Vikarabad railway junction
-
Video: కదులుతున్న రైలు ఎక్కబోయి జారిపడిన ప్రయాణికుడు
సాక్షి, వికారాబాద్: కదులుతున్న రైలు ఎక్కబోయి ఓ ప్రయాణికుడు రైల్వే ట్రాక్ మధ్యలో ఇరుక్కుపోయాడు. వెంటనే అప్రమత్తమైన తోటి ప్రయాణికులు, రైల్వే సిబ్బంది.. ట్రాక్ మధ్యలో చిక్కుకున్న వ్యక్తిని సురక్షితంగా బయటకు లాగారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన వికారాబాద్ రైల్వే స్టేషన్లో వెలుగుచూసింది. బీదర్ నుంచి యశ్వంతపూర్ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు వికారాబాద్ రైల్వేస్టేషన్ నుంచి బయలు దేరింది. స్టేషన్ నుంచి ఓ ప్రయాణికుడు హుటాహుటినా పరుగెత్తుకొచ్చి కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో కాలుజారి ప్రమాదవశాత్తు రైలుకు, ట్రాక్‌కు మధ్య ఇరుక్కుపోయాడు. విషయం గమనించిన ప్రయాణికులు వెంటనే చైన్ లాగి రైలును ఆపారు. రైల్వే సిబ్బంది, పోలీసులు రెండు గంటలు శ్రమించి రైల్వే ట్రాక్ మధ్యలో ఇరుక్కున్న వ్యక్తిని కాపాడారు. ప్లాట్‌ఫాం పగులగొట్టి ప్రయాణికుడిని అతడిని బయటకు తీశారు. అతడికి స్వల్ప గాయాలవ్వగా.. వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది. గాయపడిన వ్యక్తిని రాయచూర్‌కు చెందిన సతీష్‌గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఇవి వైరల్‌గా మారాయి. ప్రయాణికుడిని కాపాడిన రైల్వే సిబ్బందిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. చదవండి: ఏబీవీపీ కార్యకర్తను జుట్టుపట్టి ఈడ్చుకెళ్లిన ఘటన.. కానిస్టేబుల్ సస్పెండ్ A man slipped and got stuck between the train and platform, while attempting to board a moving train at #Vikarabad Railway Station and was dragged along, recorded in #CCTV . The alert passengers, RPF, railway officials saved the life of the passenger. (1/2)#Telangana pic.twitter.com/2iQDtUHSWd— Surya Reddy (@jsuryareddy) January 30, 2024 -
బ్రేకేయకున్నా ఢీకొట్టలే!
సాక్షి, హైదరాబాద్: శుక్రవారం మధ్యాహ్నం 1.05 గంటలు.. వికారాబాద్ రైల్వే సెక్షన్ పరిధిలోని గొల్లగూడ–చిట్టిగడ్డ మధ్య ప్రాంతం.. ఒకవైపు నుంచి రైలు గంటకు వంద కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోంది.. అదే ట్రాక్‌పై ఎదురుగా లోకో ఇంజిన్ 80 కిలోమీటర్ల వేగంతో వస్తోంది.. రెండింటి మధ్య దూరం 600 మీటర్లే.. అయినా దేనికీ బ్రేకులు వేయలేదు.. కానీ చూస్తుండగానే రెండూ ఆటోమేటిగ్గా వేగం తగ్గించుకున్నాయి. రెండింటి మధ్య 380 మీటర్ల దూరం ఉందనగా ఆగిపోయాయి. అంటే ఎదురెదురుగా దూసుకొస్తున్న రైళ్లు బ్రేకులతో ప్రమేయం లేకుండా, లోకో పైలట్ల (రైలు నడిపేవారు) జోక్యం లేకుండానే ఆగిపోయి ప్రమాదాన్ని నివారించాయి. పూర్తి స్వదేశీ సాంకేతికతతో రూపొందిన ‘కవచ్’ పరిజ్ఞానమే దీనికి కారణం. తొలుత టి–కాస్ పేరుతో రూపొందిన ఈ పరిజ్ఞానంపై ఎనిమిదేళ్లుగా ప్రయోగాలు జరుగుతున్నాయి. తాజాగా మేకిన్ ఇండియాలో భాగంగా ‘కవచ్’ పేరిట పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశారు. మరో విశేషం ఏమిటో తెలుసా.. ఇలా ఒకేట్రాక్‌పై దూసుకొచ్చిన ఓ రైలులో స్వయంగా రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఉండగా.. ఎదురుగా వచ్చిన ఇంజన్లో రైల్వే బోర్డు చైర్మన్, సీఈవో వినయ్ కుమార్ త్రిపాఠీ ఉన్నారు. త్వరలోనే ‘కవచ్’ను దేశవ్యాప్తంగా రైళ్లలో ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలో దీనిని స్వయంగా పరిశీలించేందుకు రైల్వే మంత్రి ఈ పరీక్షలో పాల్గొన్నారు. కవచ్ సాంకేతిక పరిజ్ఞానం విజయవంతం అయిందని చెబుతున్న రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్. చిత్రంలో ఎంపీ అర్వింద్ తదితరులు కిలోమీటరుకు రూ. 50 లక్షల ఖర్చు స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ‘కవచ్’ పూర్తిస్థాయిలో విజయవంతం కావటం గర్వకారణమని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రశంసించారు. ‘‘కవచ్ అద్భుతంగా పనిచేస్తుందని ధీమాగా చెప్పగలను. అందుకే బహిరంగంగా, అందరి సమక్షంలో ప్రయోగించి చూశాం. దీన్ని దేశవ్యాప్తంగా.. ఏటా నాలుగైదు వేల కిలోమీటర్ల పొడవునా ఏర్పాటు చేస్తాం. కవచ్ పరిజ్ఞానం కోసం కిలోమీటర్‌కు రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షలు ఖర్చవుతుంది. అదే యూరోపియన్ పరిజ్ఞానానికైతే కిలోమీటర్‌కు రూ.2 కోట్ల వరకు ఖర్చవుతుంది. పైగా కవచ్ వాటి కంటే సమర్థవంతమైనది. అందుకే దీన్ని సగర్వంగా ఇప్పుడు విదేశాలకు ఎగుమతి చేస్తాం’’ అని రైల్వే మంత్రి చెప్పారు. అన్ని రూల్స్.. ఆటోమేటిగ్గా.. ►తొలుత రైల్వే మంత్రి, రైల్వే బోర్డు చైర్మన్ విడివిడిగా రెండు రైళ్లలో బయలుదేరారు. సనత్‌నగర్ దాటాక ఒకేట్రాక్లో ముందు మంత్రి ఉన్న రైలు, వెనుక బోర్డు చైర్మన్ ఉన్న రైలు ప్రయాణించాయి. ముందున్న రైలుకు వెనకాల ఉన్న రైలు చేరువగా వచ్చే ప్రయత్నం చేసింది. లోకో పైలట్ బ్రేకు వేయకున్నా.. వెనకాల ఉన్న రైలు దానంతట అదే వేగం తగ్గి, ఆగిపోయింది. ►ఒకచోట మధ్యలో రెడ్ సిగ్నల్ పడినా లోకోపైలట్ బ్రేకు వేయకుండా ముందుకు నడిపించారు. కానీ ఆటోమేటిగ్గా బ్రేకు పడి రైలు ఆగిపోయింది. ►లెవల్ క్రాసింగ్ వద్ద నిర్ధారిత దూరం నుంచి హారన్ మోగించాలి. కానీ లోకోపైలట్ మోగించకున్నా.. నిర్ధారిత ప్రాంతానికి చేరుకోగానే ఆటోమేటిక్‌గా రైలు కూత వేసింది. ►లూప్లైన్లో వెళ్లేప్పుడు గంటకు 20 కిలోమీటర్ల లోపు వేగం ఉండాలన్న నిబంధన ఉంది. వేగంగా నడిపేందుకు లోకో పైలట్ ప్రయత్నించినా రైలు దానంతట అదే వేగం తగ్గింది. ►పెద్ద మలుపులో రైలుగరిష్ట వేగం గంటకు 30 కిలోమీటర్లు మించొద్దు. అంతకన్నా వేగంగా నడిపితే రైలు ఆటోమేటిగ్గా ఆ వేగానికి తగ్గిపోయింది. ఎలా పనిచేస్తుంది? రైల్వే అనుబంధ పరిశోధన సంస్థ ‘రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ (ఆర్డీఎస్ఓ)’ కవచ్ పరిజ్ఞానాన్ని రూపొందిం చింది. కొన్ని దేశీ పరిశ్రమలు పరికరాలను తయారు చేసి సమకూర్చాయి. 2013లో ట్రెయిన్ కొలీజన్ అవాయిడెన్స్ సిస్టం(టీకాస్)పేరుతో.. వికారాబాద్–వాడీ–సనత్ నగర్ సెక్షన్ల మధ్య ప్రయోగాలు చేసి, అభి వృద్ధి చేశారు. ప్రత్యేక కవచ్ యంత్రాలను రైల్వేస్టేషన్లలో, రైళ్లలో అమరుస్తారు. ట్రాక్ పై ప్రతి కిలోమీటర్‌కు ఒకటి చొప్పున ఆర్ఎఫ్ఐడీ ట్యాబ్‌లను అమర్చుతారు. రేడి యో ఫ్రీక్వెన్సీ సిగ్నళ్ల కోసం నిర్ధారిత ప్రాం తాల్లో 40 మీటర్ల ఎత్తు ఉండే టవర్లను ఏర్పాటు చేస్తారు. కమ్యూనికేషన్ టవర్, జీపీఎస్, రేడియో ఇంటర్ఫేజ్లతో అన్నిం టినీ అనుసంధానిస్తారు. ఈ మొత్తం పరి జ్ఞానం ఎప్పటికప్పుడు రైళ్లను పరిశీలిస్తుం టుంది. లోకోపైలట్ ముందుండే స్క్రీన్‌లో సమాచారం డిస్ప్లే అవుతుంది. మంచు, రాత్రి సమయాలు, ఇతర కారణాలతో మసకగా ఉన్నప్పుడు.. రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న సిగ్నల్ కూడా స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఏ చిన్న సమస్య చోటుచేసుకున్నా.. వెంటనే లోకోపైలట్‌ను, స్టేషన్‌లోని అధికారులను అప్రమత్తం చేస్తుంది. ఈ వ్యవస్థ ద్వారా పరస్పరం సమాచారాన్ని కూడా పంపించుకోవచ్చు. కొత్త ధైర్యం వచ్చింది ‘‘కవచ్‌తో ఎంతో దూరం నుంచి కూడా సిగ్నళ్లను తెలుసుకోగలం. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రమాదాలకు అవకాశం ఉండదు. ప్రయాణికులకు పూర్తి ధైర్యం, నమ్మకాన్ని కల్పించగలం. మాకు కూడా కొత్త ధైర్యం వచ్చింది’’ – జీఎస్ ప్రసాద్, రైలు లోకో పైలట్ -
వికారాబాద్ రైల్వే స్టేషన్‌ను పరిశీలించిన జీఎం
వికారాబాద్ రూరల్ : వికారాబాద్ రైల్వే స్టేషన్‌ను దక్షణ మధ్య రైల్వే జీఎం రాజేంద్రగుప్తా గురువారం పరిశీలించారు. బీదర్ వెళ్లి వస్తూ రైలు వికారాబాద్ స్టేషన్లో ఆపడంతో రైల్వేజీఎం రాజేంద్రగుప్తా, డీఆర్ఎం ఆశీష్‌అగర్వాల్ వికారాబాద్ స్టేషన్ దిగి వికారాబాద్ పరిసరాలను పరిశీలించి వెళ్లిపోయారు. -
నాని సినిమా సందడి
హిరో నాని చూసేందుకు ఎగబడ్డ అభిమానులు వికారాబాద్ రూరల్ : వికారాబాద్ రైల్వే స్టేషన్లో గురువారం సినిమా సందడి నెలకొంది. నాని నూతన చిత్రం మజ్నూకు సంబంధించిన సినిమా సన్ని వేశాలను ఉదయం నుంచి సాయంత్రం వరకు చిత్రికరించారు. ఇందులో తొలి పరిచయంగా అనూ అనే కొత్త హిరోయిన్ నట్టిస్తుండగా ఉయ్యాల జంపాల డైరెక్టర్ వీరేచి వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. అనంది క్రియేషన్ బ్యానర్‌పై పి. కిరణ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గురువారం హిరోయిన్ పెళ్లి కూతురుగా ఉండి హిరో హిరోహిన్లు రైల్వే స్టేషన్లో రైలు కోసం వచ్చి ఉండే చిత్రికరణ దృశ్యాలను చిత్రికరించారు. నాని వికారాబాద్ వచ్చాడని తెలియడంతో అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని హిరో హిరోయిన్లను చూసేందుకు ఆసక్తి కనబర్చారు. -
త్వరలో పుష్పుల్ రైలు
వికారాబాద్, న్యూస్‌లైన్: ఎంఎంటీఎస్ రైళ్ల సేవలు ఇప్పట్లో వికారాబాద్‌కు అందే అవకాశం లేదని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ ప్రదీప్‌కుమార్ శ్రీవాత్సవ అన్నారు. దీనికి ప్రత్యమ్నాయంగా హైదరాబాద్ నుంచి తాండూరు వరకు త్వరలో పుష్పుల్ రైలును నడపనున్నట్లు ఆయన వెల్లడించారు. సికింద్రాబాద్ డివిజనల్ మేనేజర్ సుశాంత్‌కుమార్ మిశ్రాతో కలిసి మంగళవారం వికారాబాద్ రైల్వే జంక్షన్‌ను జీఎం తనిఖీ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఎంఎంటీఎస్ రైలు వికారాబాద్ వరకు రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం ముందుగా 50 శాతం నిధులను కేటాయించాల్సి ఉంటుందన్నారు. ఆ నిధులు అందిన తర్వాతే రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంటుందని చెప్పరు. ఈ నేపథ్యంలో వికారాబాద్ నుంచి తాండూరు వరకూ పుష్పుల్ రైలును కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డితో త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపారు. జిల్లా పరిధిలోని ఆదర్శ రైల్వేస్టేషన్లు వికారాబాద్, శంకర్పల్లి, లింగంపల్లి, తాండూరు స్టేషన్లను అంచలంచెలుగా అభివృద్ధి చేయనున్నట్టు జీఎం శ్రీవాస్తవ పేర్కొన్నారు. వికారాబాద్‌లో లోకోషెడ్ ఏర్పాటు చేసే ఉద్దేశం లేదన్నారు. పరిశీలనలో సైడింగ్ ట్రాక్‌ల ఏర్పాటు... ధారూరు రైల్వే స్టేషన్ సమీపంలో ఎనిమిది లైన్ల సైడింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేయాలని వ్యాపార, వాణిజ్య సంస్థల వారు కోరుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని జీఎం శ్రీవాత్సవ చెప్పారు. ఈ స్టేషన్ నుంచి సిమెంట్, బొగ్గు సంబంధ వ్యాపార లావాదేవీల ద్వారా ప్రతి నెల రూ.3కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉందని పలు సంస్థల ప్రతినిధులు రైల్వే శాఖ దృష్టికి తీసుకొచ్చారన్నారు. సాధ్యమైనంత తొందరగా సైడింగ్ ట్రాక్‌ల ఏర్పాటు చేసే విషయం పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు కాలే యాదయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండీ హఫీజ్, ప్రముఖ న్యాయవాది గోవర్ధన్‌రెడ్డి, తరిగోపుల సంగమేశ్వర్, నవాబ్‌పేట్ మాణిక్‌రెడ్డి తదితరులు కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లను వికారాబాద్‌లో ఆపాలని కోరుతూ వినతిపత్రాలు అందజేశారు. జీఎం వెంట చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ సాహు, ఏజీఎం సునీల్‌కుమార్ అగర్వాల్, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ రవిపాడి, చీఫ్ ఇంజనీర్ (కన్స్ట్రక్షన్) కె.వి.శివప్రసాద్, సీటీఈ శ్రీనివాస్, రైల్వే ఆస్పత్రి సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రుమిదేవ్, ఎడీఎన్ వికారాబాద్ గోవిందరాజులు తదితరులు ఉన్నారు. బషీరాబాద్: ఈ ఏడాది బడ్జెట్లో దక్షిణ మధ్య రైల్వేకు అధిక ప్రాధాన్యం లభించిందని రైల్వే శాఖ జనరల్ మేనేజర్ ప్రదీప్‌కుమార్ శ్రీవాత్సవ పేర్కొన్నారు. ఈ జోన్లో ప్రయాణికులకు త్వరలో మరిన్ని రైళ్లు అందుబాటులోకి వస్తాయన్నారు. మంగళవారం నవాంద్గి(బషీరాబాద్) స్టేషన్‌ను రైల్వే శాఖ అధికారులు పరిశీలించారు. జీఎం వెంట డీఆర్ఎం సుశాంత్ కుమార్ మిశ్రా, సీనియర్ డీసీఎం రవిపాడి, ఏజీఎం ఎస్కే అగర్వాల్ తదితరులున్నారు. నవాంద్గితోపాటు మంతట్టి, కర్ణాటకలోని కురుగుంట, సేడం, చితాపూర్, వాడి తదితర రైల్వే స్టేషన్లను కూడా అధికారులు తనిఖీ చేశారు. లింక్ ఎక్స్‌ప్రెస్, ఇంటర్ సిటి ఎక్స్‌ప్రెస్ రైళ్లను నవాంద్గి రైల్వే స్టేషన్లో నిలపాలని, మధ్యాహ్న సమయంలో మరో రైలును ఇక్కడినుంచి నడపాలని జీఎంకు స్థానికులు వినతిపత్రం సమర్పించారు. జీఎంను కలిసిన వారిలో గ్రామ సర్పంచ్ జయమ్మ, టీడీపీ మండల అధ్యక్షుడు అజయ్ ప్రసాద్, బీజేపీ మండల అధ్యక్షుడు రాజ్‌కుమార్ కులకర్ణి ఉన్నారు.