతి వర్గం), పీపుల్స్ వార్(కేఎస్ వర్గం), ఓ వర్గం ప్రైవేటు సైన్యమైన ఆర్వోసీ(రీ ఆర్గనైజింగ్ కమిటీ), మరో వర్గం ప్రైవేటు సైన్యమైన రెడ్ స్టార్.. నక్సల్స్ కార్యకలాపాలతో జిల్లా అట్టుడికిపోయింది. సైద్ధాంతిక విభేదాలు పొడచూపడంతో ఒక్కోసారి నక్సల్స్ గ్రూపుల మధ్యే కాల్పులు చోటుచేసుకునేవి. కాల్పులు.. ఎదురు కాల్పులు.. ఎన్‌కౌంటర్లతో జిల్లా నెత్తురోడింది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల వల్ల జిల్లాలో అధికశాతం నక్సల్స్ లొంగిపోయి.. జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. కొందరు పోలీసు ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయాల వల్ల జిల్లాలో నక్సల్స్ కదలికలు లేకుండా పోయాయి.
మళ్లీ కలకలం..
గురువారం పుట్టపర్తిలోని ఓ ప్రైవేటు లాడ్జిలో నలుగురు మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. ఒడిశా పర్యాటక శాఖ మంత్రి మహేశ్వర మహంతిపై పూరీలో ఈనెల 21న నలుగురు మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఒడిశాలో గాలింపులు తీవ్రమవడంతో కాల్పులు జరిపిన మావోయిస్టులు ఫిబ్రవరి 23న పుట్టపర్తికి చేరుకున్నారు. ఓ ప్రైవేటు లాడ్జిలో ఏర్పాటు చేసుకున్న షెల్టర్‌లో నలుగురు మావోయిస్టులు నాలుగు రోజులుగా తలదాచుకుంటున్నారు. ప్రైవేటు లాడ్జిలో కొందరు వ్యక్తుల కదలికలు అనుమానాస్పదంగా ఉండటాన్ని నిఘా వర్గాలు పసిగట్టాయి. గురువారం తెల్లవారుజామున ఆ లాడ్జిపై దాడి చేసి.. నలుగురు మావోయిస్టులను అదుపులోకి తీసుకోవడం సంచలనం రేపింది. డీజీపీ ప్రసాదరావు ఆదేశాల మేరకు వారిని ఒడిశాకు తరలించారు.
వ్యూహాత్మకంగా మావోయిస్టులు..
పోలీసుల కార్యకలాపాలు తక్కువగా ఉండి.. ప్రశాంతంగా ఉన్న ప్రదేశాలను మావోయిస్టులు షెల్టర్ జోన్‌గా ఎంచుకుంటారు. షెల్టర్ జోన్ ఏర్పాటు చేసుకున్న ప్రదేశాల్లో మావోయిస్టులు ఎలాంటి దాడులకు, హింసాత్మక ఘటనలకు పాల్పడరు. తద్వారా తమ కదలికలు ఆ ప్రాంతంలో లేవనే సంకేతాలను పంపినట్లవుతుందన్నది వారి ఎత్తుగడ. ఎక్కడైనా దాడులు చేసిన తర్వాత గాలింపులు తీవ్రమైతే.. అందులో పాల్గొన్న మావోయిస్టులను షెల్టర్ జోన్‌కు తరలిస్తారు.
దాడుల్లో గాయపడిన వారిని.. రోగాల బారిన పడిన వారిని కూడా షెల్టర్ జోన్‌కు తరలిస్తారు. షెల్టర్ జోన్‌లో తమకు అత్యంత విశ్వసనీయమైన ఇన్‌ఫార్మర్లకు నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తారు. ఎప్పటికప్పుడు షెల్టర్ జోన్‌నూ.. నిర్వాహకులను మార్చుతుంటారు. తద్వారా ఎవరికీ అనుమానం రాదన్నది మావోయిస్టుల వ్యూహం. సత్యసాయి బాబా నిర్యాణం తర్వాత పుట్టపర్తికి వీవీఐపీల తాకిడి గణనీయంగా తగ్గింది. ఆ క్రమంలో పోలీసులు కూడా నిఘాను, బందోబస్తును తగ్గించారు. భక్తులు, పర్యాటకుల తాడికి కూడా గణనీయంగా పడిపోవడంతో పుట్టపర్తిలోని లాడ్జిలు 90 శాతం ఖాళీగా ఉంటున్నాయి.
ఇది పసిగట్టిన మావోయిస్టులు భక్తుల పేరుతో లాడ్జిలను అద్దెకు తీసుకుని.. షెల్టర్ ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. గురువారం నాటి ఘటన నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు పుట్టపర్తిలో నిఘా, భద్రతను కట్టుదిట్టం చేశారు. పుట్టపర్తిలో మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే విషయం తెలుసుకుని స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
పుట్టపర్తిలో మావోల కలకలం
Published Fri, Feb 28 2014 2:45 AM | Last Updated on Tue, Oct 16 2018 2:39 PM
Advertisement
Advertisement