సాక్షి, ఖమ్మం: గత కొద్ది రోజులుగా తెలంగాణలో ఎడతెరిపిలేని వానలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో చెరువులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో, లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, రోడ్లు తెగిపోయాయి. రోడ్డు రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక, ఖమ్మం జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో మున్నేరు తీవ్రరూపం దాల్చింది.
వివరాల ప్రకారం.. మున్నేరు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ప్రస్తుతం మున్నేరు నీటి మట్టం 19 అడుగులకు చేరుకుంది. ఈ క్రమంలో 18 అడుగులకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్. దీంతో, బ్రిడ్జిపై నుంచి వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. ఇదే సమయంలో అక్కడి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. నాయబజార్ కాలేజీ, స్కూల్‌తో పాటు ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు.
ఇదిలా ఉండగా.. ఖమ్మం జిల్లాలోని పాలేరు పూర్తి స్థాయిలో నిండిపోయింది. పాలేరు రిజర్వాయర్ నీటి మట్టం పూర్తి స్థాయిలో 23 అడుగులకు చేరుకుంది. ప్రస్తుత నీటి మట్టం 23.25గా ఉన్నట్టు తెలుస్తోంది. పాలేరుకు ప్రస్తుత ఇన్ ఫ్లో 12,438 క్యూసెక్కులుగా ఉండగా.. ఔట్ ఫ్లో 10, 614 క్యూసెక్కులుగా ఉంది.
మరోవైపు.. రెండు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు సత్తుపల్లి జేవీఆర్, కిష్టారం ఓపెన్ కాస్ట్‌లలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. జేవీఆర్ ఓసీలో 60 వేల టన్నులు, కిష్టారం ఓసీలో 16 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.
పాలేరు రిజర్వాయర్
పూర్తిస్థాయి నీటిమట్టం : 23 అడుగులు
ప్రస్తుత నీటిమట్టం : 23.5
బేతుపల్లి పెద్దచెరువు
పూర్తిస్థాయి నీటిమట్టం : 16 అడుగులు
ప్రస్తుత నీటిమట్టం : 16.1
పెదవాగు ప్రాజెక్టు
పూర్తిస్థాయి నీటిమట్టం : 19 అడుగులు
ప్రస్తుత నీటిమట్టం : 11
కిన్నెరసాని రిజర్వాయర్
పూర్తిస్థాయి నీటిమట్టం : 407 అడుగులు (8.4 టీఎంసీలు)
ప్రస్తుత నీటిమట్టం : 402.2 అడుగులు (7.85 టీఎంసీలు)
తాలిపేరు ప్రాజెక్టు
పూర్తిస్థాయి నీటిమట్టం : 74 మీటర్లు
ప్రస్తుత నీటిమట్టం : 72.11 మీటర్లు
Comments
Please login to add a commentAdd a comment