
న్యూఢిల్లీ : అంతరిక్షంలో ఉపగ్రహాన్ని కూల్చివేసేందుకు భారత్ చేపట్టిన ప్రయోగం ‘మిషన్ శక్తి’ కారణంగా మిగిలిపోయిన ఉపగ్రహ శకలాలు 45 రోజుల్లో ధ్వంసమవుతాయని డీఆర్‌డీవో చీఫ్ జి. సతీష్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. భారత్ లాంటి శక్తిమంతమైన దేశాలు ఇలాంటి ప్రయోగాలు చేసినపుడే మన సామర్థ్యం గురించి ప్రపంచ దేశాలకు ఒక అవగాహన ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అంతరిక్షంలో మిషన్ శక్తి వంటి ప్రయోగాల ద్వారా రక్షణ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో తెలుస్తుందన్నారు. ఇక మిషన్ శక్తి గురించి కేంద్ర ఆర్థిక మాజీ మంత్రి పి.చిదంబరం చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘ ఇలాంటి ప్రయోగాలు చేసినపుడు వాటి ఫలితాలను రహస్యంగా ఉంచడం సాధ్యంకాని విషయం. ప్రయోగ సమయంలో మన ఉపగ్రహాన్ని ప్రపంచలోని అన్ని స్పేస్ స్టేషన్లు ట్రాక్ చేశాయి. ఇందుకు సంబంధించి మేము అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే ముందుకు సాగాం’ అని సతీష్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మిషన్ శక్తికి సంబంధించిన వీడియోను ఆయన విడుదల చేశారు.
(చదవండి : అంతరిక్ష ప్రయోగాల్లో మరో ముందడుగు)
కాగా శత్రుదేశాల ఉపగ్రహాలు కూల్చేసేందుకు ఇటీవల భారత్ చేపట్టిన శాటిలైట్ విధ్వంసక క్షిపణి (ఏశాట్) పరీక్ష వల్ల అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రానికే (ఐఎస్‌ఎస్) ముప్పు వాటిల్లనుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఆ ప్రయోగం వల్ల అంతరిక్షంలో దాదాపు 400 వ్యర్థ శకలాలు పోగుపడ్డాయని నాసా అడ్మినిస్ట్రేటర్ జిమ్ బ్రైడెన్‌స్టిన్ తెలిపారు. దీంతో ఐఎస్‌ఎస్‌ను వ్యర్థాలు ఢీకొనే ప్రమాదం 44 శాతం పెరిగిందన్నారు. ఈ నేపథ్యంలో సతీష్‌రెడ్డి మాట్లాడుతూ.. ఐఎస్‌ఎస్‌కు భద్రతను దృష్టిలో పెట్టుకునే తమ టీమ్ ఈ ప్రయోగాన్ని చేపట్టిందని, 45 రోజుల్లోగా ఈ శకలాలు నాశనమవుతాయని పేర్కొన్నారు.
#WATCH Defence Research and Development Organisation releases presentation on #MissionShakti pic.twitter.com/4llQ1t3JUG
— ANI (@ANI) April 6, 2019