సాక్షి, హైదరాబాద్: రక్షణ రంగంలో స్వావలం బనకు సరికొత్త ప్రయత్నం మొదలైంది. ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా 108 వ్యవస్థలు, ఉపవ్యవస్థలను దేశీయంగానే తయారు చేసేందుకు డీఆర్‌డీవో శ్రీకారం చుట్టింది. ఈ టెక్నాల జీలు మనకు చేసే మేలు ఏమిటి? ఆత్మ నిర్భర్ భారత్‌తో రక్షణ రంగంలో వచ్చిన మార్పులేమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకొనేందుకు డీఆర్‌డీవో చైర్మన్ డా.జి.సతీశ్‌రెడ్డితో ‘సాక్షి’ ముచ్చటించింది.
ప్రశ్న: రక్షణ రంగంలో స్వావలంబన కోసం ఆత్మనిర్భర్ భారత్ నినాదంతో వచ్చిన మార్పులేమిటి?
జవాబు: స్వావలంబన సాధించాలన్నది దేశ చిరకాల వాంఛ. నిజానికి డీఆర్‌డీవో ఏర్పాటు ఉద్దేశాల్లో ఇది ఒకటి. ఆరు దశాబ్దాలుగా డీఆర్ డీవో కీలకమైన రక్షణరంగ వ్యవస్థల్లో ఇతరు లపై ఆధారపడకుండా ఉండేందుకు పరిశోధ నలు సాగిస్తోంది. స్వావలంబన సాధించేం దుకు అందరూ కలసికట్టుగా ప్రయత్నించాలని ప్రధాని మోదీ ఆత్మనిర్భర్ భారత్ ద్వారా పిలుపునిచ్చారు. దీనివల్ల అక్కడక్కడా జరుగుతున్న వేర్వేరు ప్రయత్నాలు ఏకతాటి పైకి వస్తాయి. ఫలితంగా లక్ష్యాన్ని వేగంగా అందుకోవచ్చు. ప్రధాని పిలుపు రక్షణ వ్యవస్థలోని అన్ని విభాగాల్లో కొత్త చైతన్యం నింపిందనడంలో సందేహం లేదు. శాస్త్రవేత్తలు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారు. ఈ మార్పును నేను కూడా ప్రత్యక్షంగా గమనిస్తున్నా. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం డీఆర్‌డీవో అంతర్గత శక్తియుక్తులను బహిర్గతం చేస్తోందంటే అతిశయోక్తి కాదు.
ప్ర: దేశానికి అవసరమైన అన్ని రకాల మైక్రోప్రాసెసర్లు, ఆపరేటింగ్ సిస్టమ్‌లను సొంతంగా తయారు చేసుకొనే అవకాశం ఉందా?
జ: కచ్చితంగా ఉంది. ఆధునిక ప్రపంచంలో యుద్ధం తీరుతెన్నులు మారిపోతున్నాయి. సైబర్ యుద్ధం నేపథ్యంలో వ్యూహాత్మక వ్యవస్థలు, ఆస్తులను కాపాడుకోవడం అత్యవసరం. డీఆర్‌డీవో ఇందుకోసం అన్ని స్థాయిల్లో ప్రయత్నాలు చేస్తోంది. మనదైన ఆపరేటింగ్ సిస్టమ్‌ను కూడా అభివృద్ధి చేస్తున్నాం. డీఆర్‌డీవో ఇప్పటికే సొంత ఓఎస్‌ను అంతర్గతంగా ఉపయోగిస్తోంది. మైక్రోప్రాసెసర్ల తయారీలో కొన్ని దేశాల గుత్తాధిపత్యాన్ని తప్పించుకొనేందుకు పరిశ్రమ వర్గాలతో కలసి సిస్టమ్ ఆన్ చిప్‌తోపాటు కొన్ని ప్రాసెసర్ల అభివృద్ధి కూడా చేపట్టాం. ఈ ప్రయత్నాలన్నింటి ఫలితాలను మనం త్వరలోనే చూడబోతున్నాం.
ప్ర: ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం కోసం డీఆర్‌డీవో గుర్తించిన 108 రకాల రక్షణ వ్యవస్థల వల్ల లాభాలేమిటి?
జ: భారతీయ పరిశ్రమ వ్యాపార అవకాశాలు పెరుగుతాయి. ఈ 108 రక్షణ వ్యవస్థలు, ఉప వ్యవస్థలపై పనిచేసే క్రమంలో పరిశ్రమ వర్గాలు అత్యాధునిక టెక్నాలజీల డిజైనింగ్, డెవలప్‌మెంట్ సామర్థ్యాన్ని సంపాదించుకుంటాయి. ఈ సామర్థ్యం కాస్తా పరిశ్రమ మరింత ప్రగతి సాధించేందుకు తద్వారా భవిష్యత్తులో దేశ రక్షణ అవసరాలను తీర్చగలిగేవిగా మారతాయి. ఆత్మనిర్భర్ భారత్‌కు పరిశ్రమ తోడ్పాటు అందించడమే కాకుండా రక్షణ రంగంలో మరిన్ని ఎగుమతులు సాధించేందుకు వీలు ఏర్పడుతుంది.
ప్ర: డీఆర్‌డీవో టెక్నాలజీలను సామాన్యులకు దగ్గర చేసేందుకు ప్రయత్నాలేమైనా చేస్తున్నారా?
జ: సరిహద్దు ప్రాంతాలు, ఎత్తైన ప్రదేశాల్లో ఉన్న ప్రజలు చాలా మంది ఇప్పటికే డీఆర్‌డీవో టెక్నాలజీలతో లాభం పొందుతున్నారు. కొండ ప్రాంతాల్లోనూ వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చేందుకు అనువైన టెక్నాలజీలను మేం రూపొందించాం. ఈ పద్ధతిలో పండిస్తున్న పంటలను సమీపంలోని భద్రతా దళాలు వినియోగిస్తున్నాయి. డెంగీ, చికన్ గున్యా, దోమల్లాంటి కీటకాలను పారదోలే మందు, ఆహార కాలుష్యాన్ని గుర్తించే కిట్‌లను చాలా మంది వాడుతున్నారు. మానవ వ్యర్థాలను ఇంధనంగా మార్చేందుకు డీఆర్‌డీవో బయో డైజెస్టర్‌ను అభివృద్ధి చేసింది. హిమాలయాల్లో విధులు నిర్వహించే సైనికుల కోసం సిద్ధం చేసిన ఈ టెక్నాలజీ ఇప్పుడు సమాజం మొత్తానికి ఉపయోగపడుతోంది. తాజాగా ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా గుర్తించిన 108 వ్యవస్థల్లోనూ కొన్నింటిని సామాన్య ప్రజల వినియోగానికి తెచ్చే ప్రతిపాదన ఉంది. పౌరుల వాడకానికి ఉపయోగపడే టెక్నాలజీలను డీఆర్‌డీవో పరిశ్రమలకు ఉచితంగా బదలాయిస్తోంది.
ప్ర: రక్షణ రంగంలో ప్రైవేటు పరిశ్రమల భాగస్వామ్యం వల్ల ధరలు ఎక్కువ కావా?
జ: కానేకావు. ఎందుకంటే పోటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి... ఇందుకోసం పలు మార్పులు చేశాం. ఆరోగ్యకరమైన పోటీ కారణంగా నాణ్యమైన ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయి. ఫలితంగా రక్షణ వ్యవస్థల ధరలు తక్కువగానే ఉంటాయి. ఎగుమతులు చేసుకొనేందుకూ అవకాశం కల్పిస్తుండటం వల్ల పరిశ్రమలకూ తగిన లాభాలు ఉంటాయి.
ప్ర: ఆత్మనిర్భర భారత్ సాకారమైతే ఎంత డబ్బు ఆదా చేయవచ్చు?
జ: రక్షణరంగ వ్యవస్థల అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. అది కొనసాగుతూనే ఉంటుంది. సాంకేతిక పరిజ్ఞానంలో వచ్చే మార్పులను జోడించడం, మెరుగైన వ్యవస్థలను సిద్ధం చేసుకోవడం అవసరం. అయితే దిగుమతుల ఖర్చులతో పోలిస్తే స్థానికంగా తయారు చేసుకోవడం వల్ల మూడింట రెండొంతులు ఆదా అవుతుందని ఆశిస్తున్నాం. విదేశీ మారకద్రవ్యం రూపేణా పెద్ద మొత్తంలోనే ఆదా చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment