
జమ్మూ: తాము సొంతంగా అభివృద్ధి పరిచిన యాంటీ డ్రోన్ టెక్నాలజీని రక్షణ రంగ పరిశ్రమలకు అందజేసినట్లు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) చీఫ్ జి.సతీశ్‌రెడ్డి వెల్లడించారు. కొత్త సాంకేతికత సాయంతో డ్రోన్లను ఎదుర్కొనే విధంగా రూపకల్పన చేసిన వ్యవస్థలను ఈ పరిశ్రమలు రక్షణ, భద్రతా సంస్థలకు అవసరమైన విధంగా తయారు చేసి అందజేస్తాయని ఆయన తెలిపారు. శత్రు డ్రోన్లపై నిఘా వేసి, గుర్తించి, వెంటాడేందుకు అవసరమైన అన్ని సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ వ్యవస్థలు ఈ టెక్నాలజీలో ఉన్నాయన్నారు. ఈ కొత్త వ్యవస్థలను పలుమార్లు విజయవంతంగా పరీక్షించినట్లు వెల్లడించారు. వాటిని స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవాల సమయంలో మోహరించినట్లు వివరించారు. గురువారం జమ్మూలో సెంట్రల్ యూనివర్సిటీలో డీఆర్‌డీవో ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న కలాం సెంటర్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ(కేసీఎస్‌టీ) శంకుస్థాపన చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు.