న్యూఢిల్లీ: పెట్టుబడి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ స్కీమ్) కింద టెలికం ఉత్పత్తుల తయారీకి సంబంధించి 31 ప్రతిపాదనలకు టెలికం శాఖ ఆమోదం తెలిపింది. దీనికింద రూ.3,345 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. అంతర్జాతీయ కంపెనీలైన నోకియా, జబిల్ సర్క్యూట్స్, ఫాక్స్‌కాన్, ఫ్లెక్స్‌ట్రానిక్స్, సన్‌మీనా–ఎస్‌సీఐ, రైజింగ్ స్టార్‌తోపాటు.. దేశీయ కంపెనీలు డిక్సన్ టెక్నాలజీస్, టాటా గ్రూపులో భాగమైన అక్షస్త టెక్నాలజీస్, తేజాస్ నెట్‌వర్క్స్, హెచ్‌ఎఫ్‌సీఎల్, సిర్మా టెక్నాలజీ, ఐటీఐ లిమిటెడ్, నియోలింక్ టెలీ కమ్యూనికేషన్స్, వీవీడీఎన్ టెక్నాలజీస్ పీఎల్‌ఐ కింద ప్రోత్సాహకాలకు ఎంపికయ్యాయి. రానున్న నాలుగేళ్లలో ఈ సంస్థలు రూ.3,345 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రతిపాదనలు సమర్పించాయి. తద్వారా 40,000 మందికి పైగా ఉపాధి లభించనుంది. ఈ పథకం అమలయ్యే కాలంలో ఈ సంస్థల ద్వారా రూ.1.82 లక్షల కోట్ల ఉత్పత్తులు తయారీ కానున్నాయి.
అందుబాటు ధరల్లో ఉండాలి..
‘‘మీరు తయారు చేసే ఉత్పత్తులు అందుబాటు ధరల్లో, ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఉండాలి. రూ.3,345 కోట్ల ప్రోత్సాహకాలన్నవి పెద్దవేమీ కావు. మీకు మరింత మొత్తం ప్రోత్సాహకాలుగా ఇవ్వాలని అనుకుంటున్నాం. కాకపోతే మీరు తయారు చేసే ఉత్పత్తులు కూడా ఆ స్థాయిలో ఉండాలన్నదే షరతు. పరిశ్రమకు ప్రేరణనిచ్చేందుకు ప్రభుత్వం సాయం చేస్తోంది’’ అని కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి దేవుసిన్హ చౌహాన్ తెలిపారు. ఈ పథకం దేశీయంగా పరిశోధన, నూతన టెలికం ఉత్పత్తుల అభివృద్ధికి ఊతమిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ‘‘పీఎల్‌ఐ ద్వారా భారత్‌ను టెలికం తయారీ కేంద్రంగా మార్చాలని అనుకుంటోంది. దేశీయంగా విలువను జోడించడం ద్వారా ఇది సాధ్యమవుతుందని భావిస్తున్నాం’’అంటూ టెలికం శాఖ ప్రత్యేక కార్యదర్శి అనితా ప్రవీణ్ పేర్కొన్నారు.
చిన్న సంస్థలు సైతం..
టెలికం శాఖ ఆమోదించిన 31 దరఖాస్తుల్లో 16 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలవి (ఎంఎస్‌ఎంఈ) ఉన్నాయి. ఇందులో కోరల్ టెలికం, ఇహూమ్ ఐవోటీ, ఎల్‌కామ్ ఇన్నోవేషన్స్, ఫ్రాగ్ సెల్‌శాట్, జీడీఎన్ ఎంటర్‌ప్రైజెస్, జీఎక్స్ ఇండియా, లేఖ వైర్‌లెస్, సురభి శాట్‌కామ్, సిస్ట్రోమ్ టెక్నాలజీస్, టిన్నిఇన్ వరల్డ్‌టెక్ తదితర కంపెనీలున్నాయి. పీఎల్‌ఐ పథకం టెలికం రంగంలో స్వావలంబనకు (ఆత్మనిర్భర్ భారత్) దారితీస్తుందని టెలికం తయారీదారుల సంఘం టెమా పేర్కొంది. టెలికం ఆపరేటర్ల సంఘం సీవోఏఐ డైరెక్టర్ జనరల్ ఎస్‌పీ కొచర్ స్పందిస్తూ.. పీఎల్‌ఐ పథకం ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందన్నారు. ‘‘భారత్ ఇప్పటికే ప్రపంచంలో రెండో అతిపెద్ద టెలికం మార్కెట్‌గా ఉంది. టెలికం ఆవిష్కరణల కేంద్రంగా భారత్‌ను మార్చడానికి ఈ పథకం సాయపడుతుంది’’ అని కొచర్ ప్రకటించారు.
టెలికం పీఎల్‌ఐ.. రూ.3,345 కోట్ల పెట్టుబడులు
Published Fri, Oct 15 2021 4:01 AM | Last Updated on Fri, Oct 15 2021 4:01 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment