టెలికాం కంపెనీల పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు | Supreme Court dismissed pleas by telecom giants to re compute AGR dues | Sakshi
Sakshi News home page

టెలికాం కంపెనీల పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

Published Fri, Sep 20 2024 8:45 AM | Last Updated on Fri, Sep 20 2024 10:02 AM

Supreme Court dismissed pleas by telecom giants to re compute AGR dues

టెలికాం కంపెనీలు చెల్లించాల్సిన ఏజీఆర్‌ బకాయిలకు సంబంధించిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌) లెక్కింపులో తప్పులు దొర్లాయని, వాటిని సవరించాలంటూ వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్ కంపెనీలు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాయి. ఈ బకాయిలపై బహిరంగ విచారణ జరపాలని కోరాయి. ఈమేరకు సుప్రీంకోర్టు విచారణ జరిపి సంస్థలు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ప్రభుత్వానికి ఇచ్చే పూర్తి బకాయిలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌, న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, బీఆర​్‌ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌లోని వివరాలు విచారించింది. టెలికాం కంపెనీలు లైసెన్స్‌ రెన్యువల్‌ చేయడానికి, స్పెక్రమ్‌ వినియోగించుకున్నందుకు ప్రభుత్వానికి డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని కారణాల వల్ల బకాయిలు చెల్లించకపోతే తిరిగి వడ్డీతో సహా జమ చేయాలి. ఇవి ఏజీఆర్‌ కిందకు వస్తాయి. ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ఐడియా కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్‌ ప్రకారం..సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం(ఏజీఆర్‌) బకాయిలు లెక్కించడంలో లోపాలు జరిగాయి. వాటిని సవరించాలి. ఇప్పటికే పోగైన బకాయిలపై వడ్డీని ఉపసంహరించాలి. క్యూరేటివ్‌ పిటిషన్‌ను బహిరంగంగా విచారణ చేయాలని కంపెనీలు కోరాయి.

ఇదీ చదవండి: స్టార్టప్‌ కంపెనీలో క్రికెటర్‌ రూ.7.4 కోట్లు పెట్టుబడి

గతంలో సెప్టెంబర్‌ 1, 2020లో కోర్టు విడుదల చేసిన ఆదేశాల ప్రకారం..మార్చి 31, 2021లోపు కంపెనీల బకాయిల్లో 10 శాతం చెల్లించాలి. తదుపరి ఏడాది మరో 10 శాతం చొప్పున 2031 మార్చి 31లోపు పూర్తి బకాయిలు కట్టాల్సి ఉంటుంది. ప్రభుత్వం టెలికాం విభాగానికి చెల్లించాల్సిన ఏజీఆర్‌పై రీవాల్యుయేషన్ అనుమతించబడదని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసింది. ఇదిలాఉండగా, అన్ని టెలికాం కంపెనీలు కలిపి మొత్తం రూ.1.47 లక్షల కోట్ల ఏజీఆర్‌ బకాయిలు చెల్లించాల్సి ఉంది. వీటిలో లైసెన్స్ ఫీజు బకాయిలు మొత్తం రూ.92,642 కోట్లు కాగా, స్పెక్ట్రమ్ యూసేజ్ ఛార్జీలు రూ.55,054 కోట్లుగా ఉన్నాయి. వొడాఫోన్‌ఐడియా కంపెనీ 2024 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఏజీఆర్‌ బకాయిలు రూ.70,320 కోట్లు, భారతీ ఎయిర్‌టెల్‌ రూ.43,980 కోట్లు  కట్టాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement