వైకల్యంతో వీల్ చెయిర్‌కు పరిమితమైన ఇందిర ను చైల్డ్‌కేర్ హోమ్‌లో చేర్చారు తల్లిదండ్రులు. వారానికి ఒకసారి మాత్రమే ఇంటి నుంచి ఎవరో ఒకరు వచ్చి ఇందిరను కలిసేవారు. ఇందిరకేమో వాళ్లను పదేపదే చూడాలనిపించేది. ఎంతో ఇష్టమైన తన వాళ్లకు దూరంగా ఉన్నప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో ప్రత్యక్షం గా అనుభవించిన ఇందిర తనలాంటి వాళ్లకు ఇబ్బందులు కలగకుండా చూసేందుకు ‘ప్రేమ్ ఇల్లమ్’ పేరుతో షెల్టర్ హోమ్ ను నడుపుతూ.. 30 మంది పిల్లలను అమ్మలా ఆదరిస్తున్నారు.
ఇందిరకు ఐదేళ్లు ఉన్నప్పుడు పోలియో వచ్చి తొంభైశాతం వైకల్యానికి గురైంది. నడవడానికి రెండు కాళ్లు సహకరించనప్పటికీ ‘ఏదోఒకరోజు నేను నడవగలుగుతాను’ అన్న ధైర్యంతో ఉండేది. తల్లిదండ్రులు చెన్నైలోని ఓ షెల్టర్ హోంలో ఇందిరను చేర్చారు. హోమ్‌లో ఉన్న పిల్లలంతా బొమ్మలతో ఆడుకోవడానికి ఇష్టపడితే ఇందిర మాత్రం చదువుకునేందుకు ఆసక్తి చూపించేది.
అన్నయ్య ప్రోత్సాహంతో..
షెల్టర్ హోమ్‌లో సైకాలజిస్టుగా పనిచేస్తోన్న అన్నయ్య సెల్విన్ ఇందిర ఆసక్తిని గమనించి తల్లిదండ్రులతో మాట్లాడి ఇందిర డైలీ స్కూలుకు వెళ్లి చదువుకునేందుకు ప్రోత్సహించాడు. ఇందిర ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుందోనని తల్లిదండ్రులు భయపడ్డప్పటికీ, అన్న అండతో‡ధైర్యం గా ముందుకు సాగింది. కానీ చాలా స్కూళ్లు ఇందిర వైకల్యాన్ని సాకుగా చూపించి అడ్మిషన్ ఇవ్వడానికి వెనకాడాయి. ఎట్టకేలకు ఒక స్కూలు ఇందిరకు ఎనిమిదో తరగతిలో చేరేందుకు అడ్మిషన్ ఇచ్చింది. స్కూల్లో చేరిన ఇందిర అనేక భయాలు, ఆత్మనూన్యతకు లోనైనప్పటికీ అంకిత భావంతో ఎంతో కష్టపడి చదివి ఎస్‌ఎస్‌ఎల్‌సీ మంచి మార్కులతో పాసైంది. అలాగే డిగ్రీ, ఎంసీఏ కూడా పూర్తి చేసింది.
ప్రేమ్ ఇల్లమ్..
ఇందిర లాంటి వాళ్లను మరింత మందిని ప్రోత్సహించాలన్న ఉద్దేశ్యంతో సెల్విన్ 1999లో ‘ప్రేమ్ ఇల్లమ్’ను స్థాపించి వైకల్యం గలిగిన పిల్లలకు ఆసరాగా నిలుస్తున్నాడు. ఇందిర ఎంసీఏ అయ్యాక ఉద్యోగం చేసే అవకాశం వచ్చినప్పటికీ ప్రేమ్ ఇల్లమ్‌లో చేరి సేవ చేయాలని నిర్ణయించుకుంది. 2017 నుంచి ప్రేమ్ ఇల్లమ్ సంస్థకు సేవలందిస్తోంది. ప్రస్తుతం ప్రేమ్ ఇల్లమ్‌లో 30 మంది అమ్మాయిలు ఉన్నారు. వీరిలో ఐదుగురు స్కూలుకెళ్తుండగా మిగతా వారంతా హోమ్‌లోనే ఉంటున్నారు. ఈ పిల్లలకు చదువు చెప్పడం కోసం ఇందిర స్పెషల్ ఎడ్యుకేషన్‌లో బిఈడీ చేసి వారికి పాఠాలు చెబుతోంది. అంతేగాక 2019 నుంచి సేంద్రియ పద్ధతిలో పంటలు పండిస్తూ, ఆ పంటలతోనే షెల్టర్ హోమ్ పిల్లలకు భోజనం పెడుతుండడం విశేషం. కరోనా కష్టకాలంలో గ్రామంలోని పాజిటివ్ పేషంట్లకు భోజనాన్ని పంపిణీ చేసింది.
‘‘నా చిన్నప్పటినుంచి పన్నెండేళ్ల వరకు షెల్టర్ హోంలో గడిపాను. దీంతో బయట సమాజంలో ఎలా ఉంటుందో తెలిసేది కాదు. శారీరక, మానసిక వైకల్యం లేని పిల్లల్ని ఎప్పుడూ కలవలేదు. ఎనిమిదో తరగతిలో చేరి కొత్తకొత్త పాఠ్యాంశాలను నేర్చుకోవడం, తోటి విద్యార్థులతో కలవడం కష్టంగా ఉండేది. రోజూ స్కూలు అవగానే అన్నయ్య దగ్గర బాధపడేదాన్ని. ‘‘నువ్వు ధైర్యాన్ని కోల్పోవద్దు నిన్ను నువ్వు గట్టిగా నమ్ము’’ అని వెన్ను తట్టి చెప్పేవారు. అ ప్రోత్సాహంతోనే ఎంసీఏ వరకు చదివాను. నాకు ఒకరు ఏవిధంగా చెయ్యందించారో అలానే నేను నాలాంటి వాళ్లకు సాయం చేయాలని ప్రేమ్ ఇల్లమ్‌లో పని చేస్తున్నాను. మేము సేంద్రియ పద్ధతిలో ఒక్కో పంటకు 25 బస్తాల ధాన్యాన్ని పండిస్తాము. అవి హోమ్‌లో ఉన్న పిల్లలకు సరిపోతాయి. కూరగాయలు, పండ్ల చెట్లు కూడా పెంచి పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం’’ అని ఇందిర చెప్పింది.
పట్టుదలకు వైకల్యం అడ్డురాదని, ఎంతటి పనినైనా సాధించవచ్చని ఇందిర ‘ప్రేమ్ ఇల్లమ్’ నిరూపిస్తుంది.
ప్రేమ్ ఇల్లమ్.. వీల్‌చెయిర్‌తోనే నడిపిస్తోంది
Published Sun, Jul 18 2021 5:56 AM | Last Updated on Sun, Jul 18 2021 5:56 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment