Telecom Commission
-
మిషన్ 6జీ.. 5జీ కంటే వందరెట్ల వేగంగా నెట్ స్పీడ్.. భారత్ భారీ ప్లాన్!
టెలికమ్యూనికేషన్ రంగంలో ప్రపంచ దేశాలతో భారత్ పోటీ పడుతోంది. 5జీ సేవల్ని 125 నగరాల్లో అందుబాటులోకి తెచ్చి ఆరు నెలలైందో లేదో 6జీపై అధ్యయనం కోసం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఒక విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేసింది. 2030 నాటికి దేశంలో 6జీ సేవలు అందుబాటులోకి తెచ్చి ప్రజా జీవనంలోనూ, సామాజికంగా సమూల మార్పు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. 6జీని ఒక మిషన్లా తీసుకువెళ్లి దక్షిణ కొరియా, చైనా, జపాన్ వంటి దేశాల సాంకేతికతతో పోటీపడతామని సగర్వంగా ప్రకటించింది. ప్రస్తుతం భారతీయులు 100 కోట్ల మొబైల్ ఫోన్లను వాడుతున్నారు. ఇంటర్నెట్ వాడే వారి సంఖ్య 2014లో 25 కోట్లు ఉంటే ఇప్పుడు 85 కోట్లకు చేరుకుంది. ఇక ఏడాదికేడాది స్మార్ట్ ఫోన్లు వాడే సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం 30 కోట్ల గృహాలకు చెందిన వారు ఏడాదికి 16 కోట్ల కంటే ఎక్కువగానే స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. అంటే ప్రతీ ఇంటివారు రెండేళ్లకి ఒకసారి కొత్త ఫోన్‌ను కొంటున్నట్టు లెక్క. భారతీయులు ఫోన్ లేకుండా ఒక నిముషం కూడా గడిపే పరిస్థితి లేదు. అన్ని పనులు ఫోన్‌ద్వారా చేస్తున్నారు. ఏదైనా బిల్లు కట్టాలన్నా, సినిమాలు చూడాలన్నా, ఆన్లైన్ క్లాసులు వినాలన్నా , బ్యాంకింగ్ లావాదేవీలు, యూపీఐ చెల్లింపులు ఇలా.. ఏ పనైనా అరచేతిలో ఉన్న ఫోన్‌తోనే. అందుకే స్మార్ట్ ఫోన్ మార్కెట్ కూడా మన దగ్గరే ఎక్కువ. 6జీ ద్వారా నెట్ స్పీడ్ పెరిగితే మరింత సులభంగా పనులన్నీ అయిపోతాయి. ఆ మేరకు మార్కెట్ కూడా విస్తృతమవుతుంది. పదేళ్లలో 6జీ సేవలు అందుబాటులోకి తెచ్చేలా కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. ఏమిటీ 6జీ...? టెలికమ్యూనికేషన్ రంగంలో ఆరో తరం సేవల్ని 6జీ అంటారు. 5జీ సేవలు పూర్తిగా విస్తరించకుండానే 6జీపై కేంద్రం పరిశోధనలు మొదలు పెట్టింది. 5జీ కంటే దీని నెట్ స్పీడ్ వందరెట్లు వేగంగా ఉంటుంది. సెకనుకు ఒక టెరాబైట్ వేగంతో పని చేస్తుంది. క్షణ మాత్రం ఆలస్యం లేకుండా డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. కేంద్రం ప్రణాళికలు ఇవే ..! భారత్ 6జీ ప్రాజెక్టును రెండు దశల్లో అమలు చేస్తారు. తొలి దశలో ప్రధానంగా పరిశోధనలపై ఫోకస్ ఉంటుంది. రెండో దశలో వాణిజ్యపరంగా 6జీ సేవల వాడకంపై సమగ్ర అధ్యయనం జరుగుతుంది. ప్రాజెక్టు పర్యవేక్షణకు కేంద్రం అత్యున్నత కౌన్సిల్‌ను ఏర్పాటు చేసింది. 6జీ ప్రమాణాలు, స్పెక్ట్రమ్‌ల గుర్తింపు, సిస్టమ్స్, డివైజ్‌లకు ఎకో సిస్టమ్ ఏర్పాటు, పరిశోధన, అధ్యయనాలకు ఆర్థిక సాయం తదితరాలను ఈ కౌన్సిల్ పర్యవేక్షిస్తుంది. రూ.10వేల కోట్లతో ఒక కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేసి 6జీపై తొలిదశ పరిశోధనలు మొదలు పెట్టనున్నారు. మొత్తంగా 6జీ పరిశోధనలకు రూ. 63 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనాలున్నాయి. కొత్త సాంకేతిక వ్యవస్థలైన టెరాహెర్ట్జ్ కమ్యూనికేషన్, రేడియో ఇంటర్ఫేసెస్, టాక్టిల్ ఇంటర్నెట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కొత్త ఎన్కోడింగ్ పద్ధతులు, 6జీ పరికరాలకు అవసరమయ్యే చిప్ సెట్స్ వంటివాటిపై కూడా ప్రధానంగా అత్యున్నత మండలి దృష్టి పెడుతుంది. ఎలాంటి మార్పులు వస్తాయి? ► 6జీ అందుబాటులోకి వస్తే ఫ్యాక్టరీలన్నీ రిమోట్ కంట్రోల్‌తో ఆపరేట్ చేయొచ్చు ► రియల్–టైమ్ గేమింగ్ ఇండస్ట్రీకి కొత్త హంగులు చేకూరుతాయి. ► స్వయంచోదక కార్లు రోడ్లపై ఇక పరుగులు తీస్తాయి ► డేటా ట్రాన్స్ఫర్ జాప్యం లేకుండా క్షణాల్లో జరగడం వల్ల సుదూరంలో ఉండి కూడా సర్జరీ చేసే అవకాశం ఉంటుంది. ► 6జీ సపోర్ట్‌తో నడిచే డివైజ్‌లన్నీ బ్యాటరీలతో నడుస్తాయి. దీంతో బ్యాటరీ తయారీ రంగం పరుగులు పెడుతుంది ► ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ) మరో దశకు చేరుకుంటుంది. ► ఆత్మనిర్భర్ భారత్ కింద ఉన్న డిజిటల్ ఇండియా, రూరల్ బ్రాడ్‌బ్యాండ్, స్మార్ట్ సిటీలు, ఈ–గవర్నెన్స్ వంటివి పుంజుకుంటాయి. ► రేడియో ఫ్రీక్వెన్సీ వినియోగం మరింత సామర్థ్యంతో పని చేస్తుంది. ఎలాంటి నెట్వర్క్ సమస్యలు లేకుండా ఒకేసారి అత్యధిక డివైజ్‌లకు నెట్ కనెక్షన్ ఇవ్వొచ్చు. 5జీతో పోలిస్తే 10 రెట్లు ఎక్కువ పరికరాలకు 6జీ కనెక్షన్ ఒకేసారి ఇచ్చే అవకాశముంటుంది. ► వైర్లెస్ కమ్యూనికేషన్లలో విప్లవాత్మక మార్పులు రావడంతో పర్యావరణం అనుకూలంగా ఉంటుంది. 5జీ రేడియేషన్‌తో పర్యావరణానికి దెబ్బ ఎక్కువగా ఉందనే ఇప్పటికే విమర్శలున్నాయి. ► సామాజికంగా పలు మార్పులు చోటు చేసుకుంటాయి. అత్యంత వేగంతో పనిచేసే ఇంటర్నెట్ అందుబాటులోకి రావడం వల్ల ఎక్కడ నుంచైనా పని చేసే అవకాశం ఉంటుంది. దీంతో పల్లెలు, పట్టణాల మధ్య తేడా తగ్గిపోతుంది. పల్లెల నుంచి వలసల్ని నిరోధించవచ్చు ► 6జీ సర్వీసులు అందరికీ అందుబాటులోకి రావడం, ఎక్కడ నుంచైనా రిమోట్ కంట్రోల్‌తో ఆపరేట్ చేసే అవకాశాలు ఉండడంతో గ్రామీణ జీవనంలో కూడా విప్లవాత్మక మార్పులు వస్తాయి. ఇతర దేశాల్లో ఎలా..? ► 6జీ సేవల్లో ప్రస్తుతం దక్షిణ కొరియా ముందంజలో ఉంది. రూ.1200 కోట్ల పెట్టుబడులతో 2025కల్లా తొలి దశ అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఉంది. ► జపాన్‌లో ఐఒడబ్ల్యూఎన్ ఫోరమ్ 6జీ సేవలపై 2030 విజన్ డాక్యమెంట్ని విడుదల చేసింది. ► చైనా 6జీపై 2018లోనే అధ్యయనం ప్రారంభించింది. 2029లో అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ► అమెరికా కూడా ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (ఎఫ్‌సీసీ)తో కలిసి 2018లో 6జీపై అధ్యయనాలు మొదలు పెట్టింది. యాపిల్, గూగుల్ వంటి కంపెనీలతో కూడా కలిసి పనిచేస్తోంది. -
టెలికం పీఎల్ఐ.. రూ.3,345 కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: పెట్టుబడి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ స్కీమ్) కింద టెలికం ఉత్పత్తుల తయారీకి సంబంధించి 31 ప్రతిపాదనలకు టెలికం శాఖ ఆమోదం తెలిపింది. దీనికింద రూ.3,345 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. అంతర్జాతీయ కంపెనీలైన నోకియా, జబిల్ సర్క్యూట్స్, ఫాక్స్‌కాన్, ఫ్లెక్స్‌ట్రానిక్స్, సన్మీనా–ఎస్సీఐ, రైజింగ్ స్టార్తోపాటు.. దేశీయ కంపెనీలు డిక్సన్ టెక్నాలజీస్, టాటా గ్రూపులో భాగమైన అక్షస్త టెక్నాలజీస్, తేజాస్ నెట్వర్క్స్, హెచ్ఎఫ్సీఎల్, సిర్మా టెక్నాలజీ, ఐటీఐ లిమిటెడ్, నియోలింక్ టెలీ కమ్యూనికేషన్స్, వీవీడీఎన్ టెక్నాలజీస్ పీఎల్ఐ కింద ప్రోత్సాహకాలకు ఎంపికయ్యాయి. రానున్న నాలుగేళ్లలో ఈ సంస్థలు రూ.3,345 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రతిపాదనలు సమర్పించాయి. తద్వారా 40,000 మందికి పైగా ఉపాధి లభించనుంది. ఈ పథకం అమలయ్యే కాలంలో ఈ సంస్థల ద్వారా రూ.1.82 లక్షల కోట్ల ఉత్పత్తులు తయారీ కానున్నాయి. అందుబాటు ధరల్లో ఉండాలి.. ‘‘మీరు తయారు చేసే ఉత్పత్తులు అందుబాటు ధరల్లో, ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఉండాలి. రూ.3,345 కోట్ల ప్రోత్సాహకాలన్నవి పెద్దవేమీ కావు. మీకు మరింత మొత్తం ప్రోత్సాహకాలుగా ఇవ్వాలని అనుకుంటున్నాం. కాకపోతే మీరు తయారు చేసే ఉత్పత్తులు కూడా ఆ స్థాయిలో ఉండాలన్నదే షరతు. పరిశ్రమకు ప్రేరణనిచ్చేందుకు ప్రభుత్వం సాయం చేస్తోంది’’ అని కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి దేవుసిన్హ చౌహాన్ తెలిపారు. ఈ పథకం దేశీయంగా పరిశోధన, నూతన టెలికం ఉత్పత్తుల అభివృద్ధికి ఊతమిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ‘‘పీఎల్ఐ ద్వారా భారత్‌ను టెలికం తయారీ కేంద్రంగా మార్చాలని అనుకుంటోంది. దేశీయంగా విలువను జోడించడం ద్వారా ఇది సాధ్యమవుతుందని భావిస్తున్నాం’’అంటూ టెలికం శాఖ ప్రత్యేక కార్యదర్శి అనితా ప్రవీణ్ పేర్కొన్నారు. చిన్న సంస్థలు సైతం.. టెలికం శాఖ ఆమోదించిన 31 దరఖాస్తుల్లో 16 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలవి (ఎంఎస్ఎంఈ) ఉన్నాయి. ఇందులో కోరల్ టెలికం, ఇహూమ్ ఐవోటీ, ఎల్‌కామ్ ఇన్నోవేషన్స్, ఫ్రాగ్ సెల్‌శాట్, జీడీఎన్ ఎంటర్ప్రైజెస్, జీఎక్స్ ఇండియా, లేఖ వైర్లెస్, సురభి శాట్‌కామ్, సిస్ట్రోమ్ టెక్నాలజీస్, టిన్నిఇన్ వరల్డ్‌టెక్ తదితర కంపెనీలున్నాయి. పీఎల్ఐ పథకం టెలికం రంగంలో స్వావలంబనకు (ఆత్మనిర్భర్ భారత్) దారితీస్తుందని టెలికం తయారీదారుల సంఘం టెమా పేర్కొంది. టెలికం ఆపరేటర్ల సంఘం సీవోఏఐ డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచర్ స్పందిస్తూ.. పీఎల్ఐ పథకం ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందన్నారు. ‘‘భారత్ ఇప్పటికే ప్రపంచంలో రెండో అతిపెద్ద టెలికం మార్కెట్‌గా ఉంది. టెలికం ఆవిష్కరణల కేంద్రంగా భారత్‌ను మార్చడానికి ఈ పథకం సాయపడుతుంది’’ అని కొచర్ ప్రకటించారు. -
నెట్ న్యూట్రాలిటీకి ఓకే..
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ కంటెంట్ అందించే విషయంలో సర్వీస్ ప్రొవైడర్లు పక్షపాత ధోరణితో వ్యవహరించకుండా నియంత్రించే దిశగా నెట్ న్యూట్రాలిటీ నిబంధనలకు టెలికం కమిషన్ (టీసీ) ఆమోదముద్ర వేసింది. ఇందుకు సంబంధించి టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ చేసిన సిఫార్సులను బుధవారం జరిగిన సమావేశంలో ఆమోదించింది. రిమోట్ సర్జరీ, అటానామస్ కార్లు మొదలైన కీలక అప్లికేషన్స్, సర్వీసులకు మాత్రం నెట్ న్యూట్రాలిటీ నిబంధనల నుంచి మినహాయింపు లభించనుంది. టెలికం కమిషన్ చైర్మన్ అరుణ సుందరరాజన్ ఈ విషయాలు వెల్లడించారు. ‘నెట్ న్యూట్రాలిటీపై ట్రాయ్ చేసిన సిఫార్సులను టెలికం కమిషన్ (టీసీ) ఆమోదించింది. కొన్ని క్రిటికల్ సేవలకు మాత్రం ఈ నిబంధనల నుంచి మినహాయింపు లభించే అవకాశం ఉంది‘ అని ఆమె పేర్కొన్నారు. ఈ నిబంధనల అమలు, పర్యవేక్షణ కోసం టెలికం శాఖ (డాట్) ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనుంది. ఇందులో ప్రభుత్వ అధికారులు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ప్రొవైడర్స్, టెలికం ఆపరేటర్లు, పౌర సమాజ సభ్యులు, వినియోగదారుల హక్కుల పరిరక్షణ సంస్థల ప్రతినిధులు మొదలైన వారు సభ్యులుగా ఉంటారు. కీలకమైన సర్వీసులకు సంబంధించిన డేటా ట్రాఫిక్ నిర్వహణ విషయంలో అనుసరించాల్సిన విధానాల గురించి టెలికం శాఖ .. ట్రాయ్ సిఫార్సులు కోరనుంది. సర్వీస్ ప్రొవైడర్లు కొన్ని వెబ్సైట్లు, సర్వీసులకే ప్రాధాన్యమిస్తూ మిగతా వాటిని బ్లాక్ చేయడం లేదా నెట్ వేగాన్ని తగ్గించేయడం వంటి పక్షపాత ధోరణులతో వ్యవహరించకుండా తటస్థంగా ఉండేలా చూడటం .. నెట్ న్యూట్రాలిటీ ప్రధాన ఉద్దేశం. ఇంటర్నెట్ కంటెంట్‌ను అందించడంలో వివక్ష ధోరణులకు దారి తీసేలా.. ఏ సంస్థలతోనూ సర్వీస్ ప్రొవైడర్లు ఒప్పందాలు కుదుర్చుకోకూడదని ట్రాయ్ సిఫార్సు చేసింది. అలాగే నెట్ సర్వీస్ ప్రొవైడర్లు కంటెంట్‌ను బట్టి ఇంటర్నెట్ వేగాన్ని నియంత్రించడం వంటి పక్షపాత దోరణులకు పాల్పడకుండా నిర్దిష్ట ఆంక్షలు ఉండేలా లైసెన్సింగ్ నిబంధనల్లోనూ మార్పులు చేయాలని కూడా సూచించింది. ‘డిజిటల్ కమ్యూనికేషన్స్’కు ఆమోదం కొత్త టెలికం విధానానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తీసుకునే దిశగా జాతీయ డిజిటల్ కమ్యూనికేషన్స్ విధానం (ఎన్డీసీపీ) 2018కి కూడా టెలికం కమిషన్ ఆమోదముద్ర వేసినట్లు సుందరరాజన్ తెలిపారు. ‘భౌతిక మౌలిక సదుపాయాల కన్నా డిజిటల్ మౌలిక సదుపాయాలు ప్రస్తుతం దేశానికి చాలా కీలకమని సమావేశంలో సభ్యులంతా అభిప్రాయపడ్డారు. సాధ్యమైనంత త్వరగా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ చెప్పారు. సంస్కరణల ఊతంతో 2022 నాటికి డిజిటల్ కమ్యూనికేషన్స్ రంగంలో రూ. 6.5 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు కొత్తగా 40 లక్షల ఉద్యోగాల కల్పన, సెకనుకు 50 మెగాబిట్ వేగంతో ప్రజలందరికీ బ్రాడ్‌బ్యాండ్‌ను అందుబాటులోకి తేవడం మొదలైన లక్ష్యాలను ఎన్‌డీసీపీలో నిర్దేశించుకున్నారు. పంచాయతీల్లో 12.5 లక్షల వై–ఫై హాట్‌స్పాట్స్ సుమారు రూ. 6,000 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్‌తో 2018 డిసెంబర్ ఆఖరు నాటికి దేశవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో సుమారు 12.5 లక్షల వై–ఫై హాట్‌స్పాట్స్‌ను ఏర్పాటు చేసే ప్రతిపాదనకు కూడా కమిషన్ ఓకే చెప్పినట్లు సమావేశంలో పాల్గొన్న అధికారి ఒకరు తెలిపారు. ఈ ప్రాజెక్టు కింద పోలీస్ స్టేషన్లు, పోస్టాఫీసులు, ప్రాథమిక వైద్య కేంద్రాలు, పాఠశాలలను వై–ఫై సర్వీసులతో అనుసంధానించనున్నారు. రోజంతా ప్రజల వినియోగానికి 1–2 వైఫై హాట్‌స్పాట్స్ అదనంగా అందుబాటులో ఉంటాయి. మరోవైపు, టెలికం ఆపరేటర్ల నుంచి టాక్‌టైమ్, డేటా మొదలైనవి కొనుగోలు చేసి తమ బ్రాండ్ కింద రిటైల్‌గా విక్రయించే వర్చువల్ నెట్వర్క్ ఆపరేటర్స్ (వీఎన్‌వో)పై విధిస్తున్న ద్వంద్వ పన్నులను నివారించే ప్రతిపాదనను కూడా టెలికం కమిషన్ ఆమోదించింది. -
'జియో ఉచిత ఆఫర్లతో వచ్చే నష్టమేమి లేదు'
న్యూఢిల్లీ : ఉచిత వాయిస్ కాల్స్, ఉచిత డేటా కల్పిస్తూ జియో అందిస్తున్న ప్రమోషనల్ ఆఫర్‌పై టెలికాం పరిశ్రమ సంపదంతా తుడిచిపెట్టుకు పోనుందని ఆందోళనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. అయితే రిలయన్స్ జియో లాంటి టెలికాం సంస్థలు అందించే ప్రమోషనల్ ఆఫర్ వల్ల ఇండస్ట్రి ఆర్థిక సంపద ఏమీ తగ్గిపోదని టెలికాం రెగ్యులేటరీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) స్పష్టీకరిస్తోంది. గత నెల టెలికాం కమిషన్ ఆదేశాలకు స్పందించిన ట్రాయ్ ఈ మేరకు ఓ డ్రాఫ్ నోట్‌ను రూపొందించింది. టెలికాం కంపెనీల ప్రమోషనల్ ఆఫర్ల వల్ల పరిశ్రమ ఆర్థికసంపదకు నష్టం వాటిల్లుతుందని, ప్రభుత్వానికి చెల్లించే లైసెన్సు ఫీజులు తగ్గుతాయని టెలికాం కమిషన్ ఆందోళన వ్యక్తంచేసింది. ఈ ప్రమోషనల్ ఆఫర్లపై పునఃసమీక్షించాలని ఆదేశించింది. అయితే టెలికాం పరిశ్రమ సంపదకు ఎలాంటి హాని ఉండదని ట్రాయ్ పేర్కొంది. టారిఫ్, టారిఫ్ ఆర్డర్ల బాధ్యతలన్నీ టెలికాం రెగ్యులేటరీ కిందకు వస్తాయి. సెక్టార్ ను ప్రమోట్ చేస్తూ వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటం ట్రాయ్ బాధ్యతని సీనియర్ అధికారులు పేర్కొన్నారు. కన్జ్యూమర్ల ప్రయోజనాలను రక్షిస్తూ.. మార్కెట్‌ను డెవలప్ చేయాలనేది ట్రాయ్ యాక్ట్ లో స్పష్టంగా చెప్పి ఉంటుందని ఓ సీనియర్ అధికారి చెప్పారు. దీని కింద రిలయన్స్ జియోకు ఇచ్చిన అనుమతిని రెగ్యులేటరీ పూర్తిగా సమర్థించుకుంటోంది. దీనిపై అటార్ని జనరల్ అభిప్రాయాన్ని కూడా ట్రాయ్ కోరుతున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. ప్రమోషనల్ ఆఫర్లు ఫైనాన్సియల్ సెక్టార్ కు తీవ్రంగా దెబ్బకొడతాయని ఆందోళన వ్యక్తంచేస్తూ టెలికాం సెక్రటరీ జే ఎస్ దీపక్ అధినేతగా ఉన్న టెలికాం కమిషన్ ట్రాయ్‌కి ఓ లేఖ రాసింది. రెండు ప్రమోషనల్ ఆఫర్లు వెల్కమ్ ఆఫర్, హ్యాపీ న్యూయర్ ఆఫర్ కింద రిలయన్స్ జియో ఉచిత వాయిస్, డేటా కస్టమర్లకు ఆఫర్ చేస్తోంది. -
జియో వల్ల ప్రభుత్వానికి ఎంత నష్టమో తెలుసా?
-
జియో వల్ల ప్రభుత్వానికి ఎంత నష్టమో తెలుసా?
న్యూఢిల్లీ : ఆఫర్ల మీద ఆఫర్లు గుప్పిస్తున్న రిలయన్స్ జియో వల్ల ఇటు టెలికాం కంపెనీలకే కాదు, అటు ప్రభుత్వానికి భారీగానే నష్టం వాటిల్లుతోంది. జియో ఉచిత డేటా, ఉచిత వాయిస్ సర్వీసులతో ప్రభుత్వం రూ.685 కోట్లను వదులుకోవాల్సి వచ్చిందని టెలికాం కమిషన్ వెల్లడించింది.. నిర్దేశించిన సమయానికి మించి ఆఫర్లను అందిస్తుండటంతో సెక్టార్ నష్టపోతున్నట్టు పేర్కొంది. ఈ విషయంపై మొట్టమొదటిసారి స్పందించిన టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్, జియో బ్యాక్ టూ బ్యాక్ ప్రమోషనల్ ఆఫర్లు, ఈ ఆర్థిక సంవత్సరం మూడో క్వార్టర్లో ప్రభుత్వంపై పడిన ప్రభావాన్ని వివరించింది. పరిశ్రమ వృద్ధికి తోడ్పడేలా ప్రస్తుత నిబంధనలను సమీక్షించాలని, ప్రమోషనల్ టారిఫ్‌లకు సంబంధించిన ఆదేశాలు తూచా తప్పకుండా అమలయ్యేలా చూడాలని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌కి కమిషన్ సూచించింది. సెప్టెంబర్ 5 నుంచి జియో ఉచిత వాయిస్, డేటా ఆఫర్లు ఇవ్వడం ప్రారంభించింది. దీంతో అప్పటినుంచి ఇతర టెలికాం కంపెనీలు భారతీ ఎయిర్ టెల్, వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులార్ లు తమ కస్టమర్లను కాపాడుకోవడానికి భారీగా రేట్లు తగ్గిస్తూ వస్తున్నాయి. దీంతో వాటి రెవెన్యూలకు భారీగా గండిపడింది. కంపెనీల రెవెన్యూలను ఆధారంగానే ప్రభుత్వం లైసెన్సు ఫీజులను, స్పెక్ట్రమ్ ఛార్జీలను వసూలు చేస్తోంది. ప్రస్తుతం వీటి రెవెన్యూలు పడిపోతుండటంతో ప్రభుత్వానికి కూడా నష్టాలు పెరిగిపోతున్నాయి. టెలికాం కంపెనీల రెవెన్యూలు మరో 8-10 శాతం క్షీణించే అవకాశముందని మార్కెట్ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న కమిషన్, 2002, 2008 నిర్ణయించిన ప్రమోషనల్ ఆఫర్లను ట్రాయ్ కచ్చితంగా అప్లయ్ చేయాలని ఆదేశించింది. ట్రాయ్ 2002లో తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రమోషనల్ ఆఫర్ 90 రోజులకు మించి ఉండకూడదు. కానీ జియో తన ఉచిత ఆఫర్లను వివిధ పేర్లతో పొడిగిస్తూ వస్తోంది. ఈ విషయంపై టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ కూడా లీగల్ గా సవాల్ చేసింది. -
ఉచిత టారిఫ్‌లపై టెలికం కమిషన్ దృష్టి
న్యూఢిల్లీ: ప్రమోషనల్ మొబైల్ టారిఫ్‌లపై అంతర్మంత్రిత్వ శాఖల బృందం టెలికం కమిషన్ దృష్టి సారించింది. పరిశ్రమ వృద్ధికి తోడ్పడేలా ప్రస్తుత నిబంధనలను సమీక్షించాలని, ప్రమోషనల్ టారిఫ్‌లకు సంబంధించిన ఆదేశాలు తూచా తప్పకుండా అమలయ్యేలా చూడాలని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌కి సూచించింది. ద్వితీయ, తృతీయ త్రైమాసికాల్లో టెలికం పరిశ్రమ ఆదాయాలు క్షీణించడంపై చర్చించిన కమిషన్ .. తాజా సూచనలు చేసినట్లు తెలుస్తోంది. రిలయన్స్ జియో ఉచిత ప్రమోషనల్ సర్వీసుల కారణంగా టెలికం పరిశ్రమ దాదాపు 20% ఆదాయం నష్టపోయినట్లు ఇండియా రేటింగ్స్ వెల్లడించిన నేపథ్యంలో కమిషన్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. -
ట్రాయ్ నిర్ణయానికి మద్దతు తెలిపిన టెలికం ప్యానెల్
న్యూఢిల్లీ: స్పెక్ట్రం కొనుగోలు అంశంలో ట్రాయ్ సిఫార్సులకు టెలికం ప్యానెల్ మద్దతు తెలిపింది. ఈ మేరకు టెలికం కమిషన్ నిర్ణయం తీసుకున్నట్లు ఉన్నతాధికారి ఒకరు శనివారం వెల్లడించారు. జరగబోయే వేలంలో 700 ఎంహెచ్‌జెడ్ ఎయిర్‌వేవ్ బ్యాండ్‌ను కూడా అమ్మకానికి ఉంచనున్నారు. ట్రాయ్ నిర్ణయించిన ప్రాథమిక ధరలకే ఈ వేలం జరగనుంది. ఈ వేలం ద్వారా మొత్తం రూ.5.60 లక్షల కోట్లు సమకూరుతాయని అంచనా. ఢిల్లీ పరిధిలో ట్రాయ్ చేసిన సిఫార్సులు... 700 ఎంహెచ్‌జెడ్‌కు రూ. 1595 కోట్లు, 800 ఎంహెచ్‌జెడ్‌కు రూ. 848 కోట్లు, 900 ఎంహెచ్‌జెడ్ బ్యాండ్‌కు రూ. 673 కోట్లుగా, 1800 ఎంహెచ్‌జెడ్ బ్యాండ్‌కు రూ.399 కోట్లుగా, 2100 ఎంహెచ్‌జెడ్ బ్యాండ్‌కు రూ.554 కోట్లు, 2300, 2500 ఎంహెచ్‌జెడ్ బ్యాండ్లకు రూ. 143 కోట్లు స్పెక్ట్రం ధరలుగా నిర్ణయించింది. అత్యధిక ఫ్రీక్వెన్సీ గల స్పెక్ట్రంను సొంతం చేసుకున్న టెలికం కంపెనీలు ముందస్తుగా 50 శాతం, పదేళ్లలో మిగతా మొత్తాన్ని చెల్లించాలని సూచించింది. -
మార్చినాటికి పూర్తి స్థాయి నంబర్ పోర్టబిలిటీ
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది మార్చి 31లోగా దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో మొబైల్ నంబర్ పోర్టబిలిటీని (ఎంఎన్‌పీ) అమల్లోకి తేవాలని టెలికం శాఖ నిర్దేశించుకుంది. దీని వల్ల సర్కిల్ మారినా మొబైల్ నంబరు మార్చుకోవాల్సిన అవసరం లేకుండా ఇతర టెలికం కంపెనీ సర్వీసులకు మారే వీలు లభిస్తుంది. ఉదాహరణకు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ టెలికం సర్కిల్లో ఉన్న మొబైల్ యూజరు ఒకవేళ తన నంబరు మార్చుకోకుండా వేరే టెలికం కంపెనీకి మారదల్చుకుంటే.. ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో మాత్రమే మార్చుకోవడానికి వీలుంది. అదే పూర్తి స్థాయి ఎంఎన్‌పీ అమల్లోకి వస్తే ఇతర రాష్ట్రాల సర్కిల్స్‌లో సైతం వేరే టెలికం కంపెనీకి మారడానికి వెసులుబాటు లభిస్తుంది. ఇందుకు సంబంధించి టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ సిఫార్సులకు టెలికం కమిషన్ ఆమోదముద్ర వేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. తుది ఆమోదముద్ర కోసం టెలికం కమిషన్ నిర్ణయాన్ని టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్ ముందు ఉంచనున్నట్లు వివరించాయి. పూర్తి స్థాయి ఎంఎన్‌పీ అమలుకు సంబంధించి ప్రతిపాదనపై ఆమోదముద్ర వేసినప్పట్నుంచీ ఆరు నెలల పాటు టెలికం ఆపరేటర్లకు వ్యవధి ఇవ్వాలని ట్రాయ్ సిఫార్సు చేసింది. మరోవైపు తదుపరి రౌండు స్పెక్ట్రం వేలం ప్రక్రియ నిర్వహణ కోసం వేలంపాటదారు ఎంపిక తదితర అంశాలకు సంబంధించిన ప్రక్రియకు టెలికం కమిషన్ ఆమోదముద్ర వేసింది. ఆక్షనీర్ల(టెలికం కంపెనీలు) నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నవంబర్ తొలి వారంలో ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదన కూడా టెలికం శాఖ మంత్రి ముందు ఉంచనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 95 కోట్లకు టెలికం యూజర్ల సంఖ్య... * టెలికం వినియోగదారుల సంఖ్య ఈ ఏడాది ఆగస్టులో 95 కోట్లను దాటింది. వీటిల్లో మొబైల్ వినియోగదారుల సంఖ్య 92.43 కోట్లుగా ఉందని ట్రాయ్ తెలి పింది. టెలికం యూజర్ల సంఖ్య 95 కోట్లను అధిగ మించడం ఇది రెండోసారి. గతంలో 2012 మార్చిలో ఈ సంఖ్య 95 కోట్లను దాటింది. ట్రాయ్ వెల్లడించిన గణాంకాల ప్రకారం... * ఈ ఏడాది జూలైలో 94.64 కోట్లుగా ఉన్న మొత్తం టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య ఈ ఏడాది ఆగస్టులో 95.18 కోట్లకు పెరిగింది. * మొబైల్, ఇంటర్నెట్ డాంగిల్ కనెక్షన్లతో కలిపి మొత్తం వెర్లైస్ యూజర్ల సంఖ్య 92.4 కోట్లకు చేరింది. * మొత్తం టెలికం కస్టమర్లలో ప్రైవేట్ కంపెనీల వినియోగదారుల వాటా 90 శాతానికి పైగా ఉంది. -
ఇక పూర్తి స్థాయి నంబర్ పోర్టబిలిటీ
* పంచాయతీల్లో బ్రాడ్‌బ్యాండ్ నెట్వర్క్ సవరణ ప్రతిపాదనకు ఓకే * నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాల్లో టెలికం సేవల విస్తృతిపై దృష్టి * టెలికం కమిషన్ నిర్ణయాలు న్యూఢిల్లీ: దేశంలో ఏ ప్రాంతానికి వె ళ్లినా, ఆపరేటరును మార్చినా మొబైల్ నంబరును మార్చుకోవాల్సిన పని లేకుండా పూర్తి స్థాయి మొబైల్ నంబరు పోర్టబిలిటీకి (ఎంఎన్‌పీ) టెలికం కమిషన్ సూత్రప్రాయంగా ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఎంఎన్‌పీ విధానం ప్రకారం ఆపరేటరు మారినా ఒకే నంబరును కొనసాగించుకునే వెసులుబాటు ఒక సర్కిల్‌కి మాత్రమే పరిమితమైంది. టెలికం కమిషన్ నిర్ణయంతో.. సర్కిల్ మారినా కూడా దేశవ్యాప్తంగా ఈ వెసులుబాటు లభిస్తుంది. పూర్తి స్థాయి ఎంఎన్‌పీ అమలు విషయంలో బ్యాంకు గ్యారంటీలు తదితర అంశాల గురించి ట్రాయ్ నుంచి మరింత అదనపు సమాచారాన్ని టెలికం కమిషన్ కోరనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. శుక్రవారం సమావేశమైన అంతర -మంత్రిత్వ శాఖల టెలికం కమిషన్.. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పలు ప్రతిపాదనలను ఆమోదించింది. 2.5 లక్షల గ్రామ పంచాయతీల్లో జాతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ (ఎన్‌వోఎఫ్‌ఎన్) ప్రాజెక్టు గడువును 2017 మార్చి దాకా పొడిగిస్తూ సవరించిన ప్రతిపాదనకు ఓకే చెప్పింది. దాదాపు రూ. 20,000 కోట్ల ఈ ప్రాజెక్టు 2015 సెప్టెంబర్ నాటికి పూర్తి కావాల్సి ఉంది. ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్, పవర్‌గ్రిడ్, రెయిల్‌టెల్‌తో ఏర్పాటు చేసిన భారత్ బ్రాడ్‌బ్యాండ్ నెట్వర్క్ ఇందులో సింహభాగం పనులు చేపడుతోంది. నక్సల్ ప్రభావిత రాష్ట్రాల్లో మొబైల్ టవర్లు.. తొమ్మిది నక్సల్ ప్రభావిత రాష్ట్రాల్లో టెలిఫోన్ సేవలు విస్తరించేందుకు మొబైల్ టవర్లను ఏర్పాటు చేయాలన్న యోచనకు టెలికం కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో టెలికం నెట్‌వర్క్‌ను పటిష్టం చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ. 2,900 కోట్ల వ్యయం కాగలదని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ అంచనా వేసింది. ఈ ప్రతిపాదనలను క్యాబినెట్ తుది ఆమోదానికి పంపనున్నారు. ఎన్‌వోఎఫ్‌ఎన్ ఇన్ఫ్రాను వినియోగించుకునే గవర్నమెంట్ యూజర్ నెట్వర్క్ (గన్) అనే వైఫై ప్రాజెక్టుకు కూడా టెలికం కమిషన్ ఆమోదముద్ర వేసింది. దీనికి రూ. 25,000 కోట్ల మేర నిధులు అవసరమవుతాయని అంచనా. అటు ప్రభుత్వోద్యోగులకు శిక్షణ కల్పించేందుకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఫైనాన్స్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు కూడా ఆమోదం లభించింది. దీనిపై క్యాబినెట్ తుదినిర్ణయం తీసుకోనుంది. -
స్పెక్ట్రమ్ రిజర్వ్ ధరకు ఓకే
న్యూఢిల్లీ: టెలికం స్పెక్ట్రమ్ రిజర్వ్ ధరకు కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం.. గతంలో నిర్వహించిన వేలంతో పోలిస్తే తాజా ధర సుమారు సగానికి తగ్గనుంది. ఈ రేట్లతో జనవరిలో నిర్వహించబోయే స్పెక్ట్రం వేలం ద్వారా కనీసం రూ. 48,000 కోట్లు రాబట్టవచ్చని కేంద్రం భావిస్తోంది. సాధికారిక మంత్రుల బృందం (ఈజీవోఎం) సిఫార్సుల మేరకు.. అన్ని సర్వీస్ ఏరియాల్లో 1800 మెగాహెట్జ్ బ్యాండ్‌లోనూ, ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో 900 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌లో స్పెక్ట్రం వేలానికి సంబంధించి కనీస ధరను క్యాబినెట్ ఆమోదించినట్లు కేంద్రం ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. దీని ప్రకారం 1800 మెగాహెర్జ్బ్యాండ్లో దేశవ్యాప్తంగా ప్రతి మెగాహెట్జ్‌కి కనీస ధర రూ. 1,765 కోట్లు ఉంటుంది. ఇది మార్చ్‌లో నిర్వహించిన వేలం ధరతో పోలిస్తే సుమారు 26 శాతం తక్కువ. తాజా రిజర్వ్ ధరను బట్టి చూస్తే 1800 మెగాహెర్ట్జ్‌బ్యాండ్‌లో నిర్దేశిత 5 మెగాహెట్జ్‌కి రూ. 8,825 కోట్ల మేర ధర ఉంటుంది. 900 మెగాహెర్ట్జ్‌బ్యాండ్‌లో.. గత వేలంలో రేటుతో పోలిస్తే.. తాజాగా నిర్వహించే వేలంలో 900 మెగాహెర్ట్జ్‌బ్యాండ్ స్పెక్ట్రం ధర సుమారు 53 శాతం మేర తక్కువ ఉండేలా క్యాబినెట్ ఖరారు చేసింది. ఈ బ్యాండ్‌లో ఢిల్లీలో ప్రతి మెగాహెట్జ్‌కి రూ. 360 కోట్లు, ముంబైలో రూ. 328 కోట్లు, కోల్‌కతాలో రూ. 125 కోట్లు కనీస రేటు ఉంటుంది. 900 మెగాహెట్జ్ బ్యాండ్‌లో 46 మెగాహెర్ట్జ్మేర, 1800 మెగాహెర్ట్జ్‌బ్యాండ్‌లో 403.2 మెగాహెర్ట్జ్మేర 2జీ స్పెక్ట్రమ్‌ను విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది. కనీస రేటు ప్రాతిపదికన 1800 మెగాహెర్ట్జ్‌బ్యాండ్ ద్వారా రూ. 36,385 కోట్లు, 900 మెగాహెర్ట్జ్‌బ్యాండ్ ద్వారా రూ. 12,300 కోట్లు రాగలవని భావిస్తున్నారు. కొత్త టెలికం కంపెనీలు 1800 మెగాహెర్ట్జ్లేదా 900 మెగాహెర్ట్జ్‌బ్యాండ్‌లో కనీసం 5 మెగాహెర్ట్జ్స్పెక్ట్రం కొనుగోలు చేయాల్సి ఉంటుందని అత్యున్నత స్థాయి మంత్రుల బృందం సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. అయితే, పాత ఆపరేటర్లు తమ లెసైన్సులు 2014తో ముగియని పక్షంలో .. 1800 మెగాహెర్ట్జ్‌బ్యాండ్‌లో కనీసం 600 మెగాహెట్జ్, 900 మెగాహెర్ట్జ్‌బ్యాండ్‌లో 1 మెగాహెర్ట్జ్ మేర తీసుకోవాల్సి ఉంటుంది. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ సిఫార్సు చేసిన ధర కన్నా ఈజీవోఎం నిర్ధారించిన రేటు అధికం. 1800 మెగాహెర్ట్జ్ బ్యాండ్ రేటు 15 శాతం మేర, 900 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌లో స్పెక్ట్రమ్ ధర 25% మేర ఎక్కువ. వచ్చే నెలలో వేలంపై కసరత్తు జనవరి 21 నుంచి వేలం ప్రక్రియ ప్రారంభించేందుకు ప్రస్తుతం కసరత్తు జరుగుతున్నట్లు టెలికం శాఖ వర్గాలు తెలిపాయి. వచ్చే కొన్ని రోజుల్లో దరఖాస్తులను ఆహ్వానించవచ్చని వివరించాయి. మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్, లూప్ మొబైల్ సంస్థల లెసైన్సుల గడువు వచ్చే ఏడాది ఆఖరు త్రైమాసికంతో తీరిపోనుంది. దీంతో 900 మెగాహెర్ట్జ్‌బ్యాండ్‌లో వాటికి ఉన్న 46 మెగాహెర్ట్జ్స్పెక్ట్రమ్ను కూడా వేలం వేయనున్నారు. క్యాబినెట్ నిర్దేశించిన బేస్ రేటు ప్రకారం ఈ మెట్రోల స్పెక్ట్రమ్‌నకు కనీసం రూ. 12,300 కోట్లు రాగలవు. మొత్తం రెండు బ్యాండ్లలో స్పెక్ట్రమ్ విలువ సుమారు రూ. 48,685 కోట్లు ఉంటుందని అంచనా. అయితే, బిడ్డింగ్ మొత్తాన్ని విడతల వారీగా చెల్లించే అవకాశం కల్పించడంతో ప్రభుత్వానికి వేలం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో తక్షణం లభించేది సుమారు రూ. 15,000 కోట్లు మాత్రమే. -
రేడియేషన్ పరిమితి దాటితే రెట్టింపు జరిమానా
న్యూఢిల్లీ: మొబైల్ టవర్ల నుంచి పరిమితికి మించి రేడియేషన్ వెలువడిన పక్షంలో టెలికం కంపెనీలపై విధించే జరిమానాను టెలికం శాఖ రెట్టింపు చేసింది. ఇకపై రూ. 10 లక్షలు విధించనుంది. గతంలో రేడియేషన్‌కి సంబంధించి ఏ నిబంధనలు ఉల్లంఘించినా జరిమానా గరిష్టంగా రూ.5 లక్షలు ఉండేది. మరోవైపు, దరఖాస్తులు, ఇతరత్రా పత్రాల సమర్పణ విషయంలో నిబంధనల ఉల్లంఘన జరిగితే విధించే జరిమానా పరిమాణాన్ని టెలికం శాఖ తగ్గించింది. కొత్త పెనాల్టీ శ్లాబ్‌ల ప్రకారం రేడియేషన్ మొదలైన వాటికి సంబంధించి సెల్ఫ్ సర్టిఫైడ్ డాక్యుమెంట్లను సమర్పించడంలో జాప్యం జరిగితే గరిష్టంగా రూ. 50,000 పెనాల్టీ ఉంటుంది. గతంలో చిన్నపాటి ఉల్లంఘనలకు కూడా గరిష్టంగా రూ. 5 లక్షల జరిమానా ఉండేది. పరిశ్రమవర్గాల అంచనాల ప్రకారం మొబైల్ టవర్ల నిబంధనల ఉల్లంఘనల విషయంలో ఈ ఏడాది ప్రథమార్ధం దాకా టెలికం శాఖ సుమారు రూ. 1,900 కోట్ల జరిమానాలు విధించింది. ఇందులో అత్యధికంగా 64 శాతం పెనాల్టీలు డాక్యుమెంట్ల అంశానికి చెందినవే కాగా రేడియేషన్ ఉల్లంఘనల వాటా 1.2 శాతం మాత్రమే. కొత్త శ్లాబ్‌ల ప్రకారం మొబైల్ టవర్‌ను ఉపయోగించడం మొదలుపెట్టినప్పట్నుంచీ 15 రోజుల్లోగా కాంప్లయన్స్ సర్టిఫికెట్‌ను టెలికం కంపెనీలు సమర్పించాల్సి ఉంటుంది. ఈ గడువు తర్వాత 15-30 రోజుల జాప్యానికి రూ.5,000-20,000 దాకా జరిమానా కట్టాల్సి ఉంటుంది. అంతకు మించి 60 రోజుల దాకా ఆలస్యమైతే రూ. 50,000 పెనాల్టీ ఉంటుంది. అప్పటికీ సమర్పించకపోతే టవర్‌ని మూసేయాల్సి వస్తుంది. ఇన్స్టాల్ అయిన అన్ని మొబైల్ టవర్ల విషయంలో సెల్ఫ్ సర్టిఫికేషన్ సమర్పించేందుకు 2015 మార్చ్ దాకా గడువునిచ్చింది టెలికం శాఖ. -
స్పెక్ట్రం బేస్ రేటు పెంపునకు ఓకే...
న్యూఢిల్లీ: జనవరిలో వేలం వేయనున్న టెలికం స్పెక్ట్రంనకు సంబంధించి బేస్ ధరను 25 శాతం దాకా పెంచే ప్రతిపాదనకు సాధికారిక మంత్రుల బృందం (ఈజీవోఎం) ఆమోద ముద్ర వేసింది. అలాగే సీడీఎంఏ సేవలకు ఉపయోగపడే 800 మెగాహెట్జ్ బ్యాండ్ రిజర్వ్ ధరను కూడా సిఫార్సు చేయాల్సిందిగా టెలికం రంగ నియంత్రణ సంస్థ (ట్రాయ్)కి సూచించింది. రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీ సారథ్యంలో శుక్రవారం జరిగిన సమావేశంలో టెలికం కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా ... ఈజీవోఎం ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది. టెలికం సంస్థల విలీన, కొనుగోళ్ల నిబంధనల అంశం ఈ భేటీలో చర్చకు రాలేదు. జీఎస్ఎం సేవలకు ఉపయోగపడే 900 మెగాహెట్జ్ బ్యాండ్‌లో గరిష్టంగా 5 మెగాహెట్జ్ కోసం బిడ్లు వేయొచ్చు. 1800 మెగాహెట్జ్ బ్యాండ్‌లో ఎంత స్పెక్ట్రం వేలం వేసేదీ టెలికం విభాగంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని టెలికం శాఖ మంత్రి కపిల్ సిబల్ తెలిపారు. స్పెక్ట్రం వేలం, వన్ టైమ్ స్పెక్ట్రం ఫీజు, ఇతర ఫీజుల ద్వారా రూ. 40,000 కోట్లు రావొచ్చని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆయన వివరించారు. స్పెక్ట్రం ట్రేడింగ్‌కి కూడా సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సిబల్ పేర్కొన్నారు. 1800 మెగాహెట్జ్ బ్యాండ్‌కి సంబంధించి ప్రతి మెగాహెట్జ్‌కి రూ. 1,496 కోట్ల రిజర్వ్ ధర పెట్టాలని ట్రాయ్ సూచించగా, టెలికం కమిషన్ అంతకన్నా 15 శాతం అధికంగా రూ. 1,765 కోట్లుగా ఉంచాలని సిఫార్సు చేసింది. ఇక 900 మెగాహెట్జ్ బ్యాండ్‌కి ధరను ట్రాయ్ సూచించిన దానికన్నా 25 శాతం ఎక్కువగా ఉంచాలని ఈజీవోఎం నిర్ణయించింది. దీని ప్రకారం ఢిల్లీలో ప్రతి మెగాహెట్జ్‌కి కనీస ధర రూ. 360 కోట్లుగాను, ముంబైలో రూ. 328 కోట్లుగాను, కోల్‌కతాలో రూ. 125 కోట్లుగాను ఉండనుంది. రిజర్వ్ ధరను ఎక్కువ చేసినా కూడా గత వేలం ధరతో పోలిస్తే తక్కువగానే ఉంటుందని సిబల్ తెలిపారు. గత వేలంలో 1800 మెగాహెట్జ్బ్యాండ్కి సంబంధించి ప్రతి మెగాహెట్జ్‌కి రేటు రూ. 2,800గా నిర్ణయించారు. ఇక తాజాగా, పేమెంట్ నిబంధనలు గతంలో తరహాలోనే ఉంటాయని సిబల్ తెలిపారు. 1800 మెగాహెట్జ్ బ్యాండ్‌కి 30 శాతం, 900 మెగాహెట్జ్‌కి 25 శాతం అప్‌ఫ్రంట్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికీ ఎక్కువే..: మరోవైపు.. టెలికం రంగంలో అంతంత మాత్రంగా ఉన్న లాభదాయకతను బట్టి చూస్తే 1800, 900 మెగాహెట్జ్ బ్యాండ్లకి నిర్ణయించిన కనీస ధర ఇప్పటికీ అధికంగానే ఉందని కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ ఇండియాకి చెందిన మొహమ్మద్ చౌదరి పేర్కొన్నారు. పైగా సీడీఎంఏ స్పెక్ట్రం ధరలపై అనిశ్చితి, రూపాయి అస్థిరత తదితర అంశాలు వేలంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చన్నారు. -
స్పెక్ట్రమ్ రిజర్వు ధర పెంపు
న్యూఢిల్లీ: స్పెక్ట్రమ్ వేలానికి దేశవ్యాప్తంగా కనీస రిజర్వు ధరను పెంచుతూ టెలికమ్ కమిషన్ బుధవారం సిఫార్సు చేసింది. నియంత్రణ సంస్థ ట్రాయ్ అంతకుముందు నిర్ణయించిన ధరపై 15% పెంచుతూ టెలికమ్ కమిషన్ సిఫార్సులు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇక ఢిల్లీ, ముంబై వంటి కీలక సర్కిళ్లలో మాత్రం రేటును 25% పెంచారు. ఇప్పుడు టెలికమ్ కమిషన్ ప్రతిపాదించిన ధరలు... గతంలో వేలానికి నిర్ధారించిన రిజర్వు ధరల కన్నా తక్కువే.1800 మెగాహెట్జ్, 900 మెగాహెట్జ్‌కు సంబంధించి స్పెక్ట్రమ్ ధర, విలీనాలు, కొనుగోళ్లపై తాము నిర్ణయం తీసుకున్నామని, ఇప్పుడు ఈ విషయం సాధికార మంత్రుల కమిటీ పరిశీలనకు వెళుతుందని టెలికమ్ కార్యదర్శి ఎంఎఫ్ ఫరూఖి చెప్పారు. టెలికమ్ శాఖ మూడో విడత స్పెక్ట్రమ్ వేలాన్ని జనవరిలోగా నిర్వహించవచ్చని, వచ్చే మార్చిలోగా ప్రభుత్వం కనీసం రూ.11,000 కోట్లు ఆదాయం సమకూర్చుకోవాలని భావిస్తోంది. ఢిల్లీ సర్కిల్ 1800 మెగాహెట్జ్‌కు కొత్త బేస్ ధరను టెలికమ్ కమిషన్ రూ.218.90 కోట్లుగా, ముంబైకి రూ.206.74 కోట్లుగా సిఫార్సు చేసింది.