త్వరలో పుష్‌పుల్ రైలు | soonly push pull trains to state | Sakshi
Sakshi News home page

త్వరలో పుష్‌పుల్ రైలు

Published Tue, Feb 18 2014 11:54 PM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM

soonly push pull trains to state

 వికారాబాద్, న్యూస్‌లైన్: ఎంఎంటీఎస్ రైళ్ల సేవలు ఇప్పట్లో వికారాబాద్‌కు అందే అవకాశం లేదని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ ప్రదీప్‌కుమార్ శ్రీవాత్సవ అన్నారు. దీనికి ప్రత్యమ్నాయంగా హైదరాబాద్ నుంచి తాండూరు వరకు త్వరలో పుష్‌పుల్ రైలును నడపనున్నట్లు ఆయన వెల్లడించారు. సికింద్రాబాద్ డివిజనల్ మేనేజర్ సుశాంత్‌కుమార్ మిశ్రాతో కలిసి మంగళవారం వికారాబాద్ రైల్వే జంక్షన్‌ను జీఎం తనిఖీ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఎంఎంటీఎస్ రైలు వికారాబాద్ వరకు రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం ముందుగా 50 శాతం నిధులను కేటాయించాల్సి ఉంటుందన్నారు.

 ఆ నిధులు అందిన తర్వాతే రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంటుందని చెప్పరు. ఈ నేపథ్యంలో వికారాబాద్ నుంచి తాండూరు వరకూ పుష్‌పుల్ రైలును కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డితో త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపారు. జిల్లా పరిధిలోని ఆదర్శ రైల్వేస్టేషన్లు వికారాబాద్, శంకర్‌పల్లి, లింగంపల్లి, తాండూరు స్టేషన్లను అంచలంచెలుగా అభివృద్ధి చేయనున్నట్టు జీఎం శ్రీవాస్తవ పేర్కొన్నారు. వికారాబాద్‌లో లోకోషెడ్ ఏర్పాటు చేసే ఉద్దేశం లేదన్నారు.

 పరిశీలనలో సైడింగ్ ట్రాక్‌ల ఏర్పాటు...
 ధారూరు రైల్వే స్టేషన్ సమీపంలో ఎనిమిది లైన్ల సైడింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేయాలని వ్యాపార, వాణిజ్య సంస్థల వారు కోరుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని జీఎం శ్రీవాత్సవ చెప్పారు. ఈ స్టేషన్ నుంచి సిమెంట్, బొగ్గు సంబంధ వ్యాపార లావాదేవీల ద్వారా ప్రతి నెల రూ.3కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉందని పలు సంస్థల ప్రతినిధులు రైల్వే శాఖ దృష్టికి తీసుకొచ్చారన్నారు. సాధ్యమైనంత తొందరగా సైడింగ్ ట్రాక్‌ల ఏర్పాటు చేసే విషయం పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు కాలే యాదయ్య,  జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండీ హఫీజ్, ప్రముఖ న్యాయవాది గోవర్ధన్‌రెడ్డి, తరిగోపుల సంగమేశ్వర్, నవాబ్‌పేట్ మాణిక్‌రెడ్డి తదితరులు కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లను వికారాబాద్‌లో ఆపాలని కోరుతూ వినతిపత్రాలు అందజేశారు. జీఎం వెంట చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ సాహు, ఏజీఎం సునీల్‌కుమార్ అగర్వాల్, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ రవిపాడి, చీఫ్ ఇంజనీర్ (కన్‌స్ట్రక్షన్) కె.వి.శివప్రసాద్, సీటీఈ శ్రీనివాస్, రైల్వే ఆస్పత్రి సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రుమిదేవ్, ఎడీఎన్ వికారాబాద్ గోవిందరాజులు తదితరులు ఉన్నారు.

 బషీరాబాద్: ఈ ఏడాది బడ్జెట్‌లో దక్షిణ మధ్య రైల్వేకు అధిక ప్రాధాన్యం లభించిందని రైల్వే శాఖ జనరల్ మేనేజర్ ప్రదీప్‌కుమార్ శ్రీవాత్సవ పేర్కొన్నారు. ఈ జోన్‌లో ప్రయాణికులకు త్వరలో మరిన్ని రైళ్లు అందుబాటులోకి వస్తాయన్నారు. మంగళవారం నవాంద్గి(బషీరాబాద్) స్టేషన్‌ను రైల్వే శాఖ అధికారులు పరిశీలించారు. జీఎం వెంట డీఆర్‌ఎం సుశాంత్ కుమార్ మిశ్రా, సీనియర్ డీసీఎం రవిపాడి, ఏజీఎం ఎస్‌కే అగర్వాల్ తదితరులున్నారు.

 నవాంద్గితోపాటు మంతట్టి, కర్ణాటకలోని కురుగుంట, సేడం, చితాపూర్, వాడి తదితర రైల్వే స్టేషన్‌లను కూడా అధికారులు తనిఖీ చేశారు. లింక్ ఎక్స్‌ప్రెస్, ఇంటర్ సిటి ఎక్స్‌ప్రెస్ రైళ్లను నవాంద్గి రైల్వే స్టేషన్‌లో నిలపాలని, మధ్యాహ్న సమయంలో మరో రైలును ఇక్కడినుంచి నడపాలని జీఎంకు స్థానికులు వినతిపత్రం సమర్పించారు. జీఎంను కలిసిన వారిలో గ్రామ సర్పంచ్ జయమ్మ, టీడీపీ మండల అధ్యక్షుడు అజయ్ ప్రసాద్, బీజేపీ మండల అధ్యక్షుడు రాజ్‌కుమార్ కులకర్ణి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement