సర్కారుకు ఖమ్మం ముంపు బాధితుల విజ్ఞప్తి
సర్వం కోల్పోయాం.. లక్షల్లో నష్టపోయాం..
నిత్యావసరాల నుంచి ఎలక్ట్రానిక్ సామగ్రి దాకా ఏదీ మిగల్లేదు.. రోజూ పనికి వెళ్తేనే తప్ప పూట గడవని పరిస్థితి
రూ.16,500 సాయంతో తాత్కాలిక ఉపశమనమేనని ఆవేదన.. తమ బతుకులు గాడినపడాలంటే సాయం పెంచాలని డిమాండ్
పంట పరిహారం కూడా పెంచి ఇవ్వాలని విజ్ఞప్తులు
సాక్షిప్రతినిధి, ఖమ్మం: మున్నేరు ముంపు నష్టం లెక్క కట్టలేని స్థాయిలో ఉందని.. కానీ ప్రభుత్వం ఇస్తామంటున్న సాయం సరిపోయేలా లేదని వరద బాధితులు వాపోతున్నారు. నిత్యావసరాలు, దుస్తుల నుంచి ఎలక్ట్రానిక్ సామగ్రిదాకా ఏదీ మిగల్లేదని.. సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజూ పనికి వెళ్తే తప్ప పూటగడవని పరిస్థితుల్లో ఉన్న తమ బతుకులు గాడిన పడాలంటే సర్కారు ఆర్థిక సాయాన్ని మరింత పెంచాలని కోరుతున్నారు. వరద ముంపునకు గురై ఎనిమిది రోజులు దాటినా ఇంకా ఎలాంటి సాయం అందలేదని వాపోతున్నారు.
సాయం కోసం ఎదురుచూస్తూనే..
మున్నేరు ముంపు ప్రాంతాల్లో పరిస్థితులు ఇంకా కొలిక్కిరాలేదు. ఇళ్లను, మిగిలిన సామగ్రిని శుభ్రం చేసుకునేందుకే బాధితులు అష్టకష్టాలు పడుతున్నారు. ఎవరైనా వచ్చి ఏదైనా సాయం అందిస్తారా అంటూ ఎదురుచూస్తున్నారు. మున్నేరు, ఆకేరు ఇతర వాగులకు వచ్చిన వరదతో ఖమ్మం జిల్లాలో 15,201 ఇళ్లు నీట మునగగా.. 70 వేల మందికిపైగా నిరాశ్రయులయ్యారు. ఎవరిని కదిలించినా.. సర్వం కోల్పోయి, మళ్లీ మొదటి నుంచి జీవితం ప్రారంభించాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు.
ఇళ్లలోని ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్, టీవీ, మిక్సర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు, మంచాలు, టేబుల్స్, నిత్యావసరాలు అన్నీ పాడైపోయాయని అంటున్నారు. ఏళ్లకేళ్లుగా కూడబెట్టుకుని సమకూర్చుకున్న సామగ్రి అంతా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రూ.16,500 సాయం అందిస్తే, తాత్కాలిక ఉపశమనమే ఉంటుందని.. ఇక తమ బతుకులు గాడినపడేది ఎలాగని వాపోతున్నారు.
పొలాల పరిహారమూ పెంచాలి..
వరదల వల్ల సాగుకోసం చేసిన పెట్టుబడులు పూర్తిగా నష్టపోయామని.. ఇప్పుడు మళ్లీ పెట్టుబడులు అవసరమని రైతులు చెప్తున్నారు. ప్రభుత్వం ఎకరాకు రూ.10 వేలు ఇస్తామన్న పరిహారాన్ని పెంచాలని కోరుతున్నారు. ముఖ్యంగా కొన్నిచోట్ల పొలాల్లో ఇసుక మేటలు, రాళ్లు చేరాయని.. వాటిని తొలగించాలంటే రూ.లక్షల్లో ఖర్చవుతుందని అంటున్నారు. అలాంటప్పుడు పరిహారం ఎలా సరిపోతుందని ప్రశ్నిస్తున్నారు.
పాలేరు వరదతో ఆరు ఎకరాల్లో వరి కొట్టుకుపోయింది. పొలం కోతకు గురై ఇసుక మేట వేసింది. కరెంటు మోటార్లు, స్తంభాలు కూడా కొట్టుకుపోయాయి. రూ.4 లక్షలకుపైనే నష్టం జరిగింది. ప్రభుత్వం ఇస్తామన్న పరిహారంతో ఇవన్నీ సరిచేసుకునేదెట్లాగో తెలియడం లేదు.
– బీరెల్లి సుధాకర్‌రెడ్డి, మల్లాయిగూడెం, కూసుమంచి మండలం, ఖమ్మం జిల్లా
ఈ సాయం సరిపోదు..
ఖమ్మం ధంసలాపురానికి చెందిన నిడిగుండ నరేశ్–ఈశ్వరమ్మలకు ఇద్దరు పిల్లలు. రోజూ పనికి వెళ్తేనే కుటుంబం గడిచేది. మున్నేరు వరదతో ఇంటి పునాది కోతకు గురై గోడలు పడిపోయాయి. ఇంట్లోని టీవీ, ఫ్రిడ్జ్, కూలర్, గ్యాస్ సిలిండర్ అన్నీ కొట్టుకుపోయాయి. ప్రభుత్వం ఇస్తామంటున్న ఆర్థిక సాయంతో కోలుకునేది ఎలాగని నరేశ్ దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం దయ చూపితేనే..
ఖమ్మం మోతీనగర్‌కు చెందిన కస్తూరి సంతోష–రమేశ్ కూలి పనులు వెళ్లి జీవిస్తున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. మున్నేటి వరదతో ఇంటి ప్రహరీ కూలిపోగా, తలుపులు ఊడిపోయి సామగ్రి కొట్టుకుపోయింది. ఇప్పటివరకు ఎలాంటి సాయం అందలేదని.. తమపై ప్రభుత్వం దయచూపితేనే కోలుకుంటామని వారు వాపోతున్నారు.
ఆదుకుంటేనే మనుగడ
ఖమ్మం వెంకటేశ్వర నగర్‌కు చెందిన వెంకటేశ్వర్లు తోపుడు బండిపై కూరగాయలు అమ్మడంతోపాటు చిన్న కిరాణాషాపు నిర్వహిస్తున్నాడు. ఆయనకు ఇద్దరు పిల్లలు. మున్నేటి వరదతో ఇంట్లో సామాన్లతోపాటు కిరాణా షాపులోని సామగ్రి అంతా కొట్టుకుపోయాయి. «అధికారులు వచ్చి పేర్లు రాసుకెళ్లినా ఇంకా ప్రభుత్వ సాయం అందలేదని.. సర్వం కోల్పోయిన తాము సాధారణ స్థితికి వచ్చేలా ప్రభుత్వమే ఆదుకోవాలని వెంకటేశ్వర్లు కోరుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment