ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా వస్తున్న రెండు రైళ్లు ‘కవచ్’ పరిజ్ఞానంతో వాటంతట అవే ఆగిపోయిన దృశ్యం. (ఇన్‌సెట్‌లో) ట్రాక్‌పై ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాబ్‌లను అమరుస్తున్న రైల్వే ఉద్యోగి
సాక్షి, హైదరాబాద్: శుక్రవారం మధ్యాహ్నం 1.05 గంటలు.. వికారాబాద్ రైల్వే సెక్షన్ పరిధిలోని గొల్లగూడ–చిట్టిగడ్డ మధ్య ప్రాంతం.. ఒకవైపు నుంచి రైలు గంటకు వంద కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోంది.. అదే ట్రాక్‌పై ఎదురుగా లోకో ఇంజిన్ 80 కిలోమీటర్ల వేగంతో వస్తోంది.. రెండింటి మధ్య దూరం 600 మీటర్లే.. అయినా దేనికీ బ్రేకులు వేయలేదు..
కానీ చూస్తుండగానే రెండూ ఆటోమేటిగ్గా వేగం తగ్గించుకున్నాయి. రెండింటి మధ్య 380 మీటర్ల దూరం ఉందనగా ఆగిపోయాయి. అంటే ఎదురెదురుగా దూసుకొస్తున్న రైళ్లు బ్రేకులతో ప్రమేయం లేకుండా, లోకో పైలట్ల (రైలు నడిపేవారు) జోక్యం లేకుండానే ఆగిపోయి ప్రమాదాన్ని నివారించాయి. పూర్తి స్వదేశీ సాంకేతికతతో రూపొందిన ‘కవచ్’ పరిజ్ఞానమే దీనికి కారణం. తొలుత టి–కాస్ పేరుతో రూపొందిన ఈ పరిజ్ఞానంపై ఎనిమిదేళ్లుగా ప్రయోగాలు జరుగుతున్నాయి. తాజాగా మేకిన్ ఇండియాలో భాగంగా ‘కవచ్’ పేరిట పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశారు.
మరో విశేషం ఏమిటో తెలుసా.. ఇలా ఒకేట్రాక్‌పై దూసుకొచ్చిన ఓ రైలులో స్వయంగా రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఉండగా.. ఎదురుగా వచ్చిన ఇంజన్‌లో రైల్వే బోర్డు చైర్మన్, సీఈవో వినయ్ కుమార్ త్రిపాఠీ ఉన్నారు. త్వరలోనే ‘కవచ్’ను దేశవ్యాప్తంగా రైళ్లలో ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలో దీనిని స్వయంగా పరిశీలించేందుకు రైల్వే మంత్రి ఈ పరీక్షలో పాల్గొన్నారు.
కవచ్ సాంకేతిక పరిజ్ఞానం విజయవంతం అయిందని చెబుతున్న రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్. చిత్రంలో ఎంపీ అర్వింద్ తదితరులు
కిలోమీటరుకు రూ. 50 లక్షల ఖర్చు
స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ‘కవచ్’ పూర్తిస్థాయిలో విజయవంతం కావటం గర్వకారణమని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రశంసించారు. ‘‘కవచ్ అద్భుతంగా పనిచేస్తుందని ధీమాగా చెప్పగలను. అందుకే బహిరంగంగా, అందరి సమక్షంలో ప్రయోగించి చూశాం. దీన్ని దేశవ్యాప్తంగా.. ఏటా నాలుగైదు వేల కిలోమీటర్ల పొడవునా ఏర్పాటు చేస్తాం. కవచ్ పరిజ్ఞానం కోసం కిలోమీటర్‌కు రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షలు ఖర్చవుతుంది. అదే యూరోపియన్ పరిజ్ఞానానికైతే కిలోమీటర్‌కు రూ.2 కోట్ల వరకు ఖర్చవుతుంది. పైగా కవచ్ వాటి కంటే సమర్థవంతమైనది. అందుకే దీన్ని సగర్వంగా ఇప్పుడు విదేశాలకు ఎగుమతి చేస్తాం’’ అని రైల్వే మంత్రి చెప్పారు.
అన్ని రూల్స్.. ఆటోమేటిగ్గా..
►తొలుత రైల్వే మంత్రి, రైల్వే బోర్డు చైర్మన్ విడివిడిగా రెండు రైళ్లలో బయలుదేరారు. సనత్‌నగర్ దాటాక ఒకేట్రాక్‌లో ముందు మంత్రి ఉన్న రైలు, వెనుక బోర్డు చైర్మన్ ఉన్న రైలు ప్రయాణించాయి. ముందున్న రైలుకు వెనకాల ఉన్న రైలు చేరువగా వచ్చే ప్రయత్నం చేసింది. లోకో పైలట్ బ్రేకు వేయకున్నా.. వెనకాల ఉన్న రైలు దానంతట అదే వేగం తగ్గి, ఆగిపోయింది.
►ఒకచోట మధ్యలో రెడ్ సిగ్నల్ పడినా లోకోపైలట్ బ్రేకు వేయకుండా ముందుకు నడిపించారు. కానీ ఆటోమేటిగ్గా బ్రేకు పడి రైలు ఆగిపోయింది.
►లెవల్ క్రాసింగ్ వద్ద నిర్ధారిత దూరం నుంచి హారన్ మోగించాలి. కానీ లోకోపైలట్ మోగించకున్నా.. నిర్ధారిత ప్రాంతానికి చేరుకోగానే ఆటోమేటిక్‌గా రైలు కూత వేసింది.
►లూప్‌లైన్‌లో వెళ్లేప్పుడు గంటకు 20 కిలోమీటర్ల లోపు వేగం ఉండాలన్న నిబంధన ఉంది. వేగంగా నడిపేందుకు లోకో పైలట్ ప్రయత్నించినా రైలు దానంతట అదే వేగం తగ్గింది.
►పెద్ద మలుపులో రైలుగరిష్ట వేగం గంటకు 30 కిలోమీటర్లు మించొద్దు. అంతకన్నా వేగంగా నడిపితే రైలు ఆటోమేటిగ్గా ఆ వేగానికి తగ్గిపోయింది.
ఎలా పనిచేస్తుంది?
రైల్వే అనుబంధ పరిశోధన సంస్థ ‘రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ (ఆర్‌డీఎస్‌ఓ)’ కవచ్ పరిజ్ఞానాన్ని రూపొందిం చింది. కొన్ని దేశీ పరిశ్రమలు పరికరాలను తయారు చేసి సమకూర్చాయి. 2013లో ట్రెయిన్ కొలీజన్ అవాయిడెన్స్ సిస్టం(టీకాస్)పేరుతో.. వికారాబాద్–వాడీ–సనత్ నగర్ సెక్షన్ల మధ్య ప్రయోగాలు చేసి, అభి వృద్ధి చేశారు. ప్రత్యేక కవచ్ యంత్రాలను రైల్వేస్టేషన్లలో, రైళ్లలో అమరుస్తారు. ట్రాక్ పై ప్రతి కిలోమీటర్‌కు ఒకటి చొప్పున ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాబ్‌లను అమర్చుతారు. రేడి యో ఫ్రీక్వెన్సీ సిగ్నళ్ల కోసం నిర్ధారిత ప్రాం తాల్లో 40 మీటర్ల ఎత్తు ఉండే టవర్లను ఏర్పాటు చేస్తారు.
కమ్యూనికేషన్ టవర్, జీపీఎస్, రేడియో ఇంటర్‌ఫేజ్‌లతో అన్నిం టినీ అనుసంధానిస్తారు. ఈ మొత్తం పరి జ్ఞానం ఎప్పటికప్పుడు రైళ్లను పరిశీలిస్తుం టుంది. లోకోపైలట్ ముందుండే స్క్రీన్‌లో సమాచారం డిస్‌ప్లే అవుతుంది. మంచు, రాత్రి సమయాలు, ఇతర కారణాలతో మసకగా ఉన్నప్పుడు.. రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న సిగ్నల్ కూడా స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఏ చిన్న సమస్య చోటుచేసుకున్నా.. వెంటనే లోకోపైలట్‌ను, స్టేషన్‌లోని అధికారులను అప్రమత్తం చేస్తుంది. ఈ వ్యవస్థ ద్వారా పరస్పరం సమాచారాన్ని కూడా పంపించుకోవచ్చు.
కొత్త ధైర్యం వచ్చింది
‘‘కవచ్‌తో ఎంతో దూరం నుంచి కూడా సిగ్నళ్లను తెలుసుకోగలం. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రమాదాలకు అవకాశం ఉండదు. ప్రయాణికులకు పూర్తి ధైర్యం, నమ్మకాన్ని కల్పించగలం. మాకు కూడా కొత్త ధైర్యం వచ్చింది’’
– జీఎస్ ప్రసాద్, రైలు లోకో పైలట్
Comments
Please login to add a commentAdd a comment