న్యూఢిల్లీ: టెలికం స్పెక్ట్రమ్ రిజర్వ్ ధరకు కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం.. గతంలో నిర్వహించిన వేలంతో పోలిస్తే తాజా ధర సుమారు సగానికి తగ్గనుంది. ఈ రేట్లతో జనవరిలో నిర్వహించబోయే స్పెక్ట్రం వేలం ద్వారా కనీసం రూ. 48,000 కోట్లు రాబట్టవచ్చని కేంద్రం భావిస్తోంది. సాధికారిక మంత్రుల బృందం (ఈజీవోఎం) సిఫార్సుల మేరకు.. అన్ని సర్వీస్ ఏరియాల్లో 1800 మెగాహెట్జ్ బ్యాండ్‌లోనూ, ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో 900 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌లో స్పెక్ట్రం వేలానికి సంబంధించి కనీస ధరను క్యాబినెట్ ఆమోదించినట్లు కేంద్రం ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. దీని ప్రకారం 1800 మెగాహెర్జ్‌బ్యాండ్‌లో దేశవ్యాప్తంగా ప్రతి మెగాహెట్జ్‌కి కనీస ధర రూ. 1,765 కోట్లు ఉంటుంది. ఇది మార్చ్‌లో నిర్వహించిన వేలం ధరతో పోలిస్తే సుమారు 26 శాతం తక్కువ. తాజా రిజర్వ్ ధరను బట్టి చూస్తే 1800 మెగాహెర్ట్జ్‌బ్యాండ్‌లో నిర్దేశిత 5 మెగాహెట్జ్‌కి రూ. 8,825 కోట్ల మేర ధర ఉంటుంది.
900 మెగాహెర్ట్జ్‌బ్యాండ్‌లో..
గత వేలంలో రేటుతో పోలిస్తే.. తాజాగా నిర్వహించే వేలంలో 900 మెగాహెర్ట్జ్‌బ్యాండ్ స్పెక్ట్రం ధర సుమారు 53 శాతం మేర తక్కువ ఉండేలా క్యాబినెట్ ఖరారు చేసింది. ఈ బ్యాండ్‌లో ఢిల్లీలో ప్రతి మెగాహెట్జ్‌కి రూ. 360 కోట్లు, ముంబైలో రూ. 328 కోట్లు, కోల్‌కతాలో రూ. 125 కోట్లు కనీస రేటు ఉంటుంది. 900 మెగాహెట్జ్ బ్యాండ్‌లో 46 మెగాహెర్ట్జ్‌మేర, 1800 మెగాహెర్ట్జ్‌బ్యాండ్‌లో 403.2 మెగాహెర్ట్జ్‌మేర 2జీ స్పెక్ట్రమ్‌ను విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది. కనీస రేటు ప్రాతిపదికన 1800 మెగాహెర్ట్జ్‌బ్యాండ్ ద్వారా రూ. 36,385 కోట్లు, 900 మెగాహెర్ట్జ్‌బ్యాండ్ ద్వారా రూ. 12,300 కోట్లు రాగలవని భావిస్తున్నారు.
కొత్త టెలికం కంపెనీలు 1800 మెగాహెర్ట్జ్‌లేదా 900 మెగాహెర్ట్జ్‌బ్యాండ్‌లో కనీసం 5 మెగాహెర్ట్జ్‌స్పెక్ట్రం కొనుగోలు చేయాల్సి ఉంటుందని అత్యున్నత స్థాయి మంత్రుల బృందం సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. అయితే, పాత ఆపరేటర్లు తమ లెసైన్సులు 2014తో ముగియని పక్షంలో .. 1800 మెగాహెర్ట్జ్‌బ్యాండ్‌లో కనీసం 600 మెగాహెట్జ్, 900 మెగాహెర్ట్జ్‌బ్యాండ్‌లో 1 మెగాహెర్ట్జ్ మేర తీసుకోవాల్సి ఉంటుంది. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ సిఫార్సు చేసిన ధర కన్నా ఈజీవోఎం నిర్ధారించిన రేటు అధికం. 1800 మెగాహెర్ట్జ్ బ్యాండ్ రేటు 15 శాతం మేర, 900 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌లో స్పెక్ట్రమ్ ధర 25% మేర ఎక్కువ.
వచ్చే నెలలో వేలంపై కసరత్తు
జనవరి 21 నుంచి వేలం ప్రక్రియ ప్రారంభించేందుకు ప్రస్తుతం కసరత్తు జరుగుతున్నట్లు టెలికం శాఖ వర్గాలు తెలిపాయి. వచ్చే కొన్ని రోజుల్లో దరఖాస్తులను ఆహ్వానించవచ్చని వివరించాయి. మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్, లూప్ మొబైల్ సంస్థల లెసైన్సుల గడువు వచ్చే ఏడాది ఆఖరు త్రైమాసికంతో తీరిపోనుంది. దీంతో 900 మెగాహెర్ట్జ్‌బ్యాండ్‌లో వాటికి ఉన్న 46 మెగాహెర్ట్జ్‌స్పెక్ట్రమ్‌ను కూడా వేలం వేయనున్నారు. క్యాబినెట్ నిర్దేశించిన బేస్ రేటు ప్రకారం ఈ మెట్రోల స్పెక్ట్రమ్‌నకు కనీసం రూ. 12,300 కోట్లు రాగలవు. మొత్తం రెండు బ్యాండ్‌లలో స్పెక్ట్రమ్ విలువ సుమారు రూ. 48,685 కోట్లు ఉంటుందని అంచనా. అయితే, బిడ్డింగ్ మొత్తాన్ని విడతల వారీగా చెల్లించే అవకాశం కల్పించడంతో ప్రభుత్వానికి వేలం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో తక్షణం లభించేది సుమారు రూ. 15,000 కోట్లు మాత్రమే.
స్పెక్ట్రమ్ రిజర్వ్ ధరకు ఓకే
Published Tue, Dec 10 2013 2:15 AM | Last Updated on Sat, Aug 11 2018 8:24 PM
Advertisement