
వృద్ధాశ్రమంలో సినీ నటుడు రంగనాథ్ జన్మదిన వేడుక
రసూల్‌పురా (హైదరాబాద్) : టాలీవుడ్ ప్రముఖ నటుడు రంగనాథ్ తన 70వ జన్మదిన వేడుకలను శుక్రవారం పాతబోయిన్‌పల్లిలోని అమ్మ వృద్ధాశ్రమంలో జరుపుకున్నారు. ఆశ్రమంలో కేక్ కట్ చేసి వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. కుటుంబసభ్యుల మధ్య కన్నా ఆశ్రమవాసుల మధ్య పుట్టిన రోజు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హీరోకు మాత్రమే ప్రాముఖ్యం ఇచ్చేటువంటి సినిమాలను దర్శక, నిర్మాతలు ప్రోత్సహిస్తున్న కారణంగా నేడు సినిమాలకు మహిళా ప్రేక్షకులు దూరమవుతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం కుర్రకారు కోసమే సినిమాలు తీస్తున్నారని ఆయన అన్నారు. కార్యక్రమంలో రంగనాధ్ స్నేహితులు శేషు,ఆశ్రమ నిర్వాహకులు కరీమున్నీసా, అయేషా, సాయి పాల్గొన్నారు.