old age marriages
-
మలి ప్రేమ..: ఔను.. వాళ్లు ఇష్టపడ్డారు
ప్రేమికుల రోజంటే యువ హృదయాల గురించే మాట్లాడుకుంటారు. వారి ఆశలు, ఆనందాల గురించే ప్రస్తావిస్తుంటారు. మలివయసులో ఒంటరితనంతో బాధపడుతున్న పెద్దలు... తోడును కోల్పోయిన జీవితాల్లో వెలుగులు నింపడం గురించి ఆలోచిస్తున్నామా?!తీరిక లేని మన జీవితాల్లో నుంచి వారిని దూరం పెడుతున్నాం సరే, వారి మదిలో దాగున్న ప్రేమలను, బాధలను అర్ధం చేసుకుంటున్నామా?! ఆరుపదుల వయసులో మనసున మనసై బతుకున బతుకై తోడొకరుండిన అదే భాగ్యమూ .. అని కోరుకుంటున్న ఒంటరి పెద్దల ప్రేమలనూ గౌరవిద్దామా... ప్రేమికుల దినోత్సవం సందర్భంగా మలి వయసులో చిగురించిన తమ ప్రేమను ఫలప్రదం చేసుకున్న కొన్ని జంటల ప్రేమ కథల గురించి చెబుతున్నారు తోడూనీడా వ్యవస్థాపకురాలు రాజేశ్వరి. ప్రేమ, పెళ్లి విషయానికి వస్తే వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే అనేది ఇటీవల జరుగుతున్న సంఘటనలు రుజువు చేస్తున్నాయి. గౌహతిలోని ప్రమోద్ తాలూక్దార మెమోరియల్ వృద్ధాశ్రమంలో ఉంటున్న 71 ఏళ్ల పద్మేశ్వర్ గోలాకు పాటలు పాడటం హాబీ. ఆ వృద్ధాశ్రమంలో గోలా స్వరానికి మంత్రముగ్ధురాలైన 65 ఏళ్ల జయప్రభ బోరా అతన్ని ఇష్టపడింది. అతను ఆమెను ‘జాన్’ అని పిలుస్తాడు. ఆమె అతన్ని ‘బాబు’ అని పిలుస్తుంది. గోలాకు కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. జయప్రభకు మాత్రం పిల్లలున్నారు. భర్త ఎప్పుడో చనిపోయాడు. బోరా పిల్లలు, మనవలు కూడా ఈ అవ్వ–తాత పెళ్లి జరిపించి, వారి ఆనందంలో తామూ పాలు పంచుకున్నారు. సాయంగా మారిన ప్రేమరాజమండ్రి అర్బన్ నారాయణపురానికి చెందిన మాడుగుల మూర్తి వయసు 65 ఏళ్లు. నూడుల్స్ బండి నడుపుకునే చిరువ్యాపారి. ఎప్పుడో కుటుంబాన్ని వదిలి బయటకు వచ్చేశాడు. ఆరోగ్యం సహకరించడం లేదు. ఒంటరిగా జీవించలేక స్థానికంగా ఉండే స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో చేరారు. ఆశ్రమంలోకి వచ్చాక కూడా ఎవరితోనూ మాట్లాడకుండా అనాసక్తంగా రోజులు గడుపుతుండేవారు. కడప జిల్లా కమ్మలగుంటకు చెందిన 68 ఏళ్ల గుజ్జుల రాములమ్మ అదే ఆశ్రమంలో కొన్నాళ్లుగా ఉంటున్నారు. ఆశ్రమంలో ఆరోగ్యం బాగోలేని వారికి తనకు చేతనైనంతలో సేవలు చేస్తుండేది. కొన్నినెలలుగా సేవలు అందిస్తున్న రాములమ్మతో మూర్తికి మానసిక బంధం ఏర్పడింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఆశ్రమ నిర్వాహకులను కలిసి, తమ మనసులో మాట చె΄్పారు. ప్రేమలకు వయసుతో పనిలేదు. మానసికంగా ‘మాకోసం ఒకరున్నారు’ అనే భావన జీవించడానికి కొత్త శక్తిని ఇస్తుంది. ఒంటరి పెద్దలు కోరుకుంటున్న జీవనాన్ని అందించడానికి వారి కుటుంబసభ్యులూ అండగా నిలవాల్సిన సమయమిది.సాయంగా ఉండాలనుకున్నాం.. అనారోగ్యంగా ఉండి, ఆసుపత్రికి వెళ్లాలన్నా అక్కడ మీతోపాటు ఎవరినైనా వచ్చారా..’ అని డాక్టర్లు అడుగుతున్నారు. కొన్నాళ్లుగా నాకు సాయంగా రాములమ్మ ఉంటోంది. ఏ విషయంలోనైనా ఆమెకు సాయంగా నేనూ ఉంటాను అని చె΄్పాను. ఇద్దరమూ ఒకరికి ఒకరం తోడుగా ఉందామనుకుని, పెళ్లి చేసుకోవాలనుకున్నాం. ఆశ్రమం వాళ్లు మమ్మల్ని అర్ధం చేసుకున్నారు. అంతా కలిసి ఈ మధ్యే మా ఇద్దరికీ దండలు మార్చి, అందరి సమక్షంలో పెళ్లి చేశారు. ఇప్పుడు మాకు ఒకరున్నారనే తోడు, జీవనానికి భరోసా ఉంది. – మూర్తి, రాములమ్మమనసులో మాట పంచుకోవడానికి...మలివయసు ప్రేమకథలు మనసుకు హత్తుకునేలా ఉంటాయి. తోడు–నీడ వేదికగా మలివయసు జంటలను కలుపుతున్నాను. ఆరు పదుల వయసు దాటినా, వారిలో అంతటి ప్రేమ ఉందా అనే ఆశ్చర్యమూ కలుగుతుంది. ఈరోజుల్లో పిల్లలు కూడా పెద్దల పెళ్లికి అంగీకరిస్తున్నారు. కానీ, ఇంకా సమాజం అంగీకరించడంలేదు. ఆ వయసు లో ప్రేమ–పెళ్లి అవసరమా? అంటున్నారు. మలివయసులో అనారోగ్యంగా ఉన్నప్పుడు ఏదో భయం, దిగులు ఆవరిస్తుంది. బాగోలేనప్పుడే మరొకరి అవసరం ఉంటుంది. ఇరవైల్లో చేసుకునేదే ప్రేమ పెళ్లి కాదు.. అరవైల్లోనూ ఎమోషనల్ రిలేషన్ కోరుకునేవారి సంఖ్య పెరుగుతోంది.– రాజేశ్వరి, తోడు నీడ వ్యవస్థాపకురాలు -
నా తోడు వై .... నీ నీడనై
ఒంటరి తల్లిదండ్రులకు తోడు కోసం పిల్లల అన్వేషణ పెరుగుతున్న ‘కొత్త’ దంపతులు హైదరాబాద్ : మా అమ్మకు ఒక తోడు కావాలి.... అవును.. మా నాన్నకు కూడా తోడు కావాలి... మంచి సంబంధం ఉంటే చూసి పెట్టండి. వాళ్లకు నచ్చితే పెళ్లి చేస్తాం. కుల, మతాలతో సంబంధం లేదు. ఒకరినొకరు అర్ధం చేసుకొని తోడుగా ఉంటే చాలు...అంటున్నారు పిల్లలు. ఇదేంటీ?... పిల్లలు తల్లిదండ్రుల కోసం సంబంధాలు వెదకడమేమిటీ? అని ఆశ్చర్యపోతున్నారా? కానీ ఇది నిజం. ‘మనసున మనసై.. బతుకున బతుకై తోడొకరుండిన అదే భాగ్యమూ..’ అనుకుంటూ ఒంటరిగా గడుపుతున్న తమ తల్లికి.. లేదా తండ్రికి తోడు కోసం పిల్లలు అన్వేషిస్తున్నారు. వాళ్లకు నచ్చిన వ్యక్తులతో పెళ్లిళ్లు చేస్తున్నారు. అంతే కాదు. ఈ పెళ్లిళ్లకు బంధుమిత్రులను కూడా ఆహ్వానిస్తున్నారు. నగరంలో ఈ నయా ట్రెండ్‌కు అద్భుతమైన ఆదరణ లభిస్తోంది. ఒకప్పుడు తోడు కోసం వెతుక్కొనే ఒంటరి తల్లిదండ్రులను తృణీకార భావంతో చూసిన కొడుకులు, కూతుళ్లే ఇప్పుడు వారికి తోడు తెచ్చేందుకు స్వయంగా ముందుకొస్తున్నారు. కొడుకులు, కోడళ్లు, కూతుళ్లు, మనుమలు, మనుమరాళ్లు అందరూ ఉండి కూడా జీవిత భాగస్వామిని కోల్పోయి... ఏళ్ల తరబడి ఒంటరిగా జీవిస్తున్న పెద్దల జీవితాల్లో ప్రసరిస్తున్న కొత్త వెలుగులివి. ఈ కాంతుల వెనుక కృషిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం... నూతన ఒరవడి బంజారాహిల్స్‌కు చెందిన ప్రీతి (పేర్లు మార్చాం) ముంబయిలోని ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తోంది. రెండేళ్లుగా పెళ్లి కోసం బంధువులు ఒత్తిడి చేస్తున్నారు. కానీ ఒంటరిగా ఉన్న అమ్మకు పెళ్లయితే తప్ప తాను చేసుకోబోనని తెగేసి చెప్పింది. అంతేకాదు... అమ్మకు తోడు కోసం ఓ స్వచ్చంద సంస్థను సైతం ఆశ్రయించింది. ఆమె మాటల్లోనే చెప్పాలంటే ‘ నేను పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్లిపోతే అమ్మ ఒంటరిగా ఉంటుంది. ఆమె ఆలనాపాలనా చూసుకునేందుకు ఎవ్వరూ ఉండరు. అమ్మను అలా వదిలేసి వెళ్లడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు’... ఇది ఒక్క ప్రీతి ఆవేదన మాత్రమే కాదు. ఎంతోమంది కూతుళ్లు... కొడుకుల ఆవేదన కూడా. సికింద్రాబాద్ ఏఎస్రావు నగర్‌కు చెందిన 65 ఏళ్ల విప్రనారాయణ కపూర్, 55 ఏళ్ల జయేందిర ఏడాది క్రితమే వివాహం చేసుకున్నారు. ఆ పెళ్లికి కొడుకులు, కూతుళ్లు, దగ్గరి బంధువులంతా తరలి వచ్చారు. ఏడాది నుంచి ఆ దంపతులు ఎంతో అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటున్నారు. రాజేందర్రావు రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి. ఆయన కొడుకు అమెరికాలో స్థిరపడ్డాడు. హైదరాబాద్‌లో ఒంటరిగా ఉంటున్న తన తండ్రికి తోడు కావాలని స్వచ్ఛంద సంస్థను ఫోన్లో సంప్రదించాడు. 62 ఏళ్ల రాజేశ్వరరావుకు, 53 ఏళ్ల విద్యావతికి వివాహమైంది. కొడుకు అమెరికా నుంచి వచ్చి దగ్గరుండి మరీ పెళ్లి చేసి వెళ్లాడు. యాభై ఏళ్లు పైబడి.. ఒంటరిగా బతుకుతున్నవ్యక్తుల కోసం... వారి ఆకాంక్షలను సఫలీకృతం చేయడం కోసం... తోడు కోసం పరితపించే ఒంటరి పెద్దవాళ్లకు బాసటగా నిలిచేందుకు ఆవిర్భవించిన ‘తోడు-నీడ’ సంస్థ కృషి ఇది. ఫలితంగా ఇప్పటి వరకు సుమారు 150 జంటలు ఏకమయ్యాయి. కనీసం 600 మంది తోడు కోసం తమ పేర్లు నమోదు చేసుకొని నిరీక్షిస్తున్నారు. మరెందరో ఫోన్లలో సంప్రదిస్తున్నారు. రెండేళ్లుగా 50 మంది పెద్దలు తమ పిల్లల సమక్షంలో ఒక్కటయ్యారు. అలా ఒక్కటి కావడమే కాదు. ఎలాంటి విభేదాలు... ఇబ్బందులు లేకుం డా కలిసి బతుకుతున్నారు. ఒక బలమైన సామాజిక మార్పునకు ఇది నిదర్శనం. దూరాలు పెరిగి.... ఓవైపు ఉమ్మడి కుటుంబాలు ఉనికి కోల్పోయాయి. మరోవైపు ఉపాధి కోసం నగరాలు, దేశాలు దాటి వెళ్లడం యువతకు తప్పనిసరైంది. దీంతో తల్లిదండ్రులు... పిల్లలకు మధ్య తెలియని ‘దూరం’ పెరిగింది. ఒకప్పుడు కొడుకులు, కోడళ్లు, మనుమలు, మనుమరాళ్లతో కళకళలాడిన లోగిళ్లు వెలవె ల బోతున్నాయి. ఇళ్లలో పెద్దలు మాత్రమే మిగిలిపోయారు. ఇది ఒక పరిణామమైతే... మరోవైపు వ్యక్తుల సగటు ఆయుః ప్రమాణం 62 నుంచి 67 ఏళ్లకు పెరిగింది. మహిళల్లో ఇది ఇంకొంచెం ఎక్కువే. దీంతో పాటు వృద్ధాప్య సమస్యలూ పెరిగాయి. పిల్లలు, సమాజం వల్ల నిరాదరణకు గురయ్యే వయోధికులు కుంగుబాటుకు లోనవుతున్నారు. ఈ క్రమంలో జీవిత భాగస్వామిని కోల్పోయి... ఒంటరిగా మిగిలినప్పుడు ఆ జీవితం మరింత నరకప్రాయంగా మారుతుంది. ‘మగవారి కంటే మహిళలే ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. పిల్లలు పట్టించుకోవడం లేదు. ఓల్డేజ్ హోమ్‌లకు పంపిస్తున్నారు. ఇలాంటి ఒంటరి తల్లిదండ్రులు తమ భావోద్వేగాలను పంచుకోవడానికి తోడు కోసం తపిస్తున్నారు’ అని అంటున్నారు ‘తోడు-నీడ’ వ్యవస్థాపక అధ్యక్షురాలు రాజేశ్వరి. ఐదేళ్ల క్రితం ఈ సంస్థను స్థాపించినప్పుడు అంతా విస్మయం వ్యక్తం చేశారు. అదెలా సాధ్యమని ఆశ్చర్యపోయారు. తోడు కావాలనే తపన ఉన్నప్పటికీ ఎంతోమంది పెద్దలు పిల్లల కారణంగా వెనుకడుగు వేశారు. ‘తమ తండ్రో...తల్లో పెళ్లి చేసుకుంటే వారి పేరిట ఉన్న ఆస్తులు పోతాయనే ఉద్దేశంతో అలాంటి పెళ్లిళ్లను బిడ్డలు అడ్డుకున్నారు. తమ పిల్లలకు పెళ్లిళ్లు కావని బాధ పడ్డారు. జీవిత చరమాంకంలో తోడు ఏమిటని నిందించారు. నన్ను అనేక రకాలుగా బెదిరించారు. ఇదంతా నాలుగైదేళ్ల కిందటి సంగతి. పెద్దలు పెళ్లి చేసుకుంటే తమ కుటుంబ పరువు పోతుందనుకున్న అపోహల నుంచి ఇప్పుడు చాలా దూరమే నడిచి వచ్చారు. ఇది గొప్ప మార్పు’ అంటున్నారు రాజేశ్వరి. ఇప్పుడు కొత్త వెలుగు సమాజం మొత్తంగా ఈ మార్పు వచ్చిందని కాదు కానీ... ఒక బలమైన ప్రవాహం మాత్రం మొదలైంది. తోడు కోసం తపించి... పిల్లలను ఎదిరించి వారికి దూరమైన వాళ్లు...బిడ్డలను ఎదురించలేక కుమిలిపోయిన వాళ్లు ఉన్నారు. వయోభారంతో అందరూ ఉండి కూడా ఆదరించేవాళ్లు లేక నీళ్లింకిన గాజు కళ్లతో గడిపేస్తున్న వారూ ఉన్నారు. ఒకప్పుడు కుటుంబ భారాన్నంతా మోసి... సంపదను సృష్టించి విజయవంతంగా బాధ్యతలను నిర్వర్తించిన పెద్దలు వాళ్లు. ఇప్పుడు ‘నేనున్నానంటూ’ ఆప్యాయంగా పలకరించే పిలుపు కోసం... ఓ నులివెచ్చని స్పర్శ కోసం నిరీక్షిస్తున్నారు. ఆ పెద్దల మనస్సును అర్ధం చేసుకొని వాళ్ల ఆశలు... ఆకాంక్షలు... అభిరుచులకు అనుగుణంగా నడుచుకోవడం తప్ప కొడుకులు, కూతుళ్లు నిర్వర్తించవలసిన బాధ్యత మరొకటి ఉంటుందా..?