స్పెక్ట్రం బేస్ రేటు పెంపునకు ఓకే...
న్యూఢిల్లీ: జనవరిలో వేలం వేయనున్న టెలికం స్పెక్ట్రంనకు సంబంధించి బేస్ ధరను 25 శాతం దాకా పెంచే ప్రతిపాదనకు సాధికారిక మంత్రుల బృందం (ఈజీవోఎం) ఆమోద ముద్ర వేసింది. అలాగే సీడీఎంఏ సేవలకు ఉపయోగపడే 800 మెగాహెట్జ్ బ్యాండ్ రిజర్వ్ ధరను కూడా సిఫార్సు చేయాల్సిందిగా టెలికం రంగ నియంత్రణ సంస్థ (ట్రాయ్)కి సూచించింది. రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీ సారథ్యంలో శుక్రవారం జరిగిన సమావేశంలో టెలికం కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా ... ఈజీవోఎం ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది. టెలికం సంస్థల విలీన, కొనుగోళ్ల నిబంధనల అంశం ఈ భేటీలో చర్చకు రాలేదు. జీఎస్‌ఎం సేవలకు ఉపయోగపడే 900 మెగాహెట్జ్ బ్యాండ్‌లో గరిష్టంగా 5 మెగాహెట్జ్ కోసం బిడ్లు వేయొచ్చు. 1800 మెగాహెట్జ్ బ్యాండ్‌లో ఎంత స్పెక్ట్రం వేలం వేసేదీ టెలికం విభాగంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని టెలికం శాఖ మంత్రి కపిల్ సిబల్ తెలిపారు. స్పెక్ట్రం వేలం, వన్ టైమ్ స్పెక్ట్రం ఫీజు, ఇతర ఫీజుల ద్వారా రూ. 40,000 కోట్లు రావొచ్చని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆయన వివరించారు. స్పెక్ట్రం ట్రేడింగ్‌కి కూడా సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సిబల్ పేర్కొన్నారు.
1800 మెగాహెట్జ్ బ్యాండ్‌కి సంబంధించి ప్రతి మెగాహెట్జ్‌కి రూ. 1,496 కోట్ల రిజర్వ్ ధర పెట్టాలని ట్రాయ్ సూచించగా, టెలికం కమిషన్ అంతకన్నా 15 శాతం అధికంగా రూ. 1,765 కోట్లుగా ఉంచాలని సిఫార్సు చేసింది. ఇక 900 మెగాహెట్జ్ బ్యాండ్‌కి ధరను ట్రాయ్ సూచించిన దానికన్నా 25 శాతం ఎక్కువగా ఉంచాలని ఈజీవోఎం నిర్ణయించింది. దీని ప్రకారం ఢిల్లీలో ప్రతి మెగాహెట్జ్‌కి కనీస ధర రూ. 360 కోట్లుగాను, ముంబైలో రూ. 328 కోట్లుగాను, కోల్‌కతాలో రూ. 125 కోట్లుగాను ఉండనుంది. రిజర్వ్ ధరను ఎక్కువ చేసినా కూడా గత వేలం ధరతో పోలిస్తే తక్కువగానే ఉంటుందని సిబల్ తెలిపారు. గత వేలంలో 1800 మెగాహెట్జ్‌బ్యాండ్‌కి సంబంధించి ప్రతి మెగాహెట్జ్‌కి రేటు రూ. 2,800గా నిర్ణయించారు. ఇక తాజాగా, పేమెంట్ నిబంధనలు గతంలో తరహాలోనే ఉంటాయని సిబల్ తెలిపారు. 1800 మెగాహెట్జ్ బ్యాండ్‌కి 30 శాతం, 900 మెగాహెట్జ్‌కి 25 శాతం అప్‌ఫ్రంట్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది.
ఇప్పటికీ ఎక్కువే..: మరోవైపు.. టెలికం రంగంలో అంతంత మాత్రంగా ఉన్న లాభదాయకతను బట్టి చూస్తే 1800, 900 మెగాహెట్జ్ బ్యాండ్‌లకి నిర్ణయించిన కనీస ధర ఇప్పటికీ అధికంగానే ఉందని కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ ఇండియాకి చెందిన మొహమ్మద్ చౌదరి పేర్కొన్నారు. పైగా సీడీఎంఏ స్పెక్ట్రం ధరలపై అనిశ్చితి, రూపాయి అస్థిరత తదితర అంశాలు వేలంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చన్నారు.