మొబైల్ టవర్ల నుంచి పరిమితికి మించి రేడియేషన్ వెలువడిన పక్షంలో టెలికం కంపెనీలపై విధించే జరిమానాను టెలికం శాఖ రెట్టింపు చేసింది.
న్యూఢిల్లీ: మొబైల్ టవర్ల నుంచి పరిమితికి మించి రేడియేషన్ వెలువడిన పక్షంలో టెలికం కంపెనీలపై విధించే జరిమానాను టెలికం శాఖ రెట్టింపు చేసింది. ఇకపై రూ. 10 లక్షలు విధించనుంది. గతంలో రేడియేషన్‌కి సంబంధించి ఏ నిబంధనలు ఉల్లంఘించినా జరిమానా గరిష్టంగా రూ.5 లక్షలు ఉండేది. మరోవైపు, దరఖాస్తులు, ఇతరత్రా పత్రాల సమర్పణ విషయంలో నిబంధనల ఉల్లంఘన జరిగితే విధించే జరిమానా పరిమాణాన్ని టెలికం శాఖ తగ్గించింది. కొత్త పెనాల్టీ శ్లాబ్‌ల ప్రకారం రేడియేషన్ మొదలైన వాటికి సంబంధించి సెల్ఫ్ సర్టిఫైడ్ డాక్యుమెంట్లను సమర్పించడంలో జాప్యం జరిగితే గరిష్టంగా రూ. 50,000 పెనాల్టీ ఉంటుంది. గతంలో చిన్నపాటి ఉల్లంఘనలకు కూడా గరిష్టంగా రూ. 5 లక్షల జరిమానా ఉండేది.
పరిశ్రమవర్గాల అంచనాల ప్రకారం మొబైల్ టవర్ల నిబంధనల ఉల్లంఘనల విషయంలో ఈ ఏడాది ప్రథమార్ధం దాకా టెలికం శాఖ సుమారు రూ. 1,900 కోట్ల జరిమానాలు విధించింది. ఇందులో అత్యధికంగా 64 శాతం పెనాల్టీలు డాక్యుమెంట్ల అంశానికి చెందినవే కాగా రేడియేషన్ ఉల్లంఘనల వాటా 1.2 శాతం మాత్రమే. కొత్త శ్లాబ్‌ల ప్రకారం మొబైల్ టవర్‌ను ఉపయోగించడం మొదలుపెట్టినప్పట్నుంచీ 15 రోజుల్లోగా కాంప్లయన్స్ సర్టిఫికెట్‌ను టెలికం కంపెనీలు సమర్పించాల్సి ఉంటుంది. ఈ గడువు తర్వాత 15-30 రోజుల జాప్యానికి రూ.5,000-20,000 దాకా జరిమానా కట్టాల్సి ఉంటుంది. అంతకు మించి 60 రోజుల దాకా ఆలస్యమైతే రూ. 50,000 పెనాల్టీ ఉంటుంది. అప్పటికీ సమర్పించకపోతే టవర్‌ని మూసేయాల్సి వస్తుంది. ఇన్‌స్టాల్ అయిన అన్ని మొబైల్ టవర్ల విషయంలో సెల్ఫ్ సర్టిఫికేషన్ సమర్పించేందుకు 2015 మార్చ్ దాకా గడువునిచ్చింది టెలికం శాఖ.